తడి
జీపు వెనక సీట్లోంచి ఒక బంట్రోతు, ఒక చిన్న అధికారీ, ముందు సీట్లోంచి డ్రైవరూ దిగేక - ముందు సీటు కుడివైపు నుంచి ఒక పెద్దయ్యగారు దిగేరు. వారే, డీ ఈ ఓ గారని నేను తేలికగానే పోలిక పట్టేను. వారు బండి దిగిన వెంటనే, వెంటనే, హెడ్మాస్టరు గారు ఆయనకి నమస్కరించి, మిగతా వారితోబాటు బడిలోపలికి తీసుకునివెళ్లేరు.డీ ఈ ఓ గారు దిగేటప్పుడు, ఆయన చెటుల్లో బొత్తి లోంచి, ఒక కాగితం జారిపడిపోయింది. అది వారెవ్వరూ చూసుకోలేదు, లోపలికి వెళ్లిపోయేరు. నేను పరిగెత్తుకెళ్లి వాళ్లకిద్దామనుకున్నాను. ఇంతలోపే ఆ కాగితం మా అయ్య దగ్గరికి ఎగిరొచ్చి, ఆగక అక్కడినుంచీ, మోపులు కడుతున్న నాదగ్గరకొచ్చింది. ఆ కాగితాన్ని చూడగానే, పట్టుకోవాలనిపించింది. చూడబోతే, పాల లాంటి తెల్ల కాగితం. ముట్టుకుంటే, మురికైపోతుందేమోనని, చేతులు లాగూకి, తుండు గుడ్డకీ తుడుచుకుని, ఆ కాగితాన్ని భద్రంగా రెండు చేతులతోనూ పట్టుకున్నాను. బడికేసి, చూసేను కానీ, ఎవరూ కానరాలేదు. ఎవరూ, వెనక్కి రాకపోతే, ఈ తెల్ల కాగితం నాదేననిపించి, నాకు పట్టరాని సంబరం వేసింది. ఆ తెల్ల కాగితం పట్టుకుని మైమరచిపోతున్న నన్ను, మా అయ్య అదిలించే సరికి, మళ్లీ ఈ లోకం లోకి వచ్చేను.
ఏమైనా, సరే, ఆ కాగితాన్ని వదులుకోవాలనిపించలేదు. మా అయ్య దగ్గరినుంచి కనుమరుగవ్వాలని ” అయ్యా, ఆకలవుతున్నాది” అని చెప్పేను. దానికి, మా అయ్య ” ఇంటికి పోయి, బువ్వ తిని బిరీన వచ్చేయి. ఈ పొద్దు పని ముగించాలి” అని చెప్పేడు. చాలు, ఈ అవకాశం అనుకుని, ఆ కాగితాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని, ఇంటికి పరుగు తీసేను. గుడిసె బయట, రాయి దగ్గరి పొయ్యి ఊదుతూ అవస్థ పడుతున్న అమ్మ, నన్నొక్కడినీ చూసి ఆశ్చర్యపోయింది. ఉయ్యాల్లో, బజ్జున్న చెల్లికి ముద్దు పెట్టి, లోపల చూరు మీదనుంచి వేలాడుతున్న, నా సంచీ ని అందుకున్నాను. ఈ లోగా అమ్మ ” బువ్వ తిందువు రా” అని పిలిచింది. జరిగినదంతా అమ్మకి చెప్పేను. అమ్మ ఏవీ మాటాడలేదు. “బిడ్డ బడికి పోవట్లేదే” అని లోలోపలే బాధ పడుతోందని నాకు తెలుసు.
బువ్వ తిని, ఆ కాగితం మీద ఏదైనా రాసుకోవాలని అనుకున్నాను. కానీ, ఏమి రాయాలో తోచలేదు. ఎక్కాలు రాద్దామని మొదలు పెట్టేను, అన్నీ గుర్తుకు రాలేదు. కానీ కాగితం ఒకవేపంతా నిండిపోయింది. రెండో వేపు, కంఠస్థం వచ్చిన “భారతదేశము - ఎల్లలు” రాసి , నచ్చక చెరిపేసేను. “అయ్యా, నన్ను చదివించు” అని మా అయ్యకి పరాకు చెబుతున్నట్టుగా రాసి , చూపించాలనుకున్నాను, కానీ, అయ్యకి చదవడం రాదని గుర్తుకొచ్చి నిరుత్సాహ పడ్డాను. ఈ మాటే, అమ్మతో అంటే, అమ్మ నవ్వి, “పాన్లే, ఆ ఒచ్చిన పెద్దయ్యకే రాసియ్యి, ఆయనేమన్నా మీ అయ్యకి చెప్తాడేమో “‘ అంది. సరే అని చెప్పి-, ఎల్లలు రాసి చెరిపిన రెండో వేపు -
“పెద్దయ్య సారూ,
నన్ను బడికి పోనీమని మా నాయనకి చెప్పండి. బడినుంచి వచ్చినాక, నాయనకి తోడుగా పని చేస్తాను. మీరు గట్టిగా చెప్తే మీ మాట ఇంటాడు. నా పేరు రాంబాబు, తరగతి -5″
అని రాసేను. వంకర టింకరగా రాసిన ఈ మాటలకే ఠావు కాగితమూ పూర్తిగా ఒక వేపు నిండి పోయింది. అమ్మకి చదివి వినిపించేను. కానీ, దాన్నిఎలా ఇవ్వాలో, తెలియలేదు. బడిలోపలికి వెళదామనుకుంటే కనీసం తెల్ల చొక్కా అయినా లేదు. ఎలాగోలా చూద్దామనుకుని, నలిగిన ఆ కాగితాన్ని, మడతబెట్టి జాగ్రత్తగా లాగూ జేబులో పెట్టుకుని, అయ్యకి అన్నం తీసుకుని బడికేసి బయలు దేరేను.
నేను అక్కడికి చేరేసరికి, అయ్య మొత్తం పనంతా దాదాపుగా పూర్తిచేసి, మోపులు కూడా బండ్లోకి ఎక్కించేసేడు. అయ్య బువ్వ తింటూండగా, ఎలా చెయ్యాలో దిక్కు తోచక, మడచిన ఆ కాగితాన్ని, జీపులో పెద్దయ్యగారు కూర్చున్న సీటు మీద వుంచి, బరువుగా ఒక కట్టె పేడుని వుంచేను. కాసేపాగితే, వాళ్లు తిరిగొచ్చేస్తారు కదా అనుకుంటుంటే, అయ్య నన్ను పొలం మీదికి బయలుదేరదీసేడు. ఎదురు చెప్పలేక, తల వేలాడేసుకుని, అయ్య వెనకాలే పొయాను. బడిలోకి దూసుకెళ్లి, ఆ వచ్చిన పెద్దయ్యగారి చేతిలో ఈ కాగితం పెట్టనందుకు, ఈ సారి నా మీద నాకే కోపం వచ్చింది.
చలికాలం కావడం వల్ల తొందరగా పొద్దు గుంకింది. ఇంటికి చేరి, దీపం బుడ్లు ముగ్గుపొడి తో తుడుస్తూ వుంటే, మా తరగతి పిల్లవాడొకడు, రొప్పుతూ లోపలికొచ్చి - “ఒరేయ్, హెడ్మాస్టరుగారూ, డీ ఈ ఓ గారూ, జీపులో మీ ఇంటికొస్తున్నారు. మీ నాయనతో మాట్లాడతారంట” అన్నాడు. వీడి అరుపుకి, అయ్య అక్కడికి వచ్చి -”మనకాడ ఏం పనిరా అబ్బయ్యా?” అని అడిగేడు. ఏమీ అర్థం కాక తెల్లబోయిచూస్తున్న నాకే, నేను రాసిన ఆ కాగితం చప్పున మతికి వచ్చింది. ఆ సంగతి అమ్మ ఇంకా అయ్యకి చెప్పి వుండదని నమ్మిన నేను, అయ్యతో తెలీదన్నట్టు అడ్డంగా తలాడించేను. తనకి తెలిసిపోతే, పెద్ద సార్లని, మీదికి ఉసిగొల్పేనని అయ్య నా మీద విరుచుకపడతాడేమోనని నా గుండె జారింది. ఈ లోగా, జీపు ఇంటికి దగ్గరగా వచ్చి నిలిచింది. మా అయ్య పరుగున బండి దగ్గరకు వెళ్లి, చెయ్యి కట్టుకు నిలబడ్డాడు. చుట్టుపక్కల వుండే జనమంతా గుమిగూడేరు.
అప్పుడు, బండి దిగిన డీ ఈ ఓ గారు, ” ఇతడేనా, రాంబాబు తండ్రి - పెంచలయ్య?” అని హెడ్మాస్టరుగారిని అడిగేరు. ఆయన అవునన్నాక, మా అయ్యతో “చూడు, పెంచలయ్యా, రాంబాబుని, రేపట్నుంచీ, బడికి పంపించు. పనికి వద్దు” అన్నారు. మా అయ్య, నోరు తెరిచి మాట్లాడేలోగా ఆయన కాస్త స్వరం పెంచి - “వాణ్ణి, చదివించే పూచీ నాది, వాడు చదివి నీ ఇంట్లో దీపం వెలిగిస్తాడు” అన్నారు. మా అయ్య గొంతులో తడారిపోవడం చూసిన ఆయన, కాస్త మెత్తగా “ఇక నీ సంగతంటావా, చిన్న మెరకేదైనా కౌలుకి తీసుకో, కాగితాలవీ కూర్చుకుని, నెల్లూరు వస్తే, అధికారులతో మాట్లాడి నీకు అప్పు మంజూరు చేయించడానికి సాయం చేస్తాను” అన్నారు. చెల్లి నెత్తుకుని, గుడ్లప్పగించి చూస్తున్న అమ్మతో, అనునయంగా “పిల్లవాణ్ణి, రోజూ బడికి పంపే బాధ్యత నీది” అని, హెడ్మాస్టరు గారికి “దయచేసి మీరు గమనిస్తూ వుండండి” అని చెప్పి - జీపెక్కి, దుమ్ము రేపుకుంటూ అందరూ తిరిగి వెళ్లిపోయేరు.
అరోజు రాత్రి, మా అమ్మ, అయ్య మీద పెద్ద పోరు జరిపి, చివరకు గెలిచింది. అయ్యకి నోరెత్తే సందు లేకపోయింది. అమ్మ ఎంతో సంబరంగా పొద్దున్న నన్ను బడికి పంపడానికి తయారు చేసింది. కానీ, తెల్ల చొక్కా లేదే అని నేను, ఊగిసలాడుతూవుంటే, “రాంబాబూ, బడికీ” అని మా తరగతి పిల్లలు అరుచుకుంటూ వచ్చి ఇంటిముందు పొగయ్యేరు. “తెల్ల చొక్కా లేకపోయినా కూడా, నిన్ను అయ్యవారు రమ్మన్నారు” అని నన్ను లాక్కెళ్లేరు.
ఆ ఏడాది పొదలకూరులోనే అయిదు పూర్తి చేసేక, డీ ఈ ఓ పాండురంగం గారు, నా వెనకే వుండి నన్ను తాడికొండ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించేరు. ఉపకార వేతనమూ ఏర్పాటు చేసి ఇప్పించేరు. వారి పిల్లలిద్దరూ, నాకంటే పెద్దవాళ్లు. వాళ్ల అబ్బాయికి, మరి సరిపోని శుభ్రమైన బట్టలు, స్టీలు సామాన్లవాడికి ఇచ్చెయ్యకుండా వారి భార్య పార్వతమ్మగారు నాకోసం అట్టే పెట్టేవారు. వారు నెల్లూరు నుంచీ బదిలీ అయ్యేవరకూ, నేను ఎప్పుడు సెలవులకి ఇంటికి వెళ్లినా, ఒక పూటైనా వారింటి భోజనం రుచి చూపించి, నా బాగోగులు విచారించే వారు. తరువాత, తరువాత నాకు తెలిసింది, గురుకులం లో అయ్యవార్లని కూడా నా గురించి తరచూ వాకబు చేసేవారని. పాండురంగంగారు, పై వూరికి వెళ్లిపోయినా, నేను హైస్కూలు పూర్తి చేసేవరకూ, నెలకొక జాబైనా రాసేవారు. స్కాలరుషిప్పు ఎలా పొందాలీ, ఏ ఏ ధ్రువీకరణ పత్రాలు కావాలీ - ఇలాంటి విషయాలలో నాకు మార్గదర్శిగా వుండడమే కాక, బాగా చదువుకోవడానికి నాకు అంతులేని ప్రోత్సాహాన్ని సదా అందించేవారు. వారి ఉత్తరాల్లో, నడవడి గురించీ, విలువల గురించీ- బడిలో నా పెరిగే తరగతికి అనుకూలంగా నాకు సూత్రాలు చెప్పేవారు. పాండురంగం గారి ఉత్తరాలన్నీ, ఈ నాటికీ నా దగ్గర భద్రంగా వున్నాయంటే, వారన్నా, వారి మాటన్నా నాకు ఎంత గౌరవమో తెలుస్తుంది.
తాడికొండలో హైస్కూలు పూర్తయిన తరువాత, ఇంటర్మీడియట్ కూడా గుంటూరులో వారి సలహా మేరకే చేరేను. నా ఇంటర్మీడియట్ చదువుకి వారు కొంత ఆర్ధిక సహాయం కూడా అందించేరు. గుంటూరులో నా చదువు పూర్తయ్యేసరికి, మా అయ్య కొద్దిగా నిలదొక్కుకుని, మా స్థలాన్ని విడిపించుకోగలిగాడు. చెల్లిని కూడా, అప్పటికి బళ్లో వేసేడు. పాండురంగం గారికున్న మంచి పేరు వల్లా, వారిమాట చలవ వల్లా నేను సహాయం కోరగా నిరాకరించిన వారు తక్కువ. నా పోషణా భారం మా అయ్య మీద పడిందీ చాలా తక్కువే. నా అంతట నేను స్వయం సమృద్ధిగా బ్రతకడానికి, అవసరమైన తర్ఫీదు వారి ద్వారానే నాకు చిక్కింది. ఇంజినీరింగు చదవాలని కృషి చేస్తునప్పుడు, బుద్ధి వికసిస్తుందని పొరుగు రాష్ట్రంలో చేరమని వారే సూచించేరు.
నాగపూరు లో బి టెక్కు చదివి, నేను ఇక్కడ, ఉద్యోగం లో చేరేటప్పటికి, వారు పదవీ విరమణ చేసి, హైదరాబాదు లో స్థిర పడ్డారు. నేను, మొదటి జీతం అందుకుని, వారి పేర వెయ్యి రూపాయలు మని ఆర్డరు చేస్తే, తిరుగు టపా మీద “అమ్మనీ, నాన్ననీ సాదరంగా చూసుకో. చెల్లిని బాగా చదివించు. బాధ్యత విస్మరించకు” అని రాసి, పైకాన్ని సున్నితంగా తిప్పి పంపేసేరు. నేను, ప్రతీ నెలా ఏదో ఒక మొత్తం వారికి పంపించి, వారి ఋణాన్ని కొంతైనా తీర్చుకుందామనుకున్న నా ఆశ నెరవేరలేదు. ఇప్పటికీ, నేను ఫోను చేస్తే, “ఒరేయి, అబ్బాయీ” అని ఎంతో ప్రేమగా పాండురంగం గారూ, పార్వతమ్మ గారూ పలకరిస్తారు. చెల్లి, ఈ ఏడాది, పది రాస్తే అమ్మనీ, అయ్యనీ కూడా నెల్లూరుకి మార్చి -అక్కడ దాని పై చదువు కొనసాగించాలని నా కోరిక.