వాడుక భాషలో తెలుగు కవితావికాసము

స్త్రీల కవిత్వం

స్త్రీ ఒక తల్లికి కూతురు, ఒక శిశువుకు తల్లి, ఒక అన్నకు చెల్లి, ఒక తమ్మునికి అక్క, ఒక పురుషునికి భార్య, ప్రియురాలు, ఒక అత్తకు కోడలు. ఇలా స్త్రీకి ఎన్నో అవతారాలు. పురుషునితో సమానంగా ఇప్పుడు స్త్రీలు కూడ ఆఫీసులలో, కంపెనీలలో, కళాశాలలో పని చేస్తున్నారు, కానీ తక్కువ వేతనంతో. సంఘంలో స్త్రీని ఇంకా ఒక ఆటవస్తువుగానే కొందరు భావిస్తున్నారు. స్త్రీ హృదయంలో కలిగే భావాలు, క్షోభలు, సుఖ దుఃఖాలు, కన్నీళ్ళు, ప్రేమలు, కామాలు – ఇవన్నీ కవితకు మంచి సారవంతమైన క్షేత్రం. ఒక వంద సంవత్సరాలుగా స్త్రీల కవితలు ఎంతగానో ముందడుగు వేసింది. స్వాతంత్ర్యానికి ముందు ముగురమ్మలు దీనికి మూలకారకులు. వారు – విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని. మచ్చుకు వారి కవిత ఒకటి కింద ఇస్తున్నాను. సౌదామినిగారి “దురదృష్టాన్ని” చదివిన తరువాత కళ్ళ నీళ్ళు బెట్టుకోని వాళ్ళు అరుదుగా ఉంటారు.

అరమరలేని మన చిరతర స్నేహరుచుల్
కురిసిన వెన్నెలలా, అరవిరిసిన మల్లియలా

మనమున నెవ్వగలే మాసెను ఘనమగు నెయ్యములో
మెరపుల గుంపేమో అది కరగని వెలుగేమో

దినములు నిముసములై చనియెను తిన్నని నడకలతో
కన్నుల తళుకేమో అది పున్నెపు ప్రోవేమో

జీవితమున కంతా అది చెలువపు నిగ్గేమో
పరమ ప్రేమకు చిహ్నమైన తెలి వెన్నెల కాంతుల సన్నపు తళుకేమో
– విశ్వసుందరమ్మ, స్నేహరుచి

కను మూసి లేచాను వెనుదిరిగి చూశాను
కనలేదు ఆ జంట, వినలేదు ఆ జాడ
గుండె గుబగుబ లాడెను
నా గొంతు
ఎండి గుటకడదాయెను

పిలిచాను పిలిచాను అలసిపోయాను
అలసిపోయిన గుండె అట్టె ముడిపోవ
ఆకాశమున కెగిరితి
అక్కడా
అంధకారమె చూసితి

కేక వినబడదాయె చూపు కనబడదాయె
అంధకారములోన అట్టె రెక్కలు ముడిచి
అవనిపై బడితిని
అక్కడా
అంధకారమె గంటిని
– బంగారమ్మ, తమస్సు

చూచితి మెంతో దేశము
సుఖము, శాంతి దొరకునొ యని
మునిగితి మెన్నో నదులను
మోక్షము చేపట్టుద మని
ఎక్కితి మెన్నో కొండల
నీశ్వరు దర్శింతా మని
మ్రొక్కితి మెన్నో వేల్పుల
కొక్క పండు వర మిమ్మని
నోచితి మెన్నో నోములు
కాచి బ్రోచు నని పార్వతి
కడకు దేవి దయచేతను
కంటిమి రత్నములు రెండు
బతుకు కలంకారముగా
వాని దాచ చేతగాక
ఎచటనొ పోగొట్టుకొంటి
మెంతటి దురదృష్టముననొ
– సౌదామిని, దురదృష్టము

అరవైయవ దశకమునుండి స్త్రీల కవిత్వము, స్త్రీవాద కవిత్వము తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొన్నది. జయప్రభ, ఓల్గా, రేవతిదేవి, ఈశ్వరి, సావిత్రి వంటి కవులు ఒక కొత్త చేవను, బలాన్ని, దృక్పథాన్ని సాహిత్యంలో సృష్టించారు. అమెరికాలాటి విదేశాల్లో ఉండే స్త్రీలు కూడా ఈ ఉద్యమంలో ముఖ్య పాత్రలే. వీరి కవితలను చదువుతుంటే ఒక కథను చదివేలా అనుభూతి కలుగుతుంది. కింద కొన్ని కవితాభాగాలను ఉదాహరణలుగా ఇస్తున్నాను.

….
ఇద్దరి రక్తమూ ఎర్రగానే వుంది
ఇద్దరి రక్తమూ వేడిగానే వుంది
ఇద్దరి రక్తమూ ఉప్పగానే వుంది
అంతే
ఆ తర్వాతెప్పుడూ అనుకరించలేదు నా పూజ్య పూర్వీకుల్ని
ఆలోచించేవాణ్ణి శాస్త్రీయంగా నా మేధస్సుతో నేను
ఆచరించేవాణ్ణి ఏది సమంజసమనిపిస్తే దాన్ని
అనుసరించేవాణ్ణి ఏది యోగ్యమనిపిస్తే దాన్ని
– పెళ్ళకూరు జయప్రద, నేస్తం ఆలోచించు

అది రాత్రి సరిగ్గా రెండు నిలువు గీతల సమయం
కొబ్బరాకుల నిలువు పాపిట మీద
మంచు బొట్టొకటి మిసమిసా నాకేసి చూస్తోంది
ఎదలోపల ఎక్కడో ఖరీదైన జ్ఞాపకం కాలుతోంది
గుండెలోపల పండిన మొగలిరేకు గుచ్చుకొన్నట్లు
చివ్వుమన్న బాధ రివ్వుమన్న సువాసన

– కొండేపూడి నిర్మల, నిద్రపట్టని రాత్రి

పురుషుడికి అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి
అందచందాలున్నాయి
గుణగణాలున్నాయి
తెలివితేటలున్నాయి
అవన్నీ పురుషుడికి
తల్లిగా
ప్రేయసిగా
స్త్రీ ఇస్తుంది
అన్ని ఇచ్చి
చివరికి
మగాడి చేతిలో
ఆటబొమ్మవుతుంది
– రేవతీదేవి, స్త్రీ

పాఠం ఒప్పజెప్పకపోతే
పెళ్ళి చేస్తానని
పంతులుగారన్నప్పుడే భయం వేసింది
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమున్నా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే
అనుమానం వేసింది
వాడికేం మహారాజని
ఆడా మగా వాగినప్పుడే
అర్థమయిపోయింది
పెళ్ళంటే పెద్ద శిక్షని
మొగుడంటే స్వేచ్ఛభక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని
– సావిత్రి, ఒక ఆడపిల్ల స్వగతం

నీకూ మంచి రోజు లొస్తున్నాయిరా కన్నా
ఆడదిగా పుట్టనని అడవిలో మానైనా కాలేదని
విలపించే రోజులు
పోతున్నాయిలే తల్లీ
ఎందుకంటే
నీవు అమ్మ పొట్టలోంచి
బైటికే రావుగా
– ఈశ్వరి

ఏమిటీ అలా వెతుకుతున్నావు
ఆ రంగుటద్దాలు తీసేసి
నా కళ్ళు పెట్టుకొని
నీలోకి చూసుకో
తెలుస్తుంది –
నీలో సగం నేనేనని
– ఇందిర కొల్లి, నీవు నేను