ఈమాట » వాడుక భాషలో తెలుగు కవితావికాసము

Expand to right
Expand to left

వాడుక భాషలో తెలుగు కవితావికాసము

వచన కవితలు

అప్పారావుగారైనా సరే, శ్రీశ్రీ ఐనా సరే - వీళ్లందరు కొత్త కొత్త ఛందస్సులను సృష్టించి పాడుటకు అనువుగా ఉండేటట్లు కవితలను అల్లినారు. పాశ్చాత్య రచనల ప్రభావంవల్ల కవులు కవితలను వచనాలుగా అల్లడానికి ఆరంభించారు. పంక్తికీ పంక్తికీ మధ్య ఉండే అంతరము, చదివేటప్పుడు వచ్చే విరామాలు ఇట్టి రచనలను ఇంకా పటిష్ఠము చేస్తాయి. మనసులో ఉదయించిన భావాలను ఏ నిర్బంధం లేకుండా బహిర్గతం చేయడానికి వీలవుతుంది. ఇవి ఆంగ్లములోని blank verse లాంటిది, మాడర్న్ ఆర్ట్ వంటిది. ఇందులో ప్రాసలు, శబ్ద సౌందర్యాలు కేవలం ఐచ్ఛికము. ఏ పత్రిక చదివినా, ఏ కవితాసంకలనం చదివినా వచన పద్యాలు అందులో తప్పకుండా ఉంటాయి. ఇట్టి పద్యాలకు వస్తువు ఏదైనా కావచ్చు. ఇక్కడ ఈ మాధ్యమంలోని కొన్ని కవితలను మీముందు ఉంచుతున్నాను -

ఏ మహారాణి మెళ్లోదో
నీలాలపేరు ఇట
తెగి పడిపోయిందేమి
కాదు - విష్ణుక్రాంత
కడు చిన్ని పూలు
తీగెపై అడనద తీరుగా ఉన్నై
నీలాల కంటేను మేలుగా ఉన్నై
- టేకుమళ్ల కామేశ్వర రావు, మిణుగురు పురుగు

అక్షరంఅక్షరంలో నీ మధురస్వర ఆలాపన వింటాను
పంక్తి పంక్తిలో నీ జీవన దృక్కోణం స్పర్శిస్తాను
లేఖలో నీవు కనబడతావు
కరిగిస్తావు
గరళం త్రాగే శక్తి నిస్తావు
- గంగినేని, ఉదయిని

ఓటు నువ్వు ఎయ్యకుండ
సీటు రాదు నాయకులుకీ
పాటు నువ్వు పడకుండా
బువ్వలేదు పెద్దలకీ
దళితన్నల రాజ్యంకై
దండు నడుపుతున్నట్టి
దండధరుల గిరిజనులా
దండులో కలవండిరో
- చుండూరు పాట, వంగపండు

ఒకడు చేసిన నేరానికి
ఒకడు వెళ్లాడు కారాగారానికి
ఒకడు చెప్పాడు దొంగ సాక్ష్యం
ఒకణ్ణి హింసించడమే అతని లక్ష్యం

న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు
అతనికి కలిగించలేదు నిట్టూర్పు
దోషి వీధిలో తిరుగుతున్నాడు
నిర్దోషి ఖైదులో మురుగుతున్నాడు
- దాశరథి, జ్వాలాలేఖిని

నేను ఏ అడవుల్లో తిరిగానో
సింహశార్దూలాల గర్భాల్లో నిద్రిస్తూ
నన్ను ఏ అందమైన లేడి మేసిందో
శాద్వలాల్లో తన రక్తమాంసాల్ని బుజ్జగిస్తూ
నేను ఏ అడవి అనుభూతికోసం కొమ్మలు జాపానో
నా ఆకుల అంగుళులతో శూన్యం స్పృశిస్తూ

ఏ ప్రాచీన సముద్ర చేతనలో తేలానో
నిరింద్రియ నిరవయవ కాంతికణాన్నయ్ స్పందిస్తూ
ఏ ఘడియలో ఊగానో
కాలంలో వ్రేలాడే బొమ్మల్లా ఉన్న
సూర్యచంద్రులకూ నాకూ అభేదం అనుభవిస్తూ

నా స్మృతులన్నీ రక్తప్రవాహాల్లో పడికొట్టుకొస్తున్నాయి
గుల్మొహర్ ఒక నూతన రుతువును ప్రకటించిన ఈనాడు
ఏ రుతువు సృష్టి అనంతత్వాన్ని
గానం చేస్తూ ఉందో ఆ రుతువును

మా వూళ్లో ఇవాళ నన్నెరిగిన వాళ్లు నలుగురే
శిథిలమైన వంతెన
గ్రామ కాలువ
పాత గుడి
ముసలి చెరువుగట్టు
- గుంటూరు శేషేంద్ర శర్మ, నీరైపోయింది

సినిమా పాటలలో వ్యావహారిక భాష

ముప్ఫైయవ దశకంనుండి చలనచిత్రాలు తెలుగులో విడుదలవుతున్నాయి. ఇవి అప్పుడూ, ఇప్పుడూ ప్రజల జనరంజనానికి అత్యవసరమైన పరికరమే. తెలుగు చిత్రసీమ చేసిన అదృష్టం ఏమంటే, సుప్రసిద్ధులైన కవులు సినిమా పాటలను రాశారు. సినిమా పాటలను పల్లెలలో, పట్టణాలలో ప్రజలు పాడుకొంటూ ఉంటారు. దేవులపల్లి, రజనీకాంతరావు, సముద్రాల, ఆరుద్ర, శ్రీశ్రీ, సిరివెన్నెల, వేటూరి మున్నగువారి పేరులు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. కింద కొన్ని ఉదహరణలు -


అదిగదిగో గగనసీమ
కృష్ణ శాస్త్రి, నా యిల్లు

అదిగదిగో గగనసీమ
అందమైన చందమామ ఆడెనోయీ

ఇదిగిదిగో తేలి తేలి
చల్లనైన పిల్లగాలి పాడెనోయీ

హాయి హాయి ఈ లోకం
తీయనైన దీ లోకం
నీ యిల్లే పూలవనం
నీ సర్వం ప్రేమ ధనం
మరవకోయి ఈ సత్యం

నీకోసమె జగమంతా
నిండెనోయి వెన్నెలలు
తేలెనోయి గాలిపైన
తీయనైన కోరికలు

చెరుచుకోకు నీ సౌఖ్యం
చేతులార ఆనందం
ఏనాడును పొరబడకోయి
ఏమైనా త్వరబడకోయి

మరల రాదు రమ్మన్నా
మాయమైన ప్రేమధనం
చిగిరింపదు తిరిగి
వాడి చెడిన పూలవనం
మరవకోయి ఈ సత్యం
- కృష్ణ శాస్త్రి, నా యిల్లు


కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దాన
ఆత్రేయ, తోడికోడళ్లు

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

[…]

గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రదుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్య మొకరిది సాగదింక తెలుసుకో
- ఆత్రేయ, తోడికోడళ్లు


కలకానిది విలువైనది - బ్రతుకు
శ్రీశ్రీ, వెలుగునీడలు

కలకానిది విలువైనది - బ్రదుకు
కన్నీటి ధారలతోనే బలిచేయకు
[…]
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం
- శ్రీశ్రీ, వెలుగునీడలు


వటపత్రశాయికి వరహాల లాలి
- నారాయణ రెడ్డి, స్వాతిముత్యం

లాలీ లాలీ లాలీ లాలీ
వటపత్ర్రశాయికి వరహాల లాలి

కళ్యాణరామునికి కౌసల్య లాలి
యదువంశవిభునికి యశోద లాలి
కరిరాజముఖునికి గిరితనయ లాలి
పరమాబ్జభవునికి పరమాత్మ లాలి

జో జో జో జో
- నారాయణ రెడ్డి, స్వాతిముత్యం

ముగింపు

నాకు ఛందస్సు అంటే ఇష్టం. తాళవృత్తాలు, మాత్రాఛందస్సు నాకు ప్రియమైనవి. ఈ రంగంలో కొన్ని ఏళ్లుగా నేను పరిశోధన కూడా స్వతంత్రంగా చేస్తున్నాను. ఐనా కూడా, నా మనసు లోతులలో ఉండే కొన్ని భావాలకు ఆకృతి ఇవ్వాలనే అపేక్ష కలిగినప్పుడు, గేయ కవితనో లేక వచన కవితనో ఎన్నుకొంటాను. ముఖ్యంగా, హృదయాన్ని స్పందింపజేసే శక్తి ఈ మాధ్యమానికి ఉంది. ఈ ఇంటర్నెట్ యుగంలో మనం దైనందినం మాట్లాడే వాడుక భాషలో చాలా మంది కవితలను రాస్తున్నారు, అంతకంటే ఎక్కువగా చదువుతున్నారు. ఆన్‌లైన్ పత్రికలు, బ్లాగులు కూడా వీటికి ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఈ విధంగా ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్నాయి. పాతంతా మంచీ కాదు, చెడూ కాదు. కొత్తంతా చెడూ కాదూ, మంచీ కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది, ప్రభావం ఉంది. కవి యోచించి మాధ్యమాన్ని ఎన్నుకోవాలి. అందుకే నారాయణ రెడ్డిగారంటారు –

కొత్త నీటిని చేర్చుకొని తర-
గెత్తు నదివలె యెట్టి జాతియు
ముందు కేగిన యంత కాలము
మూడు పూవులు, ఆరు కాయలు

గ్రంథసూచి

  1. ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు – సీ. నారాయణ రెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1989.
  2. ఆధునిక కవిత – అభిప్రాయ వేదిక - ఆచార్య తిరుమల, మద్దాళి రఘురాం, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 1981.
  3. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు – కే. కే.రంగనాథాచార్యులు (సం.), ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాదు, 1982.
  4. ఆంధ్రమహాభారతము, ఆదిసభా పర్వములు – ఒస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదు, 1968.
  5. కవనకుతూహలం – అబ్బూరి వరదరాజేశ్వరరావు, విశాల గ్రంథశాల, హైదరాబాదు, 1993.
  6. కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి – విశ్వనాథ సత్యనారాయణ, ఆంధ్ర గ్రంథాలయ ముద్రాశాల, బెజవాడ, 1934.
  7. జడకుచ్చులు – రాయప్రోలు సుబ్బారావు, ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల, బెజవాడ, 1925.
  8. జాతీయగీతాలు – గురజాడ రాఘవశర్మ, ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1978.
  9. తెలుగు చలనచిత్ర గేయ సౌందర్యం – ఎచ్. ఎస్. బ్రహ్మానంద, వెరైటీ ప్రింటర్స్, ఏలూరు, 1992.
  10. దళిత గీతాలు – జయధీర్ తిరుమలరావు (సం.), సాహితీ సర్కిల్, హైద్రాబాదు, 1993.
  11. నీరై పారిపోయింది – గుంటూరు శేషేంద్రశర్మ, ది ఇండియన్ లాంగ్వేజెస్ ఫోరం, హైదరాబాదు, 1976.
  12. మహాప్రస్థానం – శ్రీశ్రీ, బీ. ఎన్. కే. ప్రెస్, మద్రాసు, 1950.
  13. మిణుగురుపురుగు – టేకుమళ్ల కామేశ్వరరావు, నవ్య సాహిత్య పరిషత్, గుంటూరు, 1940.
  14. ముత్యాలసరాలు – గురజాడ అప్పారావు, ఎం. శేషాచలం అండ్ కో, మచిలీపట్నం, 1972.
  15. మేఘమాల – దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి, దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి సన్మాన సంఘం, మద్రాసు, 1975.
  16. మొల్ల రామాయణాము – మొల్ల, ఎమెస్కో సంప్రదాయ సాహితి, విజయవాడ, 1997.
  17. వైతాళికులు – ముద్దుకృష్ణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1987.
  18. శశికళ – అడివి బాపిరాజు
  19. శిలాలోలిత – రేవతీదేవి
  20. సూర్యుడు కూడా ఉదయిస్తాడు – విశ్వనాథ సూర్యనారాయణ, జయప్రభ, యువభారతి, హైదరాబాదు, 1980.
ముందరి పేజీ(లు) 1 2 3 4
 

(4 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    July 2, 2008 2:26 pm

    మోహనరావుగారు: “మేలుకొనుమీ భరతపుత్రుడ” అన్నది మంగిపూడి వెంకటశర్మ రచన. ఈ పాట పూర్తిపాఠం, రచయిత యింటిపేరు (మాత్రమే) మీ గ్రంథసూచిలో పేర్కొన్న “జాతీయగీతాలు – గురజాడ రాఘవశర్మ” అన్న పుస్తకంలో (12 పే) వున్నాయి. ఇదే సంచికలో ఆ పాటలోని మొదటి రెండు చరణాలను “తెలుగు వార్తాపత్రికలు” అన్న ప్రసంగంలో శ్రీరంగం గోపాలరత్నం కంఠంలో వినవచ్చు.

    - కొల్లాయి గట్టితేనేమి” పాఠం సినిమాలో స్వల్పమైన మార్పులకు గురయ్యింది.

    – శ్రీనివాస్

  2. rama అభిప్రాయం:

    July 3, 2008 10:45 am

    మోహన రావు గారు, నమస్కారమండీ!

    కవిత్వం అంటే మీకున్న మమకారం నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది సుమా. సంప్రదాయ కవిత్వం నించి మీరు ఇచ్చే పద్యాల వుదాహరణలని అప్పుడప్పుడు చూస్తూ వుంటాను. అమెరికా లొ వుంతూ కూడా తెలుగు కవిత్వం పట్ల మీకున్న ప్రేమ మెచ్చుకో తగ్గది.

    అయితే మీకు ఇటీవల కాలం లోని కవిత్వం అందుబాటులో లేకనో, లేక మరి ఏ కారణామో నాకు స్పష్టపడలేదు గాని, వుదాహరణలు ఇచ్చినప్పుడు బలం చాలలేదు అనిపించింది.

    మిగత కవయిత్రుల మాట అటుంచినా జయప్రభ గారి కవిత్వం “స్త్రీ వాద” పరిధిని దాటి విస్తరించిందన్న విషయం కవిత్వాభిమానులకి సుస్పష్టమైన విషయమే. మీరు బహుశా ఆమె రాసిన మొత్తం కవితా సంపుటాలని చదివే వుంటారు. మీరు ఇచ్చిన వుదాహరణకన్నా మంచి వుదాహరణ ఆవిడ పోయెట్రి నించి ఇవ్వవచ్చునేమోనని నాకు అంపించింది. అలాగే ఆమె కవిత్వం లో వస్తు వైవిధ్యం వ్యక్తీకరణలో వైవిధ్యము గాఢమైనవి గనక కొల్లలుగా వుదాహరణలని ఎంచుకునే అవకాశం కూడా వుంది.

    తెలుగు లోనే కాదు, అసలు భారతీయ భాషలలోనే ఒకలాంటి ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుంది; అది ఎలాంటిదంటే, ఒక ముద్రతో ఒక రచయితనో ఒక కవినో గుర్తు పెట్టుకోవటం. ఒకవేళ ఆ కవులు ముద్రల లో వొదగని కవిత్వం రాస్తే వాటిని వారి కవిత్వం ఆధారంగా విశ్లేషించటం, ఒక మూసలో వేసి చూసే దృష్టిని వదిలి వేయటం అవసరం అనుకుంటాను, సాహిత్య విశ్లేషకులకి. అప్పుడు మాత్రమే నిస్పక్షపాతమైన విమర్శ సాధ్యం అవగలదు.

    ఇది, మంచి విశ్లేషణ, మీలాంటి వారి నించి వస్తుందన్న ఆశతో చేస్తున్న సూచన గా మాత్రమే భావించగలరు. సింప్లిఫై చేసి చెప్పటం కాకుండా మీలాంటి వాళ్ళు ఇటీవలి కాలంలో, ఆమె కవిత్వం లాంటి గాఢమైన రచనలను, అందులోని విశేషాలని చెప్పటం కవితా ప్రేమికులకి సంతోషదాయకమైన విషయం కాగలదు.

    ఒక కవిలోని విశేషాంశాలని ఆ కవి సమకాలం లొనే చెప్పటం ఒక సాహిత్య మర్యాద కూడా. మన తెలుగు లొ ఎప్పుడూ కవి కలం కన్నా వందేళ్ళు దాటితేనేగాని వారి కవిత్వం వేసిన ప్రభావాన్ని అంచనా వేసే దృష్టి కనిపించదు. కనీసం మీరైనా సమకాలం లోని మంచి కవిత్వాన్ని సమకాలం లోనే అంచనా వెయ్యగల సమ దృష్టిని చూపిస్తారని ఎదురుచూస్తాను.

    మీ అభిమాని,
    రామ

  3. baabjeelu అభిప్రాయం:

    July 12, 2008 7:59 am

    కృష్ణమోహన్ గారూ,
    ఛందస్సు అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా రాసేవాళ్ళకి, అంతకన్నా ముఖ్యంగా చదివేవాళ్ళకి. అయితే ఛందోబధ్ధంగా రాయకపోతే కవిత్వంకాదు అని మీరు రాసిన సంధియుగం సీనియర్ కవులు కుర్రాళ్ళని నిర్బంధించకపోయినట్టయితే, లేక కవులు కాదు అని ఈసడించకపోయివుంటే ఎలావుండునో కథ. అప్పటి యూరోపియన్ కవిత్వపు ఇన్ఫ్లూయెన్స్, ఇంగ్లీషు చదువులు, పట్టించుకోకుండా, సంస్కృతం ఇంకా రాజభాషే అన్న అపస్మారక స్థితిలో వుండి, సంస్కృతం నుంచి డిరైవై న ఛందోబధ్ధవయిన తెలుగు కవిత్వం మాత్రమే కవిత్వమని అనుకున్నవాళ్ళ వల్లే కుర్రాళ్ళందరూ ఇటు మారిపోయేరు.

    ఇంకొక విషయం, ఛందోబధ్ధవయిన తెలుగు పద్యం, గురజాడ ముందు తరంలో మహానుభావుడనే కవికి ఎంత గేప్ వుందో చూడండి. సంధి యుగం అని ఎందుకన్నారూ?
    ఛందస్సు నుంచి ముత్యాల సరాలు నుంచి శ్రీశ్రీ కవిత్వం నుంచి కుందుర్తి ఆంజనేయులు వరకూ అని మీ అభిప్రాయమా? అందుకని ఛందస్సు కీ శ్రీశ్రీ కీ మధ్యది సంధియుగమా?
    చందస్సు మీద ఇప్పటికీ ఎవరికీ కోపంలేదు, అసహ్యంలేదు. అక్కరలేదు కాబట్టి మానీసేరు. మానేస్తున్నారు. ఛందొబధ్ధవయిన కవిత్వం రాస్తున్నవాళ్ళు అనుభూతికి, భావానికి రెండో పీట వేసి ఛందస్సుకి పెద్దపీట వెయ్యడం వల్లే వాళ్ళ కవిత్వంలో ఛందస్సు తప్ప కవిత్వం వుండకుండాపోతోంది.

  4. baabjeelu అభిప్రాయం:

    July 12, 2008 9:40 am

    kRష్ణమోహన్ గారూ,
    మరొక సంగతి. శనగన నరసింహస్వామి, ఈయన వివరాలు నాకు తెలీవు, కానీ ఈయన ప్రతీ పండక్కి అయిదో ఆరో పద్యాలు రాసి ఆంధ్రపత్రిక్కి, ఆంధ్రప్రభకీ పంపీవారు. వాళ్ళు వేసీవారు. అంతే వాటిగురించి ఎవరూ మాటాడీ వారు కాదు. మీరెవరూ ఆయన ఛందోబధ్ధవయిన పద్యాల్ని ఉదహరించరు. ఆ పద్యాల్లో భక్తి తప్ప కవిత్వం వుండీదికాదు.
    శనగన నరసింహస్వామి గారికి క్షమాపణలు.

    కరటకశాస్త్రి చేత గురజాడ చెప్పించినట్టు చదువు పొట్టపోషించుకోడానికే..సంస్కృతం నుంచి తెలుగు నుంచి ఇంగ్లీషు కి పొట్ట నింపీ భాష మారిపోడంవల్ల, ఇంగ్లీషు లోని పద్యరీతులు తెలియడంవల్ల, అవి తేలికగా వుండడంవల్ల, వాటిని ఛందోబధ్ధవయిన కవిత్వం రాసీ ఛాందసులు ఏవీ చేయలొకపోవడంవల్ల, తెలుగు కవిత్వం ఇటు మళ్ళింది. ఇండియా ట్రాఫిక్, ఇండియన్ పోలిటిక్స్ ప్రవాసాంధ్రులికి, ఎంత అసహ్యం కలిగిస్తాయో, బహుశా గురజాడకి, ఛాందసుల స్టాండర్డ్ ప్రకారం కవి, పండితుడు, కానివాడికి, అప్పటి అన్ని విషయాలూ అసహ్యం కలిగించేయి. అందుకే ముత్యాల సరాలు సృష్టించబడ్డాయి, పాత వాసన వదల్లేక. లేక పాతకొత్తల మేలుకలయిక కోసం. పాత వదులుకోలేక. పాత వదులుకోడం, మూలాల్ని తెగ్గొట్టుకోడవేకదా?

    కవిత్వాన్నికానీ, సంగీతాన్నికానీ, మిగిలిన కళారూపల్ని కానీ అప్పటి కాలపరిస్తుతులు నిర్ణయిస్తాయి తప్ప ఇంకేవీ ఏవీ చెయ్యలేవు. ఈ కాల పరిస్థితులే విశ్వనాధ వార్ని కూడా మార్పు వేపు ఈడ్చుకొచ్చేయి. కాదని పురాణం సుబ్రహ్మణ్యం గారన్నా, పురాణం సీతన్నా, పి.ఎస్ అన్నా,”చేరా” అన్నా, వేగుంట మోహన్ ప్రసాద్, “మో” అన్నా, భగవంతుడే అన్నా అది ఒప్పుకోకూడదు..

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a