ఈమాట » పలాయనం

Expand to right
Expand to left

పలాయనం

అలారం మోగగానే వులిక్కిపడి లేచాడు సుబ్బారావు. కాస్సేపు ఎక్కడున్నాడో అర్థం కాలేదు. “జరిగిందంతా కలా? నిజంగా కలా? ఎంత మంచి కల! ఎంత మంచి కల! అబ్బ! కలలోగా జీవితం వుంటే ఎంత బాగుణ్ణు!” అని కొంతసేపు మధన పడ్డాడు. కలలో కాకపోతే, అన్ని రుచికరమైన పదార్థాలు తినే యోగం తన కెక్కడ పడుతుందీ అని తనని తాను సమాధాన పరుచుకున్నాడు. అప్పుడే తెల్లారిందా అని అనుమానంగా టైం చూశాడు. శనివారం పొద్దున్న అయిదు గంటలయింది.

“అప్పుడే తెల్లారాలా” అని బాధగా నిట్టూర్చాడు సుబ్బారావు.

“అబ్బా! మీరు పడుకోరూ, నన్ను పడుకోనీరూ! వెంటనే అలారం ఆపరేం? మీ హైకింగు కాదు గానీ, నా ప్రాణాల మీద కొస్తుంది ప్రతీ శనాదివారాలూ” అని విసుక్కుంటూ అటువేపు తిరిగి, ముసుగెట్టి మళ్ళీ నిద్రలోకి జారుకొంది సుబ్బలక్ష్మి.

భావ రహితంగా అరుస్తున్న గడియారం నోరు నొక్కి, బాత్రూం లోకి వెళ్ళాడు. తెల్లవారు ఝామున కలిగిన మధుర స్వప్నం లోని అద్భుత అనుభూతులనూ, జిహ్వని పెంచే రుచులనూ తలుచుకుంటూ దంత ధావనం కానిచ్చాడు. “తెల్లారుగట్ట వచ్చిన కలలు నిజమవుతాయని” ఎవరో చెప్పిన విషయం గుర్తొచ్చి, పొంగిపోయాడు. మనిషి ఆశాజీవి కదా? బయటికి వచ్చి, రాత్రి కట్టుకున్న బట్టలు మార్చుకుని, వంటిట్లోకి వెళ్ళాడు.

“ఖాళీ కడుపుతో ఎక్సర్‌సైజు చేస్తే హానికరం” అని ఎవరో చెప్పారు సుబ్బారావుకి. అందుకని రెండు గుప్పెళ్ళ కార్న్ ఫ్లేక్స్, కప్పుడు పాలలో వేసుకుని తిన్నాడు. ఒక పెద్ద గ్లాసుడు ఆరంజ్ జ్యూసూ, ఓ పెద్ద అరటి పండూ లాగించాడు. ఆత్మారాముడు శాంతించాక, కొత్తగా కొనుక్కున్న హైకింగ్ షూస్ తొడుక్కుని బయటికి నడిచాడు. ఆ షూస్ కొనుక్కునేటప్పుడు, “మాక్కూడా కొత్త షూస్ కొను” అని పిల్లలు చేసిన హఠం గుర్తొచ్చినా, వెంటనే ఆ విషయం మర్చిపోయి, నిశ్శబ్దంగా వున్న ఇంట్లోంచి బయట పడ్డాడు.


“గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారూ!” అంటూ ఒకాయన నీరసంగా, నిద్ర కళ్ళతో పలకరించాడు.

“ఏం గుడ్ మార్నింగో, ఏమిటో! పొద్దున్నే నిద్ర లేచి రావడం నానా యాతనగా వుంది సుమండీ!” అంటూ వాపోయాడింకొకాయన.

ఆ అపార్టుమెంటు కాంప్లెక్సులో వున్న నడి వయసు తెలుగు వాళ్ళు ఒక గుంపుగా హైకింగుకి వెళతారు. అందర్నీ వాళ్ళ ఫిజికల్ చెకప్ రిపోర్టులు భయ పెడుతూ వుండటం వల్ల, మనసుని మంచి చేసుకుని, కనీసం వారం చివర్లోనయినా కొంచెం వ్యాయామం అవుతుందని హైకింగుకి బయల్దేరుతారు. ఒంటరిగా వెళితే మోటివేషన్ వుండదని, ఒకర్ని చూసి ఇంకొకరు మోటివేట్ అవుతూ, ఒక గేంగ్‌లా వెళుతూ వుంటారు. కిట్టని వాళ్ళు వాళ్ళని “తొట్టి గేంగ్” అని కూడా పిలవడం కద్దు.

ఇంతలో ఒకాయన కాఫీ కప్పుతో వచ్చాడు హైకింగుకి బయలు దేరడానికి.

“చక్కగా మీ శ్రీమతి గారు కాఫీ కలిపిస్తే, గుటకలేస్తూ వచ్చారా?” అని నవ్వుతూ అడిగాడు సుబ్బారావు.

“మా ఆవిడ కాఫీ కలిపివ్వడమా, మరోటా? ఆవిడ హాయిగా, సుబ్బరంగా నిద్రోతూ వుంది ఇంట్లో. నేనే బ్రూ కాఫీ మైక్రోవేవ్‌లో కలుపు కొచ్చాను” అన్నాడాయన నిరుత్సాహంగా. ఆయనకి తన భార్య చేత సేవలు చేయించుకోవాలని మహా కోరిక.

“కిందటి సారి నా వేన్‌లో వెళ్ళాం. ఈసారి మీ వేన్‌లో వెళదాం. ఏమంటారూ?” అంటూ సుబ్బారావు ఒకాయన భుజం తట్టాడు.
పెట్రోలు ధరలు ఎంపైర్ స్టేట్ భవనం శిఖరాగ్రాన్ని అంటుతున్నాయి మరి.

“సరేనండీ!” అంటూ ఏడ్వలేని నవ్వు మొహంతో తన వేన్ తీసుకొచ్చాడాయన.

హైకింగు స్థలంలో ఒకరిద్దరు కలిశారు. అందరి మొహాలూ బలవంతపు బ్రాహ్మణార్థానికి వచ్చిన వాళ్ళవిలా వున్నాయి. ఒకరికి షుగర్ ఎక్కువ. “కంట్రోల్లో లేదూ, కాలో, కన్నో తీసేయ్యాల్సి వస్తుంది తొందర్లో” అని డాక్టరు బెదిరించడంతో, భయంతో వచ్చాడాయన.

ఇంకొకాయనకి, “గాలి పీల్చినా కొలస్ట్రాల్ పెరిగి పోతోంద”ని బాధ. పకోడీలూ, వేపుళ్ళూ, సమోసాలూ వదలడాయె. “ఎప్పుడో ఢామ్మని గుండాగి పోతుందని” డాక్టరు తిడితే, కొలస్ట్రాల్ తగ్గించుకోడానికి వచ్చాడాయన.

అలాగే ఒకరికి ట్రై గ్లిసరైడ్స్ ఎక్కువయితే, ఒకరికి లివర్ ఫంక్షన్ ఘోరంగా వుందని కంప్లైంటు. అందరూ ఎయిర్ కండిషన్ ఆఫీసుల్లో, కాలు కదపకుండా కంప్యూటర్ ముందర పని చేసే వుద్యోగస్తులే! కొవ్వు పేరు కోక ఏమవుతుందీ? తిండి తగ్గించరు. ఇంటి పనులు చెయ్యరు. “హైకింగు చేశాంగా వీకెండులో” అని అంటారూ, అనుకుంటారూ.

“ఏంటండీ? ఈ మధ్య మీరు కాస్త ఒళ్ళు చేసినట్టున్నారూ?” అడిగాడొకాయన ఇంకొకాయన్ని.

ఆ ఇంకొకాయన తెగ బాధ పడిపోయాడు. “ఏమిటోనండీ? ఎంత వీకెండులో హైకింగు చేస్తున్నా కిందటి వారం కన్నా కాస్త బరువు పెరిగాను” అంటూ వాపోయాడు.

మొత్తానికి హైకింగు మొదలు పెట్టారు. బాధ తెలియకుండా వుండేటందుకు మాటలు మొదలు పెట్టారు.

“ఇండియాలో రియల్ ఎస్టేట్ ఎంతలా పెరిగి పోయిందో చూస్తున్నారా? అమెరికాలో కన్నా ఇండియాలోనే ఇళ్ళ ఖరీదెక్కువ. ఇప్పటికే రెండు ఫ్లాట్లు కొని వుంచాను. ఈసారి ఒక పెద్ద ప్లాట్ కొని పారేస్తే పోలా అని చూస్తున్నాను” అంటూ ఒకాయన తన ఘోష వెళ్ళబుచ్చుకున్నాడు.

“మీ ఇంట్లో నాలుగు చేతులా సంపాదిస్తున్నారండీ! అలా కొనుక్కోక ఏం చేస్తారూ?” అన్నాడు సుబ్బారావు అక్కసుగా.

“మరేం! మీకు మాత్రం? మీకు స్టాకు మార్కెట్‌లో వచ్చిన లాభాల సంగతి మాకు తెలీదా, ఏమిటీ? అయినా యాహూ స్టాకులు కొనడం మంచిదేనా? మైక్రోసాఫ్ట్ వాళ్ళు యాహూని కొనడం గేరంటీయేనా? మీరే మంటారూ?” అంటూ వేరొకాయన తన విషయాలన్నీ చెప్పుకొచ్చాడు.

“అబ్బ! అస్తమానూ రియల్ ఎస్టేటూ, స్టాకులూ! ఎవరూ చిరంజీవి పెట్టబోయే పార్టీ గురించి మాట్టాడరేం?” అని వాపోయాడొకాయన.

ఆ గేంగ్‌లో వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అయినా, ఒక్కరూ సాహిత్యం జోలికి పోరు. తెలుగు అనేది సినిమాలు చూడ్డానికీ, వార్తలు చదవడానికీ మాత్రమే పరిమితం. చిరంజీవి సినిమాకి మొదటి రోజున వెళ్ళి, కాగితం ముక్కలు ఎగరేస్తూ, వుత్సాహంగా సినిమా చూడ్డం మాత్రం అందరికీ చాలా ఇష్టం.

ఇక పిల్లల చదువుల జోలికే పోరు. తిండీ, గుడ్డా ఇచ్చి, పబ్లిక్ స్కూలుకి పంపిస్తే, తమ బాధ్యత తీరిపోయిందని నిట్టూరుస్తారు. అప్పుడప్పుడు చదువుకోమని తిడుతూ వుంటారు. ఇక ఇంటి పనుల జోలికే పోరు. ఆడవాళ్ళు వుద్యాగాలు చేసినా, చెయ్యక పోయినా అవి ఆడవారి పనులే అని వారి గాఢ నమ్మకం. ఎటొచ్చీ బయట షాపింగు పనులు మాత్రం చేస్తారు. లేకపోతే తమ భార్యలు డబ్బు తగలేస్తారనే శంక.

ఆ మధ్య ఎవరో ఓ సంఘ సేవకుడు వీళ్ళని కాస్త సంఘ సేవ చెయ్యకూడదా అని అడిగాడు. అంతే! అందరూ అంతెత్తున ఎగిరారు.

“ఏమిటీ? మా పనులకే, మా జీవితాలకే టైం సరిపోవడం లేదు. ఇక సంఘ సేవ ఒకటా మాకు? చాల్లెండి మహా చెప్పొచ్చారు. మా సేవే ఎవరన్నా చెయ్యాలి” అంటూ అలా అన్న వాళ్ళ మీద విరుచుకు పడ్డారు.

మొత్తానికి పోసుకోలు కబుర్లతో హైకింగ్ ముగిసింది ఆ రోజుకి. ఆ మర్నాడు అంత కన్నా తక్కువ టైం లో హైకింగ్ పూర్తి చెయ్యాలని నిశ్చయించుకున్నా రందరూ.


తలుపు తీసి అపార్టుమెంట్లోకి అడుగు పెట్టిన సుబ్బారావుకి నిశ్శబ్దం ఒంటరిగా ఎదురైంది. ఎవరూ నిద్ర లేవ లేదు ఇంకా! స్నానం కానిచ్చాడు ముందర. టైం తొమ్మిది దాటింది.

“పిల్లలూ! లేవండి ఇక! స్కూలు వర్కు బాగా మురగ బెట్టుకున్నారు. ఇవాళన్నా పూర్తి చెయ్యాలి. లేవండి!” అంటూ పిల్లల్ని కేకల్తో లేపాడు.

“అబ్బా! శలవ రోజన్నా కాస్త నిద్ర పోనీవు కదా నాన్నా?” అని విసుక్కుంటూ లేచారు. ఆ కేకలకి, “మొదలయింది ఈయన శనివార సుప్రభాతం” అనుకుంటూ లేచింది సుబ్బలక్ష్మి కూడా.

పూజకి సామానులు సర్దుకుని కూర్చునే సరికి, సుబ్బలక్ష్మి వంటిట్లోకి కాఫీ కలుపుకోడానికి వచ్చింది.

“కొంచెం ఏమన్నా వండి ఇస్తావా, దేముడికి నైవేద్యం పెడతానూ?” అనడిగాడు కొంచెం జంకుతూ.

“నేనింకా స్నానమే చెయ్యలేదు. మడి లేకుండా వండితే, మీ నైవేద్యానికి పనికి రాదుగా? ఇవాళ్టికి బెల్లం ముక్క నైవేద్యంగా కానియ్యండి” అని కాఫీ చప్పరిస్తూ సలహా ఇచ్చింది.

పూజ మొదలు పెట్టాడు సుబ్బారావు మనసులోనే గొణుక్కుని. అమెరికాలో చాలా కాలం నించీ వుంటున్నా, చేసేది కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం కాకపోవడం వల్ల, బాగా డబ్బు వెనకేసు కోవడం గానీ, ఓ ఇల్లు కొనుక్కోవడం గానీ చెయ్యలేక పొయాడు. వీళ్ళుండే ప్రాంతంలో ఇళ్ళ ధరలు అంబరాన్నంటుతున్నాయి మరి. వుంటున్న అద్దె కొంపలో పైన ఓ స్నానాల గదీ, రెండు పడగ్గదులూ. కింద ఓ హాలు. దాంట్లో మూడో వంతు చోటు పక్కన కొంత వరకూ ఓ గోడ పెట్టి, ఆ పక్కది వంటిల్లు అన్నారు అపార్టుమెంటు వాళ్ళు. ఆ గోడకి ఇవతల పూజా మందిరం. దానికి కాస్త ఇవతల ఓ సోఫా, దాని పక్కనే ఓ టీవీ. దాని పక్కనే పైకి వెళ్ళడానికి మెట్లు. హాల్లో బయట నించీ తలుపు తీసి లోపలకి రాగానే కనపడేది ఎదురుగా వున్న పూజా మందిరం. అగ్గిపెట్టెల్లాంటి ఈ అద్దె కొంపల్లో ఇంత కన్నా సౌకర్యాలేం వుంటాయి?

ఆ లోపల పిల్లలు గోల చేసుకుంటూ టీవీ మీద పడ్డారు. పూజ చేసుకుంటూనే, కళ్ళెర్ర జేసి, పిల్లల వేపు కోపంగా చూసి, టీవీ సౌండ్ తగ్గించమని సైగలు చేశాడు. వాళ్ళు తండ్రిని మనసులోనే తిట్టుకుని, సౌండు కొంచెమంటే కొంచెమే తగ్గించారు. టీవీ లోని బొమ్మలు అప్పుడప్పుడు సుబ్బారావు దృష్టిని ఆకర్షిస్తూనే వున్నాయి. తన దైవభక్తి గుర్తు చేసుకుంటూ, దృష్టి మరల్చుకుంటూ పూజ సాగించాడు. ఆ లోపల ఘొల్లుమంటూ ఇంటి ఫోను మోగింది.

“చీర మీద ఎంబ్రాయిడరీ ఎలా చెయ్యాలీ?” అనే విషయం మీద చర్చ మొదలు పెట్టింది సుబ్బలక్ష్మి ఫోనులో పక్కింటావిడతో.
గొంతు వాల్యూం తగ్గించమని సైగల్తో సుబ్బలక్ష్మికి చెప్పాడు. కానీ ఆవిడ అటు తిరిగి మాట్టాడుతూ, భర్త సైగల్ని చూసినా, చూడనట్టు నటించింది.

ఆ లోపల పక్కింటి తెలుగాయన చనువుతో తలుపు తోసుకుని పేపరు కోసం వచ్చాడు. సైగల తోనే పేపరెక్కడుందో చూపించి, తను పూజ చేసుకుంటున్నాననీ, ఇప్పుడు మాట్టాడలేననీ మళ్ళీ సైగల్తో చెప్పాడు.

మొత్తానికి బెల్లం ముక్క నైవేద్యంతో పూజ ముగించాడు. అప్పటిక్కూడా వంటింట్లో పొయ్యి లోంచి పిల్లి లేవలేదు వాళ్ళింట్లో.

“ఏమిటీ? ఇవాళ వంట చెయ్యవా? ఎవరన్నా భోజనానికి పిలిచారా?” అని గంటు పెట్టుకున్న మొహంతో అడిగాడు సుబ్బారావు.

“పూట పూటకీ వంట చెయ్యడం నా వల్ల కాదు బాబూ! నిన్న రాత్రి చేసిన కూరా, పప్పూ ఇంకా మిగిలే వున్నాయి. కాస్త ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం పడేస్తాను. అంతే ఈ పూటకి” అని ఖచ్చితంగా చెప్పేసింది సుబ్బలక్ష్మి.

“హతవిధీ” అని నిట్టుర్చాడు సుబ్బారావు.

“పోనీ, మా అమ్మ పంపించిన కొరివి కారంలో కాస్త ఇంగువ దట్టించి పోపు వెయ్యకూడదూ?” అని అడిగాడు ఆశగా.

“ఇంగువంటే ఏమిటి నాన్నా?” అని కిసుక్కున నవ్వుతూ ఇంగ్లీషులో అడిగారు పిల్లలు.

“మీరు వంటింటి పని ఒక్కటి ముట్టుకోరు. కోరికలు మాత్రం ఎక్కువ. పనులు చేతకాని వాళ్ళు పెట్టింది తిని వూరుకోవాలి. లేదా సొంతంగా చేసుకోవాలి. అంతేగానీ ఈ వేవిళ్ళ కోరికలు తీర్చడం నా వల్ల కాదు” అని ఝాడించేసింది సుబ్బలక్ష్మి.

అయిష్టంగా ముఖం పెట్టుకుని భోజనం కానిచ్చాడు రాత్రి చేసిన కూరలతో. తిండి మింగుతున్నంత సేపూ రక రకాల మాటలతో తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే వున్నాడు.

ఎంత రాత్రి వండిన పదార్థలయినా, సుబ్బరంగానే తిని లేచాడు. పిల్లలు కూడా భోజనాలు కానిచ్చి, మళ్ళీ టీవీ మీద పడ్డారు. వాళ్ళ స్కూలు ప్రిన్సిపలే ఇంటికి వచ్చి చదువుకొమ్మని చెప్పినా, పట్టించుకునే దశలో లేరు వాళ్ళు.

పెద్ద పొట్టతో శయనాగారం వేపు నడుస్తున్న భర్తని చూసి, “భుజించడం అయింది. ఇక శయనించడం తరువాత అంశం!” అంది వెటకారంగా సుబ్బలక్ష్మి.

“ఏమిటీ?” అన్నట్టు విసుగ్గా చూశాడు.

“వీకెండులో కూడా తెల్లారగానే హైకింగు పేరుతో వెళ్ళి పోతారు. ఇంట్లో ఏ పనీ చెయ్యరు. తిండి అసలు తగ్గించరు. ఇంటి పనులు చెయ్యడమే పెద్ద ఎక్సర్ సైజు. చీపురు పెట్టి హార్డ్ వుడ్ నేల వున్న గదులు వూడ్వండి. రోజూ వంటిల్లు కడగండి. వాక్యూం క్లీనర్ ఒదిలెయ్యండి. రోట్లో పిళ్ళూ, పచ్చళ్ళూ రుబ్బండి. గ్రైండర్లూ, మిక్సీలూ ఒదిలెయ్యండి. జబ్బు మనుషులకైతే ఈ ఎక్సర్ సైజులు కావాలి గానీ, ఆరోగ్యంగా వుంటూ, అన్ని ఇంటి పనులూ చేస్తూ వుండే వాళ్ళకి ఏ ఎక్సర్ సైజులూ అక్కర్లేదు. ఇన్ని పనులూ చేస్తుంటే, తిండి కూడా తగ్గించక్కర్లేదు” అంది సుబ్బలక్ష్మి ధాటీగా.

ఆ మాటలు ఏ చెవి తోనూ వినకుండానే తిప్పి కొట్టేశాడు.

పైపెచ్చు, “మరి నిద్ర పోకపోతే, కమ్మటి కలలెలా వస్తాయీ? షడ్రుచులతో భోజనం ఆరగించాలంటే నిద్రోయి కలలు కనడం తప్పని సరి. ఎవరేమనుకున్నా సరే, నా నిద్ర నేను పోయేది ఖాయం! కలలు కనేది కూడా ఖాయం!” అంటూ లోపలకి వెళ్ళాడు సుబ్బారావు.

ఆ మాటలేవీ పట్టించు కోకుండా, పిల్లలూ, సుబ్బలక్ష్మీ టీవీ చూడ్డంలో మునిగిపోయారు.

ముందరి పేజీ(లు) 1 2
 

(8 అభిప్రాయాలు)

  1. sunitha అభిప్రాయం:

    July 2, 2008 2:09 am

    చాలా బాగుంది.

  2. Rangababu అభిప్రాయం:

    July 3, 2008 5:19 pm

    వంటింటి కథ లో పోపు బాగానే వుంది.

  3. chokkakula venkataprasad అభిప్రాయం:

    July 4, 2008 5:49 pm

    ప్రవాన ఆంధ్రుల ఆత్మకథ (ఘోష) చాలా క్లుప్తంగా, సరళంగా,చక్కగా చెప్పారు. అయినా అ(జనా)రణ్యంలో వనవాసం చేస్తూ అక్కడ కూడ అమ్మచేతి కమ్మని వంట లాంటి వంటే కావాలంటే అది కలలోనే సాధ్యం మరి. మార్పుకోరుతూ ఇక్కడకొచ్చి మార్పుని మళ్లీ గుంజకి కట్టేద్దామంటే సాధ్యం కాదు. అయినా నరులు శాంతించరు. అందుకే రాత్రంటూ ఒకటి పెట్టి, ఒంటికి అలసట, కంటికి కునుకు తప్పనిసరి చేసేసేడు ఆ పైవాడు. లేకపోతె కలలు ఉండేవి కావు కలలోని కమ్మని ఊహలు ఉండేవి కావు. మీ సుబ్బారావు మళ్ళీ మళ్ళీ నిద్రపోయి మరిన్ని కలలు కనాలని కోరుకొంటూ నిద్రకుపక్రమిస్తున్నాను

  4. Ravi అభిప్రాయం:

    July 9, 2008 7:10 am

    సిల్లీ కథ. అసలిటువంటి పిచ్చి కథలు ఏ ప్రయోజనం ఆశించి రాస్తారో తెలియదు. కథలో బద్ధకస్తుడైన మొగుడు, అంతకంటే బద్ధకస్తురాలైన ఇల్లాలు. కనీసం ఒక సెలవు రోజు సరదాగా ఎంజాయ్ చేసే సరసులు కూడా కాదు వీళ్ళు. పైగా ఇలాంటి పాత్రల ద్వారా పాఠకులకి సందేశాలు - ఇంటి పన్లు చేసుకుంటే ఎక్సరసయిజు అక్కర్లేదు అని. ఈ ఒక్క వాక్యం రాస్తే చాలదూ? దానికింత చేట భారతం ఎందుకు? హాస్యంగానీ, ఒక శిల్పంగానీ, ఒక అనుభూతి గానీ లేని కథ. చిరాకు తెప్పించే కథ.

  5. చిన్నమయ్య అభిప్రాయం:

    July 17, 2008 5:23 am

    కధ మొదలుపెట్టి చదువుతున్నప్పుడు, అదేవిటి మొత్తం అంతా సాఫీగా సాగిపోతోంతోంఅని కంగారు పడ్డను. రెండో పుట తెరిచేక ఘర్షణ తెలిసింది. శైలీ బావుంది, సమస్య ఎత్తి చూపిన పద్ధతీ బావుంది. “రోటి పచ్చడి” - బాగా జ్ఞాపకం తెప్పించేరు. తిని ఎన్నాళ్లయిందో!
    ప్రవాసులమాటే ఎందుకు, మన మహానగరాల్లో, ఆర్ధికంగా పైకెదుగుతున్న నివాసుల జీవితమూ ఇంచుమించూ ఇదే! బాగా రాసేరు. అభినందనలు.

  6. Seetharama అభిప్రాయం:

    August 20, 2008 3:35 am

    I don’t understand why this story is accepted for print. I regret that I could not call ‘this’ any thing but a story. What did the writer want to say? Is he trying to showcase the difference between what people wish for, and what they have in reality? If so, I have no hesitation saying that the writer chose a wrong story line. If he wanted a comedy story, he missed those lines right from the beginning.

    To have an interest to write is appreciated, but as “Bharago” the famous writer said once, you need to read Five Hundred books before you attempt to write one.

    However, I don’t intend to discourage the writer, he can continue his effort, and one day, there will be light at the end of the tunnel. It is upto the editor(s) to read the story before printing. If they don’t have content, it is worth reprinting some good old stories rather than printing junk

    Regds

    Ram

  7. Anjaneyulu అభిప్రాయం:

    August 23, 2008 2:22 pm

    మనసు కోరుకునే రుచులకీ అభిరుచులకీ, పరుగులు తీసే నిజ జీవితానికీ మధ్యన నలిగే మనిషికి ఉన్న ఒకే ఒక్క బలహీనత బద్ధకం అని చాలా హృద్యంగా చెప్పిన కవి గారికి శుభాభినందనలతో.

  8. Bhushan అభిప్రాయం:

    August 29, 2008 1:24 am

    ఇదేం కథండీ బాబూ ! కాకపోతే మాలాంటి మగ మహారాజులకి వంట చెయ్యమని చెప్పే కథ రాస్తారా? ఎంత మీరు ఎక్సర్ సైజ్ అని వంక పెట్టి రాస్తే మాత్రం, అది మాలాంటి పురుషాహంకారులని ఏ మాత్రం మార్చలేదు, హ్వహ్వహ్వ ! భూషణ్