ఈమాట » జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4

Expand to right
Expand to left

జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4

మార్టిన్ తన ప్రయోగం సఫలమైందనీ, అటువంటి ప్రయోగాన్ని మళ్ళీ చెయ్యాలనీ జ్యోతిష్కులకి విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటంటే, ఒకవేళ ఇంకోసారి ప్రయోగం చేస్తే, అందులో జ్యోతిషం తప్పు అని నిరూపితమైతే, తాము ఒప్పుకోలేరు కాబట్టి. కానీ మరొకళ్ళు ప్రయోగాలు చేసి జ్యోతిషం నిజమని నిరూపిస్తే మాత్రం వెంటనే వాళ్ళు ఆ ప్రయోగాల్ని తమ సమర్ధనకి ఉపయోగించుకుంటారు. ఒకవేళ వేరేవాళ్ళు జ్యోతిషం తప్పని నిరూపిస్తే, పక్షపాతం ఆరోపిస్తారు. మరి సైంటిస్టులు అతని పరిశోధనల్ని ఉపేక్షించడానికి కారణమేమిటంటే, జ్యోతిషం నిర్ణయాత్మకం కాకపోయినా సరే పని చేస్తుంది అన్న భావనని వాళ్ళు అంగీకరించక పోవడం. జ్యోతిష్కులూ, జాతకులూ సంభాషించుకునే అవకాశం ఉండడం వల్ల మార్టిన్ ప్రయోగం సక్రమమైనది కాదని భావించడం. అంతే కాక, జ్యోతిషం పట్ల చులకనభావం, జ్యోతిషానికి ప్రచారం కల్పించకూడదనే రాజకీయధోరణీ కూడా అందుకు కారణం. ఇటువంటి ధోరణులు మార్టిన్ ని చాలా నిరాశ పరిచాయి.

మిషెల్ గోక్ లా చేసిన పరిశోధనల తాలూకు డేటాని కూడా భూ అయస్కాంత క్షేత్ర తీవ్రతల్ని బట్టి విశ్లేషిస్తే ఇంకా చక్కని ఫలితాలు వస్తాయని మార్టిన్ భావించాడు. విసుగు చెందకుండా అతను వివరమైన వ్యాసాల్ని జాఫ్రీ డిన్ కీ, ఇంకా ఇతర సైంటిస్టులకీ, జ్యోతిష్కులకీ పంపిస్తూ ఉండేవాడు. సైంటిస్టులూ, జ్యోతిష్కులూ కూడా జ్యోతిషం నిర్ణయాత్మకం అన్న భావనని వదిలి మరొక కోణంలో జ్యోతిషాన్ని పరిశీలించాలని మార్టిన్ అభిప్రాయపడుతూ ఉండేవాడు. యూరోపు, అమెరికా దేశాల్లో అనేకమందితో సంభాషించి, తన భావనల్ని సానుభూతితో స్వీకరించేవాళ్ళు ఎవరూ లేరని గ్రహించి అతను నిరాశ పడ్డాడు. (నేను చాలా కాలంగా అతనితో సంభాషించకపోవడం వల్ల అతని పరిశోధనలు ఈ మధ్యకాలంలో ఏమైనా పురోగమించాయేమో తెలియదు.)

జ్యోతిషం భవిష్యత్తులో శాస్త్రం కాగలదా?

యూకే కి చెందిన రచయితా, శాస్త్రజ్ఞుడూ అయిన డాక్టర్ ఫ్రాంక్ మెక్ గిలియాన్ 2002 వ సంవత్సరంలో Journal of Scientific Exploration (2002, Volume 16, No.1) లో ఒక వ్యాసం రాశాడు. అందులో జ్యోతిషం పని చేస్తుంది అనడానికి కొంత శాస్త్రీయమైన ఆధారం ఉండవచ్చు అని ఈ క్రింది విషయాలని వివరిస్తాడు.

  • మనుషుల, జంతువుల మెదడులో ఉండే పీనియల్ గ్రంధి మెలటోనిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. మెలటోనిన్ తయారీకి, వెలుతురుకీ సంబంధం ఉంది. మనుషులు/జంతువులు వెలుగులో ఉన్నప్పుడు మెలటోనిన్ తయారీ మందగిస్తుంది. చీకటిలో మాత్రమే ఈ హార్మోన్ ఎక్కువగా తయారై, విడుదలవుతుంది. సూర్యకాంతి మెలటోనిన్ పైన అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ, చంద్రుని కళలకూ (కాంతికీ), మెలటోనిన్ ఉత్పత్తి కావడానికీ కూడా సంబంధం ఉన్నదని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. కంటికి కనిపించే కాంతి మాత్రమే కాక, ఇతర విద్యుదయస్కాంత క్షేత్రాలు (భూ అయస్కాంత క్షేత్రంతో సమానమైన బలం కలిగినవి) కూడా మెలటోనిన్ ఉత్పత్తిపైన ప్రభావం కలిగి ఉన్నాయి. ఇటువంటి అయస్కాంత క్షేత్రాలు పీనియల్ గ్రంధి పైన ప్రత్యక్షప్రభావాన్ని కలిగి ఉన్నాయని కూడా మరికొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. మెలటోనిన్ ప్రత్యుత్పత్తికి సంబంధించిన హార్మోన్లపై వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే, మెలటోనిన్ ఎక్కువగా విడుదల అయితే, ప్రత్యుత్పత్తి హార్మోన్ల విడుదల మందగిస్తుంది. మెలటోనిన్ తక్కువగా ఉంటే, ప్రత్యుత్పత్తి హార్మోన్ల విడుదల ఎక్కువ అవుతుంది. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు ధ్రువపరిచాయి.

    ఉదాహరణలు: ధ్రువప్రాంతాల్లో జీవించే ఎస్కిమో స్త్రీలలో చలికాలంలోని చీకటి మాసాల్లో ఋతుక్రమం ఆగిపోతుంది. (వెలుగు ఉండదు కాబట్టి, మెలటోనిన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఫలితంగా ప్రత్యుత్పత్తి హార్మోన్లు మందగిస్తాయి). ఫిన్లాండులో బాగా ఉత్తరంగా ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలంలోనే ఎక్కువగా సాధారణ మరియు కవలల గర్భధారణ జరుగుతోందని మరొక పరిశోధన సూచిస్తోంది.

  • మరొక పరిశోధనలో క్రొత్తగా జన్మించిన ఎలుక పిల్లలకి మెలటోనిన్ హార్మోన్ ఇచ్చారు. దాని ఫలితంగా ఆ ఎలుకలు పెద్దవి అయిన తరువాత వాటిలో సహజంగా సంభవించవలసిన ప్రత్యుత్పత్తి సంబంధమైన శారీరిక మార్పులు (secondary sexual characteristics) ఆలస్యంగా కలిగాయి. అంతే కాక ఆ ఎలుకల/జంతువుల సాధారణమైన ఎదుగుదలా, ఇతర ఆరోగ్య పరిస్థితులూ, మాతృత్వ స్వభావం, కొత్త ప్రదేశాల్ని కనుగొనే స్వభావాల పైన కూడా ప్రభావం పడిందని అదే ప్రయోగాన్ని వేర్వేరుసార్లు చేసినప్పుడు బయటపడింది.

    అయితే ఎలుక పిల్లలు పుట్టిన ఆరు రోజుల తరువాత ఈ హార్మోన్ ను ఇస్తే దాని ప్రభావం ఏమీ లేదనీ, కేవలం పుట్టిన ఆరు రోజులలోపల ఇస్తే మాత్రమే దాని ప్రభావం కనిపించిందనీ కూడా కనిపెట్టబడింది. అంటే, పుట్టిన తరువాత కొద్ది రోజుల వ్యవధిలో ప్రయోగించబడిన మెలటోనిన్ జంతువుల భవిష్యత్ స్వభావాన్ని ముందే నిర్ణీతం (pre-program) చేస్తోంది అన్నమాట. సున్నితమైన ఆ కాలవ్యవధానం తరువాత దాని ప్రభావం లేదు. మనుషుల్లో కూడా ఇదేవిధమైన పరిశీలనలు చేయబడ్డాయి. పుట్టుకతో చూపు లేనివాళ్ళ విషయంలోనూ, పుట్టిన సమయానికి అటూ ఇటూగా చీకటి-వెలుగుల తేడాలు అధికంగా గల కాలాన్ని అనుభవించినవాళ్ళలోనూ ఇటువంటి విషయాలే గమనించబడ్డాయి.

  • పుట్టిన సమయంలో కాంతి మాత్రమే కాకుండా, పరివ్యాప్తమై ఉండే విద్యుదయస్కాంత క్షేత్రాలూ (ambient electro magnetic radiation), భూ అయస్కాంత క్షేత్రమూ కూడా మనుషుల ఎదుగుదలని ప్రభావితం చేస్తాయి అని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. చిన్నవయసులోనే వచ్చే మూర్ఛరోగానికి పుట్టినరోజు నుంచి రెండు రోజులవరకు ఉండే భూ అయస్కాంత క్షేత్రంలోని మార్పులే కారణం కావచ్చని ఒక పరిశోధన సూచిస్తోంది.

    అలాగే భూ అయస్కాంత క్షేత్ర మార్పులే ప్రసవ సమయాన్ని నిర్ణయిస్తున్నాయి అనీ, మగపిల్లల పుట్టుకకీ ప్రసవానికి మూడు రోజుల ముందు ఉన్న భూ అయస్కాంతక్షేత్ర తీవ్రతకీ సంబంధం ఉండవచ్చు అని కూడా మరికొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

  • స్కిజోఫ్రినియాతో బాధ పడేవాళ్ళ జననాలు వసంత విషువత్ కాలానికి (spring equinox) దగ్గరలో ఎక్కువగా జరుగుతున్నాయనడానికి ఆధారాలు ఉన్నాయి. ఉత్తరార్ధ గోళంలో చలికాలంలో వెలుతురు తక్కువగా ఉంటుంది కాబట్టి మెలటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వసంత విషువత్తు నుంచీ వెలుతురు ఎక్కువ అవుతుంది కాబట్టి మెలటోనిన్ ఉత్పత్తిలో మార్పు కలుగుతుంది. ఈవిధమైన మార్పు స్కిజోఫ్రినియా మీద ప్రభావం కలుగజేస్తూ ఉండవచ్చు అని భావించడానికి ఆస్కారం ఉంది.

    భూమధ్య రేఖకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఋతువులని బట్టి పగటి సమయంలోనూ, వెలుతురులోనూ మార్పు పెద్దగా రాదు. అక్కడ స్కిజోఫ్రినియా జననాలపై ఈ విధమైన ఋతువుల ప్రభావం కనబడలేదు. అంతే కాకుండా ఋతువులకీ, అనేక ఇతర వ్యాధులకీ గల సంబంధాన్ని గురించిన పరిశోధనల్ని బట్టి – ఋతువులకీ, భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులకీ, విద్యుదయస్కాంత క్షేత్రాలకీ మెలటోనిన్ ఉత్పత్తికీ సంబంధం ఉన్నదనీ, అది కొందరు పిల్లలని ప్రభావితం చేసి భవిష్యత్తులో కొన్ని భౌతిక, మానసిక లక్షణాలకీ, వ్యాధులకీ కారణమౌతున్నదనీ భావించవచ్చు.

  • జీవ వ్యవస్థలపైన (biological systems) ఋతువులు, సూర్య, చంద్రులే కాక కొన్ని ఖగోళ సంఘటనలు కూడా ప్రభావితం చూపుతాయి అని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సూర్యుడిలో ఏర్పడే మచ్చలు, సౌర వాయువులు (solar wind), నక్షత్రాలు పేలడం (supernovae) మొదలైనవి. సౌర కుటుంబంలోని కొన్ని గ్రహాలు భూమి పైకి వీచే సౌర వాయువుల్నీ, భూమియొక్క విద్యుదయస్కాంత క్షేత్రాల్నీ అనునాదాన్ని (resonance) పోలిన పద్ధతిలో ప్రభావితం చేస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. వాటి ప్రభావాల ఫలితాలు మెలటోనిన్ ఉత్పత్తిపైన ఉండవచ్చు. మెలటోనిన్ ఉత్పత్తిలో మార్పులు తీసుకువచ్చే సౌర-భూ అయస్కాంతక్షేత్ర ప్రభావాలు మన దైనందిన జీవితం పైన కూడా ఉండవచ్చు. యుద్ధాలకీ, ఈ అయస్కాంత క్షేత్రాల్లో మార్పులకీ సంబంధం ఉండవచ్చు అని కూడా ఒక పరిశోధన సూచిస్తున్నది.

ఇవీ స్థూలంగా ఆ వ్యాసంలోని అంశాలు. ఈ వ్యాసాన్ని సమీక్షించిన జాఫ్రీ డీన్ ఇటువంటి పరిశోధనల గురించి చాలా జాగ్రత్త వహించాలనీ, జ్యోతిషం అంతా సత్యమే అన్న తప్పుడు అభిప్రాయాన్ని ఇటువంటి పరిశోధనలు కలుగజేస్తాయనీ అన్నాడు. గ్రహాల ప్రభావం భూమిపై ఉండవచ్చుఅన్న సూచనకి అతడు ‘హవాయి ద్వీపంలో సముద్రపు కెరటాలపైన ఒక మనిషి సర్ఫింగ్ చేస్తే, దాని ప్రభావం ఆస్ట్రేలియా తీరంలోని సముద్రపుటలలపైన పడుతుంది’ అన్న మాట ఎంత నిజమో, అదీ అంత నిజమే అన్న అభిప్రాయాన్ని ప్రకటిస్తాడు.
ఫ్రాంక్ మెక్ గిలియాన్ వ్యాసంగానీ, ఇటువంటి పరిశోధనల్నే ప్రకటించే ‘జ్యోతిషం కూడా సైన్సే’ అనే పుస్తకాలు కానీ జ్యోతిషం ఇప్పటికిప్పుడు, యథాతథంగా సైన్సే అని చెప్పవు. కానీ జ్యోతిషానికి సంబంధించిన కొన్ని ప్రాథమికమైన అవగాహనలు భవిష్యత్తులో, యథాతథంగా కాకపోయినా, ఏదో ఒక రూపంలో శాస్త్రీయ సత్యాలు కావచ్చు అన్న ఆశని మాత్రమే ప్రకటిస్తాయి.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5