వ్యాసభాగవతంలో వామనుడు విశ్వాన్ని ఒక చిన్న బంతిని చేసి, దానితో ఆడుకొన్నాడని వుంది. ఋషి-కవి వ్యాసుడు వామనుడి పరంగా అట్లా ఊహించాడు. ఎంకి సంద్రం గురించి చెప్పిన రీతి వామనుడు చేసిన దానితో పోల్చదగినది.
“యెంకి రాణి” ధర్మప్రేమకు పరాకాష్ట, సంకేతం:
పూలతో యెంకి నే
పూజింప బోతి
యెంకి నిలువున మెరిసె
యెవ్వరో రాణి
పూలు, పూజ, మెరుపు అన్నీ నాయుడుబావకు యెంకి ద్వారానే. ఈ నాలుగు పాదాలలో ప్రేమ పరంగా లేనిదేమన్నా వున్నదా? ఇదే ప్రేమ తత్వం. ఆధ్యాత్మికంగా స్థాయీ భావం చేరుకొన్నప్పుడు, యివన్నీ ఒకటైనపుడు, వేరే జ్ఞానమున్నదా?
“నేను – తాను” ప్రకృతీపురుషుల అంతర్ ప్రవాహము. తనువు తపసుగా, మనసు మంతనముగా, బతుకు పాటగా, పాట యెంకి పల్లదనముగా, నిద్ర అంతా “నారాజు” నీడగా, కలలో కూడా యెంకి కిలకిలలుగా, జగమంత నాయుడుబావ సొగసుగా, అద్దములో కూడా యెంకితో “విద్దెములు” గా పాట పాడుకుంటారు.
“సరాగాలు” లోని రాగాలు ప్రేమ జగత్తుని అనేక రూపాలుగా, అనేక భావనలుగా గానం చేస్తాయి. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం శృంగార – ప్రణయక్షేత్రంలో పరస్పరం దోబూచులాడుకొంటాయి. రెండక్షరాల మాటలతో పాటగా వచ్చింది. తుది రాగమవుతుంది. మంగళమవుతుంది:
నీవు నేనైతే !
నిను నీలోనె కందు!
నేను నేనుగ నుంటె!
నీలోనె యుందు!
“రాకపోకలు” లో తమ అరమరికలు లేని జీవితాన్ని, అన్యోన్యతను ఎంకి – నాయుడు బావలు సహజంగా, శ్రావ్యంగా నేల నుంచి నింగివరకు ఆలపిస్తారు. చేలు, చెట్లు; మోట నడుపుట, తోట నడుపుట; మాకు నవ్వాలని కోరిక; చేనులోనే నిద్రపోయే నాయుడుబావ ఎదురుగా వెలుగుతూ ఎంకి; స్వప్నం – స్వర్గం – అన్నింటిలోనూ వాళ్ళు యిద్దరు కారు, ఒక్కరే. ఇక్కడ శృంగారరసం, ప్రేమతత్వం అద్వైత స్థాయికి చేరుకుంటాయి.
తీర తీరాల పరిగిడే ఎంకి -నాయుడుబావలను గాలే ఎగతాళి చేస్తోందిట. తన పిల్లలను ప్రకృతి ఎలా తీసికొంటుంది? సరసులయిన వాళ్ళను చూసి ఆకాశమే వులికిపడిందట! వాళ్ళ ఊహకి, కవి ఊహకి, అందని వెలుగులున్నాయా?
రతనాల వేదికను
రవల చాందినీ కింద
ముత్తె తలంబ్రాలు
ముసి ముసుల పెళ్ళంట!
“ఒయ్యార”మే వూగగా ఎంకికి నాయుడుబావ ద్వారా ప్రకృతంతా నీరాజనం పడుతుంది:
తీగల నడుమ నూగె
దీపమై తిలకమై
పీఠమై – ఎంకికి – కి
రీటమై నేలవంక?
చివరి పాట (అసలు చివరి పాట వుందా?) “తపస్సు” లో ప్రణయ పరిణతి ప్రశ్నగా ప్రవహించినా అది ప్రశ్న కాదు :
“సాగరుని సల్లాపమేలా
చందురుని యుల్లాసమేలా
సైకతంపు విలాసమేలా
లోకమికనేలా?”
ఎంకి పాటలు, కొత్త పాటలు వాస్తవము, అనుభవము, భావన, భావము, ఊహ, దర్శనము, జానపదము, సంగీతము, సాహిత్యము, రసము, సంకేతము, భక్తి, జ్ఞానము (వేదాంతము) వీటన్నింటి రంగరింపు.
ఈ రంగరింపుని తెలుగు జాతి అంతా అనుభవించి, ఆవగాహన చేసికొని, ఆనందించి, నండూరి వెంకట సుబ్బారావుగారికి నమస్కరించగలదు, కృతజ్ఞతతో వుండగలదు.