జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4
జ్యోతిషమూ – కొన్ని సూక్ష్మాంశాలు
ఇందులో జ్యోతిషానికి సంబంధించిన నా ఊహలు కొన్ని వివరిస్తాను. వీటికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవనీ, ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అనీ మనవి.
దేవమాన దశా పద్ధతి: ఫ్రాంక్ మెక్ గిలియాన్ గారి వ్యాసంలో మెలటోనిన్ హార్మోను శిశువుల పుట్టిన రోజు నుండీ కొన్ని రోజుల వరకు ప్రభావాన్ని కలిగి ఉంటుందనీ, అది వారి భవిష్యత్ ప్రవర్తనని ప్రభావితం చేస్తుందనీ (pre-program) చెప్పబడింది. పాశ్చాత్య జ్యోతిషంలో ప్రిడిక్షన్సు చెప్పడానికి చాలా ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్ధతిని progression అంటారు. మన భారతీయ జ్యోతిషంలో కూడా దీని ప్రసక్తి ఉన్నదనీ, దీన్ని దేవమాన దశా పద్ధతి అంటారనీ కొందరు పెద్దలు అంటారు. ఈ పద్ధతిలోని సూత్రం ఏమిటంటే, మనిషి పుట్టినరోజు నుండీ ఒక్కో రోజు అతని భవిష్యత్తులోని ఒక్కో సంవత్సరాన్ని నిర్ణయిస్తుంది. అంటే, ఉదాహరణకి నాకు ముప్ఫయ్యవ సంవత్సరంలో జరగబోయే సంఘటనల్ని నేను పుట్టిన రోజు నుండి ముప్ఫయ్యవ రోజున ఉన్న గ్రహస్థితులు సూచిస్తాయి అన్నమాట. ఆవిధంగా ప్రతి జాతకానికీ పుట్టిన రోజునుండి సుమారు తొంభై రోజులవరకు ఒక్కోరోజు గ్రహస్థితుల్నీ పరిశీలించి, ఆ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తారు అన్నమాట. మెక్ గిలియాన్ గారి వ్యాసంలోని అంశానికీ, ఈ జ్యోతిష సూత్రానికీ ఉన్న పోలిక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
జ్యోతిషం మన:స్థితిని ప్రతిబింబిస్తుంది తప్ప గట్టి నిజాల్ని కాదు: కొంతమంది పాశ్చాత్య జ్యోతిష్కుల భావనల ప్రకారం , జ్యోతిషం ద్వారా చెప్పే ఫలితాలు కేవలం జాతకుల మన: స్థితిని ప్రతిబింబిస్తాయే తప్ప బహి:ప్రపంచంలోని నిజాల్ని (objective reality) కాదు. ఉదాహరణలు:
ఒకావిడ ఒక వ్యక్తికి జాతకం చూసి ఫలానా సమయంలో నీ తండ్రితో తీవ్ర సమస్యలు గానీ, తండ్రి చనిపోవడం గానీ జరిగి ఉండాలని చెప్పింది. ఆ జాతకుడు పదహారేళ్ళ వయసు నుండీ స్వతంత్రంగానే బతుకుతున్నాడు. ఆ సమయంలో తండ్రి చనిపోలేదు కానీ, తాను మార్గదర్శకుడుగా (mentor) భావించి, అమితంగా గౌరవించే ఒకానొక వ్యక్తితో తీవ్రమైన విభేదాలు వచ్చి అతనితో విడిపోయాడు.
నాకు తెలిసిన ఒక స్నేహితుడికి ఆర్థికమైన ఇబ్బందులు తట్టుకోడానికి ఉద్యోగంలో మంచి మార్పు కావాలి. ఒక ఏడాది పాటు చిన్న ఉద్యోగం చేసాడు. ఎంత ప్రోత్సాహించినా పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చెయ్యలేదు. చివరికి మరొక స్నేహితుడి ప్రోద్బలంతో అతను ప్రయత్నం చెయ్యగా మంచి బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నిజానికి అతని ప్రతిభని, చదువుని, అనుభవాన్ని, ఆ సమయంలో మార్కెట్ లో ఉన్న అవకాశాల్ని బట్టి ఏ విధంగా చూసినా, అతనికా ఉద్యోగం రావడం చాలా మామూలు సంగతి. అతను ఎప్పుడు ప్రయత్నం చేసినా అటువంటి ఉద్యోగం ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ అప్పుడు ఆ ఉద్యోగం రావడం అతనికీ, అతని కుటుంబానికీ భూమ్యాకాశాలు పట్టనంత సంతోషం కలిగించింది. చాలా కాలం తరువాత అతని జాతకం చూసిన జ్యోతిష్కుడు ఒకడు ఫలానా సమయంలో నీకు ఉద్యోగంలో చాలా మంచి మార్పు వచ్చి ఉండాలి అని చెప్పాడు. అతను చెప్పిన విషయం నిజమే కానీ, అది ఆ స్నేహితుడి మన:స్థితి దృష్ట్యా చూస్తే ఎక్కువ నిజం. అతను ప్రయత్నించి ఉంటే అటువంటి ఉద్యోగం సంపాదించడం అతనికి ఎప్పుడూ ఒక లెక్కలోనిది కాదు.
ఇటువంటి ఉదాహరణల గురించి ఆలోచించినప్పుడు నాకు జ్యోతిషం ద్వారా మనుషుల కళాకళలు (moods) మాత్రమే కొంతమటుకు ముందే నిర్దేశితమౌతున్నాయేమో అనీ, ఆయా మన: స్థితుల్నిబట్టి ప్రాపంచికానుభవాల్ని మనమే నిర్మించుకుంటున్నామేమో అనీ ఒక భావన కలుగుతుంటుంది. గ్రహగతులు మనుషుల మన: స్థితుల్ని ప్రేరేపిస్తాయి తప్ప, మన జీవితాల్ని నిర్దేశించవు అని చాలా మంది జ్యోతిష్కులు అంటారు. The stars IMPEL, they do not COMPEL అనే సూక్తి జ్యోతిషంలో చాలా ప్రసిద్ధమైనదే. అయితే మనుషుల కళాకళలు హార్మోన్ల చేత ప్రభావితమౌతాయి కాబట్టి, మెక్ గిలియాన్ గారి వ్యాసంలో చెప్పినట్టు ఆ హార్మోన్ల పనితీరు గ్రహగతులచేత ముందే నిర్దేశితమయ్యే అవకాశమే ఉంటే, జ్యోతిషం భవిష్యత్ శాస్త్రం కావడానికి సావకాశం ఉన్నట్టే అని నా భావన.
జ్యోతిష సంకేతాలను తేలికగా కొట్టిపారెయ్యలేము: జ్యోతిష సంకేతాలు చాలా గహనమైనవి, ఆకర్షణీయమైనవి. ఫ్రాయిడ్ సిద్ధాంతాలు తప్పుల తడకలనీ, ఏ విధంగానూ శాస్త్రీయమైనవి కావు అనీ ఆధునికులు అంటారు. అయినప్పటికీ అతను ప్రతిపాదించిన ఇడ్, ఇగో, సూపర్ ఇగో లాంటి సంకేతాలను ఇప్పటికీ అభిమానించి, ఉపయోగించేవాళ్ళు తారసపడుతూనే ఉంటారు. ఆ సంకేతాలకున్న ఆకర్షణ అలాంటిది. జ్యోతిష సంకేతాలు కూడా ఒక ప్రత్యేకమైన ప్రాపంచిక దృక్పథాన్ని కలుగజేస్తాయి. వాటిని అవగాహన చేసుకోవడం ద్వారా మనుషుల మౌలిక స్వభావాన్ని అవగాహన చేసుకున్న తృప్తి కలుగుతుంది.
చదరంగం ఆటలో ఒక్కొక్క పావుకీ కొన్ని పరిమితమైన కదలికలు, నియమాలు ఉంటాయి. అయితే వాటి ప్రస్తారాలు, సంయోగాల (permutations and combinations) ద్వారా అనంత వైవిధ్యంగల అద్భుతమైన క్రీడ ఒకటి సాధ్యమౌతోంది. అదే విధంగా పరిమిత సంఖ్యలో ఉండే జ్యోతిష సంకేతాలని అనంత విధాలుగా సంయోగించి (combinatorial explosion), వాటి ద్వారా మనుషుల స్వభావాన్నీ, జీవన వైవిధ్యాన్నీ అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం ద్వారా జ్యోతిష్కులు ఒక మేధో సంబంధమైన క్రీడని ఆడుతున్నారని గమనించాలి. అది వాళ్ళకి అపారమైన తృప్తినీ, సరదానీ (enjoyment) ఇస్తోందనీ కూడా గ్రహించాలి. జ్యోతిషాన్ని పై పై కారణాలు చూపి తిరస్కరించినంత మాత్రాన జ్యోతిష్కులు ఆ శాస్త్రం పట్ల విముఖులైపోరనీ, అందుకు కారణం జ్యోతిష సంకేతాల్లోని బలమేననీ నా అభిప్రాయం.
జ్యోతిషం పట్ల కొంత సాధారణ పరిజ్ఞానం కలిగిన వ్యక్తికి కూడా జ్యోతిష సంకేతాలు చాలా సరళంగా యావత్ర్పపంచాన్నీ ఒక చక్కని అమరికలో పెట్టుకున్న తృప్తిని కలిగిస్తాయి. ఉదాహరణకి జాతక చక్రంలోని పన్నెండు భావాలనీ చూడండి. అవి మనిషి జీవితాన్ని పన్నెండు విభాగాలుగా సూచిస్తాయి. నా వివరణతో సాంప్రదాయ జ్యోతిష్కులు అంగీకరించకపోవచ్చు గానీ ఈ పన్నెండు విభాగాలూ ఎలా వచ్చాయో చూడండి –
మనిషి స్వభావంలో మూడు రకాలైన శక్తులు ఉన్నాయి. 1) చొరవగా పనులు చేయడం. 2) ఒక విషయం మీద స్థిరంగా నిలబడడం 3) విచక్షణని ఉపయోగించి పరిస్థితులకి అనుగుణంగా సద్దుబాటు చేసుకోవడం. ఈ మూడు శక్తుల్నీ జ్యోతిషంలో వరుసగా చర (Dynamic or Movable), స్థిర (Fixed), ద్విస్వభావ (Flexible or Mutable) రాశులు లేక భావాలని అంటారు.
అలాగే మనిషి జీవితంలో నాలుగు ప్రధానమైన విభాగాలు ఉన్నాయి. 1) బౌద్ధికమైన జీవితం (intellectual life) 2) కుటుంబ జీవితం(family life) 3) వృత్తి సంబంధమైన జీవితం (professional life) 4) సామాజిక జీవితం (social life). వీటినే జ్యోతిషం అగ్ని(intellectual), జల(emotional), భూ(resources), వాయు(communicative) తత్త్వాలని సంకేతిస్తుంది. ఈ నాలుగు విభాగాల్లోనూ మూడు శక్తులతో ప్రవర్తించడం ద్వారా మొత్తం పన్నెండు విభాగాలు ఏర్పడుతున్నాయని జ్యోతిషం అంటుంది.
ఈ రకమైన అవగాహనకి ఒక్క ఉదాహరణ మాత్రం ఇస్తాను. భూ తత్త్వం, చర భావం అయిన దశమభావం (Tenth house) ఉద్యోగాన్ని సూచిస్తుంది. సమాజంలో బ్రతకడానికి కావలసిన సాధనాల (resources) కోసం చేయవలసిన ప్రయత్నాన్ని(dynamism) ఇది సూచిస్తుంది. భూ తత్త్వం, స్థిర భావం అయిన రెండవ భావం (second house) ఉద్యోగం వలన కలిగే ఆదాయాన్నీ, వస్తు సముదాయాన్నీ(resources) సమకూర్చుకోడాన్నీ, దాచుకోడాన్నీ (fixed) సూచిస్తుంది. భూ తత్త్వం, ద్విస్వభావ భావం అయిన ఆరవ ఇల్లు (sixth house) ఆదాయ, వృత్తి విషయాల్లో (resources) తాను చేసుకోవలసిన సర్దుబాట్లు (flexibility and adjustments) సూచిస్తుంది. అంటే తాను చేసే అప్పులు, తాను ఒదిగి ఉండవలసిన పరిస్థితులు, ధనాన్ని కోల్పోయే పరిస్థితులు మొదలైనవి.
ఈ విధంగా జ్యోతిష సంకేతాలు ఒక ఆకర్షణీయమైన తర్కాన్ని (logic) కలిగి ఉంటాయి. ఆయా సంకేతాల యొక్క సంయోగాల్ని బట్టి అనంత విధాలైన పరిస్థితులని ఊహించుకోడానికి, పరిశీలించడానికీ కుతూహలం కలిగిస్తాయి. చాలా ప్రాథమికమైన ఈ సంకేతాలు తప్పని ఋజువు చేయడం కష్టం అన్నమాట అలా ఉంచితే, ఇన్ని వేల సంవత్సరాలుగా జ్యోతిష్కుల అనుభవాలకీ, పరిశీలనకీ తట్టుకుని ఈ సంకేతాలు నిలబడి ఉండడం ఆశ్చర్యకరమైన సంగతి. ఉదాహరణకి ఒక ఔత్సాహిక జ్యోతిష్కుడికి తన అనుభవంలో శని ప్రభావం వల్ల జాతకులకి సుఖాలు కలుగుతున్నాయి అని అనేకసార్లు ఋజువైతే అతను గందరగోళానికి గురై, జ్యోతిషం పైన విశ్వాసాన్ని కోల్పోతాడు. అయితే అత్యధిక సందర్భాల్లో అలా జరగడం లేదని గమనించాలి.