సామాజికసేవ
దుర్భరమైన పరిస్థితులనుండి వచ్చినవాడు కనుక, బూల్ ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకి సాధ్యమయినంత సాయం చేశాడు. అప్పట్లో లింకన్ పట్టణంలో చాలా వేశ్యాగృహాలుండేవి. సమాజంలో మోసపోయి వేశ్యావృత్తిలోకి దిగిన క్రింద తరగతి స్త్రీల కోసం “ప్రాయశ్చిత్త గృహం” ఒకటి పెట్టి వాళ్ళకి నీడ కలిపించాడు. “మెకానిక్ సంస్థ” (Mechanics Institute) అనే వయోజన కార్మిక విద్యాకేంద్రానికి ట్రస్టీగా పనిచేశాడు. బూల్ ఆ సంస్థ గ్రంథాలయానికి అనేక గ్రంథాలని తెప్పించాడు. స్త్రీలకి అందులో ప్రవేశం ఉండేటట్లు చూశాడు. తీరిక వేళల్లో అక్కడ పాఠాలు చెప్పేవాడు.
ఈ సమయంలోనే బూల్ మంచి ఉపన్యాసకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇరవై ఏళ్ళు నిండీ నిండకుండా, హైస్కూలు చదువు కూడా పూర్తి చెయ్యని బూల్, ప్రపంచంలోనే అగ్రగణ్యుడనిపించుకున్న న్యూటన్ పరిశోధనల మీదా, అతని మార్గం లోని లోటుపాట్ల మీదా సాధికారంగా మాట్లాడాడు. అదీ బూల్ వ్యక్తిత్వం – సత్యాన్వేషణలో పెద్దపెద్దవాళ్ళని కూడా సహేతుకంగా విమర్శించడానికి వెనుకాడడు. లింకన్ పట్టణం చుట్టుప్రక్కల వాళ్ళకి బూల్ అసామాన్యుడని గాఢమైన నమ్మకం ఏర్పడింది. 1847 లో, లింకన్ పట్టణంలో, ఒక సంస్థ (Lincoln Early Closing Association) కృషి ఫలితంగా ఊళ్ళో దుకాణాలన్నీ పది గంటలకన్నా ఎక్కువ తెరిచి ఉంచమని యజమానులు వాగ్దానం చేశారు. ఆ సందర్భంలో బూల్ “తీరిక సమయం, సద్వినియోగం” (The Right Use of Leisure) అన్న ఒక ఉపన్యాసం ఇచ్చాడు. సృష్టికర్త ఇచ్చిన వైవిధ్యమైన మానవమేధని తదనుగుణంగా అనేక రంగాల్లో వాడి పూర్ణ జీవితాన్ని సాధించాలనీ, ఆట పాటలు, చదువు, సంఘ సేవ, సైన్సు-మతాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి గంటకి పైగా అనర్గళంగా ఉపన్యసించి ఆకట్టుకున్నాడు.
బూల్ ఇవి సాగిస్తూనే ఖాళీ సమయాల్లో సొంతంగా గణిత శాస్త్రాన్ని అభ్యసించసాగాడు. 1838లో, ఇరవై మూడేళ్ళ వయసులో, బూల్ గణితశాస్త్రంలో మొదటి పేపర్ ప్రచురించాడు. డంకన్ గ్రెగరీ (Duncan Gregory) అనే గణితశాస్త్రవేత్త “కేంబ్రిడ్జ్ జర్నల్” అన్న గణితశాస్త్ర జర్నల్‌కి సంపాదకుడిగా ఉండేవాడు. బూల్ మట్టిలో ఉన్న మాణిక్యమని గ్రెగరీ గ్రహించాడు. గ్రెగరీ బూల్‌కి పేపర్లు ఎలా రాయాలో సలహా లిచ్చాడు. తద్వారా బూల్ కి గణిత ప్రపంచంతో సంబంధాలేర్పడ్డాయి. గ్రెగరీ బూల్‌ని తను సొంతంగా చదివిన చదువు చాలదనీ, గణితశాస్త్రంలో పట్టా పొందమనీ ప్రోత్సహించాడు. కానీ, బూల్ తల్లిదండ్రులని వదిలి వెళ్ళలేక, బడిమీద వచ్చే ఆదాయాన్ని వదులుకునే ఆర్థిక స్వాతంత్ర్యం లేక నిస్సహాయుడై యూనివర్సిటీకి వెళ్ళలేకపోయాడు. (ప్రపంచ ప్రఖ్యాత భారతదేశ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ కూడా ఏ డిగ్రీలూ లేకుండా స్వతహాగా నేర్చుకొని ప్రతిభ కనబరచాడు. హార్డీ చొరవ తీసుకొని రామానుజన్‌ని ప్రోత్సహించి కేంబ్రిడ్జికి తీసుకురాకపోతే రామానుజన్ పేరు గణితశాస్త్ర చరిత్రలో ఉండేది కాదేమో!) కానీ, బూల్ క్రుంగిపోకుండా సొంత పరిశోధనలమీద దృష్టి కేంద్రీకరించాడు. సాధ్యమైనంత వరకు గణిత శాస్త్రవేత్తలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించాడు. 1844లో ప్రచురించిన “On a General Method in Analysis” అన్న పేపరుకి రాయల్ సొసైటీ వాళ్ళు బంగారు పతకాన్నివ్వడంతో బూల్ కి గణిత ప్రపంచంలో పేరొచ్చింది. 1847లో బూల్ “The Mathematical Analysis of Logic, being an Essay Towards a Calculus,” అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది గణితంలో విప్లవాత్మకమైన మార్పులని తీసుకొచ్చింది. అయితే, దీనిని తొందరపడి రాశానని బూల్ తరవాత భావించాడు. ఆ భావాలనే మళ్ళీ 1854లో విపులంగా ప్రచురించాడు. వాటి లోతుల్లోకి వెళ్ళే ముందు బూల్ జీవితంలో వచ్చిన మరికొన్ని మార్పులని చూద్దాం.
1846 నాటికి బూల్ కి తన బడిపంతులు జీవితంపై అసహనం పెరిగింది. గణితంలో మౌలికమైన పరిశోధనలు చెయ్యగలననే నమ్మకం ఏర్పడింది. అందుకు సరయిన వాతావరణం మంచి యూనివర్సిటీలో ఉద్యోగం. కానీ, బూల్ సాంఘికస్థాయి వలన, సరైన డిగ్రీ లేకపోవడం వలన ఇంగ్లాండులో ఎక్కడా ఉద్యోగం రాలేదు. విచిత్రంగా ఇంగ్లాండు పాలిస్తున్న ఐర్లండులో ఓ అవకాశం వచ్చింది!
ఐర్లండులో క్యాథలిక్కులు, ప్రొటెస్టంటులూ ఉన్నా, ఐర్లండులో ఉన్న ఒకే ఒక్క యూనివర్సిటీ ప్రొటెస్టంట్లకు అనుకూలంగా ఉండేది. క్యాథలిక్కులు తమకూ యూనివర్సిటీలు కావాలని ఆందోళన చేశారు. అందుకు తలవొగ్గిన బ్రిటిషు ప్రభుత్వం మూడు కొత్త యూనివర్సిటీలని పెట్టింది – అయితే అవి ఏమతానికీ ప్రాతినిధ్యం ఇవ్వవని తీర్మానించింది. వాటిలో ఒకటయిన క్వీన్‌స్ కాలేజీ (Queen’s College in Cork, Belfast) లో బూల్ 1849 లో, 34 ఏళ్ళ వయసులో గణితశాస్త్ర అధ్యాపకుడిగా చేరాడు. ఎట్టకేలకు బూల్ తన మేధాశాక్తిని సరిగా ఉపయోగించుకునే వాతావరణంలోకి ప్రవేశించాడు.
1845 నుండి 1852 దాకా ఐర్లండు ఘోరమైన కరువు (Irish Potato Famine) నెదుర్కొంది. బంగాళాదుంప పంట పురుగుపడి నాశనమయిపోవడంతో దాని మీద ఆధారపడిన లక్షలాది పేద ప్రజలు అల్లాడిపోయారు. ఐర్లండుని పాలిస్తున్న బ్రిటీషు ప్రభుత్వ అసమర్థత వలన ప్రజలకి తిండికి గతిలేకపోయింది. పది లక్షల మంది ప్రజలు జబ్బు వల్లా, ఆకలి వల్లా చనిపోయారు; అయిదు లక్షల మంది వేరే దేశాలకి వలసపోయారు. కానీ, అటువంటి పరిస్థితులలో ఐర్లాండు వచ్చిన బూల్ స్థానిక ప్రజల కష్టాల గురించి పెద్దగా స్పందించిన ఆధారాలు కనబడవు. దానికితోడు, గుర్రాలనీ గాడిదలనీ సరిగా చూడటం లేదని వాపోతూ, జంతువుల మీద ప్రేమ చూపెడుతూ బూల్ పేపర్లకి ఉత్తరాలు రాయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మృదు స్వభావానికి మారుపేరనిపించిన బూల్ జీవితంలో ఇదొక పెద్ద మచ్చగానే కనిపిస్తంది.
ఐర్లండులో ఒక యూనివర్సిటీ ప్రొఫెసరు తన మేనకోడలు మేరీ ఎవరెస్టుని బూల్ కి పరిచయం చేశాడు. (ఆమె బాబాయి బ్రిటిషు సర్వేయరు కల్నల్ సర్ జార్జ్ ఎవరెస్టు. ఇతని గౌరవార్థమే ఎవరెస్టు శిఖరానికా పేరు పెట్టారు.) మేరీ కి గణితంలో ఆసక్తి ఉంది. బూల్ ఆమెకు ప్రైవేట్లు చెప్పాడు. ఇద్దరూ దగ్గరయారు. అయిదేళ్ళ తర్వాత హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో మేరీ ఆర్థికమైన చిక్కుల్లో పడింది. బూల్ ఆమెను వివాహం చేసుకోదలచాడు. 1855 లో పెళ్ళయేనాటికి బూల్ వయసు 40, మేరీ వయసు 23 మాత్రమే.

మేరీ బూల్
Courtesy of Agness Scott College
మేరీలో బూల్‌కి అనుకూలమైన జీవిత సహచారిణి దొరికింది. వాళ్ళ దాంపత్య జీవితం సంతోషంగా గడచింది. అయిదుగురు ఆడపిల్లలు కలిగారు. అయితే పెళ్ళయిన తొమ్మిదేళ్ళకి, 1864 నవంబరు 24వ తేదీన, తన 49వ ఏట బూల్ అర్థాంతరంగా న్యుమోనియా బారిన పడి, సరైన సమయానికి వైద్య సహాయం అందక మరణించాడు. బూల్ చనిపోయిన తరువాత మేరీ బూల్ విద్యా బోధన గురించీ, ముఖ్యంగా, గణితశాస్త్ర బోధన గురించీ ఎన్నో పుస్తకాలు రాసింది. తన అయిదుగురు పిల్లలనీ విశిష్ట వ్యక్తులుగా తీర్చి దిద్దింది. మేరీ బూల్ 84 ఏళ్ళ వయసులో, 1916లో మరణించింది. జార్జ్, మేరీల సంతానంలో మూడవది అయిన అలీషియా (Alicia Boole Scott) కూడా తండ్రిలాగే గణితశాస్త్రంలో ఎంతో పరిశోధన చేసి పేరు పొందింది.