నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు : ఒక స్పందన

“నమిలి మింగిన నా యెంకి” ఎంకి నాయుడుబావల ప్రణయానికి, ప్రేమకు పరాకాష్ఠ. దీనిలో వున్న భావనా సంపద, స్వభావాలను మాటల పొందిక, పొదుపుల ద్వారా రూపొందించటం, వర్ణ చిత్రాలు ప్రత్యేకం, కాలాతీతం. స్వానుభవం, సార్వజనీనం; రెండింటి ఏకత్వానికి ఎంకి నాయుడుబావలు ఒక సంకేతం.

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయీ రాదోయీ !

మెళ్ళో పూసలపేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు
కనకాబిసేకాలు
యెంకి వొంటి పిల్ల లేదోయి…

సెక్కిట సిన్నీమచ్చ
సెపితే సాలదు లచ్చ !
వొక్క నవ్వే యేలు
వొజ్జిర వొయిడూరాలు !
….

రాసోరింటికైన
రంగు తెచ్చే పిల్ల
నా సొమ్ము – నా గుండె
నమిలి మింగిన పిల్ల
……………..

ఇటువంటి గేయాలు ప్రణయ మాధుర్య, ఆత్మశక్తి సంపన్న గేయాలు, ఇక్కడ కవి (లేక నాయుడుబావ) ఉదహరించినవి కేవలం పదాలు, అలంకారాలు కావు. పదాన్ని సందర్భవశం చెయ్యటం. వాస్తవం, అనుభవం, ఊహ, జానపదం, భక్తి, వేదాంతం ఒకటిగా రూపొందుతయ్. తెలుగుతనం, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక ఆవరణ (cultural ambiance), ముగ్ధ మనోహర లక్షణం అనుభవానికి వస్తుంది. ఇలాంటి అనుభవానికి ఎంకి పాటలు చదివినప్పుడు తెలుగు సినిమా “మూగ మనసులు” జ్ఞాపకం వస్తుంది: “మూగ మనసులు” సినిమా చూసినప్పుడు ఎంకి పాటలు గుండెలో, మనసులో మెదుల్తయ్.

“పాట” నే పాడంగ
గోడ సాటున యెంకి గుటక వేసే యేళ
సూడాలి నా యెంకి సూపుల యేళ!
సూడాలి నా యెంకి సోద్దెమా యేళ!

మూడు రకాల కన్నులుంటాయంటారు కవులు, తాత్త్వికులు – భౌతిక, మానసిక, ఆత్మిక. ఒకదానికంటె యింకొకటి లోతుగా వుంటుంది, చూపుగాని, అందం గాని. నాయుడుబావకు కలిగిన పారవశ్యం, ఎంకిని చూసినపుడు, ఎంకి చూపుల ద్వారా కలిగిన పారవశ్యం. ఆ అనుభూతిని కవి కళ్ళకు కట్టినట్లు, ముగ్ధ మనోహరంగా వర్ణిస్తాడు.

స్నిగ్ధంగా, స్వచ్చందంగా, ఎంకిచూపు, నాయుడుబావ చూపు, కవి చూపు ఒకటవుతయ్. చూపంటే అది. పట్నవాసులకు పల్లెటూరి పిల్లలన్నా, వాళ్ళ అందచందాలన్నా, పద్ధతులన్నా చిన్న చూపు వుండవచ్చు. అటువంటి దృక్పథాలపై కవి హృదయపూర్వక విమర్శ చేస్తున్నాడు.

లైలా మజ్నూ కథ మనందరికీ తెలిసినదే : మజ్నూ అందగాడు. లైలా అందకత్తె కాదు. మజ్నూని అతని స్నేహితులు, “లైలాని ఎట్లా ప్రేమించేవు?” అని అడుగుతారు. అందుకు మజ్నూ జవాబు : ‘లైలాని నా కళ్ళతో చూడు.’ అయినా నండూరివారి ఎంకి నాయుడుబావలు వాస్తవము, ఊహ, రెండూను. ఎంకి నాయుడుబావలు తెలుగులో గొప్ప కవులు. “యెంకి సూపు” లో యెంకి చూపు, నాయుడుబావ చూపు, కవి చూపు ఒకటే. చదువరి చూపు కూడ వాటితో ఒకటవుతుంది.

“ఎఱ్ఱి నా యెంకి” లో “ఎఱ్ఱి” అంటూనే కవి అనుభవ పూర్వకమయిన జ్ఞానాన్ని మనకు అందిస్తాడు. ఒక విధంగా శ్లేష, ఒకవిధంగా వ్యంగ్యం యిది:

“యెనక జల్మము లోన
యెవరమో” నంటి
సిగ్గొచ్చి నవ్వింది
సిలక… నాయెంకి !
“ముందు మనకే జల్మ
ముందోలె”యంటి
తెలతెల బోయింది
పిల్ల … నా యెంకి

మొదట్లో “గుండె” ద్వారా ఒక భావనాజగత్తుని సృష్టిస్తాడు కవి. ఇక్కడ “సిలక”,”తెలతెలబోయింది” ద్వారా యింకొక భావనాజగత్తుకి తీసుకు వెళ్తాడు. అనుభవం ఎట్లా వైయక్తికమో, అట్లా రూపం దాల్చటానికి తపిస్తుంది. ఈ తపనతోబాటు భారతీయులకు పూర్వాపరజన్మలలో వున్న నమ్మకము యిక్కడ వ్యక్తమవుతుంది.

“యెంకి పయనం”లో

అంసల్లె బొమ్మల్లె
అందాల బరిణల్లె
సుక్కల్లె నా యెంకి సురిగిపోయిందంట!
పడుకుంటే నాకేటొ బ్రమ పుట్టినాదీ!

ఒక ప్రక్క అద్భుతమయిన శృంగారం. దానితోబాటు యింకొక ప్రక్క వేదాంతం. జీవితం, అనుభవం అనేక దినుసుల ముద్దలు, అనేక అంశాల రంగరింపులు.

“పిల్లోడు” అటువంటి ముద్దకు, రంగరింపుకు సంకేతం:

యెంకితో తీర్తానికెళ్ళాలి
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటే
………………
కోనేటిలో తానమాడాలి!
గుడిసుట్టు ముమ్మారు తిరగాలి!
కోపాలు తాపాలు మానాలి!
యిద్దరము పిల్లోణ్ణి యీశుడికి సూపాలి!

ప్రేమ, భక్తి, కర్మ యిక్కడ ఒకటిగా వెలువడుతయ్, వ్యక్తమవుతయ్. పల్లెజీవిత విధానం, విశ్వాసధనం, గట్టి కట్టుబాట్లు, వాటిని మనసా గ్రహించటం, ఆచరించటం, పరిణామ పరిణతులకై ఆశయం మనపై చెరగని ముద్ర వేస్తయ్. వ్యక్తి, సంఘం, దైవం, భక్తి, కర్మ, జ్ఞానం – ఎటునుంచీ చూసినా, యివన్నీ మనని పలుకరిస్తయ్, ప్రభావితం చేస్తయ్, అందుకనే శృంగారానికి, వేదాంతానికి, రెండింటి రంగరింపుకి ఎంకిపాటలని మించిన గానం సాహిత్యంలో వుండదేమో.

“సాటేలా!” లో నాయుడుబావకు ఎంకియందున్న ప్రణయం, ప్రేమ చేరుకొన్న స్థాయి, స్థాయీభావం అనుభవైక వేద్యం:

సాటేలా? నీకు మాటేలా?
సిన్నతనమేలా? సిగ్గేలా?

ఆ సీమ యీ సీమ
అందచందాలు
తిన్నంగ నిను సూసె
దిద్దుకుంటారు
……………..

యెంకొక్క దేవతై
యెలిసెనంటారు –
యింటింట పెడతారు
యెంకి నీ పేరు

స్వభావం, అందం, పంథా – ఎవరివి వాళ్ళవే. అంశాలలో సామీప్యముంటుంది గాని పూర్తి సామీప్యముండదు. Evolution లోగాని, artistic/poetic evolution లోగాని అది సాధ్యం కాదు. ప్రత్యేకత ప్రతిక్షేత్రంలోనూ ప్రత్యక్షం, తథ్యం. అనుభవంలో, భావనలో, దృక్పథంలో, ఆధ్యాత్మికతలో, ప్రత్యేకతతో బాటు సాధారణత్వం కూడా వుంది. ఉంది కనుకనే పంచుకొనటం, నాగరికత, సంస్కృతి సాధ్యమవుతున్నయ్. “సాటేలా!” లో యెంకిని కవి వైదిక వాజ్మయంలోని ఊర్వశికి సాటిగా, దీటుగా ఊహిస్తాడు, రూపొందిస్తాడు. ఈ రూపొందించటంలో వాస్తవం, ఊహ, సందర్భం, ఆశయం,అందం, ఆనందం, ఒక దానిలోకి మరొకటి యిముడుతాయి. ఊర్వశి ద్వారా చెప్పుకోదగిన ప్రతి భారతీయ కవి ప్రభావితుడయినాడు. పల్లెసీమ, పట్నవాసం, నాగరీకం – భారతీయ సంస్కృతిలో వీటి మధ్య వున్న అంతర్లీనమయిన, అంత తేలికగా దృగ్గోచరంగాని సామీప్యం, సంబంధం, ఏకత్వం, అనుభవించి, అవగాహన చేసికొని, ఆమోదించదగిన విషయాలు. “సాటేలా!” దీనికి కవితాత్మక సంకేతం.

జానపదంలోనుంచి భారతీయతలోకి, పల్లెపలుకు లోనుంచి సంస్కృతంలోకి, స్వేఛ్ఛతో, అప్రయత్నంగా, తేలికగా నండూరి శబ్దపరంగా, నాదపరంగా నడిచారు.