జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4

జ్యోతిషం పనిచేస్తుందో, పని చెయ్యదో తేల్చుకోవడం మరీ కష్టమేమీ కాదు. అయితే దానికి తాను కేవలం జాతకం చూసి, జాతకుడితో మాట్లాడకుండా, ఏ విధమైన సమాచారమూ స్వీకరించకుండా సరైన ఫలితాలు చెప్పగలను అన్న నమ్మకం ఉన్న జ్యోతిష్కులు కావాలి. జ్యోతిషం పని చేస్తుంది అని ఋజువు చెయ్యడం అవసరమే అని వాళ్ళు భావించాలి. (కనీసం తమ నమ్మకాలు తప్పో, ఒప్పో తేల్చుకోవాలి అని భావించేవాళ్ళైనా సరే కావాలి – అయితే అంత నిజాయితీ కలవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారో నాకు అనుమానమే.) అంతే కాదు, వాళ్ళు తమ ప్రతిభని పరీక్షకి పెట్టడానికి ఒప్పుకోవాలి. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. కొంచం పేరు, ప్రతిష్ఠలు సంపాదించిన జ్యోతిష్కులు కూడా అసలు పరీక్షించడం అన్న భావననే ఒప్పుకోరు. ఎందుకంటే అందులో వాళ్ళ పేరు, ప్రతిష్ఠలు బలి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకే నేను కొన్ని సూచనలు చెయ్యదలచుకున్నాను.

జ్యోతిష్కులకి తమ ప్రతిభని తామే పరీక్షించుకునే అవకాశాలు కల్పించడం:
పైన చెప్పిన లక్షణాలు గల జ్యోతిష్కుల కోసం ఒక వెబ్ సైట్ తయారు చెయ్యాలి. ఆ వెబ్ సైటుని పూర్తిగా నిష్పాక్షికంగా ఉండగల పరిశోధకులు నిర్వహించాలి. అందులో ఎవరైనా సరే తమ జన్మ వివరాలూ, జీవిత విశేషాలూ ఇవ్వవచ్చు. ఆ ఇచ్చిన సమాచారాన్ని వెరిఫై చేసి సరైనదో కాదో నిర్ణయించాలి. (లేదా సైటు నిర్వాహకులే శాస్త్రీయ పద్ధతుల్లో అటువంటి సమాచారాన్ని సేకరించాలి.) ఆ సైటులోకి జ్యోతిష్కులు తమ అసలు పేర్లు చెప్పకుండా ప్రవేశించవచ్చు. అక్కడ ఉన్న జన్మ వివరాల్ని బట్టి జ్యోతిష్కులు ఫలితాలు చెప్పాలి. తరువాత పరిశోధకులు ఆ ఫలితాల్లో ఎన్ని నిజమయ్యాయో పరిశీలించి ప్రకటించవచ్చు, లేదా ఆ జ్యోతిష్కులకి మాత్రమే తెలియజేయవచ్చు. ఇందులో వ్యక్తిగతంగా జ్యోతిష్కులకి జరిగే నష్టం ఏమీ ఉండదు, కాబట్టి వాళ్ళు తమ ప్రతిభని తామే పరీక్షించుకోడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అంతా జ్యోతిషానికి ఒక సవాలు అనీ, జ్యోతిష్కులు తప్పులు చెప్తే జ్యోతిషానికి ఆపద ముంచుకొస్తుందనీ వెబ్ సైటు నిర్వాహకులు భావించకూడదు, ప్రకటించకూడదు. (లేకపోతే జ్యోతిష్కులెవరూ ఆ సైటు జోలికే రారు).

ఆ వెబ్ సైట్ యొక్క ఉద్దేశ్యం ఏమై ఉండాలి అంటే, జ్యోతిష్కులు తాము సంపాదించుకున్న జ్ఞానాన్ని పరీక్షించుకోడానికి అవసరమైన ఒక వేదికను కల్పించడం. అంతే. దీనివల్ల కలిగే ప్రయోజనమేమిటంటే, జ్యోతిషం నిజంగా పని చేస్తుందో లేదో చూడాలనుకునే కుతూహలం గల జ్యోతిష్కులూ, జ్యోతిష విద్యార్థులూ, తమ నమ్మకాల్ని తామే వెరిఫై చేసుకోగలగడం. తాము తప్పులు చేసేకొద్దీ వాళ్ళలో శాస్త్రం మీద భ్రమలు తొలగే అవకాశం ఉంటుంది. లేదా, నిజంగా వాళ్ళు సరైన ఫలితాలు చెప్పగలిగితే, వాళ్ళు ఏ జ్యోతిష సూత్రాలు ఉపయోగించి ఫలితాలు చెప్పారో వాటిని ఇంకా గట్టిగా ఇతరులు పరిశోధించడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి పరిశోధనలకి సహకరించగల ధైర్యం జ్యోతిష్కులకీ కలుగుతుంది. జ్యోతిషం నేర్చుకునేవాళ్ళ అసలు సమస్య ఏమిటంటే, తాము నేర్చుకునే సూత్రాలు వేటినీ పరీక్షకి గురి చెయ్యకుండా, కేవలం పుస్తకాలు చదివో, గురువుల అనుభవాలు వినో, జాతకాలు చెప్పడానికి సంసిద్ధమైపోవడం. ఇటువంటి ప్రయత్నాల ద్వారా కొంతమటుకు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోడానికి వాళ్ళకి సాధ్యపడుతుంది.

అయితే ఇటువంటి ప్రయత్నం సఫలమవ్వాలంటే జ్యోతిష్కుల్లో కనీసం కొంతమందికైనా జ్యోతిషం ఎంతమటుకు పనిచేస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలి. అది లేకుండా కేవలం నమ్మకాలకి అతుక్కుపోతే, ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు.

వెరిఫై చెయ్యడానికి అవకాశం ఉన్న జ్యోతిష సూత్రాలని కంప్యూటర్ ద్వారా వెరిఫై చెయ్యడం:
చాలా మంది జ్యోతిష్కులు కొన్ని ఖచ్చితమైన, సరళమైన జ్యోతిష సూత్రాలు ఉన్నాయనీ, వాటి ద్వారా చాలా సందర్భాల్లో సరైన ఫలితాలు వస్తాయనీ అంటూ ఉంటారు. అటువంటి సూత్రాలని జ్యోతిష్కులందరూ ఒక ఫోరంగా ఏర్పడి ప్రకటించడం గానీ, సేకరించడం గానీ చేయాలి. ఇటువంటి సూత్రాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే, శని లేదా రాహువు 8వ ఇంట్లో ఉంటే దీర్ఘాయుర్దాయం (75 కంటే ఎక్కువ). శని రెండో యింట్లో ఉంటే వివాహభంగం (విడాకులు లేదా separation). అష్టమంలో కేతువు వైధవ్యం. కేంద్రాల్లో గ్రహాలు పెద్దగా లేకపోతే అల్పాయుర్దాయం.

ఇటువంటి సూత్రాలని కంప్యూటర్ ప్రోగ్రాములని ఉపయోగించి వెరిఫై చెయ్యడం చాలా తేలిక. ఇటువంటి సూత్రాలకి మినహాయింపులు ఉంటే వాటిని కూడా ప్రోగ్రామ్ చెయ్యవచ్చు.
లేదా జ్యోతిష్కులు కనీసం ఒక్క అంశం మీద దృష్టిని కేంద్రీకరించి (వివాహం ఎప్పుడు జరుగుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది మొదలైనవి), ఆ అంశాన్ని తాము ఎలా నిర్ణయిస్తారో, ఎన్ని జ్యోతిషాంశాలని పరిశీలిస్తారో వివరంగా సమాచారం తయారు చెయ్యాలి. (అందులో ఎన్ని వందల, వేల అంశాలు, స్టెప్పులూ ఉన్నా పరవాలేదు.) దాన్ని బట్టి ఒక కంప్యూటర్ ప్రోగ్రాము తయారు చేయాలి. ఆ ప్రోగ్రాముకి జాతకుల వివరాలు ఇస్తే, నూటికి యాభై శాతానికి మించిన సందర్భాలలో అది సరైన ఫలితాలు చెప్పగలిగితే జ్యోతిషం పని చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించినట్టే.

ప్రయత్నిస్తే పోయేదేముంది, మన అజ్ఞానం తప్ప!

సైంటిస్టుల దృష్టిలో జ్యోతిష్కులు తప్పుదోవ పట్టినవాళ్ళు. జ్యోతిషం సూడో సైన్సు. శాస్త్రవిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా జ్యోతిషం వంటి అశాస్త్రీయ విషయాలపై నమ్మకాలు కలిగి ఉండడం హేతువాదుల దృష్టిలో హాస్యాస్పదమైన విషయం. జ్యోతిష్కుల దృష్టిలో మాత్రం జ్యోతిషం తమ స్వానుభవం ప్రకారం వెరిఫై చెయ్యబడిన శాస్త్రం. తమ వ్యక్తిగతానుభవంలో జ్యోతిషం నిజమని నిరూపించబడినప్పటికీ, ఆ వ్యక్తిగతానుభవాన్ని సార్వత్రికం చెయ్యలేకపోతే, ఆ అనుభవానికి ఉన్న విలువ ఏమిటి? సైన్సుకి జ్యోతిషం పట్ల మొహమాటమేమీ ఉండదు. అది నిజంగా పని చేస్తుందని తేలితే దానివల్ల సైన్సుకి కలిగే లాభమే ఎక్కువ. అయితే అది పని చేస్తుందనడానికి సైన్సుకి ఇంతవరకూ ఏ ఆధారాలూ లభించలేదు.

జ్యోతిష్కులు భ్రమల్లోనూ, అజ్ఞానంలోనూ బ్రతుకుతున్నారని సైన్సు అంటుంది. కాదని జ్యోతిష్కులు నిజంగా భావిస్తే నిరూపించవలసిన బాధ్యత వారి మీదే ఉంటుంది. ఏది ఏమైనా మన నమ్మకాలని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పేముంది? తప్పో, ఒప్పో పరిశీలిస్తే పోయేదేముంది?

మహా అయితే మన అజ్ఞానం తప్ప!!


1. మార్టిన్ బెర్జిన్స్ చేసిన పరిశోధనపై జరిగిన చర్చ ఇక్కడ చూడవచ్చు.
2. మార్టిన్ బెర్జిన్స్ పరిశోధనకి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలంటే నన్ను వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు.
3. డాక్టర్ ఫ్రాంక్ మెక్ గిలియాన్ రాసిన వ్యాసం పూర్తి పాఠం ఇక్కడ చదవండి
4. జ్యోతిష సూత్రాల్ని కంప్యూటరైజ్ చెయ్యాలని భావించే ఔత్సాహికులకు కోసం ఈ వెబ్‌సైట్.

(ఈ శీర్షిక ఇంతటితో సమాప్తం)