ఇక ‘గాయం’ సినిమాలో హీరో ‘దుర్గా ప్రసాద్’ (జగపతి బాబు) వర్మ హీరోలందరిలో ఎక్కువ సంక్లిష్టమైన పాత్ర అనిపిస్తుంది. బహుశా ఆ కాలంలోని సామాజిక పరిస్థితుల్ని అర్థంచేసుకోవడంలో వర్మ అనుభవించిన సంక్లిష్టతను ఈ హీరో ద్వారా చెప్పాడు అనుకోవచ్చు. అంతేకాక శివ సినిమాలా ఏకపక్షంగా కాక, ఈ సినిమాలో హీరోతో పాటూ మరికొన్ని పాత్రలు ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి. హీరో దారినీ, ఆలోచననీ, ఆచరణనీ వ్యక్తి స్థాయిలో విమర్శించే పాత్ర ఒకటైతే (దుర్గ ప్రియురాలు అనిత (రేవతి)), మరోటి ఈ సమస్య యొక్క సామాజిక పార్శ్వాన్ని జనాంతికంగా ఎత్తిచూపేది (ప్రత్యేక పాత్రలో సిరివెన్నెల సీతారామశాస్త్రి). వర్మ సూత్రధారి గొంతు (third person narrative voice- over) ను ఉపయోగించి సినిమా ముగింపు చెప్పించిన మొట్టమొదటి సినిమా ఇదే. ఈ సినెమాటిక్ ప్రక్రియ ఉపయోగం తెలిసిన అందరికీ వర్మ దీన్ని ఉపయోగించడం ద్వారా సూచిస్తున్న భావం అర్థమయ్యే ఉంటుంది. (సినిమా థియరీలో, The third-person narrative is a narrative that is not from a player in the story, hence, assumed to be providing the illusion of subjectivity to the story అంటారు.) దీన్ని బట్టి, వర్మ ఈ విధానాన్ని ఉపయోగించి ముఖ్యపాత్రల వ్యక్తిగత స్థాయికి అతీతమైన సార్వజనీనతని కథనంలో కల్పించాడు. ఆ నెరేటివ్ లో చెప్పింది ఒక దర్శకుడిగా తన ఆభిప్రాయమే అన్న బాధ్యత నుంచీ తప్పించుకున్నాడని కూడా అనుకోవచ్చు. మనకి ఈ విశ్లేషణలో నాయకుని పాత్ర దృక్పథం ముఖ్యం గనుక ఇక్కడ ఆ గొంతుకతో చెప్పించిన ముగింపు కాక మిగతా భాగంలో హీరో పాత్ర ద్వారా వర్మ సూచిస్తున్న సమాజపు స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హీరో వ్యక్తిత్వాన్ని తీసుకుంటే, ఆరంభంలోనే “మనదొక్కటే పద్దతి, మనకు సంబంధించిన విషయాలు పట్టించుకోం. మన జోలికొస్తే మాత్రం వదలం” అని తన ఉద్దేశ్యాన్ని చాలా సూటిగా తన ప్రియురాలు అనితతో పంచుకుంటాడు. ఒక రౌడీ రాజకీయవేత్త అయిన తన అన్నయ్య గురించి ఆమె ప్రశ్నిస్తే, “మా అన్నయ్య ఏమైనా ఆకురౌడీ అనుకుంటున్నావా? ఎన్నో రకాల రాజకీయాలలో అదోటి” అని ఒక నిర్ధిష్టమైన సామాజిక విలువలని ఆపాదించక, నిస్పక్షంగా స్పందిస్తాడు. దీన్ని బట్టి కథానాయకుడు సమాజ విలువలకి కాక వ్యక్తిగా తన భావాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడుగా సాక్షాత్కరిస్తాడు. మూర్తీభవించిన సమాజ వ్యాఖ్యాతగా, దుర్గ పక్కన అనితను ఉంచి ఇక్కడ దర్శకుడు హీరోపాత్రను విడమర్చి చెప్పడమేకాక, రాబోయే విబేధాలని కూడా సూచిస్తాడు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, ప్రేమించిన అనితను పెళ్ళి చేసుకుని, దూరంగా వెళ్ళి హాయిగా జీవించాలనుకునే ఈ యువకుడు, తన అన్న, మామయ్యల మరణంతో ప్రతీకారంకోసం ఆవేశంతో కాక ఒక ఆలోచనతో రౌడీయిజాన్ని అందిపుచ్చుకుంటాడు. అన్నయ్య మరణం తర్వాత, విరోధి గ్యాంగ్ ను మట్టు బెట్టడానికి జరిగే చర్చల్లో భావరహితమైన ముఖంతో, “ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చంపడం గురించి కాదు. ఎలా చంపాలి అన్నది” అన్న ఒక్క మాటతో హీరో తన గ్యాంగ్ పై ఆధిపత్యాన్ని తీసుకుని, నిర్దేశించేస్థాయికి ఎదిగిపోతాడు. “మన జోలికొస్తే మాత్రం వదలం” అన్న ప్రారంభ వాక్యాల్ని అక్షరాలా ఆచరించి చూపిస్తాడు.
ఇంత జరిగినా తను చేసింది ‘తప్పు’ అని నమ్మడు. సమాజానికి ప్రతీకగా ఉన్న అనిత, దుర్గ చేసిన పని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తే, “నేను చేసింది తప్పని ముమ్మాటికీ నేననుకోవడం లేదు … ఏది ఏమైనా, ఎంత మందిని చంపైనా మా అన్నయ్య చేసింది నిలబెడతాను” అని అనితతో తన బంధాన్ని తెగిపోయేలా చేస్తాడు. రౌడీరాజకీయ వ్యవస్థలో మంచికోసం చెడుచేస్తూ, చెడు రౌడీరాజకీయాల్ని ఎదుర్కొనే ఒక నాయకుడిగా మిగిలిపోతాడు. ఇక్కడే ఈ పాత్ర సంక్లిష్టత బయటపడుతుంది. తను చేసేది చట్టపరంగా తప్పే అయినా, సమాజపరంగా మంచిగా అనిపించడం అప్పటి సామాజిక స్థితికి అద్దం పడుతుంది. హిందీ సినిమాలో వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతీకగా పుట్టిన ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ పాత్ర అప్పటిదాకా తెలుగులో స్పష్టంగా ఎక్కడా లేకపోయినా, ఈ నాయకుడి పాత్ర ఆ ఆలోచనా శైలిని కల్గి ఉంటుందని చెప్పొచ్చు.
సర్కార్ (రామిరెడ్డి) దుర్గపై థియేటర్లో చేసిన హత్యాప్రయత్నం తరువాత, జర్నలిస్టుగా మారిన అనిత, థియేటర్ యజమాని నిజం చెప్పకపోతే అసహనం వ్యక్తపరుస్తుంది. ఆ థియేటర్ యజమానికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను ప్రశ్నిస్తుంది. దానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పే సమాధానం, “ఆ నిజాన్ని తెలుసుకుని నువ్వు గానీ, నీ జనంగానీ ఏంచేస్తారు? నువ్వు పేపర్లో రాస్తావు, అది పొద్దున ఆరు గంటలకి ఇంటింటికీ వెళుతుంది. దాన్ని వాళ్ళు చదువుకుని పక్కన పడేసి, ఎవరి పనుల్లో వాళ్ళూ మునిగిపోతారు. అంతేగా!” అంటూ, “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. నిప్పుతోటి కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని … మారదు లోకం .. మారదు కాలం” అని స్పందించని సమాజాన్ని ప్రశ్నిస్తాడు. ఈ సన్నివేశం తరువాత ఇలాంటి ప్రశ్నే దుర్గను అడుగుతుంది అనిత, దానికి దుర్గ ఇచ్చే సమాధానం “తెలుసుకుని నువ్వేం చేస్తావ్?” అని ఇంచుమించు సిరివెన్నెల లేవనెత్తిన ప్రశ్నలాంటిదే. ఇక్కడ దుర్గ పాత్ర మరింత ముందుకు వెళ్ళి, “ఇలా ఒకరినొకరు చంపుకుంటూ పోతే, దీనికి అంతం ఎక్కడుంటుంది?” అన్న అనిత ఆవేదనకు సమాధానంగా, “అదినేను చెప్పలేను. ప్రస్తుతం జరుగుతున్నవాటికి పరిష్కారమేమిటో నువ్వు చెప్పగలవా?” అని, ప్రస్తుతం ఉన్న సమాజంలో కొన్ని జవాబుల్లేని ప్రశ్నలలో తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వ్యవస్థ కూడా ఒకటని ఎత్తిచూపుతాడు.
ఇలాంటి విలువల ఘర్షణల మధ్య చివర్లో గురునారాయణ్ (కోట శ్రీనివాసరావు) రూపొందించే మతకల్లోలాల ఎత్తగడను అరికట్టడానికి పోలీసులు కూడా దుర్గ సహాయం కోరడం, అప్పటి వరకూ దుర్గ విలువలని తప్పన్న అనిత తన భర్త పోలీస్ ఇనస్పెక్టర్ భరద్వాజ(శివకృష్ణ) ను రక్షించుకోవడానికి దుర్గ సహాయం కోరడంతో సినిమా పతాకస్థాయికి చేరుకుంటుంది. చట్టానికి వ్యతిరేకంగా హీరో ఒక వ్యవస్థని నడుపుతున్నా, చివరకు ఆ చట్టమే అతని సహాయం అర్థించడం, హీరో ఎంచుకున్న విలువల్ని సమాజానికి ప్రమాదంగా భావించిన అనిత, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ హీరోనే సహాయం కోరడంతో హీరో పాత్ర నిజంగా ‘హీరో’ అవుతుంది. ఇలాంటి హీరోయిజం అంత అభిలషణీయం కాదు, అనే ఒక సామాజిక స్పృహ కలిగించి (మభ్యపెట్టాడానికా అన్నట్టు) వర్మ ఆఖర్న voice-over ని ఆశ్రయిస్తాడు. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గొంతులో “ఇలాంటి పరిస్థితులు సమాజానికి మరణం కాదు, యుగాంతమూ కాదు. సమాజానికి తగిలిన నిర్లక్ష్యం చెయ్యకూడని గాయాన్ని ఎత్తిచూపడానికే ఈ ప్రయత్నం” అనిపిస్తాడు. ఏదిఏమైనా వర్మ, దుర్గాప్రసాద్ పాత్రను అప్పటి సమకాలీన పరిస్థితులకి అద్దంపట్టే ఒక ఒక సంక్లిష్ట పాత్రగా మలచి తను అర్థం చేసుకున్న సమాజానికి అద్దం పట్టాడు.