కవిత్వ భాష తీరుతెన్నులు

కవిత్వ భాషలో విశేష అంశాలు

1. పర్యాయపదాలు – మన ప్రయాణాన్ని పదాలనుంచి మొదలుపెడదాం. ఒకే అర్థాన్ని యిచ్చే అనేక పదాలు పర్యాయపదాలని అందరికీ తెలిసిన విషయమే. వీటిని కవిత్వభాషలోనే ఎక్కువగా చూస్తాం. ప్రాచీన కవిత్వం చాలావరకూ పద్యకవిత్వం కాబట్టి, పద్యాలలో ఛందస్సుకోసం యీ పర్యాయపదాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. కొన్ని చోట్ల అలంకారాల కోసం (ముఖ్యంగా శబ్దాలంకారాల కోసం) తగిన పర్యాయపదాన్ని ఏరుకుంటాడు కవి. ఉదాహరణకి “పొలాలనన్నీ, హలాల దున్నీ” అన్నప్పుడు శ్రీ శ్రీ నాగలికి హలం అన్న పదాన్ని వాడింది ఛందస్సు కోసం, ప్రాస కోసమే కదా.

చెప్పే విషయానికి బలాన్ని చేకూర్చడానికి కూడా ప్రత్యేకమైన పదాలని వాడిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకి “వరమున బుట్టితిన్…” అన్న తిక్కన పద్యంలో, “సహజన్ముల ప్రాపుగాంచితిన్, సరసిజనాభ యిన్నిట ప్రశస్తికి నెక్కినదాననెంతయున్” అని ద్రౌపది అంటుంది. ఇక్కడ కృష్ణుడికి వాడిన పర్యాయపదం “సరసిజనాభ” – అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తే నాకు సోదరుడై కూడా నాకీ గతి పట్టిందే అన్న ద్రౌపది వేదనని యీ పదం స్ఫురింపజేస్తుంది. వాడుకభాషలో కూడా ఒకే అర్థాన్నిచ్చే అనేక పదాలుండ వచ్చు. కానీ సాధారణంగా అవి రకరకాల మాండలికాలకి చెందినవవుతాయి. ఒకే మాండలికంలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఒకటి కన్నా ఎక్కువ ఉండడం అరుదు.

2. నానార్థాలు – ఒకే పదానికి ఉన్న అనేక అర్థాలని నానార్థాలంటాం కదా. కవిత్వంలో నానార్థాలు వాడుకభాషలో కన్నా ఎక్కువగా కనిపిస్తాయి. అసలీ నానార్థాలు ఎలా పుడతాయన్నది గొప్ప పరిశోధనాంశం. సంస్కృతంలో చాలా పదాలు కొన్ని మూల ధాతువులనుంచి ఏర్పడతాయి. వేర్వేరు ధాతువులనుంచి (లేక ఒకే ధాతువునుంచయినా!) వేర్వేరు వ్యాకరణ కార్యాల ద్వారా ఒకే పదం ఏర్పడినప్పుడు, అలా పుట్టిన పదానికి నానార్థాలు ఏర్పడతాయి. తెలుగులో యిలాటి నానార్థాలు కలిగిన పదాలు చాలా తక్కువ. ఉన్నా అవి మాండలిక భేదం వల్ల వచ్చినవే తప్ప వ్యుత్పత్తి భేదం వల్ల కాదు. ఉదాహరణకి, “గుంట” అన్న పదానికి “గొయ్య” అని అర్థం. దీనికే “ఆడపిల్ల” అని మరో అర్థం ఉంది, ఉత్తరాంధ్ర మాండలికంలో. “చుక్క” కూడా యిలాటిదే.

కవిత్వంలో యీ నానార్థాలని ఎక్కువగా శ్లేష కోసం వాడుకున్నారు పూర్వ కవులు. చిత్రకవిత్వంలో కూడా యీ నానార్థాల ఉపయోగం కనిపిస్తుంది. ఆధునిక కవులు నానార్థాలని ఉపయోగించడం చాలా అరుదైన విషయమే అని చెప్పాలి. దీనికి సినిమా”కవులు?” కొందరు మినహాయింపనుకోండి!

3. సంధి – వాడుకభాషలో ఎక్కువగా కనిపించక, కవిత్వభాషలో (అందులోనూ పద్య కవిత్వంలో) ఎక్కువగా కనిపించే, మరో భాషాంశం “సంధి”. వీటి ప్రయోజనం ముఖ్యంగా కవిత్వానికి ఒక ధారని, ప్రవాహ గుణాన్ని ఇవ్వడం అని నాకనిపిస్తుంది. మన ప్రాచీన కావ్యాలు ప్రథానంగా శ్రవ్య కావ్యాలు. అంటే చదివి ఆనందించడానికి కన్నా, విని ఆనందించడానికి ఎక్కువ అనువైనవి. అందువల్లనే ప్రాచీన కవిత్వంలో శబ్దానికి (ఇప్పటికన్నా) ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. చదివేటప్పుడు పదాలు ఒకదానితో ఒకటి చేరువై ధారగా సాగినప్పుడు శ్రవణ సుభగంగా ఉండి కవిత్వం శ్రోతలను ఆకట్టుకునేది. వాడుక భాషలోనూ సంధులు జరుగుతాయి, కానీ వాటి ప్రయోజనం వేరు. వాడుకభాషలో ఉచ్చారణా సౌలభ్యం కోసమే సంధులు జరుగుతాయి. తెలుగులో జరిగే అచ్సంధిని (అ + అ = అ), సంస్కృతంలోని సవర్ణదీర్ఘ సంధితో (అ + అ = ఆ) పోలిస్తే ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆధునిక వచన కవిత్వంలో కూడా ధారాధారితమైన కవిత్వంలో సంధులు ఎక్కువగానే కనపడతాయి. కృష్ణశాస్త్రి, తిలక్, సోమసుందర్ వంటి కవుల కవిత్వంలో వీటిని ఎక్కువ గమనించవచ్చు.

4. సమాసం – సంధి వెంటనే వచ్చేది సమాసం. ప్రాచీన కవిత్వంలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేవి సమాసాలు. తెలుగు పద్యాలలో విరామ యతి లేకపోవడం వల్ల పాదాలకి పాదాలే ఆక్రమించుకున్న సమాసాలు తరచూ దర్శనమిస్తాయి. కవిత్వంలో వీటి ప్రయోజనం ఏమిటీ అని ఆలోచిస్తే, ముఖ్యంగా కనిపించేది ధారే. సంధి కలిగించే శ్రవణ సుభగత్వాన్ని పరిపూర్ణంగా వినియోగించుకొని అనేక పదాలని ఒక సమాసంలో కూర్చినప్పుడు ఒక అప్రతిహత ధార శ్రోతలని ఆకట్టుకొంటుంది. నన్నయ్యలోనూ, శ్రీనాథుడిలోనూ, పెద్దనలోనూ, కొంత వరకూ పోతనలోనూ ఈ పద్య ధార కనిపిస్తుంది. శ్రీనాథుడిని “పద ప్రసిద్ధ ధారాధుని” అని కావ్యాలంకార సంగ్రహకారుడు పేర్కొన్నదిందుకే.

తిక్కనకి మాత్రం పద్య ధార మీద అంత మోజున్నట్టు కనిపించదు. అతడు పెద్ద పెద్ద సమాసాలు వేసిన చోటల్లా, చెప్పే విషయాన్ని ఉద్దీపింపచెయ్యడానికే ఉపయోగించుకున్నాడు, ఎక్కువగా. ఉదాహరణకి ధర్మరాజు గొప్పదనాన్ని చెపుతూ ద్రౌపది చెప్పిన ప్రసిద్ధ పద్యంలో,

“అతడు భూరి ప్రతాప మహా ప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణివేష్ఠి తాంఘ్రి
తలుడు, కేవల మర్త్యుడె ధర్మ సుతుడు“

అని పెద్ద సమాసం ప్రయోగించాడు. ఇది ధర్మ సుతుడు “కేవల మర్త్యుడు” కాదు అన్న భావానికి ప్రోద్బలంగా వేసిన సమాసం.

అయితే యిలా అనేక పదాలతో పెద్ద సమాసాలని కూర్చడం సంస్కృత పదాలతోనే సాధ్యం. తెలుగులో మహా అయితే రెండు మూడు పదాలకన్నా ఎక్కువ కలిసి సమాసంగా రూపొందవు. పూర్వ కవులు సమాసాలని మరొక ప్రయోజనం కోసం కూడా వాడుకొన్నారు, క్లుప్తత కోసం! అదేమిటి చాంతాడంత సమాసాలు క్లుప్తత నెలా యిస్తాయని ఆశ్చర్యపడకండి. ఈ ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది :

తల బక్షఛ్చట గ్రుక్కి బాతువులు కేదారంపు కుల్యాంతర
స్థలి నిద్రింపనుజూచి, యారెకు లుషస్స్నాత ప్రయాత ద్విజా
వళి పిండీకృత శాటులన్ సవి దదావాసంబు జేర్పంగ రే
వుల డిగ్గన్ వెస బాఱు వానిగని నవ్వున్ శలిగోప్యోఘముల్

ఇక్కడ “ఉషస్స్నాత ప్రయాత ద్విజావళి” అన్నది ఒక సామాసం. దీని అర్థం ఉషఃకాలంలో (పొద్దున్నే) స్నానంచేసి వెళ్ళిన బ్రాహ్మణులు అని అర్థం. దీన్ని సమాస రహితంగా చెప్పాలంటే పెద్ద వాక్యం అవుతుంది. అలాగే “పిండీకృత శాటులు” అన్న పదానికి పిడచబడిన అంగవస్త్రాలు అని అర్థం. పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిన బ్రాహ్మణులు పిడిచి వదిలివేసిన అంగవస్త్రాలు అన్న భావాన్ని రెండు సమాసాలలో ఎంత క్లుప్తంగా చెప్పాడు రాయలు!

ఆధునిక కవులు సమాసాలని (వీటినిప్పుడు పదబంధాలని అంటున్నారు) మరో విశేషమైన ప్రయోజనానికి కూడా వాడుకున్నారు. విచిత్రమైన పద సంయోజనంతో ఒక నూతన భావాన్ని ఆవిష్కరించే పదబంధాలని సృష్టించడం వీటి ప్రయోజనం. ఈ పదబంధాలు ఆయా కవుల కవిత్వభాషకి ముడిసరుకు కూడా అయిన సందర్భాలున్నాయి. “చిరునవ్వు వెన్నెల”, “మంజువాటి”, “విరహగీతిక” మొదలైన పదబంధాలు భావకవిత్వంలో కనిపిస్తే, “శ్రమైక జీవన సౌందర్యం”, “యంత్రభూతములు”, “నవీనగీతం” మొదలైనవి అభ్యుదయ సాహిత్యంలో కనిపిస్తాయి. “విషాద సుఖము”లాంటి Oxymoronsని కూడా భావ కవిత్వం సృష్టించింది.

5. ఛందస్సు – సంధులూ సమాసాల తర్వాత చెప్పుకోవలసింది ఛందస్సు. ఈ కాలంలో ఛందోబద్ధమైన కవిత్వం చాలా అరుదుగా వస్తోంది కాని, ఒకప్పుడు ఛందస్సే కవిత్వానికి ప్రధానమైన వాహికగా నిలిచింది. ఛందస్సుకీ, కవిత్వానికీ ఎంతలా అనుబంధం ఏర్పడిందంటే, ఛందస్సులో రాస్తేనే అది కవిత్వమవుతుందనీ, ఛందస్సులో రాసేది ప్రతీదీ కవిత్వమే అనీ చాలామంది చాలాకాలం అపోహ పడేంత! ఆధునిక కాలంలో యీ అపోహలు మెల్ల మెల్లగా తొలగిపోయాయనుకోండి. కాకపోతే యిప్పుడు, వాడుక భాషలో రాస్తేనే అది కవిత్వమనీ, వాడుకభాషలో రాసింది ప్రతీదీ కవిత్వమేననీ మరొక అపోహ చాలామందిలో ఏర్పడింది, అది వేరే సంగతి.

ఇంతకీ, ఛందస్సు కవిత్వానికి ఒనగూర్చేదేమిటి? చాలామంది ఠక్కున చెప్పే సమాధానం “లయ”. లయంటే ఏమిటి? దానికీ కవిత్వానికీ ఉన్న సంబంధం ఏమిటి? ఇది గేయాలలో ఉండే గతి (త్రిశ్ర గతి, మిశ్ర గతి, ఖండ గతి మొదలైనవి) అనుకుంటే, అన్ని ఛందస్సులకీ ఇలాటి గతి ఉంటుందా అన్న అనుమానం వస్తుంది. ఆక్షర బద్ధమైన వృత్తాలలో (మత్తకోకిల వంటి వాటిని మినహాయిస్తే) ప్రస్ఫుటమైన లయ ఉండదు. మాత్రాఛందస్సులో లయ ఉంటుంది. వృత్తాలు ఒక ప్రత్యేకమైన నడకని మాత్రం కలిగి ఉంటాయి. ఈ నడక, లయ, కవిత్వానికి శాబ్దికమైన ఒక సొగసును చేకూరుస్తాయి. ఒక పాట ఎలా శ్రోతలకి ఆనందాన్నిస్తుందో, అలాగే ఇదీ శ్రవణానందాన్ని కలిగిస్తుంది.

భాష కవిత్వానికి కేవలం దోహదకారే కాని భాషే కవిత్వం ఎలా కాలేదో, అలానే ఛందస్సు కూడా. ఆధునిక కవిత్వంలో కూడా, మొదట్లో మాత్రా ఛందస్సు ప్రాబల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, గురజాడనుంచి శ్రీశ్రీ వరకూ కూడా. నిజానికి మొదట్లో, వచన కవిత్వం పేరుతో వచ్చిన చాలా కవిత్వంలో (ప్రత్యేకమైన మాత్రాఛందస్సు లేక పోయినా) ఒక ప్రత్యేకమైన నడకని గమనించ వచ్చు. ఇది ఇంగ్లీషుభాషలోని free-verse (దీనికి “స్వఛ్ఛంద కవిత్వ” మని కొందరి అనువాదం). అంటే నియమితమైన ఛందస్సు లేకపోయినా, వచనంలో ఉండని ఒక ప్రత్యేకమైన నడక ఉన్న కవిత్వం. తరవాత్తరవాత అది పూర్తి వచన కవిత్వంగా మారింది. దీన్ని ఇంగ్లీషులో prose-poetry అంటారు.

ఛందస్సుకి మరొక ప్రయోజనం కూడా ఉంది. అది గుర్తుండిపోయే స్వభావం. ఇది కూడా ఒకప్పుడు కవిత్వానికి చాలా అవసరమైన గుణమే. ఈ కాలంలో చాలామందికి, కవిత్వం మిగిల్చే అనుభూతి మాత్రమే ముఖ్యం, కవితలోని పదాలూ, వాక్యాలూ గుర్తుండాల్సిన అవసరం లేదు.

6. వాక్య శైలి – ఇప్పటి వరకూ చర్చించిన భాషాంశాలన్నీ ఎక్కువగా ప్రాచీన కవిత్వంలో కనిపించేవి, శబ్ద ప్రధానమైనవి. ఈ మధ్య వచ్చిన, వస్తూన్న వచన కవిత్వంలో యివేవీ ప్రస్ఫుటంగా కనిపించవు. ఈ రకంగా చూస్తే, ఆధునిక కవిత్వ భాష, వాడుక భాషకి చాలా దగ్గరగా వచ్చింది అనుకోవచ్చు. అయినా వాక్య శైలిలో మాత్రం ఆధునిక కవిత్వ భాషకీ, వాడుకభాషకీ మధ్య తేడా గమనించవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆధునిక కవిత్వంలో కన్నా, ప్రాచీన కవిత్వంలోని వాక్య నిర్మాణం, వాడుక భాషకి దగ్గరగా ఉంటుంది! బహుశా దీనికి కారణం ప్రాచీన కావ్యాలు కథా కావ్యాలవడం కావొచ్చు.

ప్రాచీన కావ్యాల కథాకథనంలో వివిధ శైలులనీ, ఆ శైలులలో వాక్య నిర్మాణ భేదాలనీ మన విమర్శకులు గుర్తించి విశ్లేషించారు. పురాణ (కథన) శైలి ఎక్కువగా ఒక వక్త శ్రోతలకి కథ చెపుతున్నట్టుగా సాగే శైలి. నాటకీయ (సంభాషణా) శైలి దృశ్య కావ్యాలకి దగ్గరగా, అంటే ఎక్కువ సంభాషణలతో సాగుతుంది. ప్రబంధ (ఆలంకారిక) శైలిలో అలంకారాలతో కూడిన వర్ణన ఎక్కువగా ఉంటుంది. నన్నయ్యగారి వాక్యాలు (వచనంలో కూడా) ఎక్కువగా గొలుసుకట్టుగా సాగుతూ ఒక ధార కలిగి ఉంటాయనీ, అదే తిక్కనగారి పద్యాలలోని వాక్యాలు కూడా ఎక్కువ సమాపక క్రియలతో, ఎక్కడికక్కడ తెగిపోతాయనీ మధునాపంతులవారు తన సాహిత్య వాసాలలో వివరించారు.

వీటన్నిటికి భిన్నమైన ఒక విచిత్ర శైలి మనకి కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో కనిపిస్తుంది. దీనికి ఆధునిక కవిత్వ భాషతో కొంత పోలికకూడా ఉందనిపిస్తుంది! చెప్పదలుచుకున్న విషయం ఎంత విస్తృతమైనదైనా, స్వల్ప పదాలలో, ఛందోబద్ధంగా చెప్పే ప్రయత్నంలో రాయలు భాషలో క్లుప్తతని సాధించిన విధానం విచిత్రమైనది. దీనికి రాయలు వాడుకొన్న ఒక పనిముట్టు ఇంతకుముందు చెప్పుకున్న సమాసాలు. ఆది మాత్రమే సరిపోలేదు. అతని పద్యాలలో చాలా చోట్ల వాక్యానికీ వాక్యానికీ మధ్య సంబంధం (భాషాపరంగా) కనిపించదు. ఆ ఖాళీలని తమ ఆలోచనాశక్తి ద్వారా పాఠకులే పూరించుకోవాలి! అందుకే ఇతని పద్యాలకి అన్వయం చాలా కష్టం. ఉదాహరణకి ఓ కథ మొత్తాన్ని ఒక్క పద్యంలో ఎలా చెప్పాడో చూడండి.

విల్లుం దానును భిల్లుడొక్కడరుగన్, విందింట – దుగ్ధాన్నమున్
భిల్లుండన్యుడు పెట్ట, నారయుడుకన్ వీక్షించి దొబ్బంచు వా
డెల్లన్ వమ్ముగ జేసి తన్ననుపరా నెందే దెగం జూడగా
నుల్లంబై చననంపు నార చెడు నా నూహించి పోనంపడే

ఇది వచనంలో రాస్తే, ఇలా ఉంటుంది :

ఒక భిల్లుడు తన వింటితో వెళితే, విందు జరిగిన ఇంట్లో పరమాన్నాన్ని వెరొక భిల్లుడు పెడితే, నార ఉడుకుతూ ఉంటే చూసి మాంసమనుకొని, వాడు మొత్తమంతా వమ్ముచేసి, తనని పంపించడానికి వచ్చినప్పుడు ఎక్కడైనా చంపుదామని అనుకుంటే, “నార చెడుతుంది తిరిగి పంపు” అని అంటే, అర్థంచేసుకొని పంపించేసాడు కదా.

ఏమైనా అర్థమవుతోందా! ఖాళీలు పూరించుకుంటే తెలిసే అసలు కథ ఇది:

ఒక భిల్లుడు మరొక భిల్లుడింటికి వెళ్ళాడు. అక్కడా భిల్లుడు పెట్టిన పరమాన్నాన్ని తిని, వంటింట్లో ఉడుకుతున్న నారని చూసాడు మొదటి భిల్లుడు. దాన్ని మాంసం అనుకున్నాడు. “అరే! నన్నింటికి ఆహ్వానించి, మాంసం పెట్టకుండా వీడొక్కడే తినేద్దామనుకున్నాడు. ఎంత అన్యాయం!” అని, ఇచ్చిన ఆతిథ్యమంతా మరచిపోయి ఆ రెండవ భిల్లుడు మీద పగ పెంచుకున్నాడు. ఆ కోపంతో, తనకు వీడ్కోలు చెప్పడానికి రెండవ భిల్లుడు వచ్చినప్పుడు, వాడిని కొంత దూరం తీసుకువెళ్ళి చంపేద్దామనుకున్నాడు! తోవలో వెళుతూ, “ఇంక నేను వెనక్కి పోవాలి. ఇంట్లో ఉడుకుతున్న నార చెడిపోతుంది” అని ఆ రెండవ భిల్లుడు అనేసరికి మొదటి భిల్లుడికి తను పొరబడ్డానన్న విషయం అర్థమై, చంపకుండా వాణ్ణీ వెనక్కి పంపించేసాడు.

ఇదీ అసలు కథ! ఇలా రాస్తే కవిత్వమైపోతుందని నా ఉద్దేశం కాదు కాని, తన కావ్యంలో రాయలు ఉపయోగించిన ఒక ప్రత్యేక శైలి యిది. ఆధునిక కవిత్వంలో కూడా యిలా వాక్యాల మధ్య ఖాళీలు ఉండడం, వాటిని పాఠకులే పూరించుకోవడం మనం చూడవచ్చు. రాయల శైలి సాధించే ప్రయోజనం భాషలో క్లుప్తత, ఛందోబద్ధత. ఆధునిక కవిత్వంలో ఈ శైలికి క్లుప్తతతో బాటు, మరో ప్రయోజనం కూడా ఉంది – కవి చెప్పదలుచుకున్న విషయం మాటలలో చెప్పలేనప్పుడు, దాని చుట్టూ ఉన్న విషయాన్ని చెప్పి, ఆ చెప్పలేని విషయాన్ని పాఠకుల ఆలోచనకీ, అనుభూతికీ వదిలివెయ్యడం ఉదాహరణకి ముకుంద రామారావుగారి “ఏకాంత వేళ” అన్న యీ కవితలో, చెప్పినదాని కన్నా చెప్పనిదే ఎక్కువ:

గతాగతాలు
ఊహాతీత ఉదయాలు
ఆలోచనంతా పాకిన
అల్లకల్లోల ప్రశాంతం
దినాంతపు ఏకాంతం చీకటి.

ఈ శైలికి పరమావధి హైకు అని చెప్పవచ్చు.

ఆధునిక కవిత్వంలో ఎక్కువగా కనిపించే మరొక వాక్య నిర్మాణ పద్ధతి – సమాపక క్రియ లేని వాక్య ప్రయోగం. క్రియ విశేషణంలో భాగంగా మారవచ్చు లేదా పూర్తిగా లోపించవచ్చు. కవిత్వాన్ని మామూలు వచనంతో వేరు చేసే సాధనంగా దీన్ని వాడుకున్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకి అఫ్సర్ “డె జా వూ” కవితలోని యీ పంక్తులు చూడండి:

నిన్న రాత్రే
మీతో కూర్చున్నట్లుగా,
మాట్లాడినట్లుగా,
మీతో కలిసి అన్నం తింటున్నట్టుగా,
మీతో మేడమీద బిచానా వేసినట్టుగా,
ఏది అవునో ఏది కాదో?

ఇక్కడ అయిదవ పాదం తరవాత “అనిపిస్తోంది” లాంటి క్రియా పదం ఉండాలి, వ్యాకరణ రీత్యా. లేకపోయినా అర్థమవుతోంది కాబట్టి అది అనవసరమైన పదం అని తీసేసారేమో.

ఆధునిక కవిత్వంలో ఉన్న విస్తృతి, వైవిధ్యం కారణంగా, ప్రాచీన కవిత్వంలో లాగా శైలీ రీతులని వింగడించడం కష్టమైన పని. అయినా, ఆత్మాశ్రయ ధోరణి, ఉపన్యాస ధోరణి, అధిక్షేప ధోరణి, అన్యాపదేశ ధోరణి మొదలైన రకాలగా విభజించే ప్రయత్నం చెయ్యవచ్చు. ఆత్మాశ్రయ ధోరణి అంటే కవి తన గురించి మాత్రమే చెప్పడం కాదు, తనలో తాను మాట్లాడుకున్నట్లు రాయడం. ఉదాహరణకి శ్రీశ్రీ “కవితా ఓ కవితా” ఈ ధోరణిలో సాగుతుంది. ఉపన్యాస ధోరణి అంటే పాఠకులని నేరుగా ఉత్తేజ పరుస్తూ, ఉద్బోధిస్తున్న రీతులో సాగే కవిత్వం. ప్రసిద్ధమైన శ్రీశ్రీ కవితలలో చాలా కవితలు యీ కోవకి చెందుతాయి – “మరో ప్రపంచం”, “జగన్నాథ రథచక్రాలు”, “ప్రతిజ్ఞ” ఇలా చాలా. అధిక్షేప ధోరణిలో ఉండేది అధిక్షేపం, అది ఎవరిగురించయినా కావొచ్చు. ఇందులో తీవ్రతబట్టి అది హేళన కావచ్చు, తిట్లూ కావచ్చు. చెప్పే విషయాన్ని అన్యాపదేశంగా, వ్యంగ్యంగా చెప్పడం అన్యాపదేశ ధోరణి.

ఒకొక్క ధోరణికి అనువైన వాక్య శైలిని గురించి విశ్లేషించవచ్చు. ఉదాహరణకి ఉపన్యాస ధోరణిలో ఉండే కవిత్వం శబ్దాన్ని ఆశ్రయించ వలసి వస్తుంది. లేకపోతే, ఉపన్యాసానికీ ఉపన్యాసధోరణిలోని కవిత్వానికి తేడా గుర్తించడం కష్టం. ఇలా ఆధునిక కవిత్వంలోని విభిన్న ధోరణులని పరిశీలించవచ్చు.

వచన కవిత్వంలో వాక్య నిర్మాణాన్ని గురించి “కవిసేన మేనిఫెస్టోలో” శేషేంద్ర శర్మ గారు కొంత చర్చించారు. మామూలు భాషలోని వాక్యం కవితలో ఎలాటి మార్పు పొందగలదో ఇచ్చిన యీ వివరణ ఆలోచనార్హం:

కవిత్వంలో వాక్యరచన మొదట శబ్ద సమూహ సంక్షేప ప్రక్రియను అమలు జరుపుతుంది. వాక్యాన్ని ఎంత సంక్షేపం చెయ్యడానికి వీలుంటుందో అంతవరకూ శబ్దాలు తీసివేస్తూ పోతుంది ఈ ప్రక్రియ. అట్లాగే చివర, మొత్తం పద్యంలో ఉన్న వాక్యబృందాన్ని కూడా ఎంతవరకు వీలుంటే అంతవరకూ తగ్గించుకుపోతుంది – ఇక తీసివేస్తే మూలపదార్థానికే దెబ్బ తగులుతుందన్నంత వరకూ శబ్దాలనూ, వాక్యాలనూ జారవిడుస్తూ పోవాలి.

రెండవది వాక్య రచనా వ్యూహం – అంటే వాక్యంలో కర్త కర్మ క్రియలు తదితర శబ్దాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే కవి ఊహలోకి దిగిన చిత్రం సమగ్రంగా భాష అనే బ్రోమైడ్ పేపర్ మీదికి దిగుతుందో ఆ రచనా వ్యూహం. దీనికి శబ్దతత్వ వైదుష్యం కావాలి. (ప్రబంధ భాష అనుకోకండి, కొంపదీసి – ఇదంతా వర్తమాన భాషను గురించే). శబ్దాలూ వాటి స్థానాలూ స్వరూపాలూ వాటి శ్రవ్యస్వభావ ప్రభావాలూ వాటి పరంపరాగత ప్రయోగ వ్యవహారం చేత వాటికి సమాజంతో ఉన్న సాంస్కృతిక సంబంధబాంధవ్యాలూ ఇత్యాది కుశాగ్రవత్ సూక్ష్మాలు, కవి, అధ్యయన అనుభవ ఊహశాలితల చేత గ్రహించి ఉండాలి.