వాడుక భాషలో పద్యాలు

సులభంగా అర్థమయ్యే కొన్ని పద్యాలు

వాడుక భాషలో తెలుగు పద్యాలు లేవా అని ప్రశ్నిస్తే, దానికి జవాబు కచ్చితంగా ఉన్నాయి. పోతన భాగవతములో పొడుపు కొండ మీదఁ బొడిచింది మొదలుగా, శరణంబులు నీ పదాబ్జ శావానిరతుల్ అనే చోటులలో వ్యావహారికాన్ని ఉపయోగించారు [భా-1. ఇట్టి పద్యాలను మనం కొన్ని శతకాలలో, అవధానాలలో, హాస్యరసమయ సన్నివేశాలలో, చాటువులలో చదువగలము. కింద కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాను.

శతకములలో: కవి చౌడప్పా, గువ్వల చెన్నా, సంపగిమన్నా అనే మకుటాలతో ఉండే కందపద్య శతకాలను [వీ-1] చాలవరకు వాడుక భాషలోనే రాశారు ఆ కవులు. వేమన పద్యాలలో [వే-1] కూడా ఇట్టివి కొల్లలు. జనార్దనాష్టకములోని పద్యాలు కూడా వ్యావహారికాన్ని జ్ఞప్తికి తెచ్చేవే [రు-1].

గుడిసెయు మంచముఁ గుంపటి
విడియమును బొగాకుఁ దన్ను విడనొల్లని మే
ల్బడఁతియుఁ గల్గిన జలి యె-
క్కడిదప్పా కుందవరపు కవి చౌడప్పా

వెల్లుల్లిఁ బెట్టి పొగిచిన
పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా
మొల్లముగ నూని వేసుక
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా

గాడిదవలె బూడిదఁ బొ-
ర్లాడుచుఁ గొక్కెరయుఁ బోలె ధ్యానము సేసే
బేడిదపుఁ గపటయోగుల
జాడలు ఘను లెంచరన్న సంపఁగిమన్నా

అజ్ఞానమె శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినవా
యజ్ఞాన ముడిగి వాల్మికి
సుజ్ఞానపు బ్రహ్మ మొందె జూడర వేమా

అలుకలన్నియు దీరగా, నా అండ కెప్పుడు వస్తివీ
పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతో నెపుడిస్తివీ
వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు వస్తివీ
కలసి వేడుక, దనుజమర్దన, కందుకూరి జనార్దనా!

సినిమాలలో: శ్రీశ్రీగారు ఏదో ఒక సినిమాకు రాసిందనుకొంటాను కింది సీసపద్యము [శ్రీ-1]. ఇందులో మనం ప్రతినిత్యం మాట్లాడే విధంగా భరిస్తాడు, చెప్పడం, వదలడం, ఆంగ్ల పదమైన సిల్కు వాడబడినవి.

ఇంత పాతివ్రత్య మెవడు భరిస్తాడు
  ఇంతి కాదిది దంతి యినుప బంతి
పతిభక్తి యనరాదు హత విధీ దీనిని
   పతిహింస యనుచు చెప్పడమె లెస్స
ఈయమతో బ్రతు కిహలోక నరకమే
   ఈ యిల్లు వదలడం హాయి హాయి
సతి వద్దు సంసార సంకటమే వద్దు
   సన్యాసి యొక్కడే ధన్యజీవి

కనుక మతి చెడిపోవక మునుపె ముద్దు
లొల్కు సిల్కు కాషాయము లొగి ధరించి
పరుగు తీసెద కాశికి వడి వడి వడి
శపథ మిది సత్యమిది సునిశ్చయము నిదియె

సినిమా పాటలు కూడా ఛందోబద్ధమైనవే. వాటిని రాసేటప్పుడు సినీకవులు మాత్రాఛందస్సును, అంత్యప్రాసలను ఎక్కువగా వాడుతారు. కింద అమరశిల్పి జక్కన చిత్రంనుండి దేశి ఛందస్సైన ద్విపదలో (అక్కడా ఇక్కడ ఇంద్రగణాలకు బదులు పంచమాత్రలు, ప్రాసయతులు ఉన్నాయి ఇందులో) సముద్రాల రాఘవాచార్యులు రాసిన పాట [తె-1] –


మురిసేవు విరిసేవు
అమరశిల్పి జక్కన సినిమా, ఘంటసాల

మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచి
మరచేవు తిలకమ్ము ధరియించ నుదుట
నీ రూపు గన నీకె పారవశ్యాల
మా రాజు మనసేలు మరుని తంత్రాల

ఏ కాంతు దరి జేర ఏకాంత వేళ
ఈ కబురు పంపేవె ఓ కీరపాణి
చిలకమ్మ కనబోవు చెలుని పేరేమె
చెలియరో నీ స్వామి చెన్న కేశవుడ

గోపికలు సేవించు గోపాల దేవు
రూపుని మురళిని మోపి కెమ్మోవి
సరసానురాగాల స్వామి దరిజేరి
సారూప్య మోక్షమ్ము సాధింతువేమొ

విలు చేత బూనేవు వీరాల బాల
పలికిరా ఎవరైన పరిహాస లీల
నవయౌవనము దోచి నమ్మించిరా నీ
ధవునిపై పగలూని దాడి జేసేవ

ఆటలను పాటలను హావ భావముల
నీటులో నీసాటి నెఱజాణ నీవె
అలరింపగా నిన్ను ఆనంద లీల
చెలు వెరుగు కేశవుడు చేరు నీ వేళ

కౌశికుని మది గొనిన కలికి మేనకవొ
శ్రీశుకుని దరి కులుకు చెలి రంభ వేమొ
సరసలయ గతి చూడ స్వామి రాడమ్మ
పరమాత్ము గను దారి భక్తి జేరమ్మ

పేరడీలు, మణిప్రవాళాలు, ఆంగ్లంలో పద్యాలు:
రెండు భాషల పదప్రయోగాలను, వాక్య నిర్మాణాలను ఉపయోగించి రాసిన వాటిని మణిప్రవాళాలు అంటారు, అంటే ఇందులో వేటికి అవి మనలను మణులలా, పగడాలలా ఆకర్షిస్తాయి. ఒకప్పుడు తమిళ, సంస్కృత పదాలతో మలయాళములో (లీలాతిలకం, ఉణ్ణియచ్చి చరితం, ఇత్యాదులు) ఈ మణిప్రవాళాలు ఎక్కువగా ఉండినవి [వా-1]. దీక్షితులు కూడా కొన్ని మణిప్రవాళాలను రాశారు [పా-1], (వేంకటాచలపతే నిను నమ్మితి అనే పాటలో శ్రీనివాస శేషాచలమునుంచి శీఘ్రమే వందు…, వాసుదేవనే వాంఛితార్థ ఫల మిచ్చు వరదనే…). గిడుగు సీతాపతివారు [సీ-1] కూడా ఒక స్వాగత వృత్తాన్ని ఇట్టి భాషలో ఉదహరించారు.

తండులాలు గృహమందు న సంతి
తిండికైతె పదిమంది వసంతి
కుండలన్ని గృహమందు లుఠంతి
ముండనాకొడుకు లెల్ల హసంతి

ఈ నాడు పద్యాలలో ఆంగ్ల పదాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి కొన్ని చోటులలో నామవాచకాలు, మరి కొన్ని వేళలలో క్రియలు. ఇవి నేటికాలపు మణిప్రవాళాలు కాబోలు!

శ్రీశ్రీగారు వేమనను పేరడీ చేస్తూ రాసిన కింది పద్యం [రా-1] కూడా ఆసక్తికరమైనదే. ఈ ఆటవెలదిలోని మొదటి పాదములో కాకికి, సైకోకు ప్రాసయతిని గమనించాలి.

కాకికేమి తెలుసు సైకోఅనాలిసిస్
ఆటవెలది ద్విపద కత్తగారు
ఐదు, మూడు, రెండు ఆముక్త మాల్యద
విశ్వదాభిరామ వినుర వేమ

స్నేహితులైన చేకూరి రామారావు గారిని సన్మానిస్తూ కోవెల సంపత్కుమారాచార్యులు చేరా అనే మకుటంతో ఒక శతకాన్నే [స-1] రాశారు. అందులోని భాషాశైలి వ్యావహారికమే. అందులోనుండి మచ్చుకు ఒక రెండు కందాలు కింద ఉదహరిస్తున్నాను –

వీరప్పన్, ఏన్గుల సం-
హారప్పన్, కుంభిదంత హరిగంధ వ్యా-
పారప్పన్, కిడ్నాపుల
ధీరప్పన్ ప్రభుత తాడు తెంచెను చేరా

ఇస్మాయిల్ స్మైలిస్తే
ఆస్మాన్‌లో పిట్ట వాలునా చెట్టుపయిన్
జాస్మిన్ ఖుష్బూ లొలికే
అస్మితలే క్రొంబ్రతీక లౌనటె చేరా

పై పేరడీలలో వలెనే కింది కరుణశ్రీ పద్యం [మ-1] కూడా ఒక మణిప్రవాళమే.

పాకెట్లో రాకెట్లిడి
బ్రాకెట్లాడకుము ప్రజల భవితవ్యముతో
బ్రోకర్లను స్వార్థానికి
జోకర్ల నొనర్పకోయి భుట్టో భాయీ

ఆంగ్లంలో తెలుగు ఛందస్సులో పద్యాలను రాయడంలో ప్రతిభ నార్జించినవారు సుప్రభగారు. వారు రాసిన ఒక పద్యం కింద ఇస్తున్నాను. ఇది పాదమునకు నాలుగు య-గణములతో ఉండే భుజంగప్రయాతము [శా-1] (ఈ వృత్తాన్ని గురించి నేను ఒకప్పుడు శంకరాచార్యులను గురించి రాస్తూ ప్రస్తావించాను [మో-2]).

భు. four bacchii (IUU) in one line
Demanding, Demanding, denying the request!
Demanding to get love, demanding to get heart
Demanding to worship, demanding to follow
Demanding he always, repeating the same words

అవధానాలలో, ఆశువులలో: ఆ కాలంలో చిలకమర్తి లక్ష్మీనరసింహారావుగారు టంగుటూరు ప్రకాశంగారి కోరికను మన్నించి పకోడిపై ఆశువుగా కంద పద్యాలను చెప్పారట [ప్ర-1]. అందులో ఒకటి –

ఆ కమ్మదనము, ఆ రుచి,
ఆ కరకర, ఆ ఘుమఘుమ, ఆ పొంకము లా
రాకలు పోకలు పడుపులు
నీకే తగు, ఎందు లేవు, నిజము పకోడీ

పానుగంటి లక్ష్మీనరసింహరావుగారు తాను రాసిన కంఠాభరణము అనే నాటకంలో రామలక్ష్మణులను ఆశుకవులు బేడ ఇచ్చిన ఒక లుబ్ధాగ్రేసరునితో చెప్పిన పద్యం కిందిది [ప్ర-1].

తోడా లివ లేవో, గుడి
ఘోడాయే నివ్వలేవొ కొమరుగ దలపన్
బోడెమ్మ చాకలివలె
బేడా యిచ్చెదవు దూడ పేడా అరయన్

బులుసు వేంకట రామమూర్తిగారు ఒక అవధానంలో పూరించిన దుష్కరప్రాస పద్యం ఒకటి [ప్ర-1] కింద ఇస్తున్నాను.

పిట్మను షార్టుహేండు టయిపింగును ప్యాసయి వెస్టుకోస్టు యె-
స్టేట్మినరల్సు లోన పని సేయు స్టెనో యొకనాడు బీచిలో
ఖాట్మను నా బరంగు దొరగారి కుమార్తెను జూచి యిట్లనెన్
కుట్మలదంతి నీ పయిన కోరిక లీరిక లెత్తె నీతరిన్