ఈమాట » గుప్పెడంత మనసు

Expand to right
Expand to left

గుప్పెడంత మనసు

కన్నీళ్ళు కార్చడం నేర్పామంటే
ప్రతి చిన్న కారణానికీ
కదిలి కదిలి ఏడుస్తుంది
నవ్వడం నేర్పామంటే
ప్రపంచంలో నవ్వదగిన
విషయాలు దొరకక
నిరాశ పడుతుంది

కాస్తంత చురుకుదనం నేర్పామంటే
చుక్కల్ని తాకి వస్తానని గొడవ చేస్తుంది
భరించలేక పరాకు నేర్పితే
పక్కనే వున్న ఆనందాన్ని కూడా
అందుకోలేని పిచ్చిదవుతుంది

ఆదర్శాలు నేర్పామంటే
అవనిలో మన బ్రతుకు
దుర్భరం చేస్తుంది
అవసరాలే తెలియచెప్తే
నరకంలో కూడా
మనకి చోటు లేకుండా చేస్తుంది

గుప్పెడంత మనసు..
దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టామా
బ్రతుకంతా దానికే సరిపోతుంది
ఎందుకొచ్చిన గోల అని
పట్టించుకోకుండా వదిలేసామా
బ్రతుకుకి అర్ధమే లేకుండా పోతుంది

రచయిత టి. శ్రీవల్లీ రాధిక గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. "రేవు చూడని నావ" అనే కవితాసంపుటి, "మహార్ణవం", "ఆలోచన అమృతం" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి "mitva" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. "నా స్నేహితుడు" అనే కథకు 1994 లో "కథ" అవార్డు అందుకున్నారు ...

 

(9 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. vennnu అభిప్రాయం:

    September 2, 2008 2:53 am

    it is a matured poem. I felt good.

  2. Aruna అభిప్రాయం:

    September 2, 2008 7:03 am

    మీరు చెప్పిందంతా నిజమే. ఎప్పుడూ ఇలా బాధపెడుతూనే వుంటుంది మన మనసు మనలని.

  3. sathya అభిప్రాయం:

    September 4, 2008 12:11 am

    చాలా బావుంది, కాని మనసు అదుపులొ వున్నా ఎందుకంత అలజడి?

    మనసు సున్నితం కాబట్టి !

    కొత్తవి ఇంకా రాయండి.

  4. ko sya su ra అభిప్రాయం:

    September 7, 2008 6:30 am

    మనసులోంచి ఊరిన కవిత ,”మన” సులలో ముసురు పట్టించే కవిత.
    బాగుంది…కాదు…కాదు.. ( నామనసొప్పడంలేదు ) చాలాబాగుంది
    కొ శ్యా సు రా
    http://ksraoeil.blogspot.com/

  5. kusumakumari అభిప్రాయం:

    September 9, 2008 4:55 am

    “జీవితము” యొక్క గొప్ప దనమే అది. ఎన్నెన్ని సార్లు
    వర్ణించినా, ఎన్ని రకాలుగా విశ్లేషించినా, ఎన్నెన్నో రీతులైన
    నిర్వచనాలను నిరంతరమూ అందుకుంటూనే ఉండే
    అక్షయ పాత్ర కదండీ, అది.

  6. lingesh అభిప్రాయం:

    September 9, 2008 12:21 pm

    చాలా బాగుంది. nice one.

  7. essem.chelluru అభిప్రాయం:

    September 25, 2008 3:38 am

    చాలా బాగుంది. చాలా అవసరము కూడా.

  8. Audisesha reddy Kypu అభిప్రాయం:

    October 6, 2008 12:34 am

    మనసు గుప్పెడు అయినా అందులొని భావాలు గుప్పెడు కాదు. రాధిక గారు తన కవితలొ చక్కగా వివరించారు. కైపు ఆదిశేషారెడ్డి. నెల్లూరు.

  9. ఫణీంద్ర అభిప్రాయం:

    October 6, 2008 9:41 pm

    రాధిక గారూ,

    LOVED IT.

    మీ ప్రతీ కవితకూ నాకు “బాగుంది” అనే చెప్పాలనిపిస్తుంది. కానీ ప్రతీసారీ అదే చెప్తే, అదో cliched response గా మారిపోయి, సాంద్రతలేని స్పందనగా మీ ముందు ధ్వనిస్తుందని భయమేస్తుంది. కాబట్టి, దయచేసి, నేను “బాగుంది” అన్నప్పుడల్లా దాని ముందు “చాలా” అనే అదృశ్య విశేషణాన్ని దగ్గర దగ్గర ఓ లక్షమార్లు జత చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.

    “ఆదర్శాలు నేర్పామంటే
    అవనిలో మన బ్రతుకు
    దుర్భరం చేస్తుంది
    అవసరాలే తెలియచెప్తే
    నరకంలో కూడా
    మనకి చోటు లేకుండా చేస్తుంది”

    ముఖ్యంగా ఈ పేరా నాకు చాలా నచ్చింది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a