మరో గుప్పెడు మొర్మొరాలు
కవిత్వం అంటే భయవోఁ, భక్తో సరిగ్గా తెలీదు నాకు. అందులోనూ పద్య కవిత్వం.
వూదొత్తులు వెలిగించీ, హారతిచ్చీ, ప్రసాదం పెట్టీ ఆ తరవాత లెంపలు వేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించకపోతే కళ్ళు పోతాయనుకునేవాడిని. ‘వరహాచారి మేష్టారు’ చెబ్తున్నంతసేపు ఎంతో బావున్నా, ముఖాముఖీ పద్యంతో ఎప్పుడూ భయవేఁ. పంచేంద్రియాలూ పన్చెయ్యడం మానేసేవి. దీనికి సరిగ్గా వ్యతిరేకంగా వుండేది వచనం మీద అభిప్రాయం. ఎవరో పక్కన కూచుని కబుర్లు చెబుతున్నట్టు, అందులోనూ మామూలు విషయాలు. మానేపల్లి సత్యనారాయణ గారు ‘ప్రోజు’ చెప్పేవారు. ‘పేంటూ, షట్టూ, టక్కూ’ ఇదీ వేషం. మాట్లాడితే చాలు, ‘గురజాడ, గిడుగు, శ్రీశ్రీ’ వగైరాల గొప్పదనం గురించే అద్భుతంగా చెప్పేవారు. తెలుగు క్లాసు ఎంతో బావుండేది.
పదో తరగతి వరకూ ఇదే వరస.
ఇంటర్ లో ‘శివాజీ భారతం’ రాస్తున్న మేష్టారు గానీ, విఠల్ గారు గానీ మాకు రాకుండా, మా దురద్రుష్టం కొద్దీ ట్రాన్స్‌ఫరై పోయేరు. డిగ్రీలు తప్ప పాండిత్యం లేని వారొచ్చేరు. అయినా ఇంజినీరింగ్‌కి తెలుగూ ఇంగ్లీషూ అక్కర్లేదని నేను కూడా వదిలేసేను. నిజానికి ఇప్పటికీ కవిత్వమంటే, ఎలాటిదయినా, అసంకల్పిత ప్రతీకార చర్య లాగ, మనసు లోనే దణ్ణం పెట్టుకుని లెంపలేసుకుంటాను, ఎవరూ చూడకుండా.
అయితే కవిత్వాన్ని భయపడి చదవడం మానేయకుండా, భయపడుతూనే చదివేంత ధైర్యమిచ్చిన పుస్తకం తాపీ ధర్మారావు గారు రాసిన ‘సాహిత్య మొర్మొరాలు’. మా దొడ్డమ్మ కొడుక్కి వొక వింత అలవాటు, ఇప్పటికీ, వుంది. పుస్తకాలు కొని చదవక పోవడం. ఆ కొనడానికి కూడా పద్ధతీ పాడూ వుండవు. అలవాటు కొద్దీ వొకసారి, మహాప్రస్థానం, సాహిత్య మొర్మొరాలు తీసుకొచ్చి “చదవరా” అనిచ్చేడు.
‘మహాప్రస్థానా’న్ని కళ్ళకద్దుకుని గబగబా చదివేసేను. ‘సాహిత్య మొర్మొరాలు’ పుస్తకాన్ని చూస్తే చదవాలనిపించలేదు.
బస్టేండ్ లో కిళ్ళీ బడ్డీలకి తోరణాల్లా వేలాడే ‘అంబడిపూడి’ పుస్తకంలా అనిపించింది. పేపరూ, ప్రింటూ కూడా అలానే వున్నాయి. ఏ-ఫోర్ పేపరుని నాలుగు మడతలు పెడితే వున్న సైజు కన్నా కొంచెం పెద్ద సైజు. ఈయన కూడా, ‘వశీకరణం’, ‘శ్రీఘ్రస్ఖలనం’, ‘కోట్లు సంపాయించడవెఁలా’ వగైరాల లాటివి రాసుంటాడనుకున్నాను, తాపీ వారి గురించి తెలీక. అసలు రెండు పుస్తకాల్నీ పక్కపక్కనే చూసినపుడు చాలా చికాగ్గా అనిపించింది. మా చిన్నాన్న పక్కని ఆయన బాల్య మిత్రుడు, ప్రస్తుతం ఆయవారాలు చేసుకుంటున్నతన్ని చూసి మా నాన్నమ్మ చికాకు పడినట్టు.
కానీ, పుస్తకాన్ని చదవకుండా ఆగలేకపోవడం, నా అద్రుష్టం. ఆ అలవాటు కొద్దీ మొదలెట్టేను.
మొదటి వ్యాసం “కృష్ణుడి శిరసును సత్యభామ తన్నిందా?” మొదలు పెట్టిన తరవాత చికాకు పటాపంచలై పోయింది; భయం గాలి కెగిరి పోయింది. ‘తాతాజీ’ చేయి పట్టుకుని, చదువుతూ — కాదు — ఆయన చెప్పేవి వింటూ, చేమకూర వెంకట కవి వరకూ అలా గాల్లో తేలుతూ వెళ్ళిపోయేను.
“ఆ సమయంలో కృష్ణుడు ఉపశమన వాక్యాలారంభించాడు. నగలు ధరించలేదేమి, నావైపు చూడవేమి – అని నంగిరి మాటలు. ‘చే విరిదమ్మి వ్రేయుటకునై/ యుంకించి జంకించినన్, చేతితో (విరిదమ్మివంటి చేతితో)’ కొట్టబోయింది – చెవి దగ్గర అసహ్యంగా గోలపెడుతున్న జోరీగను విదిల్చినట్టు. చేవిరిదమ్మిన్ – చేతిలోవున్న వికసించిన పద్మముతో అని అర్ధము చెప్పిన కాలేజీ పండితులున్నారు. ఆ సన్నివేశములో, ఆ కోప పరిణామ చిత్రణములో, ఈ అర్థము చెప్పడము చాలా ఘోరము. ముక్కు తిమ్మన్నకు మహాపరాధమని చెప్పనక్కరలేదు.”
ఇలా చమత్కారంగా చెబ్తూ సత్యభామ తన్నలేదు, “తాకింది. దాన్ని గోపాలుడు తాచిన యది నాకు మన్ననయ అని ఆ తాకుడుని తాపుగా పేర్కొన్నాడు. ఈ తప్పుడు అర్థం చెప్పినందుకే కవి ఈ పద్యంలో ‘కుహనా గోపాలుడూ’ అని అన్నాడు” లాటివి చదివేసరికి, పద్యాలు మడి కట్టుకు తిరుగుతున్న పెద్దవాళ్ళ లాగ కాకుండా, మన చుట్టుపక్కల తిరిగే, మనకన్నా తెలివైనవాళ్ళూ, మన స్నేహితులూ అనిపించేయి.
మానేపల్లి సత్యనారాయణ మేష్టారు పుస్తకం చదివే పద్ధతి చాలాసార్లు చెప్పినా, ఇప్పటికీ అలవాటవలేదు. ముందుమాట చివర్లో చదివినపుడు ఇంకా సరదా వేసింది. అందులో తాతాజీ ఈ పుస్తకం ఎందుకు రాసేరో, ఎందుకు ఇలా రాసేరో వివరించేరు.
“ఇదొక చిన్న సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ వ్యాసాలు పండితుల కోసం వ్రాసినవి కావు: పూర్వకవుల పరిచయం బాగా వున్న పాఠకుల కోసం వ్రాసినవీ కావు. ప్రబంధాలకూ ప్రబంధ కవులకూ కొంచెం దూరమున్న వారి కోసమే వ్రాశాను […] ఆ రవంతలో కొంత విమర్శన పద్ధతీ, కొంత పద్య వ్యాఖ్యానమూ, కొంత కవుల తారతమ్యమూ, రుచి చూపించడానికి ప్రయత్నం చేశాను […]” అలానే 1972 పునర్ముద్రణ లో ‘మరో మాట’లో “ఈ రూపంగా నయినా ఈ యువతరం వారు సుప్రసిద్ధాలయిన పాత విషయాలూ, వాటి విమర్శనా విధానమూ తెలుసుకోడానికి వీలుగా వుంటుందని ఆశించాను.”
సత్సంకల్పం సిద్ధిస్తుంది, సిద్ధించింది.
మొత్తం పదహారు వ్యాసాలు. నా మట్టుకు నాకు అన్నీ ఆణిముత్యాలు. తాపీ ధర్మారావు గారి శైలి, ముఖ్యంగా విమర్శనా పద్ధతి, సులువుగా, హాయిగా వుండడం మరింత బలం. వొక్క వాక్యంలో కూడా, కవుల్ని, మహానుభావులుగా చూపించలేదు. వాళ్ళందరూ మమూలు మనుష్యులే అనిపిస్తారు. వాళ్ళ గొప్పదనం ఇంకా ఎక్కువవుతుంది.
‘ఊతపదాలూ – వ్యర్థపదాలూ’ వ్యాసం లో నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, ప్రబంధ కవుల ఊతపదాలు వివరిస్తూ, “ఈ లసత్, విలసత్, వంటివే ప్రాంచత్, రాజత్, బ్రాజత్, యొసగు, అలరారు, ఇంపారు, చెన్ను, మీరు మొదలైన జాబితా మాటలు మన కవుల ప్రబంధాలలో లక్షోపలక్షలు – వారు మహా కవులు కాబట్టి వారిని చిన్నబుచ్చడం మంచిది కాదని మనవారు ఆ వ్యర్థపదాలకి ఏదో అర్థం చెప్పి సమర్థించడానికి ప్రయత్నిస్తారు. గౌరవం యిలా చూపడం మంచిదేగాని అలా సమర్థించడమే పనిగా పెట్టుకుంటే పెద్ద అనిపించుకోలేని కవి ఎవడుంటాడు” అని రాస్తే ఆశ్చర్యం వేసింది నాకు. తాపీ ధర్మారావు గారి తెలుగు మేస్టారు ఈ వ్యాసం చదివి ముక్క చీవాట్లు పెట్టేరేమో అని భయపడ్డాను.
ఈ వ్యాసంలోనే, ఇవన్నీ తెలుగు కవిత్వంలో వున్న నియమాల వల్లనే అంటారు. ఆ వూపులోనే ఈ వ్యర్థపదాలవల్ల మహాకవులకు “పద్యం కమ్మచ్చులో దీసినట్టు […]” నడిపించడం సులువైయ్యిందంటారు. “[…] ఓహో! ఏమి ధార అని సహృదయులందరూ ప్రశంసిస్తారు.” నిజాయితీతో ఈ వ్యర్థ పదాల గురించి బాధ పడుతూ, “ఇలాటి బైరాగి చిట్కాలన్నీ యతిస్థానాల దగ్గరనో, ప్రాస స్థానాల దగ్గర్నో ఉండడము యీ వెయ్యి సంవత్సరాలనుండి చూస్తున్నాము. కానీ ఈ విమోచన మార్గం అందరికీ ఇంకా దొరకలేదు. అది తెలుగుల దురదృష్టం” అంటారు.
‘రమా హేలా కలా వాసమై’ అని చేమకూర వెంకట కవి నగర వర్ణన చేశాడట. దీని గురించి వివరిస్తూ, “ఈ వ్యర్థ పదాలూ, పాద పూరణాలు తెలుగు కవిత్వంలో తరచు కనబడుతుండడం వలన అర్థగౌరవమున్న దానిని గూడ పాద పూరణమనే భావించే దురవస్థ కలుగుతూ వుంటుంది” ఎందుకంటే, వ్యాఖ్యాతలు, “[…] లక్ష్మీ విలాసం బాగా వున్నట్టిదై” అన్నట్టు వ్యాఖ్యానించారట. తాతాజీ లక్ష్మికీ, పార్వతికీ, సరస్వతికీ వాసమై అంటారు. ఈ వ్యాసంలోనే చివరిగా “వ్యాఖ్యాతల పొరపాటుకు విచారించడం కంటే, అటువంటి అభిప్రాయాలకు దారి కల్పించిన మన మహాకవులను గురించి దుఃఖించడం న్యాయం” అని వాపోతారు.
‘పోతన్న కవిత్వ పటుత్వం’ అనే వ్యాసంలో “రాజాజీ గారు కంబ రామాయణాన్ని ఇంగ్లీషులో ప్రచురిస్తున్నారు. అలాగే మనలో ఓపికున్న సమర్థులెవరయినా తెలుగు భాగవతం లోని ఒకటి రెండు ఘట్టాలను ఇంగ్లీషున ప్రచురించడం మంచిది. అట్లయితే, సంస్కృత భాగవతంతో పరిచయమున్న యితర రాష్ట్రాలవారు గూడా, మన ఆంధ్రకవి పోతన్నలోని కవిత్వ పటుత్వం గ్రహించి గౌరవిస్తారు” అన్నారు.
కుదిరే పనే? అందులోనూ పోతన కవిత్వం? అంటే ఇంగ్లీషులో పోతన్న గారిలా కవిత్వం రాయగలిగిన తెలుగు పండితుడన్న మాట. లేదా ఇప్పటికే ఎవరైనా రాసేరేమో?
‘అణాల గొడవ’ వ్యవహారం - ‘కవితా తాంబూలాలు’ అనే వ్యాసంలో మొదలై, నాలుగయిదు వ్యాసాల తర్వాత తేలి అక్కడా ముగింపబడక (’బడు’ల గొడవ) ఇంకా ముందుకెళుతుంది. ‘కవితా తాంబులాలు’ వ్యాసం మిగిలిన వ్యాసాలన్నిట్లోనూ నాకు చాలా ఇష్టమైనది. అందులోనూ “కూపోదకం, వటచ్ఛాయా, తాంబూలం, తరుణీకుచం, శీతకాలే భవేదుష్ణం, ఉష్ణకాలేతు శీతలం” శ్లోకం ఇంకా ఇష్టం. ఇందులోనే “నిరుపహతిస్థలంబు” పద్యంలో వున్న కప్పురవిడెము కీ, “మృగమద సౌరభ” పద్యంలోని “మగువ పొలుపు తెలుపు” మృగమద తాంబూలానికీ వున్న బాదరాయణ సంబంధం కూడా వివరించేరు.
ఇక అణాల గొడవ. దండి “తూర్ణం మానీయతాం చూర్ణం, పూర్ణచంద్రనిభాననే” అన్నాడు. కాళిదాసు, “పర్ణాని, స్వర్ణ వర్ణాని, కర్ణాంతాయతలోచనే” అన్నాట్ట. ఇద్దరూ చూసింది, ఒకే కాంతని. ఆ కాంత దండిని “పండితుడని”, కాళిదాసుని “కవి” అనీ సంబోధిస్తుంది.
‘తాతాజీ’ వ్యాఖ్య: సాయం సమయములో, వొక అందమైన కాంతను చూసి, తగిన సంబోధనే అయినప్పటికీ, పూర్ణచంద్రనిభాననే అనడం రసాభాసము. దానికి తోడు, సున్నప్పిడత అడిగేడు, అందులోనూ చిటికల మీద రావాలి ‘తూర్ణం’. కాళిదాసు ‘కర్ణాంతాయతలోచనే’ అన్నాడు. అంటే, ఆ కాంతని సరిగ్గా చూసి ఆవిడలో వున్న అందాన్ని పొగిడేడు. దానికితోడు స్వర్ణ వర్ణంలో వున్న ఆకులు మాత్రమే కావాలన్నాడు. అక్కడ తిష్ఠ వేసి ఇంకా హస్కు కొట్టడానికి. కవులు సరసులుట కదా?
అణాలు లేని ఆ రోజుల్లో, అణాల గొడవెక్కడిది?
“సాహిత్య మొర్మొరాలు” అనే పేరు పెట్టడం గురించి ఇలా - “[…] కొంచెం రుచిగా వుంటాయి; ఒక పిడికెడు ఎక్కువ తిన్నా బాధ లేదు; ఎప్పుడు తిన్నా ప్రమాదం లేదు; అజీర్ణ బాధ కలగదు. ఎప్పుడు చాలు ననిపిస్తే అప్పుడే మాని వేయవచ్చు […] ఈ పేరు పెట్టడంలో ఇదే నా అభిప్రాయం.”
గురజాడనీ, శ్రీశ్రీ ని ‘కోట్’ చెయ్యకుండా ఏ వ్యాసం పూర్తవదని ఎక్కడో చదివేను. మొర్మొరాలు నవుల్తున్నప్పుడు “[…] కన్యాశుల్కంలో ‘పిల్లా, అగ్గిపుల్ల’ అన్నట్టు అడిగాడు” తగలడం ఆశ్చర్యం.
కవిత్వం మీద ఎంతసేపూ, భజన వ్యాసాలే తప్ప, వున్నదున్నట్టూ, మంచీ చెడూ వున్న వ్యాసాలు చాలా తక్కువేనేమో. 1961 లో మొదటి ముద్రణ. 3000 ప్రతులు. 72, 76, 82, 86 లలో మలి ముద్రణలు. విశాలాంధ్ర వారి ప్రచురణ. విశాలాంధ్ర వారు ఇంతకన్నా మంచి ప్రచురణే చెయ్యగలిగీ ఇలా చెయ్యడం బాధాకరవఁయిన విషయం.
పుస్తకం హస్తభూషణం అంటారు. ఈ పుస్తకం శిరోభూషణం.
రంగ అభిప్రాయం:
September 2, 2008 7:34 am
పాత మొర్మొరాలే కానీ, కొత్తవి గుప్పెడు కాదు కదా, ఒఖ్ఖటి కూడా దొరక లేదు. బహుశా, టైటిల్ నాకర్థం కాలేదేమో. చదివించే శైలి మాత్రం బావుంది.
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
September 4, 2008 8:13 am
బాబ్జీలు గారూ:
“ఈమాట రచయిత” గా మీకు స్వాగతం!
అడిగిన వెంటనే, “చెయ్యి” చేసుకున్నందుకు చాలా సంతోషం.
మీరు ఈ రచనకి ఎన్నుకున్న వస్తువు బాగానే ఉంది కాని, మీ సమర్ధత ఇంతకన్నా ఎక్కువ కాబట్టి, వచ్చే సంచికల్లో మరిన్ని మీ “రాతలు” కోసం ఎదురు చూస్తూ, అంత వరకు ఒక్క సిటం ఆగుతాను.
విష్ణుభొట్ల లక్ష్మన్న
పాఠకుడు అభిప్రాయం:
September 4, 2008 10:20 am
పిడకల వేట ఎక్కువైన ఈ వ్యాసంలో కనీసం పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు. గందరగోళం ఎక్కువయ్యింది.
ramadevi godugula అభిప్రాయం:
September 7, 2008 11:29 pm
ఈ పాఠకుడిబాధ అర్ధం కావట్లేదు. గందరగోళం ఏమిటో వివరంగా రాస్తే బావుండేది. నిజానికి చక్కటి వ్యాసం మీద ఎందుకు ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చారు? ఈ Site లో ఎడిటింగ్ అంటూ వుండదా ? పిడకల వేట ఎక్కువైంది అనడం ఎంతవరకు సబబు? మొర్మరాల మీద వ్యాసం ఇంతకన్నా ఇంకెలా వుండాలి? సహేతుకంగా లేని ఇలాంటి అభిప్రాయలని Publish చెయ్యడం ఈమాట విష్ణుభొట్ల లక్ష్మన్న గారిలాంటి వాళ్ళు గమనించాల్సిన విషయంగా భావిస్తున్నాను.
రమాదేవి గొడుగుల
విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
September 8, 2008 6:28 am
రమాదేవి గారికి:
మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం!
చిన్న సవరణ.
నేను “ఈమాట” కు ఒకప్పుడు సంపాదకుడుగా పని చేసాను. ఇప్పుడు నేను “ఈమాట” సంపాదక బృందంలో లేను. కాబట్టి, అబిప్రాయాలను “కత్తిరించే” వెసులు బాటు నాకు ఇప్పుడు లేదు.
ఇక అభిప్రాయాలపై నా అభిప్రాయం:
అభిప్రాయాలు “సహేతుకంగా” ఉండవలసిన అవసరం లేదేమో! వ్యక్తిగత దూషణలకు, అర్ధం లేని అనవసర వివాదాలకు దారి తియ్యనంత కాలం, ఎవరి అభిప్రాయాలు వారివి అని ఊరుకుంటే సరి. నేను ఈమాటలో “నా రాతలపై” వచ్చిన కొన్ని అభిప్రాయాలను చదివి ఊరుకున్నానంతే!
నమస్సులతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
September 11, 2008 6:31 pm
భాస్కర్,
పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు అనను గానీ, గుప్పెటినిండా దొరకలేదు. దవడలక్రింద గుప్పెడన్నా నలగకపోతే మొర్మరాల రుచి అంతగా తెలీదుకదా. నోట్లో పడిన ఆ కొద్ది మరమరాలు ఎక్కడో, ఎప్పుడో సరుకుల గదిలో మర్చిపోయిన డబ్బాలో చాలాకాలంగా నిలవుండిపొయ్యి, కొంచెం బూజెక్కి, కరుణెక్కిన మరమరాలని నాకనిపించింది. సాయంకాలం రావాలయందగ్గరకి హస్కేసుకోడానికిపోతే, తెలుగయ్యోరు వ్యాకరణం గురించి ఇచ్చిన ఉపన్యాసం ఇన్నట్టుంది ఈ వ్యాసం. చదివించగలిగిన శక్తుందా, బెమ్మాండంగావుంది గానీ చదివిందే భలే లేదనిపించింది. ఆ మాత్రం రాయగలిగుండి ఈపాటికో గుప్పెడు కథలో కాకరకాయలో రాసెయ్యకుండా, why the heck you are reintroducing us to something passé?
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
September 15, 2008 12:15 am
చదివించగలిగే శక్తి ఉన్న రచనని మరీ అంత హీనంగా చూడకూడదేమో! ఈ రచన ముఖ్యోద్దేశం ఏమిటి? పాత పద్యాల గురించి సామాన్య పాఠకులకుండే భయాన్ని పోగొట్టడం. ఎలా? ఓ పుస్తక పరిచయం ద్వారా.
దానిని మన పత్రికలలో ఏదో మొక్కుబడికో పేజీ నింపడానికో చేసినట్లు కాక తన అనుభవంతో అన్వయించుకుంటూ సొంత జీవితంలో ఎరిగిన వ్యక్తుల్ని స్మరించుకుంటూ చేశాడు. అది మెచ్చుకోదగ్గ ప్రయత్నం.
పోయినేడు, ఈమాట మిత్రులు నన్నేమైనా వ్యాసం రాయమని పదేపదే పోరితే, సరేనని మాఊళ్ళో లైబ్రరీ కెళ్ళి పుస్తకాలు తిరగేశా - Essay Writing for Dummies లాంటిదేమైనా దొరుకుతుందని. వ్యాస రచన నాకంత సులభం కాదని తెలిసిపోయింది. ఈ వ్యాసమూ, అబిప్రాయాలూ చదివాక, ఆ పుస్తకాలలో చదివినదొకటి గుర్తుకొచ్చింది:
“The hallmark of the personal essay is its intimacy. The writer seems to be speaking directly into your ear, confiding everything from gossip to wisdom. Through sharing thoughts, memories, desires, complaints, and whimsies, the personal essayist sets up a relationship with the reader, a dialogue - a friendship, if you will based on identification, understanding, testiness, and companionship.” [1]
Montaigne, “Every man has within himself the entire human condition,” అన్నాడట. అంటే బాబ్జీలు గారు తన గురించి చెప్తున్నప్పుడు నిజంగా మన (అంటే నాలాంటి వాళ్ళు, కామేశ్వరరావు గారి లాంటి వారు కాదు) గురించి చెప్తున్నట్లు.
అలా చూస్తే ఇది చదవదగ్గ రచనే. లోపాల్లేవని కాదు. ఉదాహరణకి, “పోతన్న కవిత్వ పటుత్వం,” వ్యాసం గురించి రాజాజీ వ్యాఖ్య కన్నా చెప్పదగ్గ విషయం లేదా? (తేల్చుకోడానికి ఈ పుస్తకం నాకందుబాటులో లేదు.) మరొకటి, వాళ్ళ చిన్నాన్న పక్కన ఆయవారాలు చేసుకునే ఆయన్ని చూసి చికాకు పడే నాన్నమ్మ - ఇది పాఠకుడిలో సరయిన స్పందన కలిగిస్తుందా?
“ఈ యువతరం వారు సుప్రసిద్ధాలయిన పాత విషయాలు,” తెలుసుకోవాలనే కోరికతో రాశానన్నారు తాపీధర్మారావు, అవి బూజుపట్టిన మరమరాలు, why the heck you are reintroducing us to something passé? అంటోంది యువత!
కొడవళ్ళ హనుమంతరావు
[1] From “Introduction,” in “The Art of the Personal Essay: An Anthology from the Classical Era to the Present,” by Philip Lopate.
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
September 15, 2008 11:06 am
భాషా, వాక్యమూ అద్భుతంగా ఉన్న ఈ వ్యాసంలో విషయానుక్రమ లోపం కొట్టచ్చినట్లు కనిపించింది.
ఈ వ్యాసం సమీక్ష లా అనుకుందామా అంటే అలా అనిపించలేదు. పోనీ “నాకు నచ్చిన పుస్తకం ( పద్యం)” లా అనుకుందామా అంటే అలాగానూ లేదు. ఎత్తుగడ ప్రధానంగా స్వానుభవం తో మొదలయ్యింది. అది కాస్తా సాగదీయబడింది. తరువాత హఠాత్తుగా వస్తువు వైపు మళ్ళింది. ఎదో ఆ పుస్తకంలో విశేషాలు తెలుస్తాయి అనుకునేంతలో మధ్యలో “మానేపల్లి సత్యనారాయణ మేష్టారు ” వచ్చేసారు. పోనీలే అనుకుని సాగితే ఇంకో వ్యాస ప్రస్తావన వస్తుందీ అనుకుంటే తాతాజీ గారెందుకు రాసారో వివరణ చెప్పారు. వెంటనే ఇంకో వ్యాసం గురించి వ్యాసకర్త అభిప్రాయాలు బిలబిలా వచ్చేసాయి.
“ఎందుకు తాతాజీ గారి పుస్తకం చదవాలి? అందులో ఆయన చెప్పిందేంటి? వ్యాసకర్తని అంతలా స్పృశించిన అంశాలేంటి? అనేవి ఎక్కడా కనిపించకపోడమే ఇందులో వున్న లోపం. స్వానుభవం ముందు చెప్పి, పుస్తకంలో ఏం వుందో రాసి, ఆ తరువాత వ్యాసకర్తని ప్రభావితం చేసిన అంశాలు రాసుంటే మరింత బాగుండేదని నా అభిప్రాయం. వ్యాసం పూర్తయ్యాక తాపీ గారి పుస్తకం గురించి తెలిసింది చాలా తక్కువ. ఇదంతా కేవలం వస్తువు చుట్టూ అల్లుకున్న అనుభవాల సాగతీత వల్ల అయ్యుండచ్చు.
హస్తభూషణం అయితే ఓ సారి చదివి ఆనందిస్తాం. శిరోభూషణం అయితే పక్క వాళ్ళకీ చెబుతాం. మనోభూషణం అయితేనే ఆ పుస్తకం గురించి రాయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ అది కనిపించలేదు ( నాకు మాత్రమే).
హనుమంత రావు గారు “చదివించగలిగే శక్తి ఉన్న రచనని మరీ అంత హీనంగా చూడకూడదేమో! ” అని రాసారు. ఈ మాటలో కొన్ని కథలూ, వ్యాసాలూ, కవితలపై ఇంతకు ముందొచ్చిన ఘాటైన పదజాలం ఇక్కడ కామెంట్లలో లేదనే అనిపించింది. వ్యక్తిగత నిందలేనంత వరకూ అభిప్రాయ ప్రకటనకొచ్చిన అడ్డేం లేదు. కాదంటే ఈమాట వారి “పదునైన” కత్తెరెలాగూవుంది.
అన్ని రచనలూ అందరికీ నచ్చాలని లేదు. కొందరికి వంకాయిష్టం. మరికొందరికి కాకర కాయ ప్రాణం. వంట సరిగ్గా ఉంటే, నచ్చిన వాళ్ళు లొట్టలేస్తారు. నచ్చని వాళ్ళు నీళ్ళు నమిలి నిష్క్ర మిస్తారు. మరీ కడుపు మండితే ఎలావుంటుందో అందరికీ తెలుసున్నదే!
రానారె అభిప్రాయం:
October 29, 2008 7:47 pm
ఒక వరసంటూ లేకుండా హాయిగా కబుర్లాడినట్టుగా బాగుందీవ్యాసం. నాలుగు కొత్తవిషయాలు తెలిశాయి. ‘సాహిత్యమొర్మొరాల’ను ఒకసారి చదవాలనిపించేలా వుంది.
కర్ణాంతాయతలోచనే … అన్నారు … కర్ణాంతాకీర్ణలోచనే అని ఒక అణా ఎక్కువగా మా పాఠాల్లో చదువుకున్నట్టు గుర్తు. అణాలు చెలామణిలో లేని రోజులా అవి!!?