జ్యోతిషమూ – లోపలి సంగతులూ - 3
వ్యక్తిత్వ లక్షణాలు: గోక్‌లా అనేక మంది ప్రసిద్ధులైన వ్యక్తుల జీవిత చిత్రణల్ని పరిశీలించి అయా వ్యాసాలు లేక గ్రంథాలలో ఆ వ్యక్తుల లక్షణాలని వర్ణించడానికి వాడిన పదాల్ని సేకరించాడు (ధైర్యవంతుడు, ఆత్మవిశ్వాసం కలవాడు, ఆలోచనాపరుడు మొదలైన పదాలు). అటువంటి యాభైవేల పదాలు తీసుకుని వ్యక్తులనీ, వాళ్ళ లక్షణాలని వర్ణించడానికి వాడిన పదాలనీ పట్టికల్లో వర్గీకరించాడు. తరవాత ఆయా వ్యక్తుల జన్మ సమయాలు సేకరించి, వాళ్ళు పుట్టినప్పుడు గ్రహాలు ఏ సెక్టర్లలో ఉన్నాయో కూడా పట్టికల్లో నమోదు చేశాడు. ఆ పట్టికలన్నీ విశ్లేషించి, జ్యోతిష సాంప్రదాయం ప్రకారం ఏ లక్షణాలు ఏ గ్రహాలకి ఆపాదిస్తారో, అవే గ్రహాలు ఆ లక్షణాలు గలవాళ్ళ జన్మసమయంలో సెక్టరు 1, 4 ల్లో ఎక్కువగా కనిపిస్తాయి అని నిరూపించాడు. ఇదే పరిశోధనని మరొకసారి అమెరికాకి చెందిన వ్యక్తుల సమాచారంతో కూడా చేసి, అవే ఫలితాల్ని సాధించాడు.
భూ అయస్కాంత క్షేత్ర ప్రభావం: గ్రహాల ప్రభావం ఆనువంశికంగా పని చేస్తుందని తన ప్రయోగాలు నిరూపించడంతో గోక్‌లా ఒక ప్రశ్న వేసుకున్నాడు. తన పరిశోధనల ప్రకారం నిరూపణ అవుతున్న విషయం ఏమిటంటే జన్మించబోతున్న శిశువు ఒక గ్రహ ప్రభావానికో, ప్రేరణకో గురి అవుతున్నది. అటువంటి ప్రభావానికి గురి అయ్యే తత్త్వం జీన్సు ద్వారా ఆనువంశికంగా వస్తుందేమో ప్రస్తుతానికి తెలియదు కానీ, అసలు పిండ దశలో ఉన్న శిశువు గ్రహాల ప్రభావానికి గురి అవ్వడం ఎలా సాధ్యమౌతోంది? అటువంటి ప్రభావం ఉంటే అది ఖచ్చితంగా భౌతికమైన శక్తి ఏదో అయి ఉండాలి అని అతడు భావించాడు. గ్రహాల గురుత్వాకర్షణ గానీ, విద్యుదయస్కాంత క్షేత్రాలు గానీ భూమి మీది మానవుల్ని ప్రభావితం చెయ్యడం అసాధ్యం. అయితే భూఅయస్కాంత క్షేత్రం (Geomagnetism) చాలా బలహీనమైనదే అయినప్పటికీ (0.3 నుంచి 0.4 గాస్, అంటే బజారులో ఆట బొమ్మల్లో దొరికే చిన్న అయస్కాంతాల కన్నా బలమైనదేమీ కాదు), మనుషులూ జంతువులూ అంత బలహీనమైన అయస్కాంత క్షేత్రాలకి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నదని కొందరు సైంటిస్టులు ప్రతిపాదించారు. కాబట్టి పుట్టబోయే శిశువులమీద భూఅయస్కాంత క్షేత్ర ప్రభావం ఉందేమో పరిశీలించడానికి అతను పూనుకున్నాడు.
భూ అయస్కాంతక్షేత్రంలో కలిగే మార్పుల్ని ప్రతీ రోజూ నమోదు చేస్తారు. ఆ మార్పుల్ని 0.0 నుంచి 2.0వరకూ ఉండే ఒక స్కేలుతో సూచిస్తారు (International Magnetic Character, Ci). ఒకరోజు ఈ ‘సై’ విలువ 0.0 ఉంటే ఆ రోజు భూ అయస్కాంత క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉందని అర్ధం. అలాగే అది 2.0 ఉంటే, భూ అయస్కాంత క్షేత్రంలో తుఫానులు చెలరేగుతున్నాయని అర్ధం. భూ అయస్కాంత క్షేత్రంలో అటువంటి మార్పులకి కారణం సూర్యుడిలో మచ్చలు ఏర్పడడం, సౌర జ్వాలలు (Solar Flares) చెలరేగడం మొదలైనవి. సూర్యుడిమీద ఇటువంటివి ఏర్పడిన కొన్ని గంటల్లోనే అవి భూమి మీద ప్రభావాన్ని చూపించడంవల్ల భూఅయస్కాంత క్షేత్ర తీవ్రతలో మార్పులు వస్తాయి.
గోక్‌లా ఏమి చేశాడంటే, తాను అంతకు ముందు ఆనువంశికతని నిరూపించడానికి ఉపయోగించిన పిల్లల జన్మకాల వివరాలకి వాళ్ళు పుట్టిన రోజున రికార్డు చెయ్యబడిన ‘సై’ విలువని జోడించాడు. సై విలువ ఎక్కువగా ఉన్నప్పుడు (1.౦ - 2.0) పుట్టినవాళ్ళకీ, తక్కువగా ఉన్నప్పుడు (0.0 - 0.9) పుట్టినవాళ్ళకీ గ్రహ స్థితుల ‘ఆనువంశికత’లో తేడాలేమైనా ఉన్నాయేమో పరిశీలించాడు. సై విలువ ఎక్కువగా ఉంటే, గ్రహ స్థితుల ‘ఆనువంశికత’ బలంగా కనపడింది. తక్కువగా ఉంటే బలహీనంగా కనపడింది. అయితే ఈ గ్రహాల్లో కూడా కేవలం కుజ, గురు, శనులకీ, వాటికన్నా బలంగా శుక్రుడికీ మాత్రమే ఈ విషయం ధ్రువపడింది. చంద్రుడి విషయంలో ధ్రువపడలేదు. అయినప్పటికీ, మొత్తానికి గ్రహాల ప్రభావం భూ అయస్కాంత క్షేత్రం ద్వారా సాధ్యపడుతున్నది అన్న ప్రతిపాదనని మిషెల్ గోక్‌లా ఈ పరిశోధన ద్వారా పైకి తీసుకువచ్చాడు. ఈ ప్రతిపాదన పట్ల ఇప్పటికీ పాశ్చాత్య జ్యోతిష్కుల్లో చాలా నమ్మకం ఉన్నది.
అయితే సిజేరియన్ ద్వారా జన్మించే శిశువుల్లో ఈ గ్రహ స్థితుల ఆనువంశికత కనిపించడం లేదనీ, విరివిగా జరుగుతున్న సిజేరియన్ జననాల వల్ల ఈ ‘నవీన జ్యోతిషం’ ద్వారా కనిపెట్టబడిన ఒక ప్రకృతి సహజమైన నియమంలో మానవులు జోక్యం చేసుకుని ఆ నియమాన్ని జరగనివ్వడం లేదనీ అతను ఆవేదన చెందాడు.
గోక్‌లా పరిశోధనలూ -సాంప్రదాయ జ్యోతిషం: మిషెల్ గోక్‌లా మొదట్లో సాంప్రదాయ జ్యోతిషాన్ని విశ్వసించి, దాని ప్రేరణతోనే తన పరిశోధనలని మొదలుపెట్టినా, తన పరిశోధనల్లో పురోగతి సాధించేకొద్దీ సాంప్రదాయ జ్యోతిషం పై విశ్వాసాన్ని కోల్పోయాడు. తన పరిశోధనల ఫలితంగా ఒకానొక శాస్త్రీయమైన నవీన జ్యోతిషం ఆవిష్కరించబడుతోందని విశ్వసించాడు. గోక్‌లా పరిశోధనా ఫలితాలు సాంప్రదాయ జ్యోతిషానికి చాలామటుకు విరుద్ధంగా కనిపిస్తాయి.
గోక్‌లా సెక్టర్లు 1,4 ల్లో ఉండే గ్రహాలు ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయని అతడి పరిశోధనలు సూచిస్తున్నాయి గానీ, సాంప్రదాయ జ్యోతిషం ప్రకారం ఈ సెక్టర్లు సుమారుగా 12, 9 భావాల్ని సూచిస్తాయి. అయితే ఈ భావాల కారకత్వాలు గోక్‌లా సెక్టర్లు సూచించే అంశాలకి చాలా విరుద్ధమైనవి. (సాంప్రదాయ జ్యోతిషంలో 1, 10 భావాల కారకత్వాలు ఈ సెక్టర్ల ఫలితాలతో సరిపోతాయి. అయితే అవి గోక్‌లా సెక్టర్లలో సుమారుగా 12, 3 ల స్థానంలో ఉంటాయి.)
గోక్‌లా పరిశోధనలు కేవలం ప్రసిద్ధులైన వ్యక్తుల విషయంలోనే ఫలితాలని ఇచ్చాయి. సామాన్యుల విషయంలో ఇటువంటి గ్రహ ప్రభావాలేమీ నిరూపితం కాలేదు.
గోక్‌లా పరిశోధనలు బుధుడు, సూర్యుడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల ప్రభావం ఏమీ లేదని నిరూపించాయి. (సాంప్రదాయ జ్యోతిషంలో బుధుడు, సూర్యుడు చాలా ప్రధానమైనవి.) అయితే సూర్యుడు భూఅయస్కాంత క్షేత్రంలోమార్పులకి కారకుడు కాబట్టి సూర్యుడి ప్రభావం పరోక్షంగా ఉన్నట్టే అని గోక్‌లా భావన. తాను సేకరించిన వ్యక్తిత్వ లక్షణాల సమాచారాన్ని ఉపయోగించి రాశుల ప్రభావం ఏమైనా కనపడుతుందేమోనని అతను శోధించాడు. కానీ వ్యక్తుల లక్షణాల్లో రాశుల ప్రభావం ఏమీ కనపడలేదు. అయినప్పటికీ గ్రహాల ప్రభావం మానవుల జీవితాలపై ఉన్నది అనే అత్యంత ప్రాథమికమైన జ్యోతిష ‘భావన’ ఈ పరిశోధనల వల్ల సత్యమని నిరూపించబడింది అని చాలామంది జ్యోతిష్కులు భావిస్తారు.
గోక్‌లా పరిశోధనలు – వివాదాలూ, సందేహాలూ: సహజంగానే గోక్‌లా పరిశోధనల ఫలితాలు ప్రకటించబడగానే హేతువాదులూ, సైంటిస్టులూ కత్తులు దూశారు. దశాబ్దాలపాటు పరిశోధనలూ, చర్చలూ, వివాదాలూ కొనసాగాయి. అతను తన పరిశోధనల ఫలితాల్ని మొదట 1955 లో ప్రకటించిన తరువాత బెల్జియంలోని శాస్త్రీయ పరిశోధకులకి తన పరిశోధనల వివరాల్ని సమర్పించి పరిశీలించమని కోరాడు. 1962 లో అతని పరిశోధనల్లో లోటుపాట్లు లేవని నిర్ధారణకి వచ్చిన తరువాత, వాళ్ళు 500 మంది బెల్జియన్ ఆటగాళ్ళ వివరాలు సేకరించి ‘మార్స్ ఎఫెక్టు’ ని పరిశోధించడానికి పూనుకున్నారు. అయితే ఆ పరిశోధనలో కూడా ‘మార్స్ ఎఫెక్టు’ బయట పడడంతో చాలా గందరగోళం (రాజకీయం) నడిచింది. మొత్తానికి 1977 దాకా ఆ పరిశోధన వివరాల్ని బహిర్గతం చేయడం జరగలేదు.