ధార

ఈలోపు మాపక్క నుంచి ఏదో మాయ జలతారు మమ్ముల్ని కప్పేసినట్లు, అమెరికన్‌ డాలర్ల వర్షం కురిసినట్లు, ఫారిన్‌ సెంటు పీపాలేవో పగిలి మేము ఆ పరిమళపు వరదలో కొట్టుకు పోతున్నట్లు, ఇంకా ఏవేవో అవుతున్నట్లు భ్రాంతి కొలుపుతూ ఒక గులాబి పువ్వు, అంతకంటే చక్కనైన కార్లోంచి దిగి, నడిస్తే ఆ గ్రానైట్ రాళ్ళు ఎక్కడ కందిపోతాయో అన్నంత సుతారంగా అడుగులు వేస్తూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ, అందరూ నన్నే చూడక తప్పదుగా అనే నమ్మకంతో కాబోలు ఎటూ తల కూడా తిప్పకుండా హోటల్ రిసెప్షన్ ‌దాటి అలా అలా చిలిపి అని తెలుగు అర్ధాన్నిచ్చే బహు ఇంగ్లీషు రెస్టారెంటులోకి అడుగులేసింది. మా ముగ్గురి లోకి మొదట తేరుకున్న వెంకట్ “ఒరేయ్, ఎదవల్లారా, ఏమిటా చూపులు? ఇక్కడ అరకోటి కారు నొదిలేసి” అంటూ మమ్ముల్ని మళ్ళీ ఈ పాపపంకిలపు లోకం లోకి లాగాడు.

“నీ కారు, నీ బొంద! ఆ అందం చూడరా, ఆమె ఒక్క సారి కోరితే ఆ కార్ల ఫ్యాక్టరీ వోనరే వంద కార్లు వైజాగ్ పంపిస్తాడు ఫ్రీగా” అన్నాను.

“ఏడిశావులే, సిండి క్రాఫర్డ్, నయోమి కాంప్బెల్ లాంటి వాళ్ళే వాడిని ఏమీ చేయలేకపోయారు. మన స్థానిక వనరులు ఏమీ చేయలేవు గానీ పదండి బార్లోకి” అన్నాడు.

“అబ్బే, ఈరోజు మంగళవారం మేము ఈరోజు తాగం .. పద.. చి..లి..పి..లోకి” అన్నాం.

“మంగళవారం మానటం ఏంట్రా?” వాడి అనుమానం.

“అవును మరి గురువారం, శనివారం ఎన్వీ మానట్లేదా? అలాంటిదే ఇదీ, పద” నేను.

చిలిపి రెస్టారెంట్ యువజంటల తోటీ నవధనికుల తోటీ కళకళ లాడుతోంది. వచ్చిన గులాబీ పువ్వు ఏ కుండీలో కూర్చుందో అని మేము వెతకక్కర్లేకుండానే అటు వేపే తిరిగిన జనాల మెడలు మాకు దారి చూపించాయి. మేము దగ్గర్లోనే ఒక టేబుల్ చూసుకొని, లొట్టల బాటిల్ తెరిచాము.

“ఎందుకురా కొంతమంది ఇంత అందంగా పుడతారూ?” అనేది గోవిందరాజుల అనుమానమైతే, “చూడరా, ఎంత సింపుల్ గా, మెళ్ళో ఒకే ఒక్క సన్న చెయిన్‌తో, స్మాషింగ్ బ్యూటీరా బాబూ” అని నా కితాబు.

“ఒరేయ్, లంబూ-జంబూ! అంత సింపుల్ గా తయారయ్యి బయటకు, ముఖ్యంగా ఇలాంటి స్టార్ హోటళ్ళకూ, పార్టీలకూ రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలీదురా” అన్నాడు వెంకట్.

“అవున్లే, నీకంటే స్వంత అనుభవం! మాకేం తెలుస్తుందీ?” సాగతీశాడు గోవిందరాజులు. కేజీలకు కేజీలు నగలు దిగేసుకుని, నడిచే నగల దుకాణం లాగా, మూవింగ్ జ్యూయలరీ మాల్స్ లా తిరిగే వెంకట్ భార్య, వదినలు గుర్తుకొచ్చి నేను పెద్దగా నవ్వితే, వాడేమో టేబుల్ కింద నుంచి తన్నాడు.

“ఇంతకీ, రేయ్, ఈ అందం ఎవరి సొంతంరా” అని మాలో మేము త్రైపాక్షిక చర్చలు జరుపుకుంటూ సూపు బదులు ఆమె అందాన్ని కళ్ళతో సిప్ చేస్తూ మధ్యలో విసిగిస్తున్న సెల్లు పీక నొక్కుతూ కాలం గడుపుతున్నాం.

ఈ లోపు ఎప్పుడొచ్చాడో తెలియదు గానీ ఆమె పక్కనో పురుషపుంగవుడు కూర్చుని ఉన్నాడు, ఏదో నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ… అసలే కరంటు కోతేమో… అప్పటి దాకా మసక మసకగా ఉండే దీపాలు పూర్తిగా ఆరిపోయాయి. కిచెన్‌ డోర్ లోనుంచి ఇద్దరు వెయిటర్లు పెద్ద ట్రే మీద బొద్దుగా ఉన్న కేకును తీసుకురావటం, ఓ మూలగా బవిరి గెడ్డాలతో, బూచోడి వేషాల్లో ఉన్న బ్యాండు సభ్యులు హ్యాపీ బర్త్ డే టూ యూ అని పాట ఎత్తుకోవటం, ఒక్క సారే జరిగాయి. చుట్టూ జనం చేరటంతో ఎవరి పుట్టిన రోజో కేకు ఎవరు కోశారో తెలియలేదు. కానీ పక్కన ఉన్న పురుషోత్తముడు మాత్రం కోపంతో కుతకుత లాడి పోతున్నాడు. గులాబి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. మెల్లగానే అయినా, గట్టిగా పళ్ళ బిగువున ఏదో అంటున్నాడు. గులాబి కళ్ళల్లో ముందస్తుగా ఒక సన్నటి నీటి తేర పేరుకుంది. త్వరలోనే గట్లు తెంచుకుని ఒక్కో చుక్కా దూకుతున్నాయి గులాబి రేకుల్లాంటి ఆ చెంపల మీదికి, ధారగా. అతగాడు వేళ్ళు చూపుతూ, పిడికిలితో ముందున్న టేబులు మీద గుద్దుతూ, ఆమె పెదవి చివరను మునిపంట కొరుకుతూ, నేల జారుతున్న కన్నీటి ముత్యాల్ని కర్చీఫ్ తో అదుపు చేయాలని విఫలయత్నం చేస్తూ… మాకు తెలియకుండానే అరగంట గడిచి పోయింది.

“ఛస్! మంచి ఈవెనింగ్ చెడగొట్టార్రా” అని తిడుతూ వెంకట్ పైకి లేచాడు. గోవిందరాజులు కూడా పోదాం రా అని క్రెడిట్ కార్డు వెయిటర్ కిచ్చి, మెల్లగా అడుగులు వేస్తూ, కొంచెం దూరం వచ్చి వెనక్కి చూసి, “ఇంకా ఏడుస్తోందిరా” అన్నాడు. స్వింగ్ డోర్ ను తిప్పుతూ నేనూ ఒక సారి మెల్లగా చూశాను, ఈసారి కర్చీఫ్ నోటికి అడ్డం పెట్టుకుని టేబుల్ను ఒక చేత్తో పట్టుకుని ఏకధారగా ఏడుస్తోంది. రిసెప్షన్‌లో క్రెడిట్ కార్డ్ కోసం నిలబడి మనసూరుకోక మళ్ళీ ఒకసారి చూస్తే రెండు చేతులతో మొహం కప్పుకొని బావురుమంటోంది. ఈలోపు మాకన్నా లోకానుభవం తనకు ఎక్కువనుకునే వెంకట్, “చాలా మంది ఆడ వాళ్ళింతేరా, ఏడవటం, ఏడిపించటం,” అన్నాడు.

బయట చిక్కబడ్డ చీకటి, మేము మౌనంగా కిందకు దిగాం. కానీ చెవుల్లో కైలాసగిరి కొండ మీద వినిపించే బంగాళాఖాతపు హోరులా ఆమె రోదన కర్ణభేరిని బద్దలు చేస్తున్న భావన.


దేవరపల్లి రాజేంద్ర కుమార్‌

రచయిత దేవరపల్లి రాజేంద్ర కుమార్‌ గురించి:

పుట్టింది గుంటూరు జిల్లా నిడుబ్రోలు – పొన్నూరు లో ,
పాఠశాల విద్యాభ్యాసం అక్కడి జిల్లా పరిషత్ హైస్కూలులో ,
అంధ్రా క్రిష్టియన్ ‌ కాలేజీలో ఇంటర్మీడియట్ , డిగ్రీ ,
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం . ఏ., ఫిలాసఫి,
మాష్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ ‌ ,
ఈనాడు జర్నలిజంస్కూలులో డిప్లొమ ,
ఈనాడు దినపత్రికలో హైదరాబాద్ లో కొంతకాలం రిపోర్టరు ఉద్యొగం ,
మధ్యలో ఆగిపోయిన పి. హెచ్ . డి.
1992 నుండి రచనలు,
ఆంధ్రజ్యోతి , ఆంధ్రభూమి , మిసిమి , తదితర పత్రికల్లో ప్రచురణ , ప్రస్తుతం ఒక ఆంగ్లదినపత్రికలో (విశాఖపట్నం) రిపోర్టరు ఉద్యోగం, పూర్తి కాలపు రచయితగా , పర్యావరణ కార్యకర్తగా మారాలని కోరిక. ప్రస్తుతం మూడు బ్లాగులను నిర్వహిస్తున్నారు.

 ...