జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3

1979 లో అమెరికన్ ఆటగాళ్ళ సమాచారాన్ని ఉపయోగించిన మరొక పరిశోధన The Skeptical Inquirer జర్నల్ లో ప్రకటించబడ్డది. అది మార్స్ ఎఫెక్టుని నిర్ధారించలేదు. అయితే ఆ పరిశోధన చాలా వివాదస్పదమైంది. తీవ్రమైన వాదోపవాదాలు నడిచాయి. ఆ పరిశోధనల్ని గోక్‌లా సవాలు చెయ్యడం జరిగింది. ఆ పరిశోధన మార్స్ ఎఫెక్టుని నిర్ధారిస్తున్నది అని కూడా కొంతమంది నిరూపించడానికి ప్రయత్నించారు. 1982 లో గోక్‌లా ని కూడా భాగస్తుడిగా చేసి మళ్ళీ కొత్తగా ఇంకొక పరిశోధన మొదలైంది. అయితే అది పూర్తి కాకుండానే నిలిచిపోయింది.

1986 లో ఇద్దరు జర్మన్ పరిశోధకులు (Arno Müller, Suitbert Ertel) జర్మన్ డాక్టర్ల వివరాలను పరిశోధించి మార్స్ ఎఫెక్టు నిజమేనని తేల్చారు. అంతేకాదు, గోక్‌లా పరిశోధన శాస్త్రీయమే అని కూడా ప్రకటించారు. 1989 లో ముల్లర్ మరొక పరిశోధన చేసి, రచయితల విషయంలో చంద్రుని ప్రభావం ఉన్నది అన్న గోక్‌లా పరిశోధనా ఫలితాన్ని నిర్ధారించలేకపోయాడు. కానీ, పత్రికా రచయితల విషయంలో గురు, శనుల ప్రభావాన్ని ధ్రువ పరిచాడు.

ఇప్పటికి కూడా ఈ పరిశోధనల గురించి భిన్నాభిప్రాయాలు చర్చలూ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అయితే హేతువాదుల, సైంటిస్టులలో ఉన్న ప్రధానమైన అభిప్రాయం ఏమిటంటే మిషెల్ గోక్‌లా పరిశోధనల్లో సమాచార సేకరణలోనూ, ఎంపికలోనూ జ్యోతిషం నిజమని నిరూపించడంకోసం ఉద్దేశ్యపూర్వకంగా పక్షపాతం వహించడం (sampling bias) జరిగిందని. ఇంగ్లండులో ఒక యూనివర్సిటీలో జరుగుతున్న జ్యోతిష పరిశోధనలకి పర్యవేక్షకుడిగా ఉన్న ఒక పెద్దాయనని నేను కలుసుకుని వ్యక్తిగతంగా చాలాసార్లు జ్యోతిషం గురించి చర్చించడం జరిగింది. ఆయన జాఫ్రీ డీన్ కి స్నేహితుడు కూడా. మిషెల్ గోక్‌లా భార్యని (ఆవిడ కూడా పరిశోధనల్లో భాగస్తురాలు) తాము కలిసి మాట్లాడడం జరిగిందనీ, ఆవిడని ప్రశ్నించగా సమాచారం ఎంపికలో తేడా జరిగిందని తమ సమక్షంలో ఆవిడ ఒప్పుకుందనీ ఆయన నాకు చెప్పాడు. అందుకే గోక్‌లా చేసిన పరిశోధనల తాలూకు సమాచారాన్ని (డేటా) ఇంకా పరిశీలిస్తూ పోవడం దండుగ అని ఆయన అభిప్రాయపడుతూ ఉంటాడు.

అయితే స్వతంత్రంగా వేరే పరిశోధకులు చేసిన పరిశోధనల్లో కూడా ఇవే ఫలితాలు వచ్చాయి కదా. ఏది ఏమైనా గోక్‌లా నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదని కూడా చాలామంది అభిప్రాయం.మిషెల్ గోక్‌లా ఫలితాల్ని (ముఖ్యంగా మార్స్ ఎఫెక్టుని) నిజమనే భావించినా, స్టాటిస్టిక్సు ప్రకారం పరిశీలిస్తే అది చాలా బలహీనమైన ప్రభావాన్నే సూచిస్తుందనీ (0.04 correlation), గణాంకాల ప్రకారం చేసే ప్రయోగాల్లో అనేక ఇతర కారణాల మూలంగా అటువంటి ఫలితాలు రావడం సహజమేననీ జాఫ్రీ డీన్ అంటాడు. అంతే కాదు, అసలు మిషెల్ గోక్‌లా ప్రయోగాలకీ జ్యోతిషానికీ ఏమీ సంబంధం లేదనీ, మార్స్ ఎఫెక్టుని జ్యోతిష్కులు జ్యోతిషం శాస్త్రీయమే అని నిరూపితమైందని వాడుకోడానికి కుదరదనీ కూడా హేతువాదులు అంటారు.

ఏది ఏమైనా మిషెల్ గోక్‌లా ఇరవయ్యవ శతాబ్దపు జ్యోతిష చరిత్రలో చాలా బలమైన ముద్ర వేశాడనీ, జ్యోతిష్కుల్లో శాస్త్రీయమైన పరిశోధన పట్ల ఆశనీ, ఆసక్తినీ రేకెత్తించడంలో సఫలమయ్యాడనీ అనడంలో సందేహం లేదు.

తర్వాత రాబోయే అంశాలు:

1.Journal of Scientific Exploration (2002, Vol. 16, No.1) లో Dr. Frank McGillion పీనియల్ గ్లాండ్ గురించి రాసిన అంశాల గురించిన స్థూలమైన వివరణ.
2.జ్యోతిషానికి సంబంధించిన కొన్ని సూక్ష్మాంశాలు
3.జ్యోతిషాభిమానులకి కొన్ని సూచనలు.


మిషెల్ గోక్‌లా పరిశోధనలకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ క్రింది పుస్తకాలనీ, వెబ్ సైట్లనీ చూడండి:

1.The Truth About Astrology by Michel Gauquelin – గోక్‌లా పరిశోధనల గురించి క్లుప్తంగానూ, సమగ్రంగానూ వివరిస్తుందీ పుస్తకం. ఈ వ్యాసంలో ఉపయోగించబడ్డ సమాచారం ప్రధానంగా దీని నుంచే స్వీకరించబడింది.
2. మిషెల్ గోక్‌లా రాసిన కొన్ని పుస్తకాలు – The Cosmic Clocks, The Scientific Basis of Astrology, Cosmic Influences on Human Behavior, Birth-Times: A Scientific Investigation of the Secrets of Astrology.
3.Astrology & Science: ఇందులో ముఖ్యంగా మిషెల్ గోక్‌లా గురించి జాఫ్రీ డీన్ రాసిన మూడు భాగాల వ్యాసం చాలా ఉపయోగకరమైనది.
4. మిషెల్ గోక్‌లా పరిశోధనల గురించిన చాలా సమాచారం ఇక్కడ దొరుకుతుంది.