ఈమాట » ప్రజాస్వామ్యం - పత్రికాస్వాతంత్ర్యం

Expand to right
Expand to left

ప్రజాస్వామ్యం - పత్రికాస్వాతంత్ర్యం

ప్రజాస్వామ్యం సురక్షితంగా, నిరవధికంగా నాలుగు కాలాలపాటు నడవటానికి పత్రికాస్వాతంత్ర్యం పట్టుకొమ్మ. అది సాధారణంగా నాగరీకులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొనే విషయం. స్వాతంత్ర్యం ఎప్పుడూ బాధ్యతాయుతమైన స్వాతంత్ర్యం అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏ పాత్రికేయుడన్నా అబద్ధాలు రాసి, తిరగరాసి, బాధ్యతారహితంగా ప్రవర్తించి రాజ్యాగం తనకు ప్రసాదించిన ఈ స్వాతంత్ర్యాన్నితన అవమానకరమైన రచనలద్వారా దుర్వినియోగం చేస్తున్నాడని అనుమానం వస్తే, అటువంటి దుష్ప్రవర్తనని ఆపడానికి ప్రజాస్వామ్య రాజ్యాలలో చట్టాలున్నాయి; న్యాయస్థానాలున్నాయి. ఆ చట్టాలని అమలుపరచడం ప్రభుత్వం బాధ్యత.

వచ్చిన చిక్కల్లా ఇక్కడే!

పత్రికా స్వాతంత్ర్యానికి సంబంధించిన చట్టాలని అమలుపరచవలసిన ప్రభుత్వమే ఆ చట్టాలని ఉల్లంఘిస్తే, ప్రజాస్వామ్య రాజ్యాలకి, నిరంకుశ నియంతృత్వాలకీ తేడా లేదు. ప్రభుత్వం హద్దుమీరి ప్రవర్తించినపుడు, ఆ విషయం బట్టబయలు చేయడానికి పత్రికలే ప్రజలకున్న ఆధారం. అందుచేత, నిజాయితీఉన్న పత్రికా రచయితలు అటువంటి ఆకతాయి ప్రభుత్వాన్ని అదుపులో పెట్టడానికి ప్రజాస్వామ్య వ్యవస్థని నూరుకళ్ళతో కాపాడటానికి వెనుదీయకూడదు. వ్యక్తులకన్నా వ్యవస్థలు ముఖ్యం.

గత శతాబ్దంలో, యాభయ్యో దశాబ్దంలో, ఆంధ్రదేశంలో మూక ఉమ్మడిగా కమ్యూనిస్టులని ప్రభుత్వాధికారులు జైళ్ళలో పడేశారు. చెప్పాచెయ్యకండా జైలులో పెట్టడానికి ఆ రోజుల్లో పెద్దకారణాలు అక్కరలేదు కాబోలు. అప్పట్లో జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆనాటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు గారికి ఒక ఉత్తరం రాశారు. క్లుప్తంగా ఆ ఉత్తరం సారాంశం ఇది. — జైలులోకి విడుదలచేయబడ్డ ఆంధ్రప్రభ దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సారు చెయ్యబడి వస్తున్నదేమిటీ అని — నార్లవెంకటేశ్వర రావు గారికి, తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికని ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయఖైదీలకు అందించడం సుతరామూ ఇష్టం లేదు. అందుకు నిరసనగా వెంకటేశ్వర రావుగారు, ఒక రోజు పత్రిక మొదటిపేజీ నిండా న ల్లగా తారుపూసి విడుదలచేసారు. అది పత్రికాప్రపంచంలో చాలా ఘాటైన నిరసన. దానితో, ప్రభుత్వం సెన్సారు చెయ్యడం మానుకున్నది. అది అప్పుడు!

పత్రికా రచయితలందరూ మడికట్టుకున్న మహానుభావులని, నిస్స్వార్థపరులనీ, దుడుకుగా, రుజువులు లేకుండా ఎప్పుడూ రాయరనీ అనుకోవడం వ్యామోహమే! పత్రికలన్నీ వర్గరాజకీయాలకి (ఆంధ్రదేశంలో అయితే కులమత రాజకీయాలకి కూడా!) అతీతం అని అమాయకుడు కూడా నమ్మడు. అక్కడేకాదు; ఇక్కడైనా, మరెక్కడైనా సరే! ఒక్క నియంతృత్వ రాజ్యాలలోనే పత్రికలు ఒకే రాజకీయ వర్గాన్ని సమర్థిస్తూ రాయాలి. అట్లా రాయకపోతే పత్రికారచయితల గతి ఏమవుతుందో వేరే చెప్పనక్కరలేదు. చరిత్ర నేర్పిన, ఇంకా నేర్పుతూవున్న పాఠాలు చాలు.

పోతే, ఉదాహరణకి ఒక పత్రికారచయిత రాసింది కేవలం - అభాండం - అని అనుకుందాము. ఒక వ్యక్తిపై ఆధారరహితమైన వ్యాఖ్య అనే అనుకుందాం. కక్షతో రాసిన రాత, దారుణమైన రాత అనే అభిప్రాయం సబబేననుకుందాం. ఆ రచయితరాసింది -యెల్లో జర్నలిజం - అనే అనుకుందాం. అటువంటి దుస్థితి వచ్చినప్పుడు, ముందుగా ఆ పత్రికాధికారులు తగు చర్యతీసుకోవాలి. చట్టబద్ధంగా ఆ రచయితపై, ఆ పత్రికపై అభియోగాలు తెచ్చి న్యాయబద్ధమయిన చర్య తీసుకోవడం ప్రజాస్వామ్య దేశాలలో అసాధ్యం కాదు.

అంతేకాని, అల్లరిమూకలు ఆ పత్రికా కార్యాలయం మీద దాడిచేసి, కిటికీ అద్దాలు పగలగొట్టి, ఫైళ్ళు తగలబెట్టి, అలాంటి రాతలు మానకపోతే మళ్ళీ ఇలాగే దాడులు చేస్తామని బెదిరించడమూ, ఆ విషయాన్ని ప్రభుత్వాధికార్లు చూసీచూడనట్టు ఊరుకోవడమూ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అలాగే, ఆ రచయిత రాసింది అభాండం అని దెప్పుతూ రుజువులు లేకుండా మరో పాత్రికేయుడు మరో అభాండం గిలికించడం కూడా పత్రికాస్వాతంత్ర్యానికి ముప్పేకాని మరొకటి కాదు.

ఆఖరిగా, పత్రికా స్వాతంత్ర్యం మేరకు ప్రభుత్వాధికారుల చర్యలు అతి రహస్యంగా గూడుపుఠాణీగా జరిగితే దానిని పోలీసు జులుం అనడం అతిశయోక్తి కాదు. రక్షణ ఇవ్వవలసినవాడే గుట్టుగా భక్షిస్తే ఇంక దిక్కేదీ?

లాటిన్‌ లో ఒక సామెత : timeo Danaos et dona ferentes (L) — I fear the Greeks even when they bring gifts — అని అర్థం!

 

(6 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Rohiniprasad అభిప్రాయం:

    July 2, 2008 2:44 am

    సమకాలీన సంఘటనల్లో పత్రికల మీద గూండాయిజం అని చోట్లా మామూలయింది. ముంబయిలో లోక్ సత్తా మీద ఇటీవలే దాడి చేశారులోఈ మధ్య ఆంధ్రజ్యోతి…పూర్వం విరసం రచయితల మీద అమలు జరిపిన దమనకాండ అందరికీ తెలిసినదే పత్రికలకు కూడా ఈ విషయంలో ‘తనదాకా వస్తే…’ అన్న పద్ధతిలో సెలెక్టివ్ మెమరీ ఉన్నట్టుగా అనిపిస్తోంది.

  2. Srinivas Nagulapalli అభిప్రాయం:

    July 2, 2008 11:24 am

    నిజమే. సభ్య సమాజంలో హింసకు, దాడులకు చోటు లేదు. కాదని హింసకు, దాడులకు చోటిస్తే సభ్య సమాజం ఉనికికే చేటు. హింస జరిపిన వారికన్నా వారిని ఉపేక్షించే చట్టాలు, న్యాయ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం వల్లనే ఎక్కువ హాని. దాడి చేసిన వాళ్ళ దౌష్ట్యం ఆ దాడికే పరిమితం. ఉపేక్షించి నిరోధించని వ్యవస్థ, మరిన్ని దాడులకు అవకాశం ఇస్తుంది. దాడులను మించిన క్రియాశీలతతో, న్యాయ వ్యవస్థ, పాలనా యంత్రాంగాలను దిద్దుకోనంతవరకు పత్రికా స్వేచ్చకే కాదు, పౌరుల స్వేచ్చకూ ఇటువంటి పోట్లు, తిప్పలు తప్పవేమో.
    విధేయుడు
    -Srinivas

  3. కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    July 2, 2008 9:20 pm

    ‘పత్రికా స్వాతంత్ర్యం’ అనే ఉసుగులో కొన్ని ప్రముఖ వార్తా పత్రికలు తమ రాజకీయ, ఆర్థిక పబ్బాలు గడుపుకోవడం మొదలైనప్పుటి నుంచీ, మన రాష్ట్రంలో వాటి credibility ప్రశ్నార్థకంగా మారింది. ఇక ‘సాక్షి’ లాంటి బ్రాండెడ్ రాజకీయ పత్రికలు రావడం ఈ స్థితికి చరమాకంగా మారింది. పత్రిక యాజమాన్యాలు తమ బలిమికి ఉపయోగకరంగా పత్రికల్ని ఉపయోగించుకుని, పత్రికా స్వాతంత్ర్యం అనే ముసుగు తగిలించుకుని ఇష్టారాజ్యం చెయ్యాలంటే ఎలా?

    ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన సంపాదకులు కావాలి. కానీ ఉద్యోగం చేసే సంపాదకులేగానీ, ఉద్యమంగా పత్రికల్ని నడిపే సంపాదకులు ఇప్పుడు లేరుగా! అందుకే, యాజమాన్యాలు చెప్పిందే వేదం, రాయమన్నదే వార్త. మరి పత్రికా స్వాతంత్ర్యం గురించి ఒకే మూసలో మనం మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నామా?

  4. Srinivas Nagulapalli అభిప్రాయం:

    July 3, 2008 6:35 am

    ఉద్యోగం చేసే సంపాదకులుంటే చాలు, ఉద్యమాలు చేయాల్సిన వారి అవసరం ఏమీ లేకుండానే అమెరికాలో ప్రత్రికా స్వేచ్చ ఉంది. ఒకరకంగా చూస్తే system సరిగ్గా లేకపోవడానికి మరియు దాన్ని దిద్దుకోవడానికి, ఉద్యమాలు ఎత్తిచూపే ఆనవాలుగాను, అనివార్యమైన అవసరాలుగానూ కనిపిస్తాయి.

    ఈ జరిగిన ఉదంతమే తీసుకుందాం. న్యాయవ్యవస్థ గంపెడు బరువు మోస్తున్న ఎడ్లబండిలాగా గాక, ప్రతిష్టాత్మకమైన స్ఫూర్తితో, సత్వరంగా న్యాయాన్యాయాలను అరెస్టుల వార్త వెలువడిననాడే (suo moto అయినా కాకపోయినా) లేదా మరునాడో తేల్చి, తప్పుగా చట్టాన్ని దురుపయోగం చేసిన పోలీసు యంత్రాంగాన్ని నియంత్రించి, వారికి కఠిన శిక్ష, జరిమానతో ముకుతాడువేసివుంటే ఇంకొకసారి ఇటువంటివి అంత సులభంగా జరిగే అవకాశమేలేదు. ప్రజలు, పత్రికలు గగ్గోలు పెట్టకముందే ఇట్లాంటివే, కళ్ళు లేకున్నా, వొళ్ళంతా కళ్ళు చేసుకొని చూసే బాధ్యత న్యాయవ్యవస్థలో పూర్తిగా లోపించకపోయినా, బాగా నీరసించినందువల్లే ఇది ఇంతగా ముదిరింది, కుళ్ళింది.

    సరే, న్యాయవ్యవస్థ తమకు సరిగ్గా వనరులు లేవని, వారి వృత్తిని కొనసాగించడానికి కావాల్సిన అంగబలం అర్థబలం ప్రభుత్వం ఇవ్వడంలేదని, ఎంతో ఇరుకున పెడుతుందని వాళ్ళ గోల వాళ్ళకూ ఉంది. మొత్తానికి మన దేశంలో ప్రజాస్వ్యామ్యం ఇంకా experiment దశలోనే ఉంది. దిద్దుకోవల్సింది కొండంత అని ఇటువంటి సమస్యలు తమ అద్దంలో చూపే దృశ్యం లాగా అనిపిస్తుంది, కనిపిస్తుంది.

    విధేయుడు
    - Srinivas

  5. Krishna అభిప్రాయం:

    July 26, 2008 12:15 pm

    మీ సంపాదకీయం రెండుసార్లు చదివాను. పొగడతాండా, తిడతాండా అన్నట్లు ఉంది. ఎవరు ఏమి చేసినా గూండాగిరీ, దౌర్జన్యం సమర్ధనీయాలు కావు. పత్రిక yellow journalism చేస్తే దానిని ఎదుర్కొనడానికి ప్రజాస్వామిక మార్గాలు ఉన్నాయి - న్యాయవ్యవస్థ, అదే పత్రికలో rebuttal మొదలైనవి. ఇక్కడ జరిగినది పత్రికాస్వేఛ్చ పైన మాత్రమే దాడి కాదు. ప్రాథమిక హక్కు అయిన వాక్స్వాతంత్ర్యము మీదనే దాడి.

  6. T.Raja gopal అభిప్రాయం:

    August 7, 2008 10:13 am

    Dear Editor,

    I concur with sri K.Mahesh kumar’s openion.

    Yes, there are some news papers, even T.V.channels which are biased and serve the needs of certain section only. The true,courageous journlists are becoming rare commodity.

    Raja gopal

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a