ఈమాట » విలువలు

Expand to right
Expand to left

విలువలు

అందరికంటే కాస్త ముందు తేరుకున్నది నేనే. ముందుగా రవి వాళ్ళ తల్లి తండ్రులకి ఫోన్ చేసాను. విషయం చెప్పాను. రవి తల్లి షాక్ వచ్చి పడిపోయింది. తండ్రి భోరున ఏడుస్తున్నాడు. ఆ రోదనలు ఫోన్లో వినడానికే ఎంతో దుర్భరంగా ఉంది. దగ్గరుంటే ఎలా ఉంటుందో పరిస్థితి ఊహించ గలను.

రవి వాళ్ళకి ఒక్కడే కొడుకు. రవికి ఇంకో చెల్లెలుంది. ఆ చెల్లెలి భర్తతో మాట్లాడాను. మళ్ళా రవి తల్లి తండ్రులతో మాట్లాడే ధైర్యం నాకు లేకపోయింది. ఏం జరిగిందో అంతా వివరించాను. రవి శవం ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉందని పోస్ట్ మార్టం చేసాక కానీ మాకు శవాన్ని చూసే అవకాశం లేదని చెప్పాను. ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయమని నా సెల్ నంబరిచ్చాను. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన బాధ. బంధాల బట్టీ బాధలూ మారుతూ ఉంటాయి.

దాదాపు రెండుగంటల సేపు స్థబ్దుగా అయిపోయాం. మాటలు గడ్డ కట్టుకుపోయాయి. మా పరిస్థితే ఇలా ఉంటే రవి తల్లి తండ్రుల పరిస్థితి ఏమిటి? పైకి వస్తాడనుకొన్న ఒక్కగానొక్క కొడుకూ, దేశం కాని దేశంలో, ఇలా పోయాడని తెలిస్తే ఎవరు తట్టుకోగలరు? కొద్ది పాటి పరిచయానికే గుండెల్లో భూకంపం వచ్చినట్లుంటే, పాతికేళ్ళ జ్ఞాపకాలు తల్లి తండ్రులు ఎలా తప్పించుకునేది? జీవితపు వేదికపై రవి పాత్ర అర్థాంతరంగా ముగిసిపోయింది. పాత్ర అంటే గుర్తొచ్చింది. రవి చాలా మంచి నటుడు. నాటకాలంటే విపరీతమైన పిచ్చి. అసలు రవి నాకు పరిచయం అయ్యింది కూడా నాటకాల ద్వారానే!

ఒక సారి మా ఏరియాలో ఉన్న తెలుగు సాంస్కృతిక సంఘం వాళ్ళు నాటకం వేస్తున్నారు కీబోర్డ్ సహకారం కావాలని నన్ను అడిగితే వెళ్ళాను. అక్కడే నాకు రవి పరిచయమయ్యాడు.. రవి ఆ తెలుగు సంఘంలో దాదాపు రెండేళ్ళనుండీ నాటకాలు వేసేవాడని చెప్పాడు. ఆ తెలుగు సంఘానికి అతి చురుకైన కార్య కర్త రవి. ప్రోగ్రాం అయ్యే వరకూ ఎంతో శ్రమించేవాడనీ అందరూ మెచ్చుకునేవారు. మా ఇద్దరికీ స్నేహం కలిసింది ఆ నాటకం ద్వారానే! కొద్ది కాలంలో మాకెంతో దగ్గరయ్యాడు. కొన్నాళ్ళ తరువాత రవికి నే చేసే కంపనీలోనే ఉద్యోగం వచ్చింది. అప్పటినుండీ మా స్నేహం మరింత బలపడింది.

పరిచయ కాలం తక్కువైనా మా మధ్య పెరిగిన అనుబంధం ఎక్కువే ! ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు. జయ ఏడుస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. రవి లేడు అన్న నిజం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది మనసు. ఇహ రవి శవాన్ని చూస్తే తట్టుకోగలదా?


పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రవి శవాన్ని మాకు అప్ప జెప్పారు. ప్రస్తుతం శవాన్ని ఇండియా తీసుకెళ్ళాలి. ఎయిర్ లైన్స్ కాంటాక్ట్ చేస్తే ఎక్కడ చనిపోతే అక్కడ కౌంటీ నుండి డెత్ సర్టిఫికేట్ కావాలన్నారు. అది రావడానికి రెండు రోజులు పడుతుంది. ఈ లోగా శవాన్ని మార్చురీలో ఉంచాలని నిర్ణయించాం. మార్చురీలో రోజుకి 500 డాలర్లు అవుతుందన్నారు. ఎయిర్లైన్స్ చార్జీలు నాలుగు వేల డాలర్లు పైగా ఉంది. ఎంత లేదన్నా అయిదు రోజుల పైనే పడుతుంది. ఇండియన్ కన్సులేట్ ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ ఖర్చు భరిస్తారు అని అన్నారు. కానీ మా ఆశ నిరాశే అయ్యింది. వాళ్ళు త్వరగా శవాన్ని ఇండియా చేర్చడానికి సహాయం చేస్తామన్నారు కానీ, ఆర్థిక సహాయం కుదరదన్నారు. ఎంత లేదన్నా దాదాపు 10 వేళ డాలర్లు అయ్యేట్లా ఉంది. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి.


ఆఫీసులో రిలీజు ఉంది. రవి మరణం వల్లా, నేను ఆఫీసుకు శలవు పెట్టాను. వారం రోజులుగా మానసిక సంఘర్షణ. రవి శవాన్ని ఇండియా పంపడానికి ప్రయత్నం చేస్తున్నాము.
అప్పుడే ఎయిర్ లైన్స్ వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టాను, రాజు, ఇంకా కొంతమంది మిత్రులూ వచ్చారు. వాళ్ళ మొహాల్లో నిరాశ కనిపించింది.

“చందూ - వెళ్ళిన పని కాలేదురా.. ఆ తెలుగు సంఘం వాళ్ళు కుదరదన్నారు…”

“కుదరదన్నారా? రవి గురించి చెప్పారా? వాళ్ళ పేరెంట్స్ ఆర్థిక పరిస్థితీ చెప్పారా?”

“చెప్పాం. కానీ ఆ తెలుగు సంఘం వాళ్ళ దగ్గర అంతగా నిధులు లేవట. మొన్ననే సునామీ వస్తే సహాయ నిధికి విరాళాలు అడిగాం, మళ్ళా ఎవర్ని అడిగేది అన్నారు.” రాజు మాటల్లో చికాకు కనిపించింది.

“అది కాదురా! వాళ్ళని కనీసం రెండు వేలయినా ఇమ్మనమని చెప్పారా? అయినా రవి ఆ సంఘం లో కార్యకర్త కదురా? ప్రతీ ప్రోగ్రాం కి చచ్చేంత చాకిరీ చేసాడు?”

“అవన్ని ఎవరిక్కావాలి? వాళ్ళు ప్రస్తుతం లాసుల్లో ఉన్నారని ఇవ్వడం కుదరదని చెప్పారు. రవి పోతే కనీసం చూడ్డానిక్కూడా ఒక్కడూ రాలేదు” రాజు గట్టిగానే అన్నాడు.

“అదేమిట్రా? ఇప్పటికే దాదాపు ఆరు వేల డాలర్లు అయ్యాయి. మార్చురీ ఖర్చులూ, శవాన్ని ఇండియా పంపే ఖర్చులూ అన్నీ కలిపి తడిసి మోపెడవుతున్నాయి. నా దగ్గర ఉన్నవన్నీ ఖర్చు పెడుతున్నాను. కంపెనీలో రవికి రావల్సిన డబ్బు కూడా రావడానికి టైం పడుతుంది. అది పేరెంట్స్ కి తప్ప ఇవ్వరు. ఈ తెలుగు సంఘం వాళ్ళు కాస్తయినా సహాయం చేస్తారేమో అనుకున్నాను.”

“చందూ! నువ్వు వెళ్ళమన్నావని వెళ్ళాం కానీ, నాకయితే ఇష్టం లేదు. వాళ్ళంతా పెద్ద ట్రాష్! వాళ్ళు సహాయం చేయకపోవడానికి అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఆ సంఘం నడిపే వాళ్ళకి రవి కులం అడ్డొచ్చింది. పైకి నాతో అనలేదు కానీ, తెలుసున్న ఇంకో స్నేహితుడు చెప్పాడు.” రాజు గొంతులో ఆవేశం కనిపించింది.

నవ్వొచ్చింది నాకు. ఎన్నోవేల మైళ్ళు, దేశం కాని దేశం వచ్చినా కులం అనేది మన జీవితాల్ని ఇంకా శాసిస్తూనే ఉంది. నా మనసులో ఉన్నదే పైకీ అన్నాను. రాజు నాకేసి తీవ్రంగా చూసాడు. నా అమాయకత్వమ్మీద కోపం వచ్చిందేమో?

“నువ్వెక్కడి పిచ్చాడివిరా? మనం ఉందన్నా లేదన్నా, కులం అనేది భారతీయుల మైండ్లలో పాతుకు పోయింది. ఇంత దూరం వచ్చినా కులాల వారీగా సంఘాలు ఏర్పరచు కోవడం చూస్తే తెలియడంలేదా? ఎంత చదువు చదివినా మన అవుట్లుక్ మారదు. ఏం చేస్తాం? అమెరికా కాదు, అంతరిక్షమెళ్ళినా ఇండియన్స్ మారరు.” ఆ గొంతులో ఆవేశమే కాదు మనుషులపై అసహ్యమూ ప్రతి ధ్వనిస్తోంది.

“పోనీ మనకు తెల్సిన ప్రసాద్ గార్ని అడిగితే?…” ఆశ చంపుకోలేక నేనే అన్నాను. ప్రసాద్ అనే ఆయన సిలికాన్ వేలీలో ఉన్న సంపన్నుల్లో ఒకరు. మామూలుగా ఏదో ఉద్యోగం జేసుకుంటున్నాయన దశ తిరిగి స్టాక్స్ లో మిలియన్లు సంపాదించాడు.

“సర్లే, ప్రసాద్ గార్ని అడగడం అంత బుద్ధి తక్కువ ఇంకేం లేదు. ఆ మధ్య శంకర ఐ ఫౌండేషన్ కి విరాళం ఇమ్మంటేనే మొహం చాటేసాడు. అయినా ఆయన గుళ్ళకీ గోపురాలకీ ఇస్తాడు కానీ ఇలాంటి వాట్ల జోలికి చస్తే పోడు. అడగడం వల్ల మన టైం వేస్ట్ తప్ప, ఉపయోగం లేదు.”

మళ్ళీ తనే అన్నాడు, “ఫర్గెట్ అబౌట్ దెం. రవి మన స్నేహితుడు. నా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ ఇస్తాను. అలాగే శీను ఓ వెయ్యి ఇవ్వ గలడు. చందూ, నువ్వెలాగూ ఖర్చు పెడుతూనే ఉన్నావు. ఓ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేమా?”

వాళ్ళందరూ ఆవేశంగా అంటున్నారే కానీ వాళ్ళ దగ్గర అంతగా సేవింగ్స్ లేవని నాకు తెలుసు. వాళ్ళ జీతాలూ, అవసరాలూ, లోన్లూ ఇవన్నీ మా గ్రూపులో అందరికీ తెలుసు. నా దగ్గర ఓ ఇరవై వేల డాలర్లు జయ స్కూల్ కోసమని దాచినవి ఉన్నాయి. అందులోంచే తీసి ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నాను. అంతగా కావాలంటే క్రెడిట్ కార్డ్ ఉండనే ఉంది. పైకి మాత్రం అన లేదు.

“ఎయిర్ లైన్స్ వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళాలంటే బరువు లెక్కన చార్జ్ చేస్తారట. అదీ కాక వాళ్ళ స్టాండర్డ్స్ కి తగ్గ కాఫిన్ లోనే పంపాలి. కాఫిన్ ఒక్కటే రెండు వేలట. నా కొకటనిపిస్తోంది. శవాన్ని ఇండియా పంపే కంటే రవి పేరెంట్స్ నే ఇక్కడికి రప్పిస్తే? ఎలాగూ రవి తాలూకు కంపెనీ డబ్బు రావల్సుంది కదా? రవి బేంక్ ఎక్కౌంట్ లో ఉన్న డబ్బు వాళ్ళకి తప్ప ఇవ్వరు.”

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3