నాకు నచ్చిన పద్యం - భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన
మ. యమునద్గంగము కృష్ణ భూమదిల మబ్జాక్ష న్మనుష్యంబు నీ
ల మహీధ్రన్నిఖిలా చలావళి తమాలద్భూజ మిందీవర
త్కుముద శ్రేణి పికద్విహంగము దమస్తోమద్గ్రహోర్క ప్రభా
సముదాయంబగుచుండె లోక మలఘు శ్యామాభ్రముల్ బర్వినన్
ఈ పద్యం భాస్కర రామాయణం, కిష్కింధ కాండము లోనిది. కవి మల్లికార్జున భట్టు.
మన ప్రధాన కావ్యాలైన భారత భాగవత రామాయణాలు ఏవీ ఒకే చేతి నుంచి వచ్చినవి కావు. భారతం కవిత్రయం రచిస్తే, భాగవతం పోతన వ్రాసిన తర్వాత శిథిలమైన భాగాల పూరణో లేక పోతన వ్రాయక వొదిలినందుననో వెలిగందల నారయా, ఏల్చూరి సింగనా రచించారు. ఇక రామాయణాన్ని భాస్కరునితో పాటు కుమార రుద్రదేవుడూ, మల్లికార్జున భట్టూ, అయ్యలార్యుడూ వ్రాశారు.
భారత భాగవతాలను ఆ తర్వాత ఎవరూ ప్రయత్నించినట్లు లేదు గానీ (ఆధునికుల్లో శ్రీపాద కృష్ణమూర్తి మినహా) రామాయణం మీద చాలామంది కవులే చేయి చేసుకున్నారు - ప్రాచీనుల్లో గోన బుద్ధారెడ్డీ, మొల్లా, ఆధునికుల్లో గోపీనాధం వెంకట కవీ, జనమంచి శేషాద్రి శర్మా, పుట్టపర్తి నారాయణాచార్యులూ, విశ్వనాథ సత్యనారాయణా, అలాంటి వారిలో కొందరు.
రంగనాథ రామాయణం పూర్తిగా ద్విపదా, మొల్ల రామాయణం బాగా సంక్షిప్తమూ కాబట్టి, రామాయణం అనగానే భాస్కర రామాయణమే భక్తిగా సంభావింప బడుతున్నది. అందులోని కిష్కింధ కాండము మల్లికార్జున భట్టు ప్రణీతము. అందులో వాలి వధ అనంతరం లంకపై దండెత్తటానికి తగిన సమయం కోసం శ్రీరామాదులు వేచి చూస్తున్నపుడు వర్షాకాలం వచ్చిన సందర్భం లోనిది పై పద్యం.
చండ ప్రచండంగా ఎండాకాలం లోకాన్ని తపింప జేసిన తర్వాత వర్షారంభ సూచనగా ఆకాశం అంతా దట్టంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. సందు లేకుండా గగనతలం నిండుగా కరి మబ్బులు ఆక్రమించాయి. లోకమంతా ఆ మబ్బుల వల్ల చీకటివారి పోయింది. ప్రకృతి లోని ప్రతీ వస్తువు పైనా నీలినీడలు కమ్మి వాటి రూపురేఖలూ స్వభావాలూ పూర్తిగా మారిపోయినట్లుగా అనిపించింది.
గంగానది కాస్తా యమునానది అయింది. తెల్లని గంగనీరు ఆ కాలమేఘచ్చాయ వలన నల్లగా మారేసరికి గంగ కాస్తా యమునగా మారింది (గంగ నీరు తెల్లగా యమున నీరు నల్లగా ఉండటం లోక ప్రసిద్ధం). ఇదీ యమునద్గంగము. ఇలాగే ఇల మొత్తం కృష్ణభూమిగా, నల్లని నేలగా (కృష్ణభూమత్+ఇలము) మారింది. మనుష్యులందరూ అబ్జాక్షులు - అంటే విష్ణుమూర్తులు, నీలమేఘశ్యాము లైనారు. కొండలూ గుట్టలూ అన్నీ నీల మహీధ్రాలు అంటే నీలగిరు లైనాయి. చెట్లన్నీ తమాల భూజాలు అంటే కాటుక చెట్లైనాయి. కొలనుల్లో వుండే కలువ పూలన్నీ ఇందివరాలు అంటే నల్లకలువ లైనాయి. పక్షులన్నీ కోయిల లైనాయి నల్లగా కనిపిస్తూ. సూర్యుడూ ఇతర గ్రహాలూ - వాటి కాంతి మీద మేఘచ్చాయ పడి వాటి ప్రభాసముదాయం అంతా చీకటి కప్పుగా మారిపోయింది.
ఘనాఘనాల అలఘుత్వమూ, సజలాంబుదాల్లోని గాఢతా, మేఘాల నీలిమ లోకంలోని వస్తువుల మీద చూపించిన ప్రభావమూ, ఉపమాలంకారం గానో ఉత్ప్రేక్ష గానో కాకుండా సాక్షాత్తూ అభేదమే చెప్పి ఉద్దిష్టభావాన్ని రూపు కట్టించాడు కవి. అంతే కాదు, నీలి నీడలు కమ్మడం సాధారణంగా కళంక సూచకం. కానీ ఇక్కడ నల్లబారిన వస్తువులేవీ అల్పాలు కాలేదు. అవీ పూజనీయాలే అయినాయి. మనుష్యులు అబ్జాక్షు లైనారు. కొండలు నీలగిరు లైనాయి. పక్షులు కోయిల లైనాయి. మామూలు కలువలు ఇందీవరా లైనాయి. ఈ విధంగా ఆ ఘనశ్యామచ్చాయతో లోకం మరి కొంత మిన్నతనం పొందిందని చెప్పడం ద్వారా, వర్షాగమనానికి హర్షాతిరేకం తోనే స్వాగతం చెప్తున్నాడీ కవి. చక్కని పోలికలతో భావబంధురంగా సాగిన ఈ పద్యంలో - ఆ చిన్న భావాన్ని ఎనిమిది దృశ్యాలతో విశదీకరించి - ఒక చిన్న భావానికే పెద్ద రూపం ఇచ్చాడు. సంస్కృత పదాల బాహుళ్యం వల్ల సహజంగా వృత్తాలకు వచ్చే ధారా, శ్రవణ పేయతా, ఈ పద్యాన్ని మరింతగా మరిచిపోలేనిదిగా చేశాయి.
భాస్కర రామాయణం రచింపబడిన తర్వాత దాదాపు రెండు వంద లేండ్లకు మొల్ల కవయిత్రి తన చిన్న రామాయణం వ్రాసింది. అందులో ఇలాంటిదే ఒక పద్యముంది. నల్లని మేఘాలు కమ్మినందున లోకం లోని వస్తువులు ఎలా నల్లగా కనిపించాయో మల్లికార్జున భట్టు వర్ణిస్తే, వెన్నెల యొక్క తెల్లని కాంతిలో లోకం ఎలా తెల్లగా మారిందో మొల్ల చెప్పింది.
ఉ. నారదులైరి సన్మునులు నాక మహీజములయ్యె భూజముల్
శారదలైరి భామినులు శంకర శైలము లయ్యె గోత్రముల్
పారదమయ్యె నీరధులు పన్నగ నాయకులయ్యె నాగముల్
వారిద వర్గమెల్ల సిత వర్ణములయ్యెను పండు వెన్నెలన్
ఇదీ మొల్ల రాసిన ఆ పద్యం. మల్లికార్జున భట్టు పద్యాన్ని మొల్ల చూసే ఉంటుంది. చూసింతర్వాత ఆకర్షింపబడి కొద్ది మార్పులతో తన పద్యాన్ని తాను వ్రాసుకొని పైపద్యం మీద తన గౌరవం ప్రకటించింది.
Dr Darla VenkateswaraRao అభిప్రాయం:
September 3, 2008 10:00 pm
పద్యాన్ని వివరించిన తీరు బాగుంది. మన ప్రాచీన కావ్యాల్లోని పద్యాల ప్రభావం తరువాత కావ్యాల్లో చాలా పద్యాల్లో కనిపిస్తుంటుంది. దాన్ని మీరు ” గౌరవం ప్రకటించినట్లు” వ్యాఖ్యానించడం ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. మీ వ్యాసంలో పద్య భావాన్ని కూడా రాసి ఉంటే సామాన్యులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుందేమో.. ఈ సారి ఆ దిశగా ఆలోచించండి.
మీ
దార్ల
Jaya అభిప్రాయం:
October 6, 2008 10:32 am
మొల్ల రాసిన పద్యానికి తాత్పర్యము ఇవ్వగలరా?
జయ
mOhana అభిప్రాయం:
October 17, 2008 8:53 am
మొల్ల వ్రాసిన పద్యంలో ప్రకృతిలోని అన్ని వస్తువులు వెన్నెల వల్ల ఎలా ఒక ఉత్తమత్వాన్ని పొందాయో అనే విషయం విదితమవుతుంది. మునులందఱు నారదునివలె ఉన్నారట. నారదునిలా తెల్లగానే కాక అతనిలా ఇంపుగా సంగీతం వినిపిస్తారు కాబోలు. ఇక వెన్నెలలో చెట్లన్నీ కూడా స్వర్గంలోని కల్పవృక్షాలవలె ఐనాయట. ఇక స్త్రీలో వెన్నెలలో తెల్లని సరస్వతిలా ఉన్నారట. బహుశా శారదలాగే వీణియను మీటుతారేమో? మాములు కొండలన్నీ శంకరుడు ఉండే హిమాలయాలలా మంచుమలలా ఉన్నవట. సముద్రంలోని అలలు రాత్రి వెన్నెలలో పాదరసంలా తోచిందట. పాములు నల్లగా ఉన్నా నాగరాజు తెల్లగా ఉంటాడని ఊహ. అందుకే శ్వేతనాగము కలలో కనబడితే మంచిది అంటారు. వెన్నెలలో సామాన్యమైన సర్పాలు కూడ నాగరాజులా తెల్లగా ఉన్నాయట. ఇక ఆకాశంలో అక్కడా ఇక్కదా ఉండే మబ్బులు కూడ వెన్నెల ప్రతిఫలనమువల్ల తెల్లగా కన్పించాయట. వెన్నెలలో అన్నీ ఒక అపూర్వమైన ఆకారాన్ని పొందినాయి అని పద్యానికి అర్ధం. అందుకే వెన్నెల అంటే అందఱికీ, ముఖ్యంగా ప్రేమికులకు చాలా ఇష్టం. భాసుడు వ్రాసిన ఒక చాటు పద్యంలో వెన్నెలను పిల్లితో పోలుస్తాడు! విధేయుడు - మోహన
[బృందావనరావు గారికి ఇంటర్నెట్ అందుబాటు పరిమితం. మా అభ్యర్ధనపై మోహనరావు గారు పంపిన తాత్పర్యం ఇది. వారికి మా కృతజ్ఞతలు - సం.]
Srinivas Vuruputuri అభిప్రాయం:
October 20, 2008 8:36 pm
మోహన రావు గారికి
అదే చేత్తో భాసుని శ్లోకాన్నీ, భావాన్నీ రాయమని మనవి.
శ్రీనివాస్
mOhana అభిప్రాయం:
November 12, 2008 6:00 am
మనకు దొరికిన పుస్తకాలనుండి శార్దూలవిక్రీడితాన్ని అశ్వఘోషుడే మొట్టమొదట వాడినట్లు అనిపిస్తుంది. భాసుడు అశ్వఘోషుని పిదప జీవించాడు. సంస్కృత నాటకకర్తలలో ఇతడే బహుశా మొదటివాడు.
కాళిదాసు కూడా ఇతడిని చాలా ప్రశంసించాడు. వెన్నెలపైన భాసుడి చాటువును కింద ఇస్తున్నాను -
కపోలే మార్జారః పయ ఇతి కరాల్లోఢి శశిన-
స్తరుచ్ఛిద్రప్రోతాన్ బిసమితి కరీ సంకలయతి
రతాంతే తల్పస్థాన్ హరతి వనితాప్యంశుకమితి
ప్రభామత్తశ్చంద్రో జగదిదమహో విప్లవయతి
నేను తెలుగులో దీనిని అనువదించే బదులు ప్రొఫెసర్ బెర్రీడేల్ కీత్ గారి ఆంగ్లానువాదాన్ని ఇస్తున్నాను -
When its rays fall on its cheeks
the cat licks them, thinking them milk;
When they are caught in the cleft of a tree
the elephant deems them a lotus;
When they rest on the couch of lovers
the maiden seizes them, saying,
“‘’Tis my robe”;
The moon in truth, proud of its brilliance,
doth lead astray all this world.
విధేయుడు - మోహన