ముగింపు

క్లాడ్ షానన్
బీజగణితాన్ని రేఖా గణితానికి అన్వయించి దేకార్త్ (Descartes) యూరప్ విజ్ఞానయుగంలో పురోగమించడానికి కారకుడయ్యాడు. బూల్ బీజగణితాన్ని తర్కానికి అన్వయించి కొత్త గణిత శాస్త్రానికే పునాది వేశాడు. ఆ కొత్త గణితాన్ని ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ కి అన్వయించి కంప్యూటర్ విప్లవానికి నాంది పలికాడు షానన్. “నా ప్రతిభేమీ లేదు, తర్కమూ, ఇంజనీరింగూ రెండూ చదివి ఉండటం నాకు కలిసొచ్చింది”, అని చాలా తేలిగ్గా తీసిపారేశాడు షానన్ . ఒకదానికొకటి సంబంధం లేని పాయలుగా ఉన్న విజ్ఞానశాఖల్ని, ఎవరో మేధావి వచ్చి కలిపి అనూహ్యమైన రీతిలో ప్రగతి సాధించడం మనకి చరిత్రలో పదే పదే కనిపిస్తుంది.
ఈ వ్యాసంలో మనం ఒక్కసారిగా ఇరవయ్యో శతాబ్దపు కంప్యూటర్ యుగంలోకి వచ్చేసినా, బూల్‌కీ షానన్‌కీ మధ్యకాలంలో చాలా కథ జరిగింది. మానవ వివేచనకి బూలియన్ తర్కమే ఆధారమైతే, గణితానికి పునాదులు కూడా తర్కంలోనే ఉండాలన్న మీమాంస ఆ కాలంలో మొదలయింది. వచ్చే సంచికలో వెనక్కి వెళ్ళి గణితశాస్త్ర పునాదుల్ని కదిపిన కథేమిటో చూద్దాం.
ఉపయోగపడిన పుస్తకాలు
- “Boole Turns Logic Into Algebra,” in “The Universal Computer: The Road From Leibniz To Turing”, by Martin Davis. W. W. Norton and Company, 2000. ఈ వ్యాస పరంపరకి ఎంతో ఉపయోగపడిన పుస్తకం.
- “Geroge Boole: His Life and Work”, by Desmond MacHale. Dublin: Boole Press, 1985. ఇది బూల్ సాధికారిక జీవితచరిత్ర. చదవదగ్గ పుస్తకం.
- “Men of Mathematics,” by ET Bell. “Complete Independence – Boole,” అన్న అధ్యాయంలో బెల్ తన సామ్యవాద భావాల మూలంగా కొంత వక్రీకరించాడని మెక్‌హేల్ (MacHale) తన పుస్తకంలో ఆరోపించాడు.
- “Lectures on Ten British Mathematicians of the Nineteenth Century,” by Alexander MacFarlane. 1901-1904 మధ్య లేహై యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసాలు. Peacock, De Morgan, Boole – వీళ్ళ మీద ఉన్న అధ్యాయాలు చదవదగ్గవి.
- “A Symbolic Analysis of Relay and Switching Cirsuits,” by Claude Shannon. MIT Masters Thesis, 1940. సాంకేతిక చరిత్ర గతినే మార్చివేసిన మాస్టర్స్ థీసిస్ ఇది. దీనిని మీంచిన మాస్టర్స్ థీసిస్ మరొకటి లేదు.
- “1 + 1 = 1 – a tale of genius,” by Ian Petticrew. బూల్ నీ షానన్ నీ కలిపి వారి పనిని వివరించే వ్యాసం.
- “Tools for Thought: The History and Future of Mind-Expanding Technology,” (Older Edition) by Howard Rheingold. MIT Press, 2000.
- “An Investigation of the Laws of Thought,” by George Boole. Cosimo Classic, 2007. ఇది బూల్ మాస్టర్ పీస్. మొదటి అధ్యాయాలు అర్థం చేసుకోవడం కష్టం కాదు. అవి చదివితే బూల్ ఎందుకు మేధావో తెలుస్తుంది.
- “Endless Frontier: Vannevar Bush, Engineer of the American Century,” by G. Pascal Zachary. The Free Press, 1997. గత శతాబ్దపు మొదటి భాగంలో అమెరికాలో ప్రభుత్వ సలహాదారుగా, ఆటంబాంబు ప్రాజెక్టు ప్రారంభకుడిగా, సైన్సులో ప్రభుత్వపాత్రని రూపొందించిన వాళ్ళలో ప్రముఖుడిగా సాటిలేని ఇంజనీరు వానెవర్ బుష్ జీవిత చరిత్ర.
- “As We May Think,” by Vannevar Bush. The Atlantic Monthly, July 1945. రెండవ ప్రపంచ యుద్ధంలో సైన్సుని వినాశ ప్రయోజనాలకి వాడుకున్నాం. అలాకాక, దానిని మానవ వికాసానికి వాడుకోవాలని ఆశిస్తూ సైంటిస్టులకి కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ రాసిన వ్యాసం. మనం చదివే పుస్తకాలూ, చూసే ఫొటోలూ, రాసుకునే నోట్సూ, అన్నీ దాచుకునే యంత్రాన్ని చవగ్గా చెయ్యొచ్చనీ, అది మనం అడిగిన ప్రశ్నలకి ఠకీ మని జవాబిస్తుందనీ జోస్యం చెప్పి, దానికి మెమెక్స్ అని పేరు పెట్టాడు!
