విన్నపము
మేము ఉద్దేశించిన ప్రయోజనము:- ఇంగ్లాండులో ఇంగ్లీషు, ఫ్రాన్సులో ఫ్రెంచి ఎట్లున్నవో - అట్లే తెలుగుదేశములో పెద్దలు నోటను వాడే నేటి తెలుగు భాషకు సాధ్యమైనంత దగ్గరగా తెలుగు వ్రాత తెచ్చి నోటి మాటా, చేతి వ్రాత ఒకదాని కొకటి పోషకములుగా చేసి, రెంటికిని సమముగా ప్రవృత్తి కలిగించి, వ్రాత సార్థకముగాను సులభముగాను చేసి, తెలుగువారు వ్రాసేదేకాక మాట్లాడేది కూడా సభ్యభాషే అనే గౌరవము దేశమునకు సంపాదించడము.
మా దృష్టిలో ఇదే వాస్తవమైన భాషాభిమానము. వాడుకలో నున్న భాషను తృణీకరించి ప్రాచీన భాషను ఆదరించడము బ్రతికియున్నవారికి తిండిపెట్టక చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టు కాదా? ఆదికవులకు ఇట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంథములే లేకపోవును గదా?
మా ఉద్దేశము కొనసాగితే, పెద్ద మనుష్యులు వ్రాసే సభ్య భాష దేశమంతా క్రమక్రమముగా వ్యాపించి విద్యాబోధనకు కావలసిన సులభసాధన మేర్పడుతుంది. పామరులకు సులభమైన వాఙ్మయము పుట్టుతుంది. వక్తలకూ వాచకులకూ తగిన భాష కుదురుతుంది. మనము ఇంగ్లీషు నేర్చుకొని వ్రాస్తూ ఉన్నట్టే మన దేశమందు కాపురమున్న ఇంగ్లీషువారున్ను ఇతరులున్ను మన భాష నేర్చుకొని మన భాషలోనే వ్రాసి గాని నోటను చెప్పిగాని మనకు హితోపదేశము చేయవచ్చును. భాషలో ఐక్యమువల్ల దేశమునకు రాష్ట్రమునకు ఎంతబలము కలుగునో చరిత్ర చదివిన వారికీ రాష్ట్రము ఏలేవారికీ తెలుసును. వాదుకలో ఉన్న భాషవల్ల కలిగే ఇన్ని లాభములు విడిచి, వాడుకలో లేనిదీ, కొద్దిమంది పండితులకు మాత్రమే సాధ్యమయినదీ, ప్రాచీన భాష వ్రాతలలో వాడడము వ్యర్థప్రయాసము కాదా? ఈ ఆచారము ఏ దేశములోనూ లేదు. మన దేశమందయినా పూర్వము లేదు. మన తాతలనాడు లేదు. మన తండ్రులనాడు లేదు. ఈ ఒక్క తరములోనే ఈ వైపరీత్యము, ఈ ఉత్పాతము పుట్టినది. ఈ విషయము ముందు ముందు మేము విపులముగా చర్చించ దలచుకొన్నదే; గాని ఇక్కడ సూచనగా మాత్రము చెప్పినాము.
పత్రికలు గానీ, పుస్తకములు గానీ, వ్రాసే వారి ముఖ్యోద్దేశ మేమి? నోట మాట్లాడే వారి ఉద్దేశమే: తమ అభిప్రాయములు ఇతరులకు తెలియజేయడము. మాట్లాడడము తమ ఎదుటనున్న వారికోసము. వ్రాయడము దూరముగా నున్న వారికోసము. ఎవరి మట్టుకు వారు జ్ఞాపకముగా వ్రాసి పెట్టుకోవడము కూడా గలదు. నోటి మాటకన్న చేతివ్రాత మేలయినది. నోటిమాట ఒక్కమారే వినబడును గాని చేతివ్రాత చాలామార్లు చూచి చదువవచ్చును. వ్రాత అనగా కాగితము మీద మాట్లాడడము. వ్రాసిన కాగితము ఒక విధమైన గ్రామోఫోను పలక. వ్రాసేవారు తమ నోటను పలికిన పలుకులే చదివేవారు తిరిగి తమ నోటను పలుకుతారు. ఇదే నోటిమాటకూ చేతివ్రాతకూ గల సంబంధము. నోట పలికినది గానీ, చేత వ్రాసినది గానీ, ఏ మాటయినా భావమును బోధించుట సాధనమాత్రము. అది పాత్రవంటిది అన్నా అనవచ్చును. ఏదో ఒక పాత్రలో పోయక నీరు నిలవనట్లు, మనోభావము ఏదో ధ్వని ద్వారా గాని స్పష్టముగా తెలియదు. మనోభావమునకు ఆధారముగాను సంజ్ఞగాను ఉన్న ఈ ధ్వనికే గదా భాష అని పేరు. ఈ ధ్వనికి గుర్తులు గదా వ్రాసిన అక్షరములు! ఇతరులకు ఏ జ్ఞానేంద్రియము ద్వారా నయినా తెలియరాక నిగూఢముగా ఉన్న ఒకరి మనో భావము పైకి వినబడే ధ్వనులవల్ల తెలుపుడు కావడము చాలా చిత్రమయిన విషయము. అట్లే చెవికి వినబడే ధ్వనులకు కంటికి కనబడే గురుతులు వాడడము కూడా అద్భుతమైనదే. వాటి రహస్యము తత్త్వవేత్తలు ఎరుగుదురు. దానిని గురించి మరొకప్పుడు విచారింతము గాని ఇప్పుడు అది అట్లుండనీయండి.
నాగరికత గల ప్రతి దేశములోను ఎక్కువ నాగరికత గలిగి పెద్దలని పేరు పొందిన వారు నిత్యమూ వాడుకొనే భాష సభ్య మయినదనిన్నీ ఇతరులు వాడుకొనేది అసభ్యమైన దనిన్నీ ఎన్నిక చేయడము కద్దు. దేశములో నాగరికత వ్యాపించిన కొలదీ సభ్య భాషకూడా వ్యాపించి అదే సామాన్య భాష అవుతున్నది. ఇంగ్లీషు వారిని గురించి, అంతో ఇంతో వారి భాషను గురించీ మన వారికి చాలా మందికి ఎంతో కొంత తెలుయును. ఫ్రెంచి వారు, జర్మనులు మొదలయిన వారి భాషలను గురించి కూడా కొందరెరుగుదురు. వీరిలో పెద్దలయిన వారి వ్యావహారిక భాషే వారి దేశములో సామాన్య భాష; దేశ భాష. అట్టి భాష మాట్లాడే వారందరూ అది వ్రాయగలరు. వ్రాసే భాషకున్ను మాట్లాడే భాషకు వ్యత్యాసము అట్టే ఉండదు. స్వీట్ పండితుడు చెప్పినట్లు “వచనములోని భాష మాట్లాడే భాషకు దగ్గరగా ఉంటుంది (The language of prose often approaches very closely to that of ordinary conversation - Sweet’s English Grammar Vol. I)” ఔచిత్యము, పదములలోని కూర్పు, సొంపు - ఇవన్నీ రసికుల భాషలో - వ్రాసినప్పుడే కాక మాట్లాడినప్పుడు కూడా - కనబడక మానవు. సామాన్యులు నేర్పులేక ఏదో ఒక విధముగా తమ అభిప్రాయములు చెప్పినా విభక్తులు, ఆదేశములు, ఆగమములు, అనుబంధములు, శబ్దార్థములు, మొదలయిన వన్నీ పండితులు మాట్లాడే భాషకు పామరులు మాట్లాడే భాషకు సామాన్యమే.
లోక వ్యవహారములో పండిత పామర సామాన్యముగా అందరినోటను నలుగుడు పడుతూ ఉన్న భాష ఎంతో కొంత మార్పు పొందడము భాషకు సహజధర్మమే. ప్రాచీన పుస్తకములు చూచిన వారందరూ ఇది లెస్సగా ఎరుగుదురు. భాషాతత్త్వ మెరిగిన వారికి భాష మారడము వింతగా కనబడనే కనబడదు. మారకపోవడమే అసంభవము. ఇంగ్లీషు భాషకు వ్రాసినట్లే ఫ్రెంచి మొదలయిన భాషలకున్ను పండితులు భాషా చరిత్రములు వ్రాసి ఉన్నారు. భాషా చరిత్రమనగా భాషలో కలిగిన మార్పుల వృత్తాంతమే కదా. ఎప్పుడూ ఒక్కలాగున ఉండే భాషకు చరిత్రమే లేదు. వాడుకలో లేక గ్రంథములందు మాత్రమే నిలిచి ఉన్న భాషకు మరి మార్పు ఉండదు; మరి చరిత్రమూ ఉండదు. నిఘంటువులున్ను, వ్యాకరణములున్ను, వాడుకలో ఉన్న వ్యవహారిక భాషలకు కావలెను; వాడుకలో లేని ప్రాచీన భాషలకూ కావలెను. మొదటి వాటికి లక్షణము భాషతో కూడా మారుతూ ఉండవలెను; తక్కిన వాటికి లక్షణము స్థిరముగా నిల్చి ఉండవలెను. లాటిన్, సంస్కృతము మొదలయిన వాటి లక్షణము స్థిరమైనదే. ఇంగ్లీష్ భాషకు 1775 లో జాన్సన్ పండితుడు వ్రాసిన నిఘంటువు ఇప్పుడు పనికి రాదు. వెబ్‌స్టర్ పండితుడు సుమారు నూరేండ్ల క్రిందట వ్రాసిన ఇంగ్లీషు నిఘంటువు ఎన్నో సార్లు పునర్ముద్రితమైనది; అయినప్పుడెల్లా గ్రంథము సవరణ కూడా అవుతూనే వచ్చినది. బెన్ జాన్సను (1600) మొదలయిన పండితులు వ్రాసిన ఇంగ్లీషు వ్యాకరణములలోని లక్షణము ఇప్పటి ఇంగ్లీషుకు పట్టదు. ఎందుచేత? భాష మారినది కనుక. వైల్డు అనే పండితుడు చెప్పినట్లు వ్యాకరణము భాషకు ఆధారము కాదు: భాషే ఆధారము వ్యాకరణమునకు. “పూర్వ కాలమందు జనులు ఈ ప్రకారమే మాట్లాడే వారు. గనుక ఇప్పుడు కూడా జనులు అట్లే మాట్లాడ వలెను.” అని నియమించేవాడు మంచి శాస్త్రకారుడు కాడు. ఎందుచేత నంటే భాష ఎల్లకాలము ఒకటే తీరున ఉండదు; మారుతూ ఉంటుంది; మార్పు వల్ల కీడుగానీ, మేలుకానీ, మారినదేమో మారినదే; అనివార్యము. ఆ మార్పు గ్రహించి యథాశక్తి తన కాలమందు వాడుకలో ఉన్న సభ్య భాష ఎట్లుంటే అట్లే పాటించవలెను శాస్త్రకారుడు.
[మిగిలిన వ్యాసాన్ని ఈ కింది pdf ఫైల్ లో చదవగలరు:
- సం.]
rahamthulla అభిప్రాయం:
November 3, 2008 6:09 am
ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ.బి.కె.ప్రసాద్ కీలక పాత్ర వహించారు.ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్పూర్తి అంటారు ఏబికే.ఇప్పుడు రాబోయే 100 కోట్ల నిధుల్ని ఆధునిక తెలుగు భాషా అవసరాలకు సద్వినియోగ పడేలా చూడాలి.
baabjeelu అభిప్రాయం:
November 3, 2008 9:08 am
రెహ్మతుల్లాగారూ నమస్తే,మీ దయవల్ల “పిడుగు” రామ్మూర్తిగారి వ్యాసం చదవగలిగేను.ఎబికే గారి కి దండాలెట్టుకోడం తప్పించింకేటీ సెయ్యలేం.ఇప్పుడు రాబోయే “వొంద” కోట్ల “గ్రాంట్లిండీషన్” తో తెలుగు భాషామతల్లి ఆరోగ్యం ఎలా బాగుపడిపోద్దో-సరిగ్గా వాడుకుంటే- తెల్టంలేదు.తెలుగు భాషామతల్లి కేటవలేదు. ఇన్నేళ్ళు బతికి బట్టకట్టింది. ఈ కొత్త హోదాతో ఆయమ్మకేటీ అవదు. ఈ హోదా రాకపోయినా ఆయమ్మ కేటీ “నస్టం” లేదు. (ఆ తమిళం బాబెవరో కాలడ్డెట్టేట్ట కదా? న్యాయమూర్తులు ఆ కాలు తీసీవరకూ “ట్రాఫిక్ జామేనటకదా?)ఈ “గ్రేంటు”, ప్రభుత్వుద్యోగుల జీతాలకీ, “టీయే,డీయే” బిల్లులకీ సెల్లు. మాయమ్మ సింకి సీరలాగేవుందేటని మీలాటోళ్ళు నిలదీస్తే, ఆ బాబులు “గ్రేంట్లు లేవోయ్ అయిరానీ సిల్లులుకి కుట్లేద్దారి” అంటారు.భాష నదీప్రవాహంలాటిదని “బా” రెహ్మతుల్లాగారూ, “రామన్నగారూ” “లక్ష్మన్నగారూ” మిగతా గార్లందరూ వొప్పుకుంటారు కదా? ఎన్ని “డేవుఁలు” కట్టినా “ఏట్లాబం?”
త్యాగరాజుగారికి తమిళం వచ్చా? తమిళంలో కృతులు రాసేరా లాటివి ఈ మధ్యనే ఇందులోనే చదివేను. ఖచ్చితంగా తమిళం వచ్చేవుంటుంది. రాజాస్థానంలోనూ, పండిత గోష్టికీ తెలుగు చెల్లుతుందేమోగానీ, తోడుకోసం పక్కింటత్తయ్యగారిని “మామీ, తైరు వేణుం, తైరు పణ్రత్తికాహ” అనే అడిగుంటారు త్యాగబ్రహ్మ. ప్రస్తుతం అక్కడ ( తంజావూరులో) తెలుగు, తెలుగు కుటుంబాల వల్లే బతికుందేమో? “ప్రభుత్వ గ్రేంట్ల” వల్లకాదని నా నమ్మకం.
కుతుబ్ షాహీ ల సమయంలోనూ, తరవాత “నిజాం” ల కాలంలోనూ తెలుగు బతికేవుందికదా?
అమ్మనుద్ధరించీ మహానుభావులు పుట్టేరా? ఏమో?
bheshajaam agnihOtrudu అభిప్రాయం:
November 3, 2008 1:00 pm
ఎ.బి.కె. ప్రసాద్ గారు మహాత్మా గాంధీ గారిని కోట్ చెయ్యడం, మహాత్ముడి మాటలు స్ఫూర్తి కలిగిచాయనడం ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆయన మార్క్స్ అనూయాయులని వినికిడి. మరయితే ఏ మార్క్సో!
Here is a French witticism.
Je suis Marxiste, tendance Groucho.
(I am a Marxist of the Groucho variety)
వసుదేవుడు చిన్నికృష్ణుణ్ణి కంసుడిబారినుంచి తప్పించడానికి అవసరార్థం ఏదో జంతువు కాళ్ళు పట్టుకున్నాడని కథ విన్నట్టు గుర్తు!
అయ్యా! బాబ్జీలు గారూ! నూరు కోట్లు మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయనాయకులు హారతికర్పూరంలా ఊదేయగలరు!
విధేయుడు,
భేషజం అగ్నిహోత్రుడు
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
November 3, 2008 11:00 pm
భేషజం అగ్నిహోత్రుడు గారి ఆశ్చర్యంతో కూడిన పరిహాసం చదివి ఇది రాస్తున్నాను. స్వంత భాషల వాడుక గురించి గాంధీకీ, మార్క్స్ కీ అభిప్రాయాల్లో చుక్కెదురా? మార్క్సిస్టు అయునవారెవరూ ఏ విషయంలోనూ గాంధీ గారి నుండి స్ఫూర్తి పొందకూడదా? నాటి కమ్యూనిస్టు సుందరయ్య నుండి నేటి నోబెల్ లారేట్ అమర్త్య సేన్ దాకా చాలా మంది గాంధీ, మార్క్స్ లిద్దరి చేతా ప్రభావితులయ్యారంటే చెయ్యాల్సింది పరిహాసం కాదు, పరిశీలన.
కొడవళ్ళ హనుమంతరావు
bhEsghajaM agnihOtruDu అభిప్రాయం:
November 4, 2008 8:42 am
హనుమంతరావు గారూ!
గాంధీ గురించి కమ్మ్యూనిష్టులు ఇదివరలో చేసిన పరిహాసం, ఇప్పటికీ కరుడు గట్టిన మార్కిస్టులు చేస్తున్న పరిహాసం ( ఎ.బి.కె. ప్రసాద్ కి ఈ విషయం స్వానుభవం!), ప్రచారం తెలిసి వుంటే, హనుమంత రావు గారు నన్ను ఇంత ఆత్మీయంగా ” తూలనాడేవారు” కారు. అమర్త్య సేన్ పై గాంధీ, మార్క్స్ ల ప్రభావం ఉండటం ఆశ్చర్య పడవలసినది కాదు. అతను academician. మార్కిస్ట్ అవునో కాదో నాకు తెలియదు. సుందరయ్య గారి సంగతి నాకు తెలియదు; క్షంతవ్యుణ్ణి.
నంబూద్రిపాద్ గాంధిపై ఒక చక్కని పుస్తకం రాసాడు. అప్పట్లో మార్కిస్టు సిద్ధాంతులు అతణ్ణి గేలి చేసి న విషయం, నాకు బాగా తెలిసిన విషయం.
“మార్కిస్టుల” పై గాంధీ ప్రభావం పరిశీలనాంశం అని మీరన్నది ముమ్మాటికీ నిజం, కరుడు గట్టిన మార్కిస్టులు ఏమంటారో? ఈ విషయంపై చలసానినో, వరవరరావునో కదిలించి చూడాలి!
విధేయుడు,
భేషజం అగ్నిహోత్రుడు
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
November 4, 2008 11:51 pm
అగ్నిహోత్రుడు గారూ,
నేను మిమ్మల్ని తూలనాడ లేదు; మీ పరిహాసం అనుచితం అని విమర్శించాను - ఆత్మీయంగా కాకపోయినా, నాదృష్టిలో సహేతుకంగా.
తెలుగు ప్రాచీన హోదా గురించి నాకు తెలియదు; ABK ఎలాంటి మార్క్సిస్టో - కరడుగట్టిన వాడో, సుతిమెత్తని వాడో గూడా తెలియదు. మీ ప్రతిస్పందన చదివింతర్వాత, ABK 70, 80 లలో రాసిన సంపాదకీయాలు చాలా చూశాను - తెలుగు విశ్వవిద్యాలయం, గిడుగు, గురజాడ, వ్యవహారిక భాష, గాంధీ, భావే, వివేకానందుడు, … ఇలాంటి చాలా విషయాల మీద.
అవి చదివితే, మీ పరిహాసం అనుచితమైనదన్న భావన మరికాస్త బలపడింది!
కొడవళ్ళ హనుమంతరావు