విలువలు

“చందూ, నువ్వు చెప్పింది బావుంది. వాళ్ళ అమ్మా నాన్నల్ని అడిగి చూడు. ఎందుకో ఈ ప్రపోజల్ కి ఒప్పుకుంటా రనుకోను”

“ట్రై చేద్దాం, వస్తానంటే ఇక్కడే అంత్యక్రియలు చేద్దాం”

అప్పుడే జయ చేతిలో ప్రింటవుట్లతో వచ్చింది. ఇది చూడన్నట్లు ఆ కాగితాలు నా ముందర పడేసింది. ఏమిటా? అని చూసి చదివి ఆశ్చర్య పోయాను.

“అమెరికాలో తెలుగు వ్యక్తి ఆత్మ హత్య” అన్న హెడ్డింగ్ క్రింద ఓ కథనం రాసుంది. రోదిస్తున్న రవి తల్లి తండ్రుల ఫొటోలు వేసారు. అంతా తప్పుడు కథనాలు. వాళ్ళు రాసింది నిజం కాదన్నట్లు తలూపాను. జయ కళ్ళలో కన్నీళ్ళు జల జలా రాలుతున్నాయి. ఇదంతా అబద్ధం అని గట్టిగా అరవాలనిపించింది. ఏ గుండెనీ ఈ నిజం తాకదని తెలిసీ, అరిచి ఏం ప్రయోజనం? మా ప్రయత్నాలు ఫలించ లేదు. రవి తల్లి తండ్రులు రాలేదు. చివరకి రవి శవాన్ని మా ఖర్చులతోనే ఇండియా పంపించాము. దీన్నుంచి తేరుకోవడానికి మాకు ఓ నాలుగు వారాలు పట్టింది.


ఇంకో నాలుగు వారాల్లో మళ్ళీ రిలీజు ఉంది. స్కాట్ వెకేషన్ నుండి తిరిగొచ్చాడు. రవి గురించి రాజు చెప్పాడని నాతో అంటూ బాధ పడ్డాడు. విషయమంతా తెలిసి, విల విల్లాడేడు. వెళుతూ ఈ వీక్ ఎండ్ ఆదివారం తనింట్లో పార్టీ ఉంది రమ్మన మని నన్నూ, రాజునీ పిలిచాడు. ‘రవి ఉంటే అందరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా?’ అనిపించింది. కుదరదన్నట్లుగా చెప్పినా, రావల్సిందేనని స్కాట్ పట్టు పట్టాడు. సరేనని ఆ సాయంత్రం నేనూ, జయా, రాజు బయల్దేరాం. స్కాట్ ఇల్లు గిల్రాయ్ లో ఉంది. అడ్రసు పట్టుకొని వెళితే మా కారు ఓ కొండ మీద పెద్ద భవంతి ముందు ఆగింది. అందరం ఒక్కసారి ఆశ్చర్య పోయాం. మమ్మల్ని చూసి సెక్యూరిటీ అతను గేట్ తీసాడు. లోపలికి వెళ్ళాం. చాలా మంది అమెరికన్లూ వచ్చారు. స్కాట్ మమ్మల్ని సాదరంగా లోపలకి ఆహ్యానించి భార్యనీ పిల్లల్నీ పరిచయం చేసాడు. అతని ఇల్లు చూస్తే మాకు మతి పోయింది. కనీసం ఓ అయిదారు మిలియన్లు ఉంటుందని నేనూ రాజూ అనుకున్నాం. జీవితంలో ఇంత గొప్ప ఇల్లు నేనెప్పుడూ చూడ లేదు. ఎప్పుడూ వర్క్ కి బి యెం డబ్ల్యూ లో వస్తాడని తెలుసు. అమెరికన్లకి కార్ల ముచ్చట కదా అనుకున్నాం కానీ, అతను ఇంత శ్రీమంతుడని మేమెప్పుడూ ఊహించ లేదు. స్కాట్ కూడా మాకెప్పుడూ చెప్ప లేదు. ఇండియన్ ఫుడ్ ఇష్టమంటూ మా లంచ్ బాక్స్ లు షేరు చేసుకునేవాడు కూడా. మా అందరికీ ఆ ఇల్లు చూస్తే నోట మాట రాలేదు.

పార్టీ మొదలు పెట్టే ముందు రవి మరణం గురించి చెప్పీ అందర్నీ రవి ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించమని అక్కడకొచ్చిన అందర్నీ కోరాడు. మాకు కళ్ళ నీళ్ళు తిరిగాయి. రవి తనకి మంచి స్నేహితుడని చెప్పాడు.

పార్టీ అయ్యాక తిరిగి వస్తూ, స్కాట్ ఎంత ధనవంతుడో చర్చించుకున్నాం. ఇంత డబ్బుండీ స్కాట్ ఎందుకు జాబ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. పది మందికి జాబ్ ఇచ్చేటంత ఆస్తి ఉంది. కాలక్షేపం కోసమేమో అని జయ అంది. నాకయితే అలా అనిపించలేదు. స్కాట్ నే అడిగి తెలుసుకోవాలి.


రెండు రోజుల తర్వాత ఓ రోజు స్కాట్ నా ఆఫీసుకొచ్చాడు.

“హాయ్ చందూ! ది సీజ్ ఫర్ యూ ! ” అంటూ ఓ కవర్ నా చేతికిచ్చాడు. తెరిచి చూడ బోతుంటే – “డోంట్ ఓపెన్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ!” అంటూ చెయ్యి పట్టుకున్నాడు.

“వాట్ ఈజ్ దిస్?” ఉండ బట్టలేక అడిగాను. తను వెళ్ళేక ఓపెన్ చెయ్యమని చెబుతూ వర్క్ విషయం మాట్లాడి వెళిపోతుండగా స్కాట్ పార్టీ బావుందని చెబుతూ –

“స్కాట్! నిన్నొక విషయం అడగచ్చా?” ‘అడుగు’ అన్నట్లు తలూపాడు.

“నీ ఇల్లు చూస్తే నువ్వు అత్యంత శ్రీమంతుడవని తెలిసింది మాకు. నువ్వంత రిచ్ అయ్యుండీ ఈ చిన్న జాబ్ నీకు అవసరమా అనిపించింది. నా ప్రశ్నకి జవాబు చెప్పాలనిపిస్తే చెప్పు. చెప్పాలన్న నిబంధనేం లేదు. నా కుతూహలం కొద్దీ అడుగుతున్నానంతే!”

స్కాట్ చిన్నగా నవ్వాడు.

“ఓ అదా! నేను శ్రీమంతుణ్ణే ! నా దృష్టిలో డబ్బు విలువైంది కాదు. కాలం విలువైంది. నా కున్న సమయంలో నేను ఇతరులకి ఎలా సహాయ పడతానా అని ఆలోచిస్తాను. నీకు తెలుసు నేను రోజుకి అయిదు గంటలే పని చేస్తాను. ఆ పని చేయగా వచ్చిన డబ్బుని, ఏ రెడ్ క్రాస్ కో, లేదా సౌత్ ఆఫ్రికాలో బీదవాళ్ళకో ఇస్తాను. నాకు ఇంత డబ్బుంది కదా, అందులోంచే ఇవ్వచ్చు కదా అని నీకనిపించచ్చు. విరాళాలూ ఇస్తాను. కానీ నా కాలాన్ని ఇతరులకోసం వెచ్చించి, నా శ్రమని వాళ్ళ కోసం ఖర్చు చేయడంలో నాకు ఎంతో తృప్తుంది. ఆనందం ఉంది. అందుకే నా ఇరవై నాలుగు గంటల్లో ప్రతీ రోజూ అయిదు గంటలు మాత్రం ప్రపంచానికే కేటాయిస్తాను! మిగతా సమయం నాకోసం. అందుకే రెండవ్వగానే ఎంత పనున్నా వెళిపోతాను. ఇలా నేను ఇరవై ఏళ్ళగా చేస్తున్నాను. ప్రతీ ఏడూ సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ వాలంటరీ వర్క్ చేస్తాను. నెల్లాళ్ళ క్రితం టర్కీలో భూకంపం వచ్చింది, గుర్తుందా? అక్కడ వలంటరీ వర్క్ కోసం రెడ్ క్రాస్ తరపున టర్కీ వెళ్ళాను. అందుకే హఠాత్తుగా శలవులో వెళిపోయాను. ఇదంతా ఎవరికీ తెలీదు. ఇలా అడిగిన వాళ్ళలో నువ్వు రెండో వ్యక్తివి. మొదటి వ్యక్తి నా భార్య. తనూ ఇక్కడే పని చేసేది. పెళ్ళికి ముందు నీ కొచ్చిన సందేహమే తనకీ వచ్చింది. చందూ, నా నమ్మకం ఒక్కటే ! మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మనకోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమూ బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి విలువ. ఇదే నా బిలీఫ్! దాన్ని అమలు చేయడానికే శ్రమ పడతాను…”

నేనేమీ మాట్లాడ లేక పోయే సరికి తన మాటలు కుదించేసాడు స్కాట్. ఇదంతా వింటూ, నా నోట మాట రాలేదు. స్కాట్ కేసి చూస్తూ ఉండి పోయాను. రెండయ్యేసరికి ఎంత పనున్నా వెళిపోతున్నాడని తిట్టుకోవడమూ, విసుగులూ, కోపాలూ గుర్తుకొచ్చాయి. స్కాట్ మీద మేనేజ్ మెంట్ కి ఫిర్యాదు చేద్దామనుకున్నాను కూడా! రవి నన్ను ఆపడం గుర్తుకొచ్చింది. నన్ను చూస్తే, నాకే సిగ్గేసింది. తలదించుకున్నాను.

పనికి సంబంధించిన వివరాలు అడిగి, కొంత సేపటి తరువాత “బై. వుయ్ విల్ టాక్ లేటర్” అంటూ వెళిపోయాడు. ఆ సాయంత్రం ఇంటికి వెళుతూ, కారులో స్కాట్ గురించి రాజు కి చెప్పాను. రాజూ ఆశ్చర్య పోయాడు.

“స్కాట్ నీ కేదో గిఫ్ట్ ఇచ్చానని చెప్పాడు?”

“గిఫ్టా? ఇవ్వలేదే? ఏదో ఎన్వలప్ ఇచ్చాడు.”

“నువ్వు తీసి చూళ్ళేదా? ” రాజు అడిగాడు.

లేదని చెబుతూ వెనకాల ఉన్న బాగ్ లో ఉందని రాజుని ఓపెన్ చెయ్య మని చెప్పాను. రాజు తెరిచి చూసాడు. ఓ ఇరవై వేల డాలర్ల చెక్కు నా పేర రాసుంది.

“అదేమిటి ఈ చెక్కిచ్చాడు?” అంటూ ఆశ్చర్య పోయాను. క్రింద చూస్తే “ఫర్ ది హెల్ప్ యూ డిడ్ ఫర్ రవి” అనుంది.

“అదా! నువ్వు రవి కోసం ఖర్చు పెట్టావని దాని కోసం ఇచ్చాడేమో! ”

“అయ్యుండచ్చు. అయినా నేను రవి పోయినప్పుడు ఖర్చు పెట్టిన సంగతి స్కాట్ కెలా తెలిసింది?” అనుమానంగా రాజు కేసి చూసాను.

“నేనే చెప్పాను. శలవు నుండి వచ్చాక, రవి ఎలా పోయాడని స్కాట్ నన్నడిగాడు. అంతా నేనే చెప్పాను. మనం పడ్డ కష్టమూ, మానసిక సంఘర్షణా, శవాన్ని ఇండియా పంపడానికి పడిన పాట్లన్నీ చెప్పాను. బహుశా అది విని నువ్వు ఖర్చు పెట్టావని తెలిసి ఇచ్చాడేమో! ”

స్కాట్ అంటే గౌరవం పెరిగింది. తన సొంతూళ్ళో, పిల్లికి కూడా బిచ్చం పెట్టని వందల ఎకరాలున్న బంధువులు తెలుసు. తాతలు సంపాదించిందాన్ని, పనీ పాటా లేకుండా ఏబ్రాసిల్లా ఖర్చు పెట్టే వాళ్ళనీ చూసాను. మంచి వాళ్ళని చూశాను కానీ, మరీ ఇంత మంచితనం చూడ్డం జీవితంలో ఇదే మొదటి సారి.

“నాకొద్దు ఈ డబ్బు. దీన్ని నా ఖర్చులకి వాడను.”

“నీకే ఇచ్చాడు కదా? మరి ఏం చేస్తావు ఈ డబ్బు. రవి వాళ్ళ పేరెంట్స్ కి ఇస్తావా?” లేదన్నట్లు తలూపాను.

“మరి?” రాజు రెట్టించాడు.

“ఈ డబ్బుతో రవి పేర ఓ ఫౌండేషన్ మొదలెడతాను. రవిలాగ ప్రాణాంతకమైన కష్టం వచ్చిన ఇండియన్స్ కి ఈ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తాను. స్కాట్ ఇచ్చిన డబ్బే దాని మొదటి పెట్టుబడి. ప్రతీ నెలా నా జీతంలో ఓ వంద డాలర్లు ఈ ఫౌండేషన్ కి జమ చేస్తాను. స్కాట్ లా మన కోసమే కాదు మన పక్క వాళ్ళ కోసమూ కాసింత జీవితాన్ని అందిస్తాను” నేను ఉద్విగ్నంగా చెబుతూంటే రవి గుర్తుకొచ్చి, కన్నీళ్ళు అప్రయత్నంగా వచ్చాయి.

రాజు నా చేతి మీద చెయ్యేసాడు.