ఈమాట » వ్యవహారిక భాషా వికాసం

Expand to right
Expand to left

వ్యవహారిక భాషా వికాసం

గ్రాంథికభాషావాదులు చాలాకాలం నిశ్శబ్దంగా ఉండి 1958-60 లలో ఒకసారి, తిరిగి 1965-70 లలో ఒకతూరి, అప్పుడప్పుడు, అక్కడక్కడ అనుకూల పరిస్థితిలో తల ఎత్తుతూ దించుతూ దోబూచులాడటం ఆరంభించారు. శాస్త్రవిచారణవల్ల సాధించలేని విజయాలను, సాహితీ సృష్టి వల్ల సమకూర్చుకోలేని శక్తిని, రాజకీయ, సాంఘిక సమస్య లేవైనా అనుకూలపడినప్పుడు పునస్సంపాదించుకోదలిచినట్లు కనిపిస్తుంది. ‘జయంతి’ పత్రికను స్థాపించిన తొలి రోజుల్లో ఇలాటి ప్రయత్నమొకటి జరిగింది. సంపాదకులు ఒకవంక శిష్ట వ్యావహారికానికి ‘ప్రజామోదం’ లభించిందని చెబుతూనే రెండోవైపు దుష్టప్రయోగాలతో నిండిన ఈ సారస్వతానికి ఒక ‘వ్యవస్థ’ కలిపించటమే తమ లక్ష్యమని ప్రకటించారు (చూ.జయంతి, 1958 నవంబరు, సంపాదకీయము).

1959-60 సంవత్సరాల ‘జయంతి’ సంచికల్లో ముఖ్యంగా జువ్వాడి గౌతమరావుగారు (59 మే: వ్యవహారభాష - వ్యాకరణము : 60 ఫిబ్రవరి” పత్రికారచన - సాహిత్యము) కుల ప్రాతిపాదికను, ప్రాంత ప్రాతిపదికను తెచ్చిపెట్టి సరికొత్త పాతవాదాల ద్వారా వ్యావహారికాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. వ్యావహారికమనేది ‘కృష్ణాజిల్లా బ్రాహ్మణభాష’ అని, తమ ప్రాంతీయ భాష తమకుండగా దాన్ని విసర్జించి తాము ఈ మండలాంతర కులాంతర భాషారూపానికి దాస్యం చేయవలసివచ్చిందని (ఎవరు నిర్బంధించారో చెప్పలేదు). తమ తమ మాండలికాల్లొ రాయటానికి ఇతర జిల్లాలవారు ‘జంకుతా’ రని, కావ్య భాషకు వ్యాకరణం రాయటమే అసాధ్యమైనప్పుడు ‘దారీ తెన్నూ లేని’ వ్యావహారిక విషయం చెప్పనక్కరలేదని, వ్యావహారికం అంతా గ్రాంథికమే కాబట్టి తామేదో కొత్త బాషను వాడుతున్నామని వ్యావహారికవాదులు ఆత్మవంచన చేసుకుంటున్నారని, ఇప్పుడు శిష్టులనేవారే లేరని వాపోయారు.

వారి రెండో వ్యాసంలో ‘కొత్తపాత’ శబ్దాలూ, ‘సర్వపనుల’ వంటి సలక్షణ సమాసాలు, ప్రమాణముగా ‘యేలగైకొనవలయును’ వంటి సుసంధులు, ‘భాషలోనుంచి’ వంటి సాధువిభక్తులూ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నేటి వ్యావహారిక రచనలేగాని పల్లెటూరి నుడికారాలున్నవి లేకపోతున్నవని, పత్రికలది(తమది తప్ప) ‘బాధ్యాతారహితమైన ప్రవర్తన’ అని, ‘సంస్కృతమును విడిచిన తెలుగుభాషలే’దని, ‘పదబాహుళ్యము ఇంగ్లీషులో కన్న సంస్కృతములో నధిక’ మని, వ్యావహారికవాదంవల్ల ప్రాచీనకావ్యాల మీద గౌరవం నశిస్తున్నదని, ‘భాషావ్యవస్థ’ చెడిపోతున్నదని ఆక్రోశించారు. ఈ సూక్తులన్నింటికీ కొండముది శ్రీరామచంద్రమూర్తిగారు, జలాంతశ్చంద్రచపలగారు సవివరంగా సమాధానాలిచ్చారు (చూ.జయంతి : చర్చావేదిక, ఆగస్తు 1959).

‘ఆంధ్రభాష-అవ్యవస్థ’ అనే వ్యాసంలో (చూ. జయంతి, 1969 ఏప్రిల్,పే.33-36) ‘గాండీవి’ గారు ఆకుకు అందని పోకకు పొందని భావాలు వెలిబుచ్చారు. పరస్పర విరుద్ధవివాదాల సంగతి అటుంచి వారు కనుక్కొన్న చారిత్రక సత్యాలివి: శిష్టవ్యావహారికం ప్రాచీనకవిసమ్మతం కాదు; దానికి వ్యాకరణగ్రంథం రాయనక్కరలేదు; గ్రాంథికానికే ఒక వ్యవస్థ లేదు; ముద్రణం ముందు ‘సుపరిష్కృతం’ కావాలి; ‘ఏవో కొన్ని సామాన్యసూత్రముల నామోదించి యెల్లరు నొకేరీతి వ్యావహారికము వ్రాయునట్లు కృషి చేసిన బాగుండునేమో’(పే.36). ‘ఏవో కొన్ని సూత్రాల’ కోసమే ఆరాటమైతే రవిపాటి గురుమూర్తిగారు, పారనంది రామస్వామిగారు, మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారి వంటి పూర్వులవీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారి వంటి ఆర్వాచీనులవి వ్యాకరణ గ్రంథాలున్నవని తెలియదో, అవి పనికిరావో వ్యాసకర్తలే చెప్పాలి. కాని ఈ చర్చలు ఏ కొద్దిమందినో ఆకర్షించినందువల్ల పెద్ద కోలాహలమే జరగలేదు.

1965 నుంచి వచ్చిన వాదోపవాదాలు పాఠ్యపుస్తకాల ‘శైలి’ విషయంలో వచ్చాయి. అంతవరకూ పాఠ్యగ్రంథాలన్నీ సరళగ్రంథికంలోనో అర్ధగ్రాంథికంలోనో ఉంటుండేవి. ఆంధ్రప్రదేశావతరణవల్ల తెలుగు నేర్చుకోవలసినవారు రెండు రకాలవారైనారు : తెలుగు మాతృభాషగా కలవారు, లేనివారు. ఆంధ్రేతరులు తెలుగు నేర్చుకోవటం నిత్యవ్యవహారంలో ఇబ్బంది లేకుండటానికే కాబట్టి వాళ్ల కోసం రాసిన పాఠ్యగ్రంథాల్లో వ్యావహారికమే వుండాలని భద్రిరాజు కృష్ణమూర్తిగారు వాదించి గ్రాంథిక పుస్తకం తమ చేతిమీదుగా అచ్చుకారాదని అభ్యంతరం లేవదీశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించాలన్న సంకల్పంతో అన్ని రంగాల్లోని విద్వాంసుల కవుల ప్రతినిధులతో తిరుపతిలో ఒక సభ జరిపింది. అనేక తర్జన భర్జనలయిన తర్వాత పింగళి లక్ష్మీకాంతంగారి అధ్యక్షతన ఆ సమావేశం వారు ఒక రాజీకి వచ్చారు. మొదటి భాషగా తెలుగు నేర్చుకునే వాళ్ళ తెలుగు వాచకాల్లో సరళ గ్రాంథికం ఉండాలని. రెండోభాషగా నేర్చేవాళ్ళుగాని శాస్త్రవిషయాలను తెలుగులో నేర్చే తెలుగు విద్యార్థులు గాని చదివే పాఠ్యగ్రంథాల్లో శిష్ట వ్యావహారికమే వుండాలను సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈనిర్ణయాన్ని ప్రభుత్వంవారు ఆమోదించి ఆయా శైలీ భేదాలను వివరణాత్మకంగా నిరూపించటానికి ఆ లక్ష్మీకాంతంగారినే అధ్యక్షులు చేసి ఒక ఉపసంఘాన్ని నియమించారు. ఆ సంఘంవారు 1966 నాటికి తమ పని నెరవేర్చారు. గ్రాంథికవ్యావహారికాలను శైలీభేదాలుగా గుర్తించి వీటిని వివరించే సంఘాన్ని శైలీ సంఘం (Style Committee) అని ప్రభుత్వం వ్యవహరించింది. తెలుగును రాజభాష చేయదలిచిన ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు చాలా అవసరం.

తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1966 లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం (తొమ్మిదో చట్టం) శాసించింది. ఇలా చేయటంలోని కష్టసుఖాలను పరిశీలించి సలహా యిమ్మని ప్రభుత్వంవారు అప్పటి విద్యాశాఖ కార్యదర్శి జె.పి.యల్ గ్విన్ అధ్యక్షతన మరో సంఘం నియమించింది. (G.O. No. 3051, 1966 డిసెంబర్ 28). గ్విన్ సంఘంవారు ముఖ్యంగా ఆంధ్రేతరులకు తెలుగు నేర్పటానికీ, ఆ భాషను ఆధునీకరించటానికీ , విశ్వవిద్యాలయాల్లో తెలుగును బోధనభాషగా చేయటానికి, పరిపాలన వ్యవహారాలకు కావలసిన సాంకేతికసహాయం అందివ్వటానికీ ఒక స్వతంత్ర సంస్థను నెలకొల్పవలసిందని సూచించారు. వారే భద్రిరాజు కృష్ణమూర్తిగారి సూచనలమేరకు (పాఠ్యగ్రంథాలతో సహా) ఆ సంస్థ ప్రచురణ లన్నింటిలోనూ లక్ష్మీకాంతం సంఘంవారు నిర్దేశించారు (చూ గ్విన్ కమిటీ నివేదిక, 5.27, పే.19). రాష్ట్ర ప్రభుత్వంవారు ఈ సూచనలను ఆమోదించి వాటిని అమలుపరచటానికి ‘తెలుగు అకాడమీ’ అనే సంస్థను 1968 ఆగస్టు 5 న స్థాపించారు. ఆ సంస్థవారు ఇంటర్మీడియట్ పాఠ్య గ్రంథాలను తెలుగులో రాయిస్తున్నప్పుడు మళ్ళీ గ్రాంథికభాషావివాదం తల యెత్తింది. సంఘాలు, ఉపసంఘాలు చర్చోపచర్చలు చేసిన తర్వాత శిష్ట వ్యావహారికాన్నే కొన్ని మార్పులతో వాడుక చెయ్యాలని అంగీకరించి అమలు జరిపేరు. ఆ సమయంలో ఈ వివాదం పత్రికల కెక్కినా, గ్రాంథికాన్ని పునఃప్రతిష్టాపించాలనే ప్రయత్నాలు ఏకముఖంగా జరుగుతున్నా, అవి నెరవేరవనే విశ్వాసం ఆశాభావం ఉన్నా, శాస్త్రీయ చర్చలవల్లగాక ఇతర మార్గాల్లో తమ వాదాన్ని నిలుపుకోవలసిన పరిస్థితికి వచ్చినందుకు గ్రాంథికవాదులను చూసి జాలిపడాలి. ఈనాడు రేడియోల్లో, పత్రికల్లో, సాహితీ రచనల్లో, సినిమాల్లొ అనుక్షణం వాడుకలొ వుండి ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉన్న వ్యావహారికవాదాన్ని ఏ శక్తీ ఎక్కువకాలం బహిష్కరించలేదు.

పరంపరగా సనాతనత్వానికి కంచుకోటలుగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో (ముఖ్యంగా అందులోని తెలుగు శాఖల్లో) కూడా వ్యావహారిక రచనలే చేస్తున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ Ph.D. పట్టానికి రాసే పరిశోధన వ్యాసాల్లో కూడా 1969 లో శిష్ట వ్యావహారికం అంగీకరించింది. 1971 లో పురిపండా అప్పలస్వామి గారు చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆంధ్రవిశ్వకళాపరిషత్తువారు అన్నిస్థాయుల్లో వ్యావహారీకం ప్రవేశపెట్టే విషయం పరిశీలించటానికి ఎం.ఆర్.అప్పారావుగారి అధ్యక్షతన ఒక సంఘం నియమించారు. మెట్రిక్యులేషన్ నుంచి ఎం.ఏ. వరకు క్రమంగా ఆ వ్యావహారికం ప్రవేశపెట్టే విధానం సూచిస్తూ 1973 జులైలో ఆ సంఘంవారు నివేదిక సమర్పించారు. 1974 నవంబరులో ఆ నివేదికను ఆమోదించి ఆ తీర్మానాలు అమలు జరపటానికి మరో స్థాయీ సంఘం నియమించారు గాని అది 1975 ఏప్రిల్‌లో మొదటి సమావేశం జరిపిన తర్వాత మరి సమావేశం కాలేదు. 1973 లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖవారు తెలుగును ద్వితీయభాషగా బోధించేటప్పుడు వ్యావహారికమే వాడాలని ఆదేశించారు (G.O. Ms.No. 384 of 27.4. 1973). తీర్మానాల దారి తీర్మానాలదే గాని ఆచరణ నత్తనడకలు నడుస్తున్నది. అసలు నడుస్తుంటే, విద్యార్థులు మాత్రం అర్ధగ్రాంథికంలో రాస్తున్నారు. కాలక్రమాన విశ్వవిద్యాలయాలు ఆమోదించినా, మానినా వ్యవహారికం చోటు చేసుకుంటుంది. ఒకటి నిజం. వ్యావహారికానికి వ్యతిరేకత తగ్గుతున్నది. గ్రాంథికానికి అనుకూలత సన్నగిల్లుతున్నది. కాలప్రవాహం అగనట్లే భాషా ప్రవాహమూ ఆగదు. ఆపలేరు. ఇది చరిత్ర. చరిత్ర నేర్పే పాఠం.

ముందరి పేజీ(లు) 1 2 3
 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Kameswara Rao అభిప్రాయం:

    June 12, 2008 8:56 am

    విద్యావసతులు ఇప్పుడు మునపటిలాగా ఏ కొందరికో పరిమితంకావు కాబట్టి సామూహిక విద్యాసౌకర్యాలకు కావ్యభాష ఉపయోగించదు.

    ఇది గ్రాంధికమో వ్యావహారికమో తెలీదు కాని నాకు మాత్రం మింగుడు పడకుండా ఉంది!

  2. రాజేంద్ర అభిప్రాయం:

    June 13, 2008 10:57 am

    మా మాష్టారి వ్యాసం ఆయన చాయాచిత్రంతో సహా — ఆహా ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a