ఈమాట » జ్యోతిషమూ – లోపలి సంగతులూ - 3

Expand to right
Expand to left

జ్యోతిషమూ – లోపలి సంగతులూ - 3

జ్యోతిషం నిజంగా పని చేస్తుందని తేలితే సైన్సు అయిపోతుందా?

జ్యోతిషం పైన ఇంతవరకు జరిగిన పరిశోధనలు అన్నీ స్టాటిస్టిక్సు మీద ఆధారపడినవి. జ్యోతిష్కులకి జాతకాలు ఇచ్చి వాళ్ళు ఒక విషయాన్ని సరిగ్గా అంచనా వెయ్యగలిగారో లేదో చూడడం, లేదా అనేకమంది జాతకాలని వాళ్ళ జీవితవిశేషాలతో పోల్చి అవి జ్యోతిష ఫలితాలకి అనుగుణంగా ఉన్నాయో లేదో చూడడం లాంటివి ఈ పరిశోధనల్లో ఉంటాయి. ఈ పరిశోధనల్లో కొన్నిటి గురించి చర్చించుకునే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. నిజంగానే గణాంకాల ప్రకారం జాతకాలకీ జీవిత సన్నివేశాలకీ పొంతన ఉన్నది అని నిరూపించబడింది అనుకోండి. అప్పుడు జ్యోతిషం నిజమైపోయినట్టేనా? సైన్సు అయిపోయినట్టేనా? సైన్సు ఎలా పురోగమిస్తుందో తెలుసుకుంటే దీనికి సమాధానం కొంతవరకు దొరుకుతుంది. (ఈ చర్చ The mind in the cave, p48-49 ఆధారంగా చేయబడ్డది. )

ఏదైనా ఒక క్రొత్త విషయం పరిశీలనల్లో బయటపడినప్పుడు దానికి సంబంధించిన వివరణల్ని (explanation of a phenomenon) నిర్మించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అటువంటి వివరణ అప్పటికే నిరూపింపబడి, అంగీకరించబడిన పరిశీలనలకీ, సిద్ధాంతాలకీ అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకి ఏదైనా ఒక గ్రహ కక్ష్యలో చిన్న తేడా ఉన్నదనుకోండి. అది ఎలా వచ్చిందో వివరించడానికి ఆల్ఫా సెంటారి దగ్గర నివసిస్తున్న గ్రహాంతరవాసులు పంపిస్తున్న లేజర్ కిరణాలు కారణం అన్నారనుకోండి. మిగతా గ్రహాల కక్ష్యలన్నిటికీ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్నీ, ఈ ఒక్క గ్రహానికీ ఈ లేజర్ కిరణాల సిద్ధాంతాన్నీ ఉపయోగిస్తాను అంటే అది అంగీకారం కాదు. అదేవిధంగా అటువంటి వివరణ ఏదైనా సరే అంతర్గతంగా ఏకరీతిగా (internally consistent) ఉండాలి. అందులోని భాగాలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉండకూడదు. అలాగే వివరణలు ఏదో ఒక పరిమితమైన విషయాన్ని మాత్రమే వివరించగలిగేట్టుగా కాకుండా అనేక అంశాలకి అన్వయించగలిగేట్టు ఉండాలి. ఉదాహరణకి గురుత్వాకర్షణ కేవలం జడ పదార్థాలకి మాత్రమే పని చేస్తుంది, కదలగలిగే (లేక ఎగరగలిగే) వాటికి పని చెయ్యదు అని నిరూపించబడి ఉంటే బహుశా శాస్త్రజ్ఞులు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఒప్పుకుని ఉండేవారు కాదు.

అంతేకాకుండా ఒక వివరణ ఫలితంగా వెరిఫై చెయ్యగలిగే కొత్త విశేషాలు బయట పడేట్టు ఉండాలి. అలాగే ఒక వివరణ మరిన్ని కొత్త ప్రశ్నలకీ, పరిశోధనలకీ దారితీసి శాస్త్ర జ్ఞానాన్ని విస్తృతపరచే విధంగా ఉండాలి. జ్యోతిషం నిజమని నిరూపించబడింది అంటే ఒక కొత్త విషయం కనిపెట్టబడిందని అర్ధం. అయితే అది ఎలా పనిచేస్తోంది అన్న దానికి జ్యోతిష్కులదగ్గర ఏ విధమైన వివరణా ఉండదు. అధిక శాతం జ్యోతిష్కులు ‘As above, so below’ అన్న నానుడిని ఉటంకించి, మనిషి సమస్త విశ్వానికీ ఒక సూక్ష్మ ప్రతిబింబం లాంటి వాడు, కాబట్టి విశ్వాంతరాళంలో జరిగేవన్నీ మనిషిలో (మనిషి జీవితంలో) ప్రతిబింబిస్తూ ఉంటాయి అని ఉపన్యాసాలిస్తూ ఉంటారు. అదేమీ శాస్త్రీయమైన సిద్ధాంతం కాదు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే కొంత సైన్సు తెలిసినవాళ్ళూ, జ్యోతిషం పైన పరిశోధన చేసినవాళ్ళూ భూఅయస్కాంత క్షేత్ర ప్రభావం (Geomagnetism) మనిషి మెదడుపై ఉండవచ్చుననీ, జ్యోతిషం శాస్త్రీయమని నిరూపించబడడానికి ఆ దిశగా పరిశోధనలు జరగాలనీ ప్రతిపాదించారు. దాని గురించి తరువాత వివరిస్తాను. ప్రస్తుతానికి అది కూడా శాస్త్రీయమైన సిద్ధాంతమేమీ కాదు, కేవలం ఊహాగానం మాత్రమే.

జ్యోతిషం మీద పరిశోధన చేసిన మిషెల్ గోక్‌లా (Michel Gauquelin) అభిప్రాయం ప్రకారం (The Truth About Astrology, p 14-15) -గణాంకాల (స్టాటిస్టిక్సు) ద్వారా కనుగొనే సూత్రమేదైనా సరే ప్రకృతి సహజమైన నియమమే అనుకోవచ్చు. గ్రిగర్ మెండల్(Gregor Mendel) బఠాణీ మొక్కలని అంటుకట్టించే ప్రయోగాలు చేసి స్టాటిస్టిక్సు సహాయంతో ఆనువంశికతా నియమాన్ని కనుగొన్నాడు. కానీ మెండల్ కనుగొన్న విషయాన్ని ఒక 50 సంవత్సరాలపాటు ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే మెండల్ ఒక మతగురువు, ఔత్సాహికుడూ మాత్రమే, శాస్త్రజ్ఞుడు కాదు. పైగా అతడు కనుగొన్నది అప్పటి కాలంలో అంగీకరించబడిన సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉంది. అతడు తన ఆనువంశికతా నియమాల్ని కనుగొన్న ఒక వంద సంవత్సరాలకిగానీ డీ.ఎన్.ఏ ని కనుగొనడం, ఆ నియమాల్ని వివరించడానికి ఒక ఖచ్చితమైన భౌతిక ప్రాతిపదిక దొరకడం జరగలేదు. కాబట్టి మొదట జ్యోతిషం పని చేస్తుంది అని గణాంకాల ద్వారా నిరూపిస్తే సైంటిస్టులు జ్యోతిషాన్ని హాస్యాస్పదమైన విషయంగా కొట్టిపారెయ్యకుండా ముఖ్యమైన విషయంగా (సీరియస్ గా) తీసుకుని, పరిశోధనలు చెయ్యడానికి అవకాశం కలుగుతుంది అని మరికొందరు జ్యోతిష్కుల అభిప్రాయం. (ఇక్కడ స్టాటిస్టిక్సు గురించిన ఒక జోకు చెప్పకుండా ఉండలేను. స్టాటిస్టిక్సు తెలిసినవాళ్ళు క్షమించాలి. ఈ ప్రపంచంలో మూడు రకాల అబద్ధాలు ఉన్నాయట. మామూలు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, స్టాటిస్టిక్సు.)

అయితే ఇంతవరకూ జ్యోతిషం మీద జరిగిన పరిశోధనలన్నీ అసలు జ్యోతిషం పని చేస్తుంది అన్న విషయాన్ని పూర్తిగా సమర్ధించడమే (నిర్ధారించడమే) చెయ్యలేదు. ఎక్కువశాతం పరిశోధనలు జ్యోతిషం అబద్ధమని నిరూపించినా, కొన్ని పరిశోధనలు నిజమని కూడా నిరూపించాయి. (నిజమని నిరూపించినవి చాలా సందేహాస్పదమైనవి అని సైంటిస్టుల/ హేతువాదుల అభిప్రాయం.) ఒకవేళ ఎవరైనా స్టాటిస్టిక్సు సహాయంతో నిజంగా, సందేహాతీతంగా జ్యోతిషం పనిచేస్తుందని నిరూపించినా, అది వెంటనే ఉన్నపళంగా, యథాతథంగా సైన్సు అయిపోదు. అటువంటి నిరూపణ అనేకమైన ప్రశ్నలకీ, ప్రతిపాదనలకీ, పరిశోధనలకీ దారి తీస్తుంది మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జ్యోతిషం పైన జరిగిన కొన్ని పరిశోధనల వివరాల్ని చూద్దాము.

జ్యోతిషం పైన జరిగిన కొన్ని పరిశీలనలూ, పరిశోధనలూ

ఈ క్రింది పరిశోధనలు జ్యోతిషం పని చెయ్యదు అని నిరూపించాయి.

  1. 1967 లో మిషెల్ గోక్‌లా (The Cosmic Clocks, p 84) చేసిన పరిశోధనలో - జీవితంలో విజయాన్ని సాధించినవాళ్ళ జాతకాల్లో శని ఉండే ఇంటినీ, అలాగే హత్యలు చేసినవాళ్ళ జాతకాల్లో కుజుడు ఉండే ఇంటినీ పరిశీలించడం జరిగింది. ఈ రెండింటికీ శనీ, కుజుడూ ఏ ఇంట్లో ఉన్నారో అన్నదానితో సంబంధమే లేదని తేలింది.
  2. 1969 నుంచి 1973 మధ్యలో న్యూయార్కులో ఆత్మహత్య చేసుకున్న 311 మంది వ్యక్తుల జనన వివరాలు సేకరించారు (Journal of Geocosmic Research, v.2, 23-47, 1978). అందులోని ప్రతీ వ్యక్తికీ జోడుగా, అదే ప్రాంతంలో అదే సంవత్సరంలో పుట్టిన మరొక మామూలు వ్యక్తి వివరాల్ని రాండమ్ గా సేకరించారు. ఈ మొత్తం వివరాల్ని ఆత్మ హత్య చేసుకున్న సంవత్సరాల ప్రకారం మూడు భాగాలు చేసారు. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నవాళ్ళ జాతకాలనీ, చేసుకోనివాళ్ళ జాతకాలనీ పోల్చి చూశారు. ఆ పోల్చడంలో కూడా కొన్ని వేల జ్యోతిషాంశాలని తీసుకుని, అన్నింటినీ పోల్చారు. అందులో ఒక్క అంశం కూడా స్థిరంగా ఆత్మహత్యని సూచించలేదు.
  3. 1974 లో ప్రకటించిన మరొక పరిశోధనలో (Leonardo 7, 235 ) వృత్తికీ, ఆరోగ్య సమస్యలకీ, ఎత్తుకీ, ఆయుర్దాయానికీ - పుట్టినసమయంలో బుధ, శుక్ర, కుజ, గురు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్నదానికీ సంబంధమే లేదు అని తేలింది.
  4. 1979 లో జర్నల్ ఆఫ్ సైకాలజీ, జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీల్లో రెండు పరిశోధనలు ప్రకటించబడ్డాయి. వాటిప్రకారం ఒక వ్యక్తి అంతర్ముఖుడా, బహిర్ముఖుడా (Extroversion, Introversion) అన్న విషయానికీ, జ్యోతిషాంశాలకీ సంబంధం ఉన్నది అని తేలింది. అయితే అదే సంవత్సరం అవే పరిశోధనల్ని మళ్ళీ చేసి (replication) జర్నల్ ఆఫ్ సైకాలజిలో ప్రకటించిన ఫలితాల ప్రకారం ఆ విషయం రుజువు కాలేదు. అంతే కాకుండా మొదట వచ్చిన ఫలితానికి కారణం ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తులకి ఏ రాశులకి ఏ ఫలితాలు రావాలో ముందే తెలిసి ఉండడమే కారణం అని అదే సంవత్సరం మరొక జర్నల్ (Zeitschrift fur Sozilpsychologie, 10, 54 ) లో ప్రకటించబడింది. తరువాతి సంవత్సరాల్లో జరిగిన వేర్వేరు పరిశోధనల్లో కూడా ఈ అంతర్ముఖ, బహిర్ముఖత్వాలకీ జ్యోతిషాంశాలకీ ఏమీ సంబంధం లేదని రుజువైంది.
  5. 1979 లో (The Truth About Astrology, p140) మిషెల్ గోక్‌లా ఒక పత్రికలో ఉచితంగా జాతకం చెప్తామని ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనకి సమాధానమిచ్చిన 150 మందికి జాతక ఫలితాలు రాసి పంపించి, అవి ఎంతవరకు సరిపోతున్నాయో వాళ్ళనీ, వాళ్ళ బంధు మిత్రుల్నీ చెప్పమన్నాడు. ఒక డజనుమంది అతనికి సమాధానమిచ్చారు. అందులో 90 శాతం మందీ, వాళ్ళ బంధు మిత్రుల్లో 80 శాతం మందీ ఆ జాతక ఫలితాలు సరిపోతున్నాయని అన్నారు. అయితే మొత్తం అందరికీ అతడు ఒకే జాతక ఫలితాలు పంపించాడు. ఆ జాతకం కనీసం ఒక యాభై హత్యలు చేసి పేరు గడించిన ఒక హంతకుడిది.
  6. 1985 లో హారీ ఎడ్వర్డ్స్ అనే ఆయన 1984 వ సంవత్సరానికి చెందిన Old Moore’s Almanack అన్న పత్రికను తీసుకుని అందులోని ప్రిడిక్షన్సుని పరిశీలించాడు. అవి చాలా ప్రసిద్ధులైన జ్యోతిష్కులు రాసినవి. అతను పరిశీలించిన 200 ప్రిడిక్షన్సులో 5 శాతం కన్నా తక్కువ నిజమయ్యాయి. అవి కూడా యాదృచ్ఛికంగానో, ముందే తెలిసిన విషయాలవల్లనో నిజమవడానికే అవకాశాలు ఎక్కువ.
  7. 1985 లో నేచర్ పత్రికలో షాన్ కార్ల్సన్ అనే ఆయన 28 మంది నిపుణులైన జ్యోతిష్కులతో కలిసి చేసిన రెండు ప్రయోగాల్ని ప్రకటించాడు. అందులో ఒక ప్రయోగంలో 83 మందికి మూడు జాతకాలు, వాటి వివరణలు ఇచ్చి, ఆ వివరణల్నిబట్టి అందులో తమ జాతకమేదో గుర్తించమన్నాడు. కేవలం 28 మంది మాత్రమే తమ జాతకచక్రాల్ని గుర్తించగలిగారు. ఇది యాదృచ్ఛికంగా కలిగే ఫలితాల శాతాన్ని (random chance) మించలేదు. అలాగే జ్యోతిష్కులకి 116 మంది వ్యక్తుల వ్యక్తిత్వ విశ్లేషణా పత్రాలూ (Personality Index Survey), వాటికి జత చేసి మూడు జాతకాలూ ఇచ్చారు. వ్యక్తిత్వ విశ్లేషణనిబట్టి సరైన జాతకమేదో ఎన్నుకోమన్నారు. 116లో కేవలం 40 పత్రాలకి మాత్రమే సరైన జాతకాన్ని గుర్తించడం జరిగింది. ఇది కూడా random chance ద్వారా వచ్చే ఫలితాల శాతాన్ని మించలేదు.
  8. 1988లో (Prometheus p 215) జాన్ మెకాల్ అనబడే జ్యోతిష్కుడు తను కోరిన నియమాల ప్రకారం ఎన్నుకున్న 28 మందిలో ఒక్కొక్కరికీ మూడేసి జాతకాలు పరిశీలించి అందులో 7 మందికి మాత్రమే సరైన జాతకాన్ని ఎన్నుకోగలిగాడు. అదీ రాండమ్ చాన్సు శాతాన్ని మించలేదు.
  9. 1990, Journal of Scientific Exploration (vol. 4, p.75-83) లో ప్రకటించిన ఒక ప్రయోగంలో ఆరుగురు నిపుణులైన జ్యోతిష్కులు 23 జాతక చక్రాలని తీసుకుని ఆ జాతకచక్రాలు ఎవరివో ఆ 23 మంది వ్యక్తుల గత చరిత్ర, ఫొటోలు, వ్యక్తిత్వ విశ్లేషణలు వగైరా పరిశీలించి ఏ జాతకం ఎవరిదో జత చెయ్యడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చే ఫలితాలకన్నా మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు. అంతేకాదు, జ్యోతిషం తెలియని మామూలు వ్యక్తులు అదే విధంగా జత చెయ్యగా వచ్చిన ఫలితాల కన్నా కూడా మెరుగైన ఫలితాలు తెప్పించలేకపోయారు. అంతేకాకుండా ఒక జ్యోతిష్కుడు జత చేసిన దానికీ మరొక జ్యోతిష్కుడు జత చేసిన దానికీ సంబంధమే లేదు.
  10. 2003, August, Journal of Consciousness Studies (vol. 10, no. 6-7) లో జాఫ్రీ డీన్ ప్రకటించిన పరిశోధన. ఇందులో కొద్దినిమిషాల తేడాలో జన్మించిన రెండువేలమంది వ్యక్తులకి సంబంధించిన సుమారు వంద అంశాలను కొన్ని దశాబ్దాల పాటు పరిశీలించడం జరిగింది. (ఒకే సమయంలో జన్మించినవారు కాబట్టి వాళ్ళందరికీ రాశుల్లోని గ్రహస్థితులు ఒకే విధంగా ఉంటాయి. అయితే వేర్వేరు చోట్ల పుట్టినవాళ్ళకి భావాలు మారిపోతాయి). పరిశీలించిన అంశాల్లో ఐక్యూ, కళల్లోనూ ఆటల్లోనూ అభినివేశం, ఆందోళన పడే స్వభావం, నలుగురిలోనూ తేలిగ్గా కలిసిపోగలగడం, వృత్తి మొదలైనవి అనేకం ఉన్నాయి. ఏ విషయంలోనూ వాళ్ళెవరికీ ఒకరితో ఒకరికి పోలికే లేదు.
  11. జేమ్సు రాండీ జ్యోతిషం నిజమని నిరూపిస్తే ఒక లక్ష డాలర్ల బహుమతి ఇస్తానని 1989 లో ప్రకటించాడు. ఒక జ్యోతిష్కుడా ఛాలెంజికి ఒప్పుకొని పన్నెండుమంది జాతకాలు పరిశీలించాడు. ఆ పన్నెండుమందితో తరువాత ఇంటర్వ్యూలు చేసి ఎవరి జాతకం ఎవరిదో తేల్చడానికి ప్రయత్నించాడు. ఒక్క జాతకం కూడా సరిగ్గా పోల్చలేకపోయాడు. ప్రస్తుతం జేమ్సు రాండీ తన బహుమతి మొత్తాన్ని ఒక మిలియన్ డాలర్లు చేశాడు. ఇంకా ఎవరూ దాన్ని గెల్చుకోలేదు.
  12. సూర్యుడున్న రాశిని బట్టి చెప్పే ఫలితాలపైన (సర్వ వ్యాప్తంగా కనిపించే ‘రాశి ఫలాలు’) ఇటువంటి ప్రయోగాలు అనేకం జరిగాయి. ఎందులోనూ ఆ ఫలితాలు నిజమని నిరూపించబడలేదు. అయితే చాలామంది జ్యోతిష్కులు కేవలం సూర్యుడున్న రాశి మీదో, చంద్రుడున్న నక్షత్రం మీదో ఆధారపడి చెప్పే ఈ దిన, వార, మాస ఫలాలని నిజమైన జ్యోతిషంగా పరిగణించరు. కాబట్టి ఈ పరిశోధనల వివరాలు ఉటంకించడంలేదు.

అయితే ఇంతవరకు జరిగిన పరిశోధనలన్నిటిలోనూ మిషెల్ గోక్‌లా చేసిన పరిశోధనలు ప్రత్యేకమైనవి. జ్యోతిషంతో, ముఖ్యంగా పాశ్చాత్య జ్యోతిషంతో పరిచయమున్నవాళ్ళు గోక్‌లా పేరు వినకుండా ఉండరు. అతని పరిశోధనలు చాలామంది జ్యోతిష్కులకి ఒక ఆశాదీపంలాగా అనిపిస్తాయి. కాబట్టి అతని పరిశోధనల గురించి కొంచం వివరంగా తెలుసుకుందాం.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5