వాడుక భాషలో పద్యాలు
నా ప్రయత్నాలు
కామేశ్వరరావుగారు తమ వ్యాసంలో ఒక విషయం చెప్పారు. అదేమంటే వాడుక భాషలో కవితలు ఎక్కువగా లేవని. లేవంటే, ఎలా? ఎవరైనా రాయాలి. రాస్తే వాటికి ఆదరణ ఉండాలి. అది లేక ఎవ్వరూ రాయరు గదా! నేను ఉదహరించిన పద్యాలు కూడా పేరడీలు లేక తమాషాకై హాస్యరసప్రధానమైన పద్యాలు. అన్ని రసాలకు అనువయ్యేటట్లు వాడుక భాషలో పద్యాలు రాయడానికి వీలవుతుంది. కాని ఛందస్సు నెరిగినవారు తమ ఉన్నతాశ్వమునుండి దిగి ప్రయత్నం చేయాలి. ఇలా రాసిన పద్యాలను కవులు, పండితులు, విమర్శకులు ఆదరించాలి, అభినందించాలి, ఆనందించాలి. వ్యావహారిక భాషలో పద్యాలను రాయడంవల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. భాషపైన, వ్యాకరణంపైన అంతగా అధికారం లేకున్నవారు కూడా పరిశ్రమించవచ్చు. దీనివల్ల ఛందస్సు ప్రక్రియ ఏ కొందరికో మాత్రమే కాక అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కళకు మళ్లీ ఒక నవజీవనం కలుగుతుంది, నవ చైతన్యం పుడుతుంది. కింద వ్యావహారిక భాషలో సామాన్యముగా మనం తెలుగులో వాడే వృత్తాలలో, జాత్యుపజాతులలో వ్రాసినవాటిని మీముందు పెట్టి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇందులోని వస్తువు ఏ ఒక్క ప్రత్యేకమైన విషయంపైన కాక అన్ని విషయాలపైన రాసినవి.
వృత్తాలు
వ్యావహారిక భాషలో వృత్తాలను వ్రాసేటప్పుడు కొన్ని విషయాలను మనం గుర్తులో ఉంచుకోవాలి. తెలుగులో సర్వసాధారణంగా ఉపయోగించే వృత్తాలు నాలుగు. అవి శార్దూలవిక్రీడితము, మత్తేభవిక్రీడితము, చంపకమాల, ఉత్పలమాల. వీటికి ప్రతి పాదాంతములో గురువు ఉన్నది. గురువుతో అంతమయ్యే పదాలు తక్కువ, అదీ కాక ప్రాస కుదరాలి. ఈ రెండు కారణాలవల్ల ఏ పాదం ఆ పాదంతో అంతం కాదు తెలుగు పద్యాలలో. తెలుగులో ప్రాసాక్షరమైన పాదపు రెండవ అక్షరం సరిగా కుదరకపోతే పదాన్ని ముందు పాదాంతములో ఆరంభించుట వాడుక.
సంస్కృతంలా కాక, తెలుగులో (కన్నడంలో కూడా) పాదాంతములో విరామం లేదు. అందుకే ఒక పాదం మరొక పాదములో చొచ్చుకుపోతుంది. ఒక విధముగా చూస్తే ఈ వృత్తాలన్నీ నియమబద్ధమైన వచనాలే. ఒక్కొక్క పాదంలో పదాలు ఒక్కొక్క విధంగా అమర్చబడిఉంటాయి కనుక ఒక ప్రత్యేకమైన లయ ఉండదు వీటిని పాడేటప్పుడు. ము-కారాంత పదాలు అనుస్వారంతో అంతమవుతాయి కాబట్టి వీటిని చివరి గురువుగా ఎన్నుకోవచ్చు వాడుక భాషలో. విక్రీడితాలను గురించి (మో-3), మాలావృత్తాలను గురించి (మో-4) నేను ఇంతకు ముందు రాసిన వ్యాసాలను ఇక్కడ ఉదహరించడం అవసరమే.
1) శార్దూలవిక్రీడితము: ఈ వృత్తాన్ని వ్యావహారిక భాషలో రాసేది కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఇందులోని ప్రతి పాదం మూడు గురువులతో ఆరంభమవుతుంది.
నువ్వేమో ఒక పూల తోట, మరి నేనో ముళ్లు! నా మానసీ
నువ్వేమో ఒక రాజ బాట, మరి నేనో రాళ్ళు! నా రూపసీ
నువ్వేమో ఒక తేనె ఊట, మరి నేనో వేము! నా ప్రేయసీ
నువ్వేమో ఒక సంజె వెల్గు, మరి నేనో రేయి! నా ఊర్వశీ
2) మత్తేభవిక్రీడితము: శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులు చేయగా లభించినదే ఈ మత్తేభవిక్రీడితము అనే వృత్తము.
చిలకా యెందుకె,నీకు కోపములు? రా చిల్కా విలాసాలతో
చిలకా యెందుకె, నీకు మౌనములు? రా చిల్కా వినోదాలతో
చిలకా యెందుకె, నీకు యోచనలు? రా చిల్కా సరాగాలతో
చిలకా యెందుకె, యీ విచారములు? రా చిల్కా పరాగాలతో
3) చంపకమాల: వృత్తాలలో చంపకమాలనే కవులు ఎక్కువగా తమ కావ్యాలలో వాడారు. తెలుగు భాషకు బాగుగా అతికిపోయిన వృత్తము ఇది.
తిరుపతి కెళ్లుదాం పదర, దేవుడి దీవెన లందడానికై,
సరసర కొండ మెట్టులను, స్వామి హరీ, అని ఎక్కుదాం, పరా-
త్పర అని మొక్కుదాం, పదము పాడుచు, ఆడుచు, వెంకటేశ్వరా,
వరముల నీయరా, వరద, వాంఛల దీర్చర, యంచు వేడుదాం
4) ఉత్పలమాల: చంపకమాలలోని మొదటి రెండు లఘువులను ఒక గురువుగ చేస్తే దొరికిన వృత్తము ఇది.
చంద్రుని చూడు, పున్నమిది, చల్లని వెన్నెల, చూపవా ముఖం?
ఇంద్రుని చెల్లెలా, యిపుడు, యింపుగ సొంపుగ యివ్వవా సుఖం?
చంద్రిక నాకు నీకు గల సంగడి, పొంగెను ప్రేమసాగరం,
చెంద్రికమోము నవ్వులను జిమ్మగ, నువ్విట రావె వేగిరం!
జాతులు
కందమును చతుర్మాత్రలతో, ఉత్సాహను త్రిమాత్రలతో రాస్తారు. మధ్యాక్కర, ద్విపదలను సూర్యేంద్ర గణాలతో రాస్తారు. వీటన్నిటికీ ప్రాస తప్పక ఉండాలి.
1) కందము: కందపద్యాలలో సరి పాదాలలో చివరి అక్షరం ఎప్పుడూ గురువుగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ము-కారాంత పదాలను అనుస్వారం పెట్టి ఉచ్చరిస్తాము. ఆ విధంగానే ఇందులో నాదం, మోదం అని వాడాను. కందాలలో, పాదాంతములో గురువులు గల వృత్తాలలో ఇట్టి వ్యావహారిక భాషలోని పదాలు బాగా ఉపయోగానికి వస్తాయి.
వస్తానని చెప్పాడే
యిస్తానని చెప్పినాడె యింపగు నాదం
తెస్తానని చెప్పాడే
నేస్తమ్మయి నాకు మంచి నెయ్యపు మోదం
2) ద్విపద: ద్విపద చాల అందమైన దేశి ఛందస్సు. సామాన్యముగా దేశి ఛందస్సులో ఒక పాదం మరొక పాదములోకి చొచ్చుకొని పోవు. ద్విపదలో ప్రతి పాదం తప్పకుండా స్వతంత్రంగా నిలవాలి.
న్యూయార్కు నింగిలో నూతన క్రాంతి
వేయి రంగుల వెల్గు వెల్లువ కాంతి
పోయింది, వెలవెలబోయింది నెలయు
హాయిగా వెన్నెల నడవి గాచింది
3) మధ్యాక్కర: నన్నయ, ఎఱ్ఱాప్రెగడలు భారతంలో రాసిన ఈ దేశి ఛందస్సును తరువాత విశ్వనాథ సత్యనారాయణ గారు మాత్రమే విరివిగా వాడారు. ఇది కూడ వ్యావహారిక భాషలో అందంగానే కనిపిస్తుంది.
అందాల రాశికి లాలి, ఆనంద జ్యోతికి లాలి
గంధాల బొమ్మకు లాలి, కలహంస శిశువుకు లాలి
కుందన ప్రతిమకు లాలి, గుడిలోని మూర్తికి లాలి
మందాకిని యలకు లాలి, మా యింటి పాపకు లాలి
4) ఉత్సాహ: ఉత్సాహ పద్యం ఒక చక్కని గతితో నడుస్తుంది. ఇది ఒక మార్చింగ్ చేసేటప్పుడు పాడే పాటలా ఉంటుంది.
ఆడ పిల్ల అంటె నీకు అలుసు అంత ఎందుకో?
కోడె నాగులాగ నిన్ను కొట్టి కాటు వేయునోయ్!
చీడపురుగులాటి నిన్ను చిదిమి పారవేయునోయ్!
పాడు బుద్ధి చాలు కాలు పట్టి పాహి యను బ్రదర్!
ఉపజాతులు
నిజంగా పదహారణాల దేశి ఛందస్సు ఉపజాతులు. ఇందులో ప్రాస లేదు. సామాన్య యతినో (అక్షరమైత్రి) లేక ప్రాసయతినో వాడుకోవచ్చు. సీసములాటి పద్యాలు చాలా పురాతనమైనవి.
1) ఆటవెలది: కిందిది ఒక వచన కవితలా కనిపించినా, ఇందులో ఆటవెలదికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కావ్యాలలో వచనములలో పద్యాలను చొప్పించడం కూడా ఒక కళ. ఇట్టి వచన పద్యాలను చిత్రకవిత్వముగా కూడా పరిగణిస్తారు.
నేను నువ్వు - నింగి, నేల - రంగుల హేల
నేను నువ్వు - గాలి, నీటి దార
నేను నువ్వు - కొండ, నీలాల మేఘాలు
నీకు నేను - అవును - నాకు నువ్వు
2) తేటగీతి: ఇందులో కావాలనే వాడుకలో ఉన్న దుష్ట సమాసాలను (సంస్కృత పదం మొదట, తెలుగు పదం తరువాత ఉండే పదాలు) ఉపయోగించాను.
ఓ వసంతగాలీ, నువ్వు ఊపవమ్మ
పంచవన్నెల పూలను పచ్చికపయి
నేడు, ఆకాశపందిరి నీడలోన
నా ప్రియుడు వచ్చి చూస్తాడు నన్ను మెచ్చి
3) సీసము: తెలుగు ఛందస్సు ప్రత్యేకత సీసపద్యము. సీసమునకు సీసపు నాలుగు పాదాలతోబాటు చివర ఆటవెలదినో, తేటగీతినో రాయాలి. అప్పుడే అది సీస మవుతుంది.
ఎంతగా పిలిచినా ఎందుకే పలుకవు
చింత నీదే గదా సిరుల రాణి
ఆకసం జూచినా హరివిల్లు జూచినా
చెలియ నీ రంగులే నిలిచినాయి
తరగలో నువ్వెగా నురుగులో నువ్వెగా
ముంగురుల నలుపు యుంగరాలొ
గాలి ఊగించగా పూలు తూగాడ నీ
నవ్వులే దలచాను నన్ను మరచి
ఆటలాడుదాం యిప్పుడే ఆరుబయట
పాట పాడుదాం యిప్పుడే పరవశించి
మాట లాడుదాం యిప్పుడే మనసు విప్పి
ఆలసించకు యిక్కడ అలసినాను
4) ముత్యాలసరము: గురజాడ అప్పారావు గారి ద్వారా బహుళ ప్రచారములో వచ్చినది ముత్యాలసరం. దేశమంటే మట్టి కాదోయ్ లాటి ప్రబోధగేయాలు ఈ ఛందస్సులోనిదే. అప్పారావుగారు ఇందులో ప్రాసను ఎక్కువగా వాడ లేదు. వారు లయకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చారు.
నవ్వు చిత్రం నువ్వె నా చెలి
దివ్వె కాంతులు నువ్వె నా సఖి
గువ్వ పాటలు నువ్వె ప్రేయసి
మువ్వలా రావే