ఈమాట » ఏటి ఒడ్డున

Expand to right
Expand to left

ఏటి ఒడ్డున

ఏటవాలుగా రెక్క విప్పిన నీటికొంగలా
మధ్యాహ్నం ఏటి పై నెమ్మదిగా పరచుకుంటుంది.
రాత్రి వానలో రాలిన స్వప్నాలను నెమరువేస్తూ
ధ్యానముద్రలో మునిగిన యోగుల్లా
పూర్తిగా తడి ఆరని జటాజూటాలతో
చెట్లు ఒంటికాలిపై నిశ్చలంగా నిలబడతాయి.

ఏటి ఒడ్డున
పచ్చని ఆకుల పట్టుగొడుగుల క్రింద
సగం తెరిచిన పుస్తకాలతో నువ్వూ, నేనూ
ఓ అలౌకిక రసాస్వాదనలో మునిగిన సహ గాయకుల్లా
నులివెచ్చని మధ్యాహ్నపు స్పర్శను అనుభవిస్తూ
చిత్తరువుల్లా మిగిలిపోతాము.

అప్పుడప్పుడూ గలగలపారే ఆలోచనల సవ్వడి కూడా లేకుండా
కాలం నా కనురెప్పల క్రింద మాగన్నుగా ఒదిగిపోతుంది.
ప్రక్కనే కాన్వాస్ మీద తడి ఆరని బ్రష్ కొనలలో
ఓ అనావిష్కృత సౌందర్యం అందమైన రహస్యం లా మెరుస్తుంది.

సాయంత్రమవగానే
చెట్లకొమ్మల్లోంచి దానిమ్మ పువ్వులా జారిపడి
నీటిపై మెరిసే సంధ్యాకాశాన్ని,
ఏటిపై పగడాల దండలై ప్రవహించే జలతారు సంగీతాన్ని,
చెట్లక్రింద వెలుగు నీడలతో దోబూచులాడే
చల్లగాలి చిరుమువ్వల సవ్వడిని,
పిక్నిక్ బాస్కెట్ లో సర్దేసి
మళ్ళీ మన రణగొణ ధ్వనుల యాంత్రిక దినచర్య లోకి
డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము .

ఓ మధురమైన మధ్యాహ్నపు స్మృతి మాత్రం
మనల్ని అగరొత్తుల పరిమళంలా ఆవరించి
వెంటాడుతూనే ఉంటుంది.

రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...

 

(12 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. baabjeelu అభిప్రాయం:

    September 1, 2008 11:23 pm

    వైదేహి శశిధర్ గారూ,
    చిక్కని కవిత్వం.
    అన్ని ప్రక్రియలలోనూ కవిత్వానికే ఎందుకు పెద్దపీట వేస్తారో ఢంకా బజాయించి చెప్పేవి ఇలాటి రచనలే.
    ఇంత చిన్న మోనిటర్ మీద, ఏ ఇషాన్ ఆర్యో షూట్ చేసిన దృశ్యాన్ని, చూపించగలిగేరు.

  2. నిషిగంధ అభిప్రాయం:

    September 2, 2008 8:08 am

    అద్భుతం!! ఎంత అందమైన పదచిత్రాలు వాడారో!!

    “అప్పుడప్పుడూ గలగలపారే ఆలోచనల సవ్వడి కూడా లేకుండా
    కాలం నా కనురెప్పల క్రింద మాగన్నుగా ఒదిగిపోతుంది.”

    ఇలాంటి అలౌకికానందం లభించి యుగాలైందనిపిస్తుంది..

  3. Malathi అభిప్రాయం:

    September 2, 2008 9:38 am

    Just enchanting, Vaidehi. Sorry for writing in English. I never got used to this keyboard.
    The imagery is charming and the end is a little anti-climatic. But it is always like that. Birngs us back to the earth, and the feeling persists like incense sticks. Wonderful. Thanks for sharing with us. I feel like I am there!

  4. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    September 2, 2008 9:19 pm

    “The Fire of Life”

    ఈమాటలోని పాత్రధారులే కొందరు రచ్చబండలో ఉన్నారు. ఆమధ్య ఇక్కడ పుట్టిన వివాదమొకటి ఎగిరి అక్కడ వాలింది. వైదేహి గారి కవిత చదివితే అక్కడ ప్రస్తావించిన Rorty వ్యాసం గుర్తొచ్చింది.

    అది చూసి, షెల్లీ వ్యాసం చదివితే ఇది కనిపించింది:

    “A Poet is a nightingale who sits in darkness, and sings to cheer its own solitude with sweet sounds; his auditors are as men entranced by the melody of an unseen musician, who feel that they are moved and softened, yet know not whence or why.”
    కవిత్వం దైవం లాంటిదట. అందుకే దానికి పెద్దపీట.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. Lakshmi Kallakuri - 'Sailakshmi' అభిప్రాయం:

    September 4, 2008 12:14 am

    సాయిలక్ష్మి స్వాభిప్రాయము:
    అర్ధరాత్రి అందమైన నిశ్శబ్దములో నీ పిక్నిక్ బాస్కెట్టు కొట్టేశానోచ్ ….!

    గలగల పారే ఆలోచనల సవ్వడిలేక
    కాలాన్ని కట్టేసి జలతరంగిణిల
    అలౌకిక (నీకవితా) రసాస్వాదన చేస్తూ
    వెలలేని అపార సౌందర్య చిత్రమైన నా సగంతో
    కలసి తాదాత్మ్యమ్ చెందానే ! సఖీ!
    ఆలపించింతిని రహస్యగానాన్ని.
    కల గాదే నీ కవితా పరిమళమ్ !

    ఏలనైనా నే ‘దేహి’ యందునే నీ కవితలకై
    వలదనకే! ‘వై’ యనకే చెలీ! వైదేహి!

  6. Sai Kiran Kumar అభిప్రాయం:

    September 6, 2008 2:56 am

    చాలా బాగున్నదండి. ప్రతి ఖండిక అద్భుతంగా ఉంది. ఇంత మంచి కవిత్వం చదివి చాలా రోజులయ్యింది.

  7. కొత్తపాళీ అభిప్రాయం:

    September 6, 2008 10:07 am

    పద్యంనిండా పురివిప్పిన పదచిత్రాలు “వావ్” అనిపించేలా ఉన్నాయి.
    బ్రష్ కి కుంచె అనీ, బాస్కెట్ కి బుట్ట అనీ రాసి ఉండొచ్చు.

  8. ko sya su ra అభిప్రాయం:

    September 7, 2008 6:11 am

    బాగుంది. చాలాబాగుంది.
    కవిత చదువుతున్నంత సేపూ, చదివినతరవతా కూదా నదీ తీరాన
    “పచ్చని ఆకుల పట్టుగొడుగుల క్రింద” సేదతీరుతూ,ఆకులమధ్యనుంచి తప్పించుకువచ్చ్చికిరణాల,ని,అరమోద్పుకళ్ళతో,చూస్తున్నట్టుగానే అనిపించింది…. కానీ..
    “అగరొత్తుల పరిమళం
    వెంటాడుతూనే ఉంటుంది”

    కొ స్యా సు రా
    http://ksraoeil.blogspot.com/

  9. Lyla yerneni అభిప్రాయం:

    September 8, 2008 8:29 pm

    “పద్యంనిండా పురివిప్పిన పదచిత్రాలు “వావ్” అనిపించేలా ఉన్నాయి.
    బ్రష్ కి కుంచె అనీ, బాస్కెట్ కి బుట్ట అనీ రాసి ఉండొచ్చు.”
    -కొత్తపాళీ అభిప్రాయం

    I beg to differ with the second sentence. I prefer the way it is written.

    “ప్రక్కనే కాన్వాస్ మీద తడి ఆరని బ్రష్ కొనలలో
    ఓ అనావిష్కృత సౌందర్యం అందమైన రహస్యం లా మెరుస్తుంది.”

    The poet perhaps did not mean it, but I read the top line in English. In my mind, it is translated as; canvas -as some coarse grass and brush -as brush ( bushes.) It looked like the whole scene in the poem is an afternoon after some rain fall, so the grass and brush is wet and is glistening.

    I felt Vaidehi did a nice plen-air painting, and at the end the artist had folded her canvas and put away the paints in a basket and had driven away in her car.

    (For some years now,) I get to read this poet in another magazine called “Telugu Jyothi.” I read a review of her poetry by V.V. Ramanatham, which I thought is very nicely done.

    In the same magazine, I also read an article by Vaidehi on Tilak’s poetry, which if I remember correctly also gives her own views of poetry. That piece is written very well.

    Her poetry is also published in ‘Kaumudi.’

    Vaidehi is an elegant, stylish and sensitive poet. This particular poetry piece is gorgeous.

    Thanks for the good read.

    లైలా.

  10. radhika అభిప్రాయం:

    September 11, 2008 10:31 am

    కవిత్వమంటే ఇదీ అని ఎవరికన్నా చెప్పాల్సివస్తే ఈ కవిత ఒక్కటి చూపిస్తే చాలు. ఎన్ని పదచిత్రాలో, ఎన్ని మెరుపులో….
    నా మనసు, నేనూ పూర్తిగా మునిగిపోయాము.

  11. రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    September 11, 2008 7:48 pm

    అద్భుతంగా వ్రాశారు. ఒక impressionist painting ని చూసిన అనుభూతి. మీ కవిత చదివేక శారద గారి కథ చదివేను. మీ అద్భుతవైన పదచిత్రాలు పూరించలేని వెలితేదో శారద గారి కథలోని అతి సాదారణ పదాల్లో పూరించబడిందని నా అభిప్రాయం. నేనే తప్పేవో, మీ కవితలో వెలితి may be due over dose of romanticism in “ఈమాట” అని అనుకుంటున్నాను.

  12. Vaidehi Sasidhar అభిప్రాయం:

    September 13, 2008 7:45 pm

    నా “ఏటి ఒడ్డున” కవిత పై తమ స్పందనని,అభిప్రాయాలని తెలియజేసిన బాబ్జీలు,నిషిగంధ,మాలతి,కొడవళ్ళ హనుమంతరావు,కాళ్ళకూరి సాయిలక్ష్మి,సాయికిరణ్ కుమార్,కొత్తపాళీ,కొ స్యా సు రా, యెర్నేని లైలా, రాధిక,రవికిరణ్ తిమ్మిరెడ్డి గార్లకు ధన్యవాదాలు.
    I am truly happy that my poem could evoke a warm response from such gifted readership.
    Vaidehi Sasidhar.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a