నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు : ఒక స్పందన

వేదాంతపరంగా జీవుడు, దేవుడు వేరు కాదు. ఒకటే. అద్వైతం, ఎంకి, ఊర్వశి వాస్తవాలు, ఊహాసుందరులు. వాస్తవ, ఊహ ఏకమయినపుడు కలిగే అనుభూతిని దర్శనము లేక ఆధ్యాత్మికానుభూతి అనవచ్చును. వేమన చెప్పినట్లు మనిషిని మించిన దైవము లేదు, మానవతను మించిన మతము లేదు. ఉపాసన ద్వారా వేమన సంఘానికి ప్రవచించాడు: ఉపాసన ద్వారా నండూరి అద్భుతమూర్తిని, ప్రణయమూర్తిని ఆరాధించాడు.తన అనుభవాన్ని శృంగార శబ్దాల ద్వారా పండితులకు, పామరులకు, సాధారణ ప్రజకు అందించాడు. ఈ అందించడంలో శృంగారం, ప్రణయం, భక్తి, వేదాంతం ఒకటవుతాయి.

మనం ఏం చేయాలన్నా మననం, శ్రద్ధ అవసరం. “యెలుగు” లో ఎంకి మీద నాయుడుబావ మనసు నిలపలేడు.అందుకని దీపం ఆరిపేయాలి: తోట”సీకటై” పోవాలి. ఎంకి దీపం ఆరిపేసినపుడు “సీకట్లో” ఆమె కళ్ళ “తళతళలు” తను “సూడాలి”. ఉపనిషత్తులోని అలంకారము యిక్కడ అటు ఇటు అయింది. వైదిక ప్రార్థన: తమసోమా జ్యోతిర్గమయ.. చీకటిలోనుంచి వెలుగులోకి తీసికొని వెళ్ళు. మనలోనే వెలుగు, మనమే వెలుగయినపుడు కావలసినవి శ్రద్ధ, భక్తి: మననం, ధ్యానం, ఇక్కడ నాయుడుబావ ఆరాధించేది బాహ్య సౌందర్యం కాదు: కేవలం శారీరకం కాదు; అంతస్సౌందర్యం. తరువాతి దశ అద్వైతం;

సూపులే ఆపేసి
యాపు పూసే మరిసి
వొక రెరుగకింకొరు
వొరిగి నిదరోదాము!

అట్లాగే కనుపాప, మనసుల కలయికకు, ఆత్మలకలయికకు అది మార్గం,దోపాదం:

కంటెదర నాకాడ కనిపాపలో నీడ
సూసుకొంటా నొసట సుక్కెట్టుకుంటాది!
……………………………..

కనిపాపలో నీడగని నవ్వుకుంటాది
మొకము సిటిలిస్తాది రకరకములవుతాది!

అనుభవమయినపుడు అద్వైతం. నీడ, నవ్వు, “మొకము సిటిలించడం”, అన్నీ దానికి మెట్లు. శృంగార ప్రస్తుతంలో నాయుడుబావ తపన. ఆధ్యాత్మిక “ముందుగతి” కొరకు, “పక్కసూపులు మాని/పయికెల్లి పోదాము!” తన “సక్క”ను యెక్కమంటాడు ఎంకిని; తనతో కొండనెక్కమంటాడు. కొండ, “వొయికుంటము”, నూరవ గడి, కైవల్యము – అన్నీ ఒకటే. త్యాగయ్య తపియించిన సాయుజ్యమూ ఇదే. రాముని ద్వారా తపించాడు త్యాగయ్య; ఎంకి సాంగత్యంలో తపిస్తాడు నాయుడుబావ. తపన, మార్గాలు వేరైనా, గమ్యం ఒకటే. పడవలు, పయనాలు, ముందుగతులు, అన్నీ ఆ గమ్యం వైపుకే.

ఎంకి నాయుడుబావ ముందెవరున్నా, కిందెవరున్నా కావలసింది పయనం. ఎంకి నీడనే “తొక్కుకొని సులువుగ రాగల”నంటాడు నాయుడు బావ. మధ్యలోగాలి, “నీపైట”, “బగబగలు” కావచ్చు. లక్ష్యం గట్టిదైనపుడు, అడుగులలో ఒడుదుడుకులు లేనపుడు మననెవరాపగలరు?

యెల్లెల్లి పయికెల్లి
యిద్దరము కలిసి
మూటలివతల పెట్టి
మునిగిపోదము పైనె

పయనం చాలా దూరం. వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, పైపైకి వెళ్ళాలి. ఇద్దరూ ఒకటిగా, “మూటలు” సరంజామా, భవబంధాలు, వాటిని “యివతల” పెట్టాలి; అవతలకి వెళ్ళాలి, “మునుక” సాయుజ్యం, ప్రకృతీపురుషుల సంగం, సంగమం; ఎంకి ప్రకృతి, నాయుడుబావ పురుషుడు. ఈ మునిగి పోవటాన్ని రామకృష్ణ పరమహంస ఉదహరించిన ఉప్పుబొమ్మ సముద్రం ఉదంతంతో పోల్చవచ్చు. ఆ ఉదంతం ప్రకారం సముద్రం లోతు తెలిసికొందామని సముద్రంలోకి వెళ్ళిన ఉప్పు బొమ్మ దానిలో విలీనమైపోతుంది. ఆ లీనమవటం, యిక్కడ మునిగిపోవటం, సాయుజ్యం .. వీటిని ఒకటిగా గ్రహించవచ్చు.

మామూలు వర్ణనలతో, అలంకారాలతో శృంగార క్రీడల్ని, విలాసాలతో ప్రేమను, చైతన్య స్రవంతిని సమవేగంతో, ఆణిముత్యాలవంటి మాటలలో, ఆడించే ఆటలలో, పాడించే పాటలలో, అమోఘమయిన పట్టుతో, పొదుపుతో ఆలపిస్తారు నండూరి. “ముత్యాలపేరు”ను సహృదయతతో చదివినా, విన్నా మనకివ్వబడిన వర్ణచిత్రంతో, తాదాత్మ్యం చెందుతాము. భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం, శాంత రసం ప్రతిపాదన జరిగేవరకు ఎనిమిది రసాలన్నీ యిమిడి వున్నాయని వివరిస్తారు. శాంతం నవమరసం. అది వచ్చేక దానిని ఉత్తమరసంగా ప్రతిపాదించారు. కాని ఒక విధంగా అది రసం కాదు. కొన్ని గేయాల్లో, గేయాల చివరలో శాంత రసానుభూతి కవికి కలిగింది; ఎంకి నాయుడుబావలకు కలుగుతుంది. వాళ్ళ ద్వారా మనకూ కలుగుతుంది.

ఎంకి పాటలు లోని చివరి పాట, “వుత్తమాటలు” వుత్త మాట కాదు. రేపటికి సూచన, భవిష్యత్తుకి బాట :

“వుత్తమాటలు నీవి పొ”మ్మందిరా
యెంకి
“కొత్త పాటలు పాడుకొ”మ్మందిరా

“వుత్తమాటలు” ద్వారా ఎంకి నాయుడుబావని క్రొత్త పాటలు పాడుకొమ్మంటుంది. కవి క్రొత్త పాటలు పాడుకొంటాడు, పాడుతాడు. 24 ఏండ్ల తరువాత కొత్త పాటలకు పీఠికలో నండూరి చెప్తారు : “ఈ కొత్త పాటలు భాషలోనూ నిర్మాణం లోనూ పూర్వపు పాటల పంధా నుండి వైదొలగినవన్నారు… మార్పు గుణమున కాయెనా దోషమున కాయెనా అను విషయము సహృదయలోకమే నిర్ణయించాలి. ఏ యెడను మార్పు సహజం.” ఎంకిపాటలునుంచి కొత్తపాటలు కి మార్పు వుంది. మార్పు అనుభవిస్తాము, గమనిస్తాము. అయినా ప్రణయము, ప్రేమలలోగాని, వాటి గాఢమైన అభివ్యక్తం లోగాని, సహజత్వము, సహజమాధుర్యములలో గాని మార్పు లేదు.అన్నింటిలోనూ ఒకే చైతన్యము, ఒకే చైతన్య స్రవంతి.

పీఠికలో చివర నండూరి వారు చెప్తారు: “ఆ మూర్తికి నా కవిత్వ జీవితాదర్శముల యెడ నీ రసభావము తప్ప మరో భావమునకు తావు లేదని యెరింగియు నా భక్తి చేయ వేరు పూజా ద్రవ్యములేమి? దీనినే అర్పించుచున్నాను.” ఇది వారి సున్నితత్వానికి, నిండుతనానికి నమ్రతకు తార్కాణం. వాటి ద్వారా ప్రతి సహృదయుడూ చలిస్తాడు. పాటలూ, ఆ చలనమూ రసతాండవానికీ, రస నిష్పత్తికీ మరొక నిదర్శనం, నీరాజనం.

ఎంకి (నాయుడుబావ కూడా) వెలుగు నీడల మిశ్రమము, ఏ ఒకటీ పూర్తిగా కాదు. ఏ ఒకరూ పూర్తిగా మంచి లేక పూర్తిగా చెడు కాదు. అందరం మంచి, చెడుల కలయిక. అట్లాగే మన జీవితం సుఖదుఃఖాల మిశ్రమము, వెలుగు నీడల మిశ్రమము.

కోటి గొంతులు గలిసి
పాట పాడే తీరు
వెలుగు నీడల నడుమ
నిలిచి ఆలింతు

ఏటి మిలమిల లోన
తోట నవనవ లోన
వెలుగు నీడల పొత్తు
తెలిసి పాలింతు

“ఎంకెవ్వ” రని లోక
మెపుడైన కదిపితే
వెలుగు నీడల వైపు
వేలు చూపింతు

కొత్త పాటలు లో మొదటి పాట మొదలుకొని కొంత మార్పు గమనిస్తాము. భాష విషయంలో, నిర్మాణంలో, ఇతివృత్తపరంగా కాని, మాధుర్యపరంగా కాని కాదు. ఈ పాటలు కాని, మొదటి పాటలు కాని చదివితే ఇంగ్లీషు కవి John Milton గొప్ప కవిత గురించి వాడిన మాటలు జ్ఞాపకం వస్తయ్. simple, sensuous, impassioned. నండూరి వారి పాటలకు ఆధ్యాత్మిక గుణము కూడా వున్నది. ఎంకి జీవితము వెలుగు నీడల పొత్తు.

“తెరచాటు” గొప్ప గీతం:

లేపకే నాయెంకి లేపకే నిదరా
యీపాటి సుకము నేనింత వరకెరుగనే
లేపకే నా యెంకి…

ఈ గీతం “నిదర” తో మొదలవుతుంది. కలలోకి వెళ్తుంది. వాస్తవం, నిద్ర, కల, కళ, దర్శనం – సాహిత్య లేక కళాసృష్టిలో యివి ముఖ్యాంశాలు. కల, స్వప్నం ఒకటే. స్వప్నం – వాస్తవం: వీటిని ఇంగ్లీషులో dream-reality గా అనువాదం చేస్తారు. రవీంద్రనాథ్ టాగూర్ ఒక చోట ‘poetic consciousness is dream consciousness’ అని అంటాడు. అంటే, కవితా చైతన్యం స్వప్న చైతన్యం, అని. దాని గురించి టాగూర్ చేసిన వ్యాఖ్య, యిచ్చిన వివరణ చదివితే dream అంటే awareness of reality లేనిది అని అనిపించదు: “dream” అనే మాటను ఆయన కొంత vision అనే sense లో వాడుతున్నాడని అనిపిస్తుంది. Dream కి, vision కి మధ్య కొంత తేడా ఉంది. కలలో వాస్తవానికి, కలకి మధ్య తేడా, దూరము వున్నయ్. దర్శనము (vision) లో వాస్తవము భాగము: అది వాస్తవాన్ని అధిగమించి వుంటుంది. కవిని స్వాప్నికుడు (dreamer) అని అనటం కంటే దార్శనికుడు (visionary) అని అనటం సమంజసము. నాయుడుబావ కల వాస్తవానికి దూరంగా వుండి తనకు కొంత సుఖాన్ని (“యీ పాటి సుఖము”) యిస్తోంది గనుక ఎంకిని, నిద్ర లేపద్దంటాడు.

కలలో యెంకి “కతలు సెపుతున్నాది”, నాయుడుబావ “ఊ” కొడుతున్నాడు. వులికులికి పడుకొన్నా కూడా. ఎంకి యింకా ఎలా వుంది?

రెక్కలతో పైకెగిరి
సుక్కల్లే దిగుతాది
కొత్త నవ్వుల కులుకు
కొత్త మెరుపుల తళుకు

స్వప్నం ఒక తీరని కోరిక (unfulfilled desire లేక wishful thinking ). ఆ తీరని కోరికలో ఒక తీరిన కోరిక, రెండింటిని కలిపి తీసికొంటే యిక్కడ వ్యక్తమయిన దానిని ఒక రకమైన wishful longing గా గ్రహించవచ్చు. వాస్తవములో అసంభవమయినది స్వప్నంలో జరుగుతోంది. (“సుక్కల్లే దిగుతాది”). స్వప్నంలో జరిగినదాన్ని ఎరుకలో లేక ఊహలో పెట్టుకొని వాస్తవంలోకి వస్తే ఒక రకమైన అస్పష్టమైన దిగులు కలగవచ్చు. దానిని Englishలో Wishful Longing గా పేర్కొంటారు. ఇది హిందీలో “చాయా వాద్” అనబడే కవితలో వ్యక్తం చేయబడింది. జైశంకర్ ప్రసాద్ వంటి కవులు యిలాంటి కవిత్వం వ్రాసారు. గేయం చివరలో నండూరి గొప్ప మలుపు, మెరుపు,మెరుగు యిస్తారు :

తెలివి రానీయకే
కల కరిగి పోతాది…
ఒక్క నేనే నీకు
పెక్కు నీవులు నాకు! లేపకే…

మనలో చాలా మందికి కలిగే అనుభవం మొదటి రెండు చరణాల్లో వ్యక్తమయింది యిక్కడ. అప్పుడప్పుడు లేక తరచు మనం కలలో పొందే ఆనందాన్ని అట్లా అనుభవిస్తూ వుండాలని మనకి వుంటుంది. కాని అది జరగదు. సుఖాన్ని యిచ్చే కల కరిగిపోవటం నాయుడు బావకి ఇష్టం లేదు. ఎవరికిష్టం? ఒక్క కుదుపుతో వాస్తవంలోకి వచ్చి పడతాము. మానవ జీవిత సారాంశం యిది. ఒక విధంగా, ఆదిశంకరాచార్యులవారు యీ అంశాలను గొప్పగా ఉదహరిస్తూ, ఆలంకారికంగా, “విశ్వం దర్పణ మాన నగరీ తుల్యం” అంటూ, మాయా వాదపరంగా “దక్షిణామూర్తి స్తోత్రం” లో శ్లోకం గానం చేస్తారు. వాస్తవము, అందని వాటికి అర్రులు చాచటం, కల, ప్రణయం, ప్రేమ, వేదాంటం అన్నీ ఏకం కాగా యీ పాట పాడుతాడు నాయుడుబావ.

మామూలు మాటలతో, మామూలు మాటలలో నిగూఢమైన, ఉద్దాత్తమైన వేదాంతాన్ని, శృంగారాన్ని కవి వ్యక్తం చేశాడు. కాళిదాసువలె నండూరి శాక్తేయుడు. శక్తిని ఆరాధిస్తాడు. కనుకనే నాయుడుబావ పైవిధంగా పాడుతాడు. ఇక్కడ ఒక ప్రశ్న: నాయుడు బావకి ఎంకి (ఎంకిని నండూరి ఊహాసుందరిగానే గ్రహించుదాము) అనేక కోణాలలో, అనేక విధాలుగా అనుభవానికి వస్తుంది. పై చరణాలను ఎంకి నాయుడుబావతో అనగలదా? భారతీయులలో, తెలుగువాళ్ళలో శాక్తేయులు కొంతమంది అనలేదు, అనదు అంటారు. ఈ రచయిత, అనగలదు, అంటుంది, అని అంటాడు. సంస్కృత సాహిత్యంలో ఒక నాటకంలో కథానాయిక కథానాయకుడి గురించి అంటుంది : నాభర్తలో ప్రతి రోజూ (లేక ప్రతి రాత్రీ) నాకు క్రొత్త భర్త.

నాయుడు బావకి తీపి కల లేక కలలనిచ్చే నిదర అయితే, ఎంకికి కలత నిదర, ఎంకి నాయుడుబావని రాజుగా భావిస్తుంది. భావనను ఎవరు అడ్డగించగలరు? ఆపగలరు? శృంగారానికి, ప్రణయానికి రాత్రి అవకాశము, (“ఆకాశము” “అవకాశము” నుంచి వచ్చింది.) అదుపులో పెట్టుకొంటున్న బాధతో ఎంకి పాడుతుంది:

ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా!
ఎన్నెలల సొగసంత యేటి పాలేనటర!

రాత్రి విచిత్రంగా వుంది. ఆకాశం యేమూలనో వుంది. రాత్రి అణిగిపోయి వుంది. చంద్రుడు యేటు పాట్లకు గురవుతున్నాడు. ప్రకృతి, పరిసరాలు ప్రణయ భావాలను కలిగిస్తున్నయ్:

యెలుతురంతా మేసి
యేరు నెమరేసింది

ఏమిటి ఉపయోగం?
కలవరపు నా బతుకు
కలత నిదరయ్యింది –

అట్లా ఎందుకయింది? అట్లా ఎట్లా అయింది? జవాబు యెవరివ్వగలరు? కర్మ అంటే ఇదేనా? దీనిని పరిస్థితులు వక్రించటం అనటం కంటె యింకేమి అనగలం?

రవల వెలుగుల గంగ రమ్మంది. ఎంకి వెళ్తుంది. శివమెత్తి “తానాలు” చేసింది. ఆ అందాన్ని, ఆ చందాన్ని, ఆ ఆనందాన్ని తనకి తను తిలకిస్తూ, వాటిని అనుభవిస్తూ, పాట పాడుకొంటాడు, పాడుతాడు :

నీలలో మునిగింది
తేలింది వెలుగుతో
మబ్బు సెందురుడల్లె
మనిసిలో మనసల్లె

శృంగారం, ప్రణయం పొంగుగా ప్రవహిస్తయ్.

“మాట కోటలు” లో నండూరి భారతీయ సాహిత్యంలో చెప్పుకో తగిన వివరాన్ని ధర్మపధం చేశారు.

కందుటెరుగని మనసు
గాయమై పాయెరా
నీకె చేటని కంట
నీరు రానీనురా

శ్రీపాద గోపాలకృష్ణమూర్తి చెప్తారు : “మా నండూరి వారి ఎంకి వాల్మీకి సీతమ్మ కంటె గొప్పది. సీతమ్మ ఎప్పుడన్నా కన్నీరు కార్చింది గాని ఎంకి తన బావకి అశుభమవుతుందని కంట తడిపెట్టనంది.”

“సంద్రం” లో వేదాంతం అంతర్ దృష్టి ద్వారా అనుభవమవుతుంది:

యింతే నటే సంద్ర మెంతో యనుకొంటి
మనకూ సూరీడుకూ మద్దెనుండేనా!

ఈ మాటల్ని ఎంకి యింకొక్క పల్లెపిల్లతో అన్నట్లు మనం ఊహించుకోవచ్చు. తరువాత చరణాల్లొ “నా రాజె” అన్నది. అతడు నాయుడుబావ అయి ఉండాలి. విశేష ప్రేమంటే పల్లె పిల్ల సముద్రం గురించి అలా భావించటంలో ఒక ఆధ్యాత్మికత వుంది.