మిషెల్ గోక్‌లా (Michel Gauquelin) పరిశోధనలు
గ్రహాల దైనందిన చలనం:(Diurnal Motion) మిషెల్ గోక్‌లా చేసిన పరిశోధనల్ని అర్ధం చేసుకోవాలంటే, మొదట గ్రహాల దైనందిన చలనం (Diurnal Motion) అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ వ్యాసం మొదటి భాగంలో భావాల గురించి వివరించడం జరిగింది. అందులో పరిచయం చేసిన భావనే ఇది. భూమి నుండి పరిశీలించినప్పుడు భూ భ్రమణాన్ని అనుసరించి తూర్పు నుండి పడమరకి గ్రహాలూ, నక్షత్రాలూ ఉదయించి అస్తమిస్తూ ఉంటాయి. ఒక ప్రదేశంలో ఒక సూర్యోదయం నుంచీ మరొక సూర్యోదయం వరకూ పట్టే కాలం ఆ ప్రదేశానికి ‘సౌర దినం’ అనుకుందాము. ఇది మనం మామూలుగా లెక్కపెట్టుకునే ఇరవై నాలుగు గంటల రోజు కాదు. ప్రదేశాన్ని బట్టి, ఋతువుని బట్టి ఈ రోజు పరిమాణం మారుతుంది. అదే విధంగా ఒక ప్రదేశంలో మిగతా గ్రహాలూ, నక్షత్రాలూ కూడా వేర్వేరు కాలాల్లో ఉదయించి అస్తమిస్తూ ఉన్నట్టుగా కనిపించే చలనాన్నే ఆయా గ్రహాల, నక్షత్రాల దైనందిన చలనం అంటారు.
ఈ దైనందిన చలనం అన్న భావన ఖగోళ శాస్త్రానికి చెందినది. దీనిలో చాలా విశేషాలే ఉంటాయి, కానీ మనకి ప్రస్తుతానికి పూర్తి వివరాలు అవసరం లేదు. గోక్‌లా ఏమి చేశాడంటే ప్రతీ గ్రహమూ తన దైనందిన చలనం ప్రకారం ఆకాశంలో ఉదయించి, నడినెత్తికి చేరి, అస్తమించి, మళ్ళా ఉదయించే గమన మార్గాన్ని కొన్ని సెక్టర్లుగా విభజించాడు. జాతకంలోని భావాలు కూడా ఇటువంటి విభాగాలే కానీ, భావాలూ, గోక్‌లా సెక్టర్లూ ఒకటి కాదు. ఈ సెక్టర్లు 12, 18, 36 ఇలా ఎన్ని విభాగాలు గానైనా ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. కుజుడి దైనందిన చలనాన్ని పన్నెండు సెక్టర్లుగా విభజించిన ఈ క్రింది రేఖా చిత్రాన్ని చూడండి. ఇది అక్టోబర్ 3, 1952 వ తేదీన పారిస్ నగరానికి లెక్క వేయబడింది.

మార్స్ ఎఫెక్టు: జ్యోతిషం మీద పరిశోధన చెయ్యలనే ఆసక్తితో ఫ్రెంచి వాడైన మిషెల్ గోక్‌లా (1928 – 1991) 1950 ప్రాంతాలలో అనేక ప్రసిద్ధులైన వ్యక్తుల జన్మ తేదీలు, జన్మ సమయాలు సేకరించాడు. ప్రసిద్ధులైన 576 ఫ్రెంచి డాక్టర్ల జన్మ సమయాలకి గ్రహ స్థితుల్ని గుణించి ఏ సెక్టర్లలో ఏ గ్రహాలు ఉన్నాయో స్టాటిస్టిక్సు ప్రకారం పరిశీలించాడు. ఆశ్చర్యకరంగా అతను గమనించిందేమిటంటే, డాక్టర్లలో ఎక్కువశాతం మందికి కుజుడు, శని 1, 4 సెక్టర్లలో ఉన్నారని. అలాగే అవే సెక్టర్లలో గురుడు ఉండడం తక్కువగా ఉందని. ఈ విధమైన గ్రహ స్థితి రాండమ్ చాన్సు ద్వారా రావలసిన ఫలితాల కన్నా భిన్నంగా ఉండడంతో, అతను అదే సంవత్సరాల్లో పుట్టిన డాక్టర్లు కాని సామాన్యుల జన్మ వివరాలు కూడా సేకరించి వాళ్ళ గ్రహ స్థితులు పరిశీలించి వాళ్ళ విషయంలో ఆ విధంగా జరగడం లేదని నిర్ధారించుకున్నాడు. డాక్టర్ల విషయంలో తన ఫలితాల్ని నిర్ధారించుకోడానికి మళ్ళా 508 మంది ప్రసిద్ధులైన డాక్టర్ల వివరాలు సేకరించి గ్రహ స్థితులు పరిశీలిస్తే మళ్ళీ అదే విధమైన ఫలితాలు వచ్చాయి.
దానితో అతను ఆరు వేలమంది వివిధ రంగాలకి చెందిన ప్రసిద్ధులైన వ్యక్తుల జన్మ వివరాలు సేకరించి అదే విధమైన పరిశీలన చేశాడు. ప్రసిద్ధులైన ఆటగాళ్ళూ, సైనికాధికారులూ కుజుడు 1, 4 సెక్టర్లలో ఉండగా జన్మిస్తున్నారనీ, గురుడు అవే సెక్టర్లలోఉండగా నటులూ, రాజకీయ నాయకులూ జన్మిస్తున్నారనీ, శని అవే సెక్టర్లలో ఉండగా సైంటిస్టులు జన్మిస్తున్నారనీ గమనించాడు. కానీ చిత్రకారులూ, సంగీతకారులూ మాత్రం శని 1, 4 సెక్టర్లలో ఉండగా జన్మించడం తక్కువని కూడా గమనించి, తన పరిశోధనా ఫలితాల్ని 1955 లో ప్రకటించాడు.
ఆటగాళ్ళ జన్మ సమయంలో కుజుడు ఉన్న సెక్టర్ల తీరుని ఈ క్రింది రేఖాచిత్రంలో చూడవచ్చు.

ఈ రేఖాచిత్రం కుజ గ్రహ ప్రభావానికి (మార్స్ ఎఫెక్టు) సూచికగా ప్రసిద్ధికెక్కింది. ఇది ఆటగాళ్ళ జన్మ సమయాల్లో మిగతా సెక్టర్ల కన్న ఒకటి, నాలుగు సెక్టర్లలో కుజగ్రహం ఎక్కువగా కనిపిస్తుందని సూచిస్తోంది. సెక్టరు ఒకటి అంటే ఒక గ్రహం ఉదయించిన తరువాత సుమారుగా రెండు గంటల కాలం. సెక్టరు నాలుగు అంటే ఒక గ్రహం నడినెత్తికి చేరిన తరువాత సుమారు రెండు గంటల కాలం. తరువాతి సంవత్సరాల్లో అతను ఫ్రాన్సులోనే కాకుండా అమెరికా, ఇంకా ఇతర యూరోపియన్ దేశాల్లోనుండి కూడా అనేక వేలమంది జన్మ వివరాలు సేకరించాడు. వాటి సహాయంతో గ్రహస్థితులు లెక్కవేసి ఫలితాల్ని విశ్లేషిస్తే అవి కూడా అంతకు ముందు వచ్చిన ఫలితాల్నే నిర్ధారించాయి.
సహజంగానే ఈ ఫలితాలు హేతువాదులూ, సైంటిస్టుల ఆసక్తిని రేకెత్తించాయి. ఆ ఫలితాల మీద అనేక పరిశీలనలూ, విశ్లేషణలూ, వేర్వేరు చోట్ల ఇవే పరిశోధనలు మళ్ళీ చేయడమూ (replication) కూడా జరిగింది. పెద్దయెత్తున వివాదాలూ చర్చలూ నడిచాయి. ఇవి ఇంకా పూర్తిగా సమసిపోలేదు. వాటి వివరాలు కొన్ని తెలుసుకునే ముందు గోక్‌లా పరిశోధనల విశేషాలు మరి కొన్ని తెలుసుకుందాం.
జ్యోతిషమూ – ఆనువంశికత
కొంతమంది జ్యోతిష్కుల విశ్వాసం ప్రకారం తల్లితండ్రుల జాతకాల్లోని గ్రహ స్థితులకీ, పిల్లల జాతకాల్లోని గ్రహ స్థితులకీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకి ఒక జ్యోతిష సూత్రం ప్రకారం తల్లి లేదా తండ్రి యొక్క జాతకంలో లగ్న, సూర్య, చంద్రులు ఏ రాశుల్లో ఉన్నారో, అవే రాశుల్లో పిల్లల లగ్న, సూర్య, చంద్రుల్లో ఒకరు ఉంటారు. ఇటువంటి విశ్వాసాలని ఆధారంగా చేసుకుని, గ్రహ స్థితులకీ ఆనువంశికతకీ (heredity) ఏమైనా సంబంధం ఉందేమో పరిశీలించడానికి గోక్‌లా పూనుకున్నాడు. తల్లితండ్రులూ, వాళ్ళ పిల్లలవీ కలిపి మొత్తం 30,000 మంది యొక్క జననకాల వివరాలు సేకరించాడు. వాళ్ళ గ్రహస్థితుల్ని పోల్చి, గణాంకాల ప్రకారం అతడు నిరూపించిందేమిటంటే, తల్లిదండ్రుల జన్మ సమయంలో 1 లేక 4 వ సెక్టర్లో ఏ గ్రహం ఉన్నదో, పిల్లల జన్మ సమయంలో కూడా అదే గ్రహం 1,4 సెక్టర్లలో ఏదో ఒకదానిలో ఉంటుందని. (ఇది రాండమ్ చాన్సు కన్నా ఎక్కువ శాతం మాత్రమే సుమా. నూటికి నూరు శాతం సందర్భాల్లో కాదు). ఈ ఫలితాలని మళ్ళా నిర్ధారించుకోవడం కోసం అతను మరొక ముప్ఫై వేల జనన కాల వివరాలు సేకరించి వాటితో కూడా మళ్ళీ అవే ఫలితాలని పొందాడు.