జ్యోతిష సంకేతాలకి మినహాయింపులు: కానీ ఇక్కడ మరొక సూక్ష్మాంశం ఉంది. జ్యోతిషం అనుభవాన్ని బట్టి తనను తాను సవరించుకొనే స్వభావం కలిగినది. అంటే ఒక జ్యోతిష్కుడి అనుభవం ప్రకారం లగ్నంలో శని ఉన్న ఒక జాతకుడు మహా సుఖాలు అనుభవిస్తున్నాడు అనుకోండి. అది తాను అవగాహన చేసుకున్న సంకేతాలకి విరుద్ధం. (శని కష్టాలని సూచిస్తాడు. లగ్నం ఆరోగ్యాన్నీ, శరీరాన్నీ సూచిస్తుంది). తన అనుభవంలో ఎదురైన ఈ వైరుధ్యాన్ని సవరించడానికి ఆ జ్యోతిష్కుడు ఏం చేస్తాడంటే, ఫలానా కారణం వల్ల ఈ జాతకానికి శని యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి ఈ జాతకుడికి శని సుఖాలే ఇస్తాడు అని శని యొక్క సంకేతానికి ఒక మినహాయింపు ఇస్తాడు.
భారతీయ జ్యోతిష శాస్త్రాన్ని కొద్దిగానైనా చదివినవారికి ఇటువంటి మినహాయింపులు, ఎదురు మినహాయింపులు వందలూ, వేలూ కనపడుతూ ఉంటాయి. చివరికి ఆ గ్రహాల సంయోగాలూ, వాటి ఫలితాలూ ఎంత గందరగోళంగా తయారవుతాయంటే, ఉపాసనా, దైవానుగ్రహమూ (లేదా క్వాంటం ఫిజిక్సు) లేకుండా ఫలితాలు చెప్పడం సాధ్యపడదు అనేటంత. అయినా సరే జ్యోతిష సంకేతాల ఆకర్షణా, అనేక గ్రహ సంయోగాలను తెలుసుకుంటూ ఉండడం వలన శాస్త్రంలో పురోగమిస్తున్నాననే తృప్తీ, ఫలితాలన్నీ సరైనవే అని ఎప్పటికప్పుడు ఆకాశానికెత్తే విశ్వాసులూ జ్యోతిష్కుడు శాస్త్రాన్ని దృఢంగా విశ్వసించేలా చేస్తాయి. జ్యోతిషం అనంత సాగరమనీ (combinatorial explosion), అందులో తనకు తెలిసినది చాలా కొంచం మాత్రమే అనీ చాలా గొప్ప జ్యోతిష్కులే తమ వినయాన్ని చాటుకుంటూ ఉంటారు.
ఇన్ని మినహాయింపులూ, అనేక వందల గ్రహ సంయోగాల గందరగోళాలు ఉన్నప్పటికీ జ్యోతిష సంకేతాల ప్రాథమిక అవగాహనలు (శని = కష్టాలు, శుక్రుడు = సుఖాలు మొదలైనవి) వేల సంవత్సరాలుగా యథాతథంగా నిలిచి ఉండడం ఆశ్చర్యకరం.
జ్యోతిష సంకేతాలు సంగ్రహ (abstract) రూపంలోనే ఫలితాలు సూచించగలవు: జ్యోతిష్కులకి తరచుగా వినిపించే ప్రశ్న. ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు కవలలకి ఒకే జాతకాలు ఉంటాయి కదా. వాళ్ళ జీవితాలు మరి ఒకే విధంగా ఉండవు, ఎందుకని? చాలామంది జ్యోతిష్కులు దీనికి చెప్పే సమాధానం ఏమిటంటే కవలలు పుట్టినప్పుడు వాళ్ళ జన్మ సమయాల్లో ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే, జాతకాలు మారిపోతాయి అని. జాతకంలో అనేక సూక్ష్మ విభాగాలు ఉంటాయనీ, అవి కొన్ని సెకన్ల వ్యవధానంలోనే మారిపోతూ ఉంటాయి అనీ, కాబట్టి జన్మ సమయం ఎంత దగ్గరగా ఉన్నా సరే, వాళ్ళ జీవితాలకి పోలిక ఉండదనీ కూడా కొంతమంది అంటుంటారు.
కవలల సంగతి పక్కన పెట్టినా, ఒకే జాతకాంశం అందరికీ ఒకేలా పని చేస్తుందా? ఉదాహరణకి ఒక రెండు జాతకాల్లో కుటుంబ స్థానాన్ని శుక్రుడు పరిపాలిస్తున్నాడు అనుకోండి. అంటే ‘కుటుంబ సౌఖ్యం ఎక్కువ’ అని జ్యోతిష్కులు అంటారు. అంతకన్నా సూక్ష్మంగా ఫలితాలు ఏమైనా చెప్పగలవా అని అడిగితే చెప్పగలిగేవాళ్ళు ఎవరూ ఉండరు. కుటుంబ సౌఖ్యం అంటే ఏమిటి? ఇంట్లో మంచి భోజనం ఉంటుందనా? ఇల్లు బాగుంటుందనా? తల్లి దండ్రులు, భార్యా బిడ్డలూ ఎక్కువ ప్రేమిస్తారనా? మరి వాళ్ళ ఇంట్లో ఎవరికీ ఎప్పుడూ అనారోగ్యాలు రావా? ఇంట్లో కాలో చెయ్యో కదలని ముసలివాళ్ళు ఎవరూ ఉండరా? ఇలా సూక్ష్మ వివరాల కోసం అడిగితే జ్యోతిష్కులు చెప్పగలిగేది శూన్యం.
అలాగే ఎవరికైనా సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం అని జోస్యం చెప్పారనుకోండి. ఎందులో? జావాలోనా? సైబేస్ లోనా? వెబ్ డిజైనింగా? డేటా వేర్ హౌసింగా? సపోర్టా? డొమైన్ ఏమిటి? ఏ కంపెనీ? టీసీయెస్సా? ఇన్ఫోసిస్సా? ఒరాకిల్లా? ఎక్కడ ఉద్యోగం వస్తుంది? బెంగళూరా? హైదరాబాదా? పూనానా? ఇలాంటి ప్రశ్నలకి ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడూ సమాధానం చెప్పలేడు. కాబట్టి జాతకాన్ని ఖచ్చితమైన సెకను ప్రకారం గుణించినా, అతి సూక్ష్మ విభాగాలు చేసి చూసినా, ఫలితాలు మాత్రం చెప్పగలిగేది ఒకానొక సంగ్రహ (abstract) రూపంలోనే తప్ప వివరంగా చెప్పడం సాధ్యపడదు. బెంగళూరుకీ, ఇన్ఫోసిస్ కీ, సైబేస్ కీ జ్యోతిష సంకేతాలు ఉండవు.
కాబట్టి కవలలకైనా, మామూలు జాతకాలకైనా సంగ్రహంగా ఫలానా అప్పుడు బాగుండచ్చు, ఉద్యోగం రావచ్చు, కుటుంబంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు ఇలా ఏదో తడుముకుంటూ ఫలితాలు చెప్పడమే తప్ప వివరంగా ఫలితాలు చెప్పడం సాధ్యపడదు. జ్యోతిషమంటేనే కొన్ని abstract సంకేతాలని బట్టి ఊహాగానాలు చెయ్యడం. అందరికీ ఒకే ఫలితం చెప్పినా వాళ్ళ వాళ్ళ అనుభవం వేరుగా ఉంటుంది. ఎవరి ‘కుటుంబ సౌఖ్యాలూ’, ‘సాఫ్ట్ వేర్ ఉద్యోగాలూ’ వాళ్ళవి. ఇది జ్యోతిషానికున్న అతి పెద్ద హద్దు (limitation). ఇది జ్యోతిష్కులూ, జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళూ కూడా అవగాహన చేసుకోవాలి.
జ్యోతిష సంకేతాల్ని మనస్తత్వశాస్త్ర పరంగా శాస్త్రీయంగా పరిశీలించాలి: జ్యోతిష సంకేతాలు ఒక సార్వజనీనమైన మానసిక భాష లాంటివి. అవి దేశ, కాలాలకి అతీతమైన ఒక మానవ స్వభావంలోని భాగాల్ని సూచిస్తాయి. ఒకే మానసిక స్థితి దేశాన్నీ, సమాజాన్నీ బట్టి అక్కడి ఆచారాల ప్రకారం వ్యక్తం కావడం జరుగుతుంది. ఉదాహరణకి యుక్త వయసులో డేటింగ్ చెయ్యడం పాశ్చాత్య దేశాల్లో సహజం. భారత దేశంలోని అధిక ప్రాంతాల్లో ఇంకా ఈ ఆచారం లేదు. ఒక పాశ్చాత్య యువకుడి జాతకం, ఒక భారతీయ యువకుడి జాతకం పరిశీలిస్తున్నాము అనుకోండి. ఇద్దరికీ ప్రేమలో పడే ఒక యోగం ఉంది అనుకోండి. పాశ్చాత్య యువకుడు ఒక అమ్మాయితో డేటింగ్ చెయ్యడానికి అవకాశం ఎక్కువ. సాంప్రదాయ కుటుంబంలోని భారతీయ యువకుడు మౌనంగా మనసులోనే ప్రేమించడానికి అవకాశం ఎక్కువ. ఇద్దరికీ ఒకే యోగమైనా వేర్వేరుగా పని చేస్తుంది.
అలాగే పాశ్చాత్య జంటల్లో విడిపోవడాలు ఎక్కువ. భారతీయులకి తక్కువ. మరి వాళ్ళ జాతకాల్లో విడాకుల యోగాలు ఎక్కువగానూ, భారతీయ జాతకాల్లో విడాకులు తక్కువగానూ కనిపిస్తాయా? అలాగే వాళ్ళకి సవతి తండ్రులు ఉండే అవకాశాలు ఎక్కువ. భారతీయుల్లో సవతి తల్లులు మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ తేడా మరి జాతకాల్లో కనిపిస్తుందా? నా అనుభవం ప్రకారం కనిపించదు. పాశ్చాత్యులూ, భారతీయులూ కూడా ఒకే భూమి మీద నివసిస్తున్నారు కాబట్టి, అందరికీ గ్రహాలూ, రాశులూ ఒకటే కాబట్టి, జ్యోతిషం ఒకవేళ నిజమే అయితే, ఒకే గ్రహ సంకేతాలకి వేర్వేరు సంస్కృతుల వాళ్ళు వేర్వేరు విధాలుగా ప్రతిస్పందిస్తున్నారు అనుకోవాలి. జ్యోతిష సంకేతాల్ని మనస్తత్వ శాస్త్ర పరంగా అధ్యయనం చేస్తే ఒక్కొక్క జ్యోతిష సంకేతమూ ఒక్కొక్క మానసికావసరం (psychological need) గా దర్శింపబడవచ్చును అనీ, ఆ దిశగా ఒక పరిశీలన చెయ్యడంలో తప్పేమీ ఉండబోదనీ నా భావన. ఈ రకమైన ప్రయత్నాలు పాశ్చాత్య జ్యోతిష్కుల్లో ఎక్కువ. అయినా సమాజంలో జ్యోతిషానికి ఉన్న ఒక ‘సిగ్గు పడాల్సిన స్థితి’ (taboo status) వల్ల ప్రతిభావంతులైన శాస్త్రజ్ఞులెవరూ జ్యోతిషం జోలికి సాధారణంగా పోరు.
జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు
ఇంతవరకు చేసిన శాస్త్రీయమైన పరిశోధనల్లో జ్యోతిషం నిజంగా పనిచేస్తుందని నిరూపితం కాలేదని నేను అనేక ఉదాహరణలిచ్చాను. ఎంత శాస్త్రీయంగా చేసినప్పటికీ ఆ పరిశోధనలు జ్యోతిష్కులకి చాలా అసంతృప్తిని కలిగిస్తాయి. జ్యోతిష్కులు జాతకాలు చెప్పేటప్పుడు అనేక అంశాలని పరిశీలిస్తారు. శాస్త్రీయ పరిశోధనల్లో అన్ని జ్యోతిషాంశాలనీ ఒకేసారి పరిశీలించడానికి వీలు ఉండదు. ఉదాహరణలు:1974 లో ప్రకటించిన మరొక పరిశోధనలో (Leonardo 7, 235 ) వృత్తికీ, ఆరోగ్య సమస్యలకీ, ఎత్తుకీ, ఆయుర్దాయానికీ – పుట్టినసమయంలో బుధ, శుక్ర, కుజ, గురు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్నదానికీ సంబంధమే లేదు అని తేలింది. అలాగే, 1967 లో మిషెల్ గోక్‌లా (The Cosmic Clocks, p 84) చేసిన పరిశోధనలో – జీవితంలో విజయాన్ని సాధించినవాళ్ళ జాతకాల్లో శని ఉండే ఇంటినీ, అలాగే హత్యలు చేసినవాళ్ళ జాతకాల్లో కుజుడు ఉండే ఇంటినీ పరిశీలించడం జరిగింది. ఈ రెండింటికీ శనీ, కుజుడూ ఏ ఇంట్లో ఉన్నారో అన్నదానితో సంబంధమే లేదని తేలింది.
జ్యోతిష్కులెవరూ కేవలం బుధ, శుక్ర, కుజ, గురు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి వృత్తినిగానీ, ఆరోగ్య సమస్యలని కానీ, ఆయుర్దాయాన్నిగానీ నిర్ణయించరు. అలాగే శనీ, కుజుడూ ఏ భావాల్లో ఉన్నారో అన్న ఒక్క అంశాన్ని మాత్రమే చూసి, వాళ్ళు హంతకులో కాదో నిర్ణయించరు. కాబట్టి ఇటువంటి పరిశోధనల్ని జ్యోతిష్కులు ఒప్పుకోలేరు. ఎంతో నిజాయితీపరులైన జ్యోతిష్కులు కూడా జ్యోతిషం పని చేస్తుందని నమ్మడానికి ప్రధానమైన కారణాలు రెండు. 1. జ్యోతిష సంకేతాలు గహనమైనవి. అవి ఒక ప్రత్యేకమైన ప్రాపంచిక దృక్పథాన్ని కలుగజేస్తాయి. వాటిని తప్పో, ఒప్పో తేల్చుకోవడం అంత సులభమేమీ కాదు. 2. జ్యోతిషం చాలా సందర్భాలలో పని చెయ్యదని తెలిసినప్పటికీ, కొన్ని కొన్ని సందర్భాలలో జాతకాలు ఆశ్చర్యకరంగా నిజమవ్వడం గమనించవచ్చు. వ్యక్తిగతానుభవం చాలా బలమైన ముద్రని వేస్తుంది కాబట్టి, ఎవరికి వారు వ్యక్తిగతంగా, జ్యోతిషం నిజమో కాదో పరీక్షించడానికి గట్టిగా ప్రయత్నిస్తే తప్ప జ్యోతిషం తప్పని పూర్తిగా అంగీకరించడం సాధ్యం కాదు.