తెల్ల కాయితం

“ఆఖరికి ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారంటే కూడా మీకు లెఖ్ఖ లేదన్న మాట. పాత రంగు కాయితాలమీద ఇలాగేనా హోంవర్కు చేయడం? మళ్ళీ అది కనిపించకుండా పైన ఓ తెల్లకాయితం పెట్టేసి నా కళ్ళు కప్పుదామనుకున్నారా?” అంటూ హెడ్ మేష్టారు కోటిగాడి మీదకెళ్ళి బెత్తంతో చితకబాదాడు. హెడ్ మేస్టారు అంత కోపంగా కోటిగాడ్ని కొడుతూంటే క్లాసులో ఒక్కరూ కిక్కురుమనలేదు. ప్రకాశం మేష్టారు అడ్డుకుని చేతిలో బెత్తం లాక్కో పోతే కోటిగాడి ప్రాణం ఆ రోజు పోయేదే. ఆ బెత్తం లాక్కోవటంలో ఆఖరికి ప్రకాశం మేష్టారిక్కూడా దెబ్బలు తగిలాయి. కొట్టేసాక హెడ్ మేష్టారు ఇన్స్పెక్టర్ కేసి విజయగర్వం తో చూసాడు. ప్రకాశం మేష్టారు వెంటనే హెడ్ మేష్టార్నీ, ఇన్స్పెక్టర్నీ బయటకి తీసుకెళ్ళి చెప్పారు కోటి గురించి, కోటిగాడి కుటుంబం స్థితిగతుల గురించీ. క్లాసులోంచి బయటకొచ్చిన ఇన్స్పెక్టర్ హెడ్ మేస్టర్ని తల వాచేటట్టు చివాట్లు పెట్టి ఇంక ఏ క్లాసులూ చూడకుండా వెళ్ళిపోయాడు. హెడ్ మేష్టారి మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు.

ఏడుస్తూ ఇంటికొచ్చిన కోటిగాడ్ని చూసి వాడి అమ్మ ఆశ్చర్యపోయింది. ’ఏమైందిరా? వంటి నిండా ఆ దెబ్బలేంటీ?’ అంటూ. బావురుమంటూ జరిగిందంతా చెప్పాడు కోటి. అమ్మ వెంటనే ప్రకాశం మేష్టారింటికెళ్ళి అడిగింది. ’ఇలాగేనానండి కొట్టడం? రేప్పొద్దున్న వీడికేదైనా అయితే? వచ్చిన ఇన్స్పెక్టర్ బానే ఉన్నాడు కానీ ఈ హెడ్ మేస్టారు వీణ్ణి కొట్టడం దేనికీ? మనిషా పశువా? ఆయన్ని రానీండి చెపుతాను.’

రాత్రంతా కోటిగాడి వంటిమీద మందు రాస్తూ, అమ్మ, నాన్నా వాడి పక్కనే కళ్ళళ్ళో వత్తులేసుకుని కూర్చున్నారు. ’అమ్మా నాకు మంచి కాయితాలుంటే హెడ్ మేష్టారు కొట్టేవాడు కాదు కదే?’ ’నేను ఆ కాయితం దొంగతనం చేయలేదమ్మా సరస్పత్తోడే, నన్నెందుక్కొట్టారు మరీ?’ ’ప్రకాశం మేష్టారు కూడా ఫర్లేదన్నారుగా అమ్మా మరి నన్నెందుక్కొట్టేరే?’ కోటి కలవరిస్తూనే ఉన్నాడు. వళ్ళు సల సలా కాగిపోతూంటే అర్ధరాత్రి వాడి నాన్న వెళ్ళి డాక్టర్నీ, ప్రకాశం మేష్టార్ని తీసుకొచ్చాడు. డాక్టరిచ్చిన మందు వేసాక ప్రకాశం మేష్టారు కూడా తెల్లవారేదాకా కోటిగాడ్ని చూస్తూ కూర్చున్నాడు.

భళ్ళుమని తెల్లవారేసరికి కోటి ఇంటి తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే ఎదురుగా హెడ్ మేష్టారు, వాళ్ళావిడా, ఓ పెద్ద పేకట్టు పట్ట్కుని ఓ ప్యూనూ. హెడ్ మేష్టారు కోటిగాడ్ని చూస్తూనే వెక్కుతూ ’కోటీ, నా కోపం ఇంతవరకూ తెస్తుందనుకోలేదు. తప్పంతా నాదే. మీ మేష్టారు చెప్తున్నా వినకుండా కొట్టేను నిన్ను. ఈ కొట్టడంలో మీ మేష్టారుక్కూడా దెబ్బల్తగిలాయి. ఇప్పట్నుంచీ నేను ఏ పిల్లగాడ్నీ కొట్టను. నీ గురించి మీ మేష్టారు చెప్పారు నాకు. నీకు ఇప్పట్నుంచీ ఎన్ని కావలిస్తే అన్ని కాయితాలు నేనే పంపిస్తాను. ఇదిగో ఈ ప్యూను పట్టుకొచ్చేడు చూడు పేకట్టు? అందులోనే ఉన్నాయి ఓ పది కొత్త నోట్ బుక్స్. అవి ఐపోయాక మీ మేష్టారు నాకు చెప్తే నేను మళ్ళీ పంపిస్తాను” అని ఇటువైపు తిరిగి ’అమ్మా, మీరిద్దరూ కోటిగాడి అమ్మా, నాన్నా అనుకుంటాను. ఇదిగో బెత్తం. మీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టండి. మిమ్మల్నీ క్షమించమని అడగాడినిక్కూడా నేను అర్హుడ్ని కాదు.” అన్నాడు.

నులక మంచంలో, మగత నిద్రతో జోగుతున్న కోటిగాడు హెడ్ మేష్టార్ని చూసి, గబుక్కున లేచి కూర్చున్నాడు ’కొట్టకండి, కొట్టకండి, అమ్మా నన్ను కొట్టడానికి మళ్ళీ ఒచ్చేరే, నేనేం చేసేనే? వద్దని చెప్పవే’ అని ఏడుపు లంకించుకుంటూ.

“లేదురా నాన్నా, కొట్టడానిక్కాదు. నీకు లేవని, ఆయన కొత్త పుస్తకాలు తెచ్చిచ్చాడూ” అన్నారు ముక్త కంఠంతో వాడి అమ్మా, నాన్నా రెండువైపుల్నించీ కోటిని పట్టుకుంటూ. ప్యూన్ తాను తెచ్చిన పేకేట్టు విప్పి కొత్త నోట్ బుక్స్ కోటిగాడి చేతిలో పెట్టాడు.

తనచేతిలో కొత్త పుస్తకాలు విప్పారిన మొహంతో చూస్తూనే, కోటిగాడు, ప్రకాశం మేష్టారికేసి తిరిగి ’మేష్టారూ, ఇవ్వేళ జరం మూలంగా స్కూల్ కి రాలేనండీ, ఓ రోజు హాజరు పడకపోతే ఫర్లేదంటారా?’ అన్నాడు ఇంకా వెక్కుతూనే.

“మరేం ఫరవాలేదు కోటీ. నువ్వు చాలా మంచివాడివనీ, బాగా చదూతావనీ ఇప్పుడే హెడ్ మేష్టారికి చెప్పేను. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను నిన్ను చూడ్డానికీ. అప్పటి దాకా సుబ్బరంగా మందు వేసుకుని పడుకో’ అంటూ బయటికి దారితీసేరు ప్రకాశం మేష్టారు. వెనకనే హెడ్ మేష్టారు.

అందరూ వెళ్ళిపోయాక కొత్త పుస్తకాల్ని గుండెలమీద పెట్టుకుని వాటిని రెండు చేతుల్తో కావలించుకుని అలాగే నిద్రలోకి జారుకున్నాడు కోటి.


రచయిత ఆర్. శర్మ దంతుర్తి గురించి:

ఇప్పటివరకూ రెండు వందలకి పైగా కధలూ, కవితలు, వ్యాసాలు కౌముది, ఈమాట, సుజనరంజని, మధురవాణి, సారంగ, సిరిమల్లె అనే పత్రికల్లో అచ్చయ్యాయి. సైబర్ సెక్యూరిటీ పరీక్ష మీద, డాటాబేస్, అప్లికేషన్ సెక్యూరిటీ మీద, వామనావతారం మీద పుస్తకాలు రాసారు. వంగూరి ఫౌండేషన్ నుంచీ, కాలిఫోర్నియా తెలుగు సంఘంనుంచీ అనేకసార్లు బహుమతులు, ప్రోత్సాహక పత్రాలూ అందుకున్నారు. ప్రస్తుతం ‘పోతన భాగవతంలో రసగుళికలు’ అనేది పదకొండేళ్ల నుంచీ, అమెరికా దేశీయ కథలు ఐదేళ్లనుంచీ కౌముది పత్రికలో, తెలుగు పద్యరత్నాలు అనేది’సిరిమల్లె’లో మూడేళ్ళనుంచీ ధారావాహికంగా వస్తున్నాయి.

 ...