తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు
స్వాతంత్ర్యం వచ్చేనాటికి మాతృభాషామాధ్యమం పాఠశాల చివరితరగతి (1-11) వరకు ఉండేది; ఇంగ్లీషు ఒక పాఠ్యాంశంగా 6వతరగతినుంచి, మాధ్యమంగా ఇంటర్ మీడియేట్ నుంచి కళాశాలస్థాయిలో ఉండేది. దేశమంతటా ఈమార్పు రావటానికి ఆంగ్ల పాలకుల విద్యావిధానమే కారణం. ఈప్రయత్నం 70ఏళ్ళ తర్వాత 1920నుంచి సమగ్రంగా అమలైంది.
‘ప్రజలభాషలో రాష్ట్రపరిపాలన జరగటం ప్రజాస్వామ్యానికి అవసరం’ అనే ఆదర్శంతో భాషాప్రయుక్తరాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత దేశభాషలకు సముచితస్థానం ఇవ్వటానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగాయి. ప్రధానభాషల (Eighth Schedule languages) ను అధికారభాషలుగా గుర్తించటం, విద్యావిధానంలో పట్టభద్రస్థాయిదాకా దేశభాషామాధ్యమం ప్రవేశ పెట్టటం, గ్రంథఅకాడమీల, సాహిత్యఅకాడమీల స్థాపన, మొదలైనవి. తెలుగులో 1957లో సాహిత్యఅకాడమీ, 1968లో తెలుగు అకాడమీ వచ్చాయి. 1969-1974కి తెలుగుమాధ్యమం పి.యు.సి. నుంచి బి.ఏ., బి.కామ్., బి.ఎస్ సీ. లస్థాయిదాకా వ్యాపించింది. ఆ తర్వాతనే తెలుగుకు క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రధాన కారణం: ఇంగ్లీషుమీడియమ్ లో చదువుకున్నవాళ్ళకు ఉద్యోగావకాశాలు పెరగటం, తెలుగు మాధ్యమం నిరుపయూగం అనేభావం చదువుకున్నపిల్లల్లోనూ, తల్లిదండ్రుల లోనూ గట్టిగా పాతుకోటం. ఇది మరో ముప్ఫై ఏళ్ళకు తారస్థాయికి చేరుకున్నది. LKG నుంచే ఇంగ్లీషులో చదువునేర్పటం అవసరమనే అపోహ చాలావర్గాల్లో కలగటం, పనిపాటలు చేసుకునే వాళ్ళుకూడా ఈ దోవ తొక్కటం విశేషం. పార్లమెంటు అంగీకరించిన భారతదేశవిద్యావిధానం తల్లకిందులైంది.
ఇంగ్లీషుమీడియం లో చదివినవాళ్ళకు చదువు ఎంతబాగా పట్టుబడుతున్నదో తెలుసుకోటానికి “ఇండియా టుడే” వారపత్రిక ఇటీవల (2006 నవంబర్ 27సంచికలో[2]) ఒక జాతీయపర్యవేక్షణ చేసి వచ్చిన ఫలితాలను ప్రచురించింది. మొత్తం 5 నగరాలనుంచి 142 అతిశ్రేష్ఠపాఠశాలలను తీసుకొని 4, 6, 8 తరగతుల్లో ఉన్న 32,000 మంది విద్యార్థులను శాస్త్రీయంగా ఎంపికచేసింది. వాళ్ళకు ఆరుప్రశ్నలిచ్చి వారు రాసిన జవాబులకు మార్కులువేశారు. అలానే 43 ఇతరదేశాల్లో అదే తరగతులపిల్లలకు ఆప్రశ్నలిస్తే వచ్చిన జవాబులకు మార్కులు వేసి, రెంటినీ పోల్చిచూస్తే, అంతర్జాతీయ స్థాయి విద్యార్థుల మార్కులు 60 శాతం పైన ఉంటే మనపిల్లలు 40 శాతం మార్కులలోపలే ఉన్నారని తెలిసింది.

India Today: Cover Story
2006/11/27
ఇది చాలామందిని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఈపరిస్థితికి చాలాకారణాలు ఉండవచ్చుగాని ప్రధానమైంది స్కూలుస్థాయిలో మాతృభాషలో పాఠాలు చెప్పకపోవటమే అనిపిస్తుంది. అవగాహనశక్తి పరభాషలో కన్నా సొంతభాషలో సులభంగా సాధ్యమౌతుంది. సొంతభాషకు వ్యాకరణం నేర్చుకునే అవసరం ఉండదు; ఇంగీషువ్యాకరణం నేర్చుకోటం కష్టంకాబట్టి బట్టీపెట్టే అలవాటుకు ఎక్కువవిలువ, అవగాహనకు తక్కువవిలువ పిల్లలు ఇచ్చినట్టు తేలింది.
ఇంగ్లీషుమాధ్యమంలో నడిచే అత్యుత్తమపాఠశాలల స్థితే ఇలాఉంటే మరి వేలకొద్ది కుక్క గొడుగుల్లా ఏర్పడ్డ స్కూళ్ళసంగ తేమిటి? అక్కడ చదివే పిల్లలకు ఎటువంటి భాష పట్టుబడుతున్నదో పరిశోధించి తెలుసుకోవాలి. అసలు ఏభాషా సరిగా అంటటం లేదేమో! మరి ఇంగ్లీషు మాధ్యమం మీద ఇంతమందికి ఇంత మమకారం ఎలా ఏర్పడ్డది? బహుశా ఈకిందివి కారణాలై ఉండవచ్చు:
- హైటెక్ ఉద్యోగాలవిస్తృతి, వాటికి ఇంగ్లీషుమాధ్యమం ఆవశ్యకత;
- బీపివోలలో, కాల్‌సెంటర్లలో వేలకొద్ది ఉద్యోగాలు రావటం;
- మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంగ్లీషుచదువుకు ప్రాధాన్యం;
- ఇంగ్లీషు మీడియంలో చదువుకొన్నవాళ్ళు ఎక్కువమంది అమెరికా ఉద్యోగాలకు వెళ్ళటం.
పై కారణాలకూ, ఒకటో తరగతినుంచి ఇంగ్లీషుచదువుకోవాలి అనుకోటానికీ, సంబంధం ఏమీ లేదు. పూర్వపద్ధతిలో ఇంటర్నుంచి చదువుకొన్నా ఆంగ్లభాషమీద అంతగాని, అంతకన్న ఎక్కువగాని అధికారమే వస్తుంది. కాల్‌సెంటర్ల ఉద్యోగాలు (తాత్కాలికంగా నిరుద్యోగసమస్యకు పరిష్కారంగా కనిపించినా) ఇతరదేశ ఆర్థికావస్థను పెంచటానికి పనికివస్తాయి గాని, మనదేశంలో వస్తువుల ఉత్పత్తికి, జీడీపి (GDP) పెరగటానికి పనికిరావు. ఇంకో ప్రధానమైన సంగతి: తెలివైన పిల్లలు విద్యావిధానంలో లోపాలున్నా గమ్యాన్ని సాధించుకోగలరు. సామాన్యులకు అది పరిష్కారం కాదు. వాళ్ళ పురోభివృద్ధికి కారణం ఇంగ్లీషుమాధ్యమం లో వాళ్ళు చదవటం అనుకోటం మరో భ్రాంతి. ప్రపంచీకరణం అన్నిదేశాలకూ వర్తిస్తుందికాబట్టి అది కారణం గాదు.
అభివృద్ధిపొందిన ఏదేశంలోనూ మాతృభాషలో తప్ప ద్వితీయభాషలో పాఠశాలవిద్య నేర్పటం లేదు. మనదేశంలోనూ విద్యావిధానం ఆప్రాతిపదికమీదే కొనసాగింది; The University Education Commission (1948-49), The Secondary Education Commision (1952-53), National Education Commission (1964-66), The New Education Policy 1986 (modified in 1992) — ఇవన్నీ విద్యామాధ్యమంగా మాతృభాషాస్థానాన్ని మార్చాలని ఎక్కడా చెప్పలేదు. 1992 లో తుదిరూపం తీసుకున్న NPE పర్యవేక్షణ కమిటీకి అధ్యక్షులు మన పూర్వముఖ్యమంత్రి పూజ్యులు నేదురుమల్లివారే. భాషావిషయంలో 1968లో పార్లమెంటు సమ్మతించిన జాతీయవిద్యావిధానం (కొఠారీ కమిషన్ రిపోర్ట్) లో ఉన్న సూత్రాలనే అనుసరించాలని వారు పునరుద్ఘాటించారు (ఉదా: త్రిభాషాసూత్రం). కాని, అమలు చేయటంలో ఏ రాష్ట్రమూ ఈ పద్ధతి అవలంబించలేదు. ఆసంగతి కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈమధ్యనే వచ్చిన మరో సర్వేలో మన విశ్వవిద్యాలయవిద్యను గూర్చినచర్చ ఉంది. దీని ఆధారం యూకే లోని Times Higher Education Supplement లో అచ్చయిన విశ్లేషణ (The Hindu, 06-12-2006[3]). దీనిప్రకారం మనదేశంలో ప్రపంచస్థాయిలో ఎన్నదగిన విశ్వవిద్యాలయూలు మూడే నట; అవి అగ్రస్థాయి 5, 20, 50 లలోలేవు; పై 100లో రెండు, పై 200లో మరోటి. చైనా లో 6, జపాన్లో 11, హాంకాంగ్‌లో 4, ఇతర ఆసియూదేశాల్లో 9; మరి యు.కే.లో 30, అమెరికాలో 55, ఉంటే మనవి చాలా అధమస్థితిలో ఉన్నాయన్న మాట. మనపునాదులు గట్టిగాలేకపోవటమే దీని కారణం అనిపిస్తుంది. కర్త రమేశ్ థాకూర్, Assistant Secretary- General of the UNO, Vice-Rector, United Nations University. ఇండియా టుడేలోనూ దీనిలోనూ చేసినవిశ్లేషణ మనకు కనువిప్పు కావాలి.
పరిష్కారమార్గాలు రెండు: ఒకటి శాశ్వతమైంది, రెండోది తాత్కాలికమైంది.
శాశ్వతపరిష్కారం
మనవిద్యావిధానాన్ని ఇదివరకు ప్రతిపాదించిన సూత్రాలననుసరించి[1] సమూలాగ్రంగా సంస్కరించుకోవాలి. అంతర్జాతీయ విద్యానిపుణులు కొఠారీకమిషన్ రిపోర్టులో చేసిన సిఫార్సులు అప్పటినించి నిష్కర్షగా అమలు చేస్తే ఇప్పటి కీ ప్రతిష్టంభన వచ్చేది కాదు. ఇప్పుడైనా ఆసూత్రాలకు అనుగుణంగా రాష్ట్రకేంద్రప్రభుత్వాలు తమతమ విధానాలను సమీక్షించుకొని మార్చుకోవాలి. ఇది అన్నిదేశాల్లో ఉన్నమార్గమే కాబట్టి శాశ్వతమైంది. ముఖ్యసూత్రం: ఇంగ్లీషుస్థాయిని తక్కువచేయకుండా మాతృభాష ద్వారా అన్నిస్థాయిల్లోనూ విద్యాబోధన జరపటం.
తాత్కాలికపరిష్కారం
ఇంగ్లీషును నేర్చుకోవద్దనీ, నేర్పవద్దనీ, ఎవరూ ఏదేశంలోనూ చెప్పరు. అయితే ఎప్పటినుంచి ఏస్థాయి వరకు, ఏపరిమాణంలో ఆంగ్లం నేర్పాలన్నదే సమస్య. ఇప్పటిలాగా ఎల్కేజీ నుంచి పిల్లలను ఇంగ్లీషుమీడియం బళ్ళలో చదివించటం, ఆత్మహత్యాసదృశం. వాళ్ళకు ఏభాషా రాని స్థితి ఏర్పడుతున్నది. మాతృభాషలో సృజనాశక్తి అడుగంటిపోతున్నది. దాన్ని ప్రభుత్వం వెంటనే ఆపెయ్యాలి.
మనం మరో అయిదేళ్ళపాటు తాత్కాలికమైన కొత్త విధానాలు, మార్గాలు శోధించ వచ్చు. వాటికి నా సూచనలు:
- పాఠశాలస్థాయిలో 5వ తరగతిదాకా మాతృభాషలోనే అన్ని అంశాలూ చెప్పాలి; ఒకటో తరగతినుంచి ఆంగ్లబోధనవల్ల పిల్లలకు మేలు జరగదు.
- ఆరో తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఇంగ్లీషు నేర్పటం, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతిదాకా ప్రతిఏడూ ఒక్కో ‘సబ్జెక్టు’ను ఆంగ్లంలో ప్రవేశ పెట్టటం, ప్రధానంగా విజ్ఞానశాస్త్రాలు, సాంకేతికవిషయూలు.
- 1నుంచి 10 తరగతుల దాకా తెలుగు చదువుకొన్నపిల్లలకు ఇంగ్లీషు నేర్చుకోటం సులభ మౌతుంది. తెలుగు సాహిత్యంద్వారా మన సంస్కృతి అర్థమౌతుంది. తెలుగు ద్వారా సృజనాత్మకశక్తి భావవ్యక్తీకరణ లో దెబ్బతినకుండా ఉంటుంది. (తెలుగు ఇంగ్లీషు సిలబస్ మార్పులు అత్యవసరం).
- విజ్ఞానశాస్త్రవిషయూలు అంచెలంచెలుగా 8-10 తరగతుల్లో ఉభయభాషావిధానం (bilingual method) లో నేర్పితే అవగాహన బాగా పెరిగి పైక్లాసులకు వెళ్ళినప్పుడు ఉభయమాధ్యమాలకు అలవాటు పడటం సాధ్యమౌతుంది. ఇంటర్ మీడియేట్ నుంచి ఇప్పటిలాగే రెండుమాధ్యమాలలోనూ క్లాసులు నడపాలి.
- ఇంటర్వ్యూలు సందర్భాన్నిబట్టి రెండు భాషల్లోనూ ఉండాలి. విద్యావిధానం, పరిపాలన, వాణిజ్యం, న్యాయవ్యవస్థ, పరిశ్రమలు తెలుగులో విస్తరించినప్పుడు తెలుగుమాధ్యమం నుంచి శిక్షణ పొందినవాళ్ళకే ఉద్యోగావకాశలు ఎక్కువవుతాయి. ప్రభుత్వం ఈమార్పు తేవటానికి చొరవతీసుకోకపోతే, భాషారాష్ట్రాలు, ప్రజాస్వామ్యం నిరర్థకమైనట్టే.
భాషాభివృద్ధికి మార్గాలు
వినియోగంవల్లనే భాష క్రమక్రమంగా పెరుగుతుంది. వినియోగంలేకపోతే భాష మార్పులేకుండా స్తబ్ధంగా ఉంటుంది. వాడుకవల్ల తెలుగు వృద్ధిపొందినరంగాలురెండు: దేశీయవృత్తులు, ప్రసారసాధనాలు. ఆంధ్రప్రదేశసాహిత్యఅకాడమీ పర్యవేక్షణలో వచ్చిన వ్యవసాయం, చేనేత, కమ్మరం, కుమ్మరం, వడ్రంగం, మొ.న వృత్తులలో తయూరయిన కోశాలు చూస్తే తెలుగుభాషావ్యాప్తి అర్థమౌతుంది. కోశనిర్మాణవిధానం నేను వ్యవసాయపదకోశం (1957-62)లో నిరూపించాను; బూదరాజు రాధాకృష్ణ, జి. ఎన్. రెడ్డి, తూమాటి దోణప్ప, పోరంకి దక్షిణామూర్తి, మొదలైనవారు సంపాదకులుగా ఇప్పటికి తొమ్మిది సంపుటాలు వచ్చాయి. పూర్వకోశాలలోలేని మాటలు సుమారు 50,000 పైనే ఉంటాయి. ఈకోశాల ప్రయూజనాలు ఆయూ సంపుటాల్లో చదవవచ్చు (తెలుగు యూనివర్సిటీ లోకాపీలు దొరకవచ్చు).
రెండోది వార్తాపత్రికల్లోనూ (ఇతరప్రసారసాధనాల్లోనూ) తెలుగుభాష చాలా వృద్ధి పొందింది. కొత్తమాటలు, రచనారీతులు 30, 40ఏళ్ళలో ఎలా పత్రికల్లో ప్రవేశించాయో పరిశోధనాంశంగా చాలామంది PG విద్యార్థులు కృషిచేశారు. తెలుగువాడుకలో లేని రంగాల్లో అది పెరగలేదు, పెరగదుకూడా; అవి: అన్ని స్థాయిల్లో జరిగే ప్రభుత్వపరిపాలన, వాణిజ్య-వ్యాపారాలు, న్యాయవ్యవస్థ, వైద్యసామాన్యవిజ్ఞాన సాంకేతిక విద్యలు. ఈరంగాలలో తెలుగును తక్షణం వాడటమే పరిష్కారమార్గం.
Bibliography
- Krishnamurti, Bh. 1998. “The regional language vs. English as instructional medium in higher education: the Indian dilemma”. In Language, Education and Society 308-17. New Delhi: Sage Publications.
- Several writers 2006 . “What’s wrong with our teaching?” (India Today, 27-11-2006)
- Ramesh Thakur 2006. “The quality of India’s higher education”. (The Hndu, 09-12-2006)
- Krishnamurti, Bh. and Aditi Mukherjee (eds.). 1985. Modernizaion of Indian Languages in News Media. Hyderabad: Dept of Linguistics, Osmania University.
- Krishnamurti, Bh. 1998. “Language in school education in India’. In Krishnamurti 1998, 275-89.
- Krishnamurti, Bh. 1998. “A survey of Telugu dialect vocabulary used in native occupations.” In Krishnamurti 1998, 121-37.
- భద్రిరాజు కృష్ణమూర్తి, 2000. భాషా, సమాజం, సంస్కృతి: నీల్ కమల్ పబ్లికేషన్స్ ప్రై. లిమిటెడ్.
![]()
రచయిత భద్రిరాజు కృష్ణమూర్తి గురించి: ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన Dravidian Languages పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించాడు. ... పూర్తిగా »
Rohiniprasad అభిప్రాయం:
July 2, 2008 3:14 am
ఇంతకన్నా సమగ్రంగా, విపులంగా, సెన్సిబ్‌ల్ గా ఈ విషయాన్ని ఎవరూ వివరించలేరేమో.
నేను మద్రాసులో 1964లో 11వ తరగతి పూర్తి చేశాను. మాకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ (ఇందులో సున్నా మార్కులొచ్చినా పరవాలేదు కాని ఫయినల్ పరీక్ష రాసి తీరాలి). తెలుగు గ్రాంథికంలో ఉండేది కనక కాస్త ఆముదం తాగిన మొహంతోనే చదివాననుకోండి. అయితే అప్పట్లో ఆ మాత్రమైనా క్లాసిక్స్ చదవడం మంచిదని ఆ తరవాత గ్రహించాను. కాలేజీ స్థాయిలో తెలుగు కన్నా హిందీ ‘సులభం’ అని అనుభవజ్ఞులు చెప్పిన మీదట బీ.ఎస్ సి దాకా హిందీ చదివాను. గ్రామరూ, ఛందస్సూ, సాహిత్యచరిత్రా చాలా నేర్పేవారు. ఫిజిక్స్ మెయిన్ అయినప్పటికీ. ఇంగ్లీషులో షేక్స్పియర్ నాటకాలు రెండేసీ, మిల్టన్ పేరడైజ్ లాస్ట్, బోలెడంత ప్రోజూ వగైరాలుండేవి. సైన్సుతోబాటు ఇంత ‘లాంగ్వేజి బరువు’ ఉన్నా ఇబ్బంది అనిపించలేదు.
ఈమధ్య విశాఖలోనే ఇంజనీరింగు దాకా చదువుకున్న ఒకతను తాను తెలుగు గబగబా చదవలేనని చెప్పుకున్నాడు. నా మద్రాసు తెలుగే నయమనిపించింది.
కొత్తపాళీ అభిప్రాయం:
July 2, 2008 7:44 am
చాలా బావుందండీ.
ఐతే పిల్లి మెళ్ళో గంట కట్టే ధీరుడెవ్వడు?
మన రాష్ట్ర రాజకీయ దురంధరులకి అసలు రాష్ట్రంలో విద్య అనే లాంటి అల్ప విషయాలు పడతాయా? అదీ కాక ప్రతి నగరంలోనూ పట్టణంలోనూ వేళ్ళూని విస్తరించిన విద్యా వ్యాపారం .. బహుశా వేల కోట్లలో సాగుతున్న ఈ వ్యాపారానికి ఎవరు ఎదురొడ్డుతారు? మా తోటి వాళ్ళందరూ ఇంగ్లీషు బళ్ళల్లో చదువుకుంటూ ఉంటే, ఆ చదువు లోని డొల్ల తెలిసిన మా నాన్న గారు మమ్మల్నందర్నీ తెలుగు బడిలోనే చదివించారు 10 వరకూ. ఇప్పుడు ఆ ధైర్యం ఎవరి కుంది?
సుధాకర బాబు అభిప్రాయం:
July 3, 2008 11:10 pm
నేను, నాలాంటి ఎందరో చాలా తీవ్రంగా ఆక్రోశించే సమస్య ఈ ఆంగ్ల భాషా మాధ్యమం బోధన - ఈ వ్యాసంలోని విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాకు అనిపించిన మరికొన్ని విషయాలు-
1) “ఇంగ్లీషులో చదువు”ల వల్ల కలుగుతున్న ప్రయోజనాలు - అని చాలా మంది అనుకొనేవి నిజానికి “చదువు” వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రమే. ఇంగ్లీషు మీడియం వల్ల అవి కలుగుతున్నాయన్న భ్రమ వ్యాపించింది.
2) అసలు తెలుగు మీడియంలో అధికంగా చదువడం వలన సమాజానికీ, వ్యక్తికీ కలిగే ఉపయోగాలు ప్రస్తుతం దాచిపెట్టిన నిధిలాంటివి అనుకొంటాను. దేశంలో కోటి మంది (అ)విద్యావంతుల బదులు నూరుకోట్ల విద్యావంతులు ప్రభవించే అవకాశాన్ని మనం గొయ్యి తీసి కప్పెట్టి ఉంచేసుకొంటున్నాము.
3) ఒక సినిమా చూసి వచ్చిన చిన్నపాటి పట్టణంలోని కుర్రవాడిని ఆ సినిమా కధ ఆంగ్లంలో చెప్పమనండి. ఇంగ్లీషు మీడియం అనేది వట్టి మాయ అని క్షణాలలో తేలిపోతుంది.
4) ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో కృతనిశ్చయం లేకుండా పోయింది. ఇక ముందు కలుగుతుందన్న ఆశ లేదు.
5) నేను పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను. ఇంటర్‌లో రెండవ భాషగా తెలుగు చదివాను. నేను చాలా తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలూ చదివాను. దేని గొప్పతనం దానిది. కాని నేను చదివిన తెలుగు రచనలు ఈనాటికీ నా మదిలో ఉన్న నేస్తాలు. ఇంగ్లీషు పుస్తకాలు ప్రయాణంలో కలిసి విడిపోయిన పరిచయాలు.
కె.మహేష్ కుమార్ అభిప్రాయం:
July 4, 2008 6:53 am
చాలా వివేకం ఉన్న వ్యాసం. ఆచరించదగ్గ సూచనలు.
మీరు చెప్పిన సూచనలలో మొదటి మూడూ, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలైన జవహర్ నవోదయా విద్యాలయాల్లో అమలవుతున్నాయి. 80% తెలుగు మాధ్యమం విధ్యార్థులు 6 వ తరగతిలో ప్రవేశిస్తే, 9 వతరగతికి వారు ఆంగ్ల మాధ్యమంలో చదివేలా తయారు చెయ్యడం జరుగుతుంది.ఈ సమయంలో వీరు హిందీ కూడా నేర్చుకుంటారు. 9 నుంచీ 12 వ తరగతి వరకు తెలుగు ఒక విషయంగా కొనసాగుతుంది. ఇవి చాలా మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి కూడా.
కానీ ఇలాంటి పాఠాల్ని నేర్చుకోవడానికి మన ప్రభుత్వం తయారుగా ఉందంటారా? ఇప్పటి వీరి నిర్ణయానికి ఆర్థిక కారణమే (ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులొస్తాయి) తప్ప సైద్ధాంతిక ఆలోచన ఉందంటారా? ఒక వేళ ఉన్నా, ప్రస్తుతం ఉన్న విద్యా విధానం, స్కూళ్ళ పరిస్తితీ, ఉపాధ్యాయుల స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే అసంభవమేమో అనిపిస్తుంది.
ఈ విషయం పై నా స్వీయానిభవాన్ని నా బ్లాగులో పొందుపరిచాను.
Kameswara Rao అభిప్రాయం:
July 8, 2008 7:15 am
ఈ వ్యాసం ఇచ్చిన ప్రేరణతో, తెలుగుభాష పరిరక్షణ గురించి ఒక బ్లాగు మొదలుపెట్టాలన్న ఆలోచన వచ్చింది. ప్రభుత్వం ఏది చెయ్యాలన్నా, ముందు ప్రజలలో దానిగురించి కదలిక రావాలని నా విశ్వాసం. ఈ సమస్య ప్రధానంగా చదువుకొని పట్టణాలలో జీవిస్తున్నవారిది కాబట్టి, దీని ప్రచారానికి ఇంటర్నెట్టు ఒక మంచి మాధ్యమం అనే నమ్మకంతో, తెలుగుభాష పరిరక్షణగురించిన ఆలోచనలకీ విస్తృత ప్రచారానికీ ఒక వేదికగా ఉంటుందనే ఆలోచనతో, “తెలుగువీర లేవరా” (http://teluguviralevara.blogspot.com) అనే బ్లాగుకి అంకురార్పణ చేసాను. ఆసక్తి ఉన్నవారందరూ తలా ఓ చెయ్యీవేస్తే, దీన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు.
ఈ వ్యాసం చదివాక ఆలోచిస్తే కొన్ని సందేహాలు కలిగాయి. ఇది నా అవగాహనా లోపమే కావొచ్చు కానీ, నివృత్తిచేసుకోవాలనే తహతహతో ఇక్కడ పెడుతున్నాను:
pedaraydu అభిప్రాయం:
July 16, 2008 3:54 am
పందెం కాస్తున్నానండి, నేను తెలుగులోనే పది వరకు చదివాను, విషయ పరిఙ్ఞానంలో, గ్రాహ్యతలో, బుద్ది కుశలతలో నేను ఏ ఆంగ్ల మాధ్యమ విధ్యార్థికన్నా తీసిపోను. తెలుగుని అభివృద్ది చేయడం మన కర్తవ్యం. కాని ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే మన భాషా సంస్కృతులు నశించటానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు.
baabjeelu అభిప్రాయం:
July 16, 2008 8:27 am
నేను ఇంటర్మీడియెట్ వరకూ తెలుగులోనే చదువుకున్నాను.
ఋణవిద్యుదాత్మకత నాకు తెలుసు. ఆవర్తన పట్టిక తెలుసు.
తెలుగు కీ దీనికీ సంబంధంలేదు. ఇంగ్లీషుకీ దీనికీ సంబంధం లేదు
దుబాసీలని ఒకప్పుడు వుండీవారు.మొఘల్ దుబాసీలు వేరు. ఇంగ్లీషు దుబాసీలు వేరు. ప్రస్తుతం రాజ్యమేలుతున్న వాళ్ళ కీ ఏలబడుతున్న ప్రజల భాషకీ మధ్యన ఈ దుబాసీ ల ప్రాబల్యం.
సంస్కృతాన్ని కానీ, పాలీ ని కానీ, ప్రాకృతాన్ని గానీ ఇప్పుడు ఎవరూ ఎందుకు బతికించుకో లేక పోయేరు.
అధికారంలో ఉన్న వారు దేన్ని సమర్ధిస్తే చచ్చినట్టు ప్రజ భరిస్తారు.
అధికారం మారిపోతే అన్నీ మారిపోతాయి. అయితే ఈ కాలం లో కూడా సామాన్య ప్రజానీకం లక్షణం గా సామాన్య విషయాల్ని జాగ్రత్త పరచుకుంటారు.
నిజాం కాలం లో కూడా తెలంగాణా లో తెలుగు వుంది కదా?యాస వేరయి వుండొచ్చు.
భాషని రక్షించు కోడం మామూలు ప్రజ పని. మామూలు ప్రజ వల్లే భాషయినా స్సంస్కృతయినా నిలబడుతుంది.
ప్రభుత్వాధికారులది కాదు. వాళ్ళు వాళ్ళపొట్ట పోషించుకోడానికి ఏ వయినా చేస్తారు.
జగన్నాధ పండిత రాయలు ఏం చేసేడండీ?
baabjeelu అభిప్రాయం:
July 16, 2008 8:59 am
భద్రిరాజు గారితో గొడవ పడలేం కానీ, ఒక్కటి మాత్రం నిజం. “స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్” గొడవ తేల్చండి?
ఇంగ్లీషు వస్తే బతుకు ఇంకా బాగుంటుంది. అందరూ ఇంగ్లీషు నేర్చుకుంటారు. రేపు “అరబ్బీ” వస్తే బాగుటుంది అంటే అందరూ “అరబ్బీ” నేర్చుకుంటారు. నేర్పే వాళ్ళు తయారుగా వుంటారు.
భాష, కమ్యూనికేషన్ అవసరం తీర్చడానికే.
భాష గురించి ఇంత చర్చ దండగ, ఎందుకంటే రేపు యుస్ ఆఫ్ ఏ కన్నా చైనా వెళ్ళడం ఎక్కువ లాభదాయకం అనిపిస్తే అప్పుడు అందరం చైనీస్ నేర్చుకుని చైనా వెల్తాం. ఇంగ్లీషుని పట్టుకుని వేళ్ళాడం. అప్పుడు “అమీర్ పేట” నిండా ఇక్కడ “చైనీస్” నేర్పబడును అని బోర్డులు వెలుస్తాయి. గవర్నమెంటు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా.
తెలివితేటలకీ, భాషకీ సంబంధం లేదు.
తెలివైనవాడికి చక్కని “కమ్యూనికేషన్ ఎబిలిటీ” వుంటే బంగారానికి సువాసన అబ్బినట్టే. “కమ్యూనికేషన్ ఎబిలిటీ” అవతలి మనిషి భాష మీద “డిపెండయి” వుంటుంది.
రాజు గారి అస్థానం లో ఉద్యోగం సంపాయించడానికి, ఒకప్పుడు సంస్కృతం, తరవాత ఉర్దూ, తరవాత ఇంగ్లీషు తరవాత ఇంకోటీ అవుతాయి.
ఈ కాల మంతా మామూలు ప్రజలు, మామూలుగానే ఇంట్లో వాళ్ళ మాతృభాష నే వాడతారు. మరీ ఎక్కడొ ప్రవాసాంధ్రులయితే తప్ప. ప్రవాసాంధ్రుల శాతం తక్కువ.
భాషనీ, సంస్కృతి నీ ప్రత్యేకించి ఎవరూ కపాడక్కర్లేదు.
భద్రిరాజు గారి వంటి వారు, మన భాషకి గౌరవం, మర్యాదా, మన్ననా దొరకాలని బాధపడతారు. అంతే.
baabjeelu అభిప్రాయం:
July 16, 2008 9:17 am
“యూనివెర్సిటీ ల్లో..” ఏవో దొరకొచ్చు అని భద్రిరాజు గారు రాసేరు. యూనివెర్సిటీ లే ఈ మాయకి కారణం.
యూనివెర్సిటీ లు భాషకి చేసిన సాయం కన్నా బయటి సాహితీవేత్తలు చాలా ఎక్కువచేసేరు. యూనివెర్సిటీ వాళ్ళు భుక్తికి ఉద్యోగాలు చేసుకుంటారు తప్ప ఇంకేవీ చేయరు. ప్రభుత్వాధికారులు కదా?
యూనివెర్సిటీ వాళ్ళ పుస్తకాలు ఘోరం. వాళ్ళు “టెన్స్ టైమ్స్” లో ఏ టైమ్ లోనూ ఇమడరు. యూనివెర్సిటీ వాళ్ళు భాషా వికాసానికి చేసిన క్రుషి పూజ్యం. “టెన్స్ టైమ్ ” అంటే వేగుంట మోహన్ ప్రసాదు గార్ని అడగండి. సరిగ్గా చెబుతాడాయన.
ప్రస్తుతం “యూనివెర్సిటీలు” “రిడండెంటు”.
అందుకే ఇన్ని పనికిమాలిన ఇంజినీరింగ్ కాలేజీలు వెలిసేయి.
ఏ పనికిమాలిన ఇంజినీరింగ్ కాలేజీ లో నయినా పిల్లల్ని జాయిన్ చెయ్యడానికి తల్లితండ్రులు తయ్యారు కానీ “యూనివెర్సిటీ” లో జాయిన్ చెయ్యడానికి ఎవరూ తయారుగా లేరు.
యూనివెర్సిటీల వల్ల ఒకప్పుడు ఎమ్ ఎస్సీ లు, పి హెచ్ డీ లూ తయరయీవారు.
అదికూడా భాషలో కాదు. సైన్సుల్లో. యూనివెర్సిటీల్లో పిహెచ్ డీ చేసి భాషనుధ్ధరించిన మహనుభావుల్ని లెక్కపెట్టండి?
పాపం ప్రస్తుతం సైన్సుని కూడా ఉధ్ధరించడంలేదు ఈ “యూనివెర్సిటీలు”
“అస్తు”
rama అభిప్రాయం:
July 20, 2008 7:16 am
అయ్య బాబ్జీలు గారు,
మీ అభిప్రాయములు బాగున్నాయి. వున్న మాటలు అవి. భద్రిరాజు గారు ఒప్పినా మానినా సత్యం సత్యమే కాదా?!
మీరు సైన్సు ల్లొ పరిశోధన గురించి బాధ పడ్డారు. తెలుగులో ఇవ్వాళ ఏం పరిశోధన జరుగుతోంది?? అక్కడికి వున్న వాళ్ళు ఎవరూ జాయిన్ కావటం లేదు. ఒక కారణం వుద్యోగాలు లేవు. అక్కడ చేరి చేయగలపని ఏమీ లేదన్న స్థితి ని ఆ డిపార్టుమెంటులు రుజువు చెసేసేయి.
తెలుగు కి విద్య ప్రమాణాలలో ఎటువంటి స్థాయి వుందో అక్కడ వున్న పాఠ్య పుస్తకాలని గమనించి చూస్తే ఇట్టే తెలుస్తుంది ఎవరికైనా. ఇందుకు అక్కడ వున్న ఆచార్యుల పూచీ లేదా? వారు ఇవ్వాళ్టి ఈ స్థితి కి కారణం కాదా?
తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు ఈ నిరాసక్తత వెనక ఎందరో మహానుభావులు మరి.
బహుశా వచ్చేనాళ్ళలో, వీరు సంస్కృతంలో, వీరు గ్రీకు, లాటిన్ భాషలలో పండితులు అని చెప్పుకున్నట్టే వీరు తెలుగులో పండితులండీ అని పరిచయం చేసే రోజులు ఆట్టే దూరం లో లేవనుకుంటాను.
డబ్బులు ఎక్కడ వుంటే బతికే అవకాశాలు ఎందులో వుంటే తల్లితండ్రులు వాటి వైపు తమ పిల్లల్ని పంపించాలని అనుకోవటం సహజం. దాన్ని తప్పు పట్టలేం.
అయితే అంత మాత్రాన నిజంగా భాషకి ముప్పు రాదు. తెలుగు లో రుచి పోవడానికి లేదా చదువుకున్న వాళ్ళకి చక్కటి తెలుగు పలుకుబడి రాకపోవడానికి పిల్లల అమ్మానాన్నలకి తెలుగు రాకపోవడం అసలు కారణం. ముందు వీళ్ళకి చక్కటి భాష వస్తే కదా వాళ్ళ సంతానానికి రావడానికి. నేను ఇట్లా అంటున్నానని ఎవరికైన కోపం రావచ్చుగాక, కానీ వాస్తవం చాలా చోట్ల ఇదే. ఇంట్లో తెలుగుని మాట్లాడే కుటుంబాలలో లేదా ప్రొత్సహించే కుటుంబాలలో భాష బాగానే వుంటోంది. పిల్లలకి అమ్మనాన్నలు ముందు మార్గదర్శకం కావాలి కదా? వాళ్ళే మొదట తెలుగు వదిలేస్తుంటే పిల్లలు ఎవర్ని చూసి తెలుగుని నిలుపుకొవలిటా?
అందుకని కర్ణుడి చావుకి అనేక కారణాలన్నట్టు అందరు ఇంతో అంతో బాధ్యులే!!
రామ
Kondalarao Palaka అభిప్రాయం:
August 15, 2008 12:39 pm
This is obviously a complex topic covering a lot of areas – Indian education system, economic factors favoring English, children’s ability to learn in a non-mother tongue etc. In my opinion, Dr. Bhadriraju’s essay is light on analysis and jumps to familiar conclusions. There are many points on which I disagree with his conclusions but I’ll focus on one of the important theses of his essay: When taught in a non-mother tongue, children do not learn well. (I’m aware that this is not a new thesis but here it is presented as being corroborated by a recent study. To that extent, this thesis can be revisited.)
This essay extrapolates – without sufficient support — the findings of “Student Learning in the Metros 2006” (SLM2006) research (reported by India Today). I say this because the SLM2008 report mainly bemoans the rote learning done by children in India. The choice of students studying in english medium schools in Indian metros for this study is one of convenience. They (researchers) had a test (written in English) for which they have results from 43 countries readily available. And, they find that the Indian students have scored a lot lower compared to their international counterparts. (I have qualms about the significance about these results but won’t venture there.) Dr Bhadriraju’s essay draws the unsupported conclusion that the poor performance is due to the students’ English medium education. Such a conclusion could have been warranted if a parallel study that involved children studying in their mother tongues had shown that Indian children learning in their mother tongues scored better than their English-medium counterparts on similar questions.
The other disagreement I have with the essay is that there is nothing sacred about mother tongue when it comes to being the preferred medium of learning. In my opinion, the key requirement for effective learning is that the medium / language be something the child should be able to fluent in / think in. The immigrant communities in the US and elsewhere are testament to the fact that children are quite capable of acquiring fluency in multiple languages. In other words, the fact that English is not the language spoken at a child’s home should not be a hindrance to schools equipping the child with sufficient fluency in English – especially if the child is studying in English medium schools from the beginning. In fact, at pre-schools in the USA, I have been told to continue to speak to my child in my language while they (the schools) take care of the English part. (And, unfortunately, for me, they do a much better job of teaching English to my daughter than I can of teaching Telugu to her; And, it’s been a losing battle for me.)
Also, note that the SLM2008 report blames rote learning. One could argue that poor language skills lead to rote learning. But, that’s an argument for better English language instruction at schools rather than an argument for sticking to instruction in mother tongue. Economic and historical reasons that have given English its current prominence can not be wished away. I feel a more pragmatic approach to the problem is to leverage the fact that children can be good at multiple languages. The reason children are weak in their mother tongue is not because of the society’s emphasis on English. Their mother tongue is weak, mostly, for the same reason their English is weak: the quality of teaching. (I refuse to believe that all the atrocious articles in telugu newspapers are written by reporters educated in English medium schoools.) I believe that once language education improves and people are convinced that it doesn’t take a lifetime of learning to achieve proficiency, there’ll be less of a rush to start English as a medium of instruction from kindergarten.
In my view, the problem can be tracked down to how we teach languages in India. IMO, the reason for this failure is ridiculously obvious: you can’t teach what you don’t know! The reason for our extremely poor language skills relative to the number of school years Indian children spend learning languages is that children are taught by teachers who themselves don’t have any fluency in the language. Put differently, the teachers are not native speakers of the languages being taught. My own example: I studied Hindi for 5 years: 6th grade till 10th. If I remember right, we used to have Hindi classes everyday. Assuming 150 school days per year, that works out to 750 hours of instruction time. On top of that I received training for and passed with good grades all the way upto raashTra bhaasha exam. So, 750+ hours of instruction for a single language is pretty intensive indeed. But, as I recognized very quickly, all that time I spent learning Hindi in school didn’t prepare me for a basic conversation in Hindi with a native speaker. And, I can’t understand 50% of the dialogue in a typical hindi movie. I bet that if the same 750 hours were taught by a native Hindi speaker, I would have a lot better fluency in the language. Same holds for English. At least, for English teaching we may have economic reasons. But, for not having Hindi taught by native speakers? No excuses!!
As a side note, Shashi Taroor, a writer/thinker I admire, has baffled me with his recent article “Celebrating India’s linguistic diversity”. He seems to take pride in the fact that we are a nation of a billion+ that speaks to each other in English when we meet anywhere outside our state borders. Linguistic diversity is great to have after we have achieved a common language first. And, studying multiple languages in school is good if it actually gives us the ability to function using those languages.
As I was finishing up this comment, I read earlier comments made by Kameswara Rao which seemed to echo my own sentiments.
thanks
Kondala Rao
Rao Vemuri అభిప్రాయం:
August 15, 2008 1:08 pm
పువ్వుల దండలో దారం దాగున్నట్ల నేను చెప్పబోయేది అంతర్లీనంగా కృష్ణమూర్తి గారిచ్చిన సలహాలలో ఉంది కాని, మరి కొంచెం విపులంగా చెబుతున్నాను, అంతే.
7. ప్రతి విద్యార్ధీ పాఠశాలలో మాతృభాషతో పాటు మరొక్క భాష నేర్చుకుంటే చాలు. ఆ రెండవ భాష ఎవరెవరి అవసరాలకి అనుకూలంగా వారు ఎన్నుకో వచ్చు. ఈ రెండవ భాష సర్వసాధారణంగా ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషలలో ఏదో ఒకటి అవటానికి సావకాశాలు ఎక్కువ.
మూడు భాషలు నేర్చుకోవాలనే నిబంధన అనవసరం.