వ్యవహారిక భాషా వికాసం

ఇది ఇలా ఉండగా, ఆంగ్లభాషాజ్ఞానమేగాని ఆంధ్రభాషా పరిచయం లేని వారంతా వ్యావహారిక వాదం సమర్ధిస్తున్నారన్న అపప్రథ పోగొట్టడానికి గిడుగువారు ‘ప్రాఁదెనుఁగుంగమ్మ ‘ [1] అనే అచ్చ తెలుగు ఉత్తరాన్ని వృత్తగంధి వచనంలో రాసి ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలోనే ప్రచురించారు. గ్రాంథికాంధ్రం – అందునా అచ్చ తెలుగు – ఎంత దుర్గ్రాహ్యమో దురవబోధమో నిరూపించటమే ఆ లేఖా రచనలో ఉద్దేశం. ఆనాటి వైయాకరణుల్లో సర్వోత్తములనిపించుకొన్న మహామహోపాధ్యాయులు తాతా సుబ్బరాయశాస్త్రిగారు ‘ఆంధ్రాభాషా సంస్కరణ’మనే వ్యాసంలొ [2] ఈ వివాద విషయంలో తమ అభిప్రాయాలేమిటో విశదీకరించారు. ఏ భాషనైనా పూర్తిగా సంస్కరిచడమనేది మానవాసాధ్యమని, సంస్కృతానికి పాణీన్యాదుల వ్యాకరణం కూడా పూర్తిగా చాలదని, మన పూర్వులు ఆయాకాలాల్లో శిష్టప్రయోగానుసారంగా వ్యాకరణ సంస్కరణలుచేస్తూ వచ్చారని, ఆధునిక శిష్టప్రయోగాలను బట్టి తెలుగు వ్యాకరణాన్ని సంస్కరించాలని, అన్యదేశ్య పదాలను స్వీకరించకపోతే వ్యవహారహాని సంభవిస్తుందని, శకటరేఫార్ధానుస్వారాలను అక్షర సమామ్నాయం నుంచి తొలగించాలని, శాస్త్ర నిదర్శనలను ఉదాహరిస్తూ వాదించారు. వఝుల చినసీతారామస్వామిశాస్త్రిగారు తమ ‘ఆంధ్రభాష’ అనే వ్యాసంలో [3]తెలుగు భాషకున్న పూర్వవ్యాకరణాలన్నీ అసంపూర్ణాలేనని, మన పూర్వవ్యాకరణసూత్రాలే వేదవాక్యాలని భావిస్తే కావ్య ప్రపంచమంతా గ్రామ్యతా భూయిష్టమవుతుందని, ఒకనాటి గ్రామ్యం ఈనాడు యోగ్యమవుతుందని వాదించారు.

1912 డిసెంబరు 11, 12 తేదీలలొ మద్రాసు, రాజధాని కళాశాలలో వావిలికొలను సుబ్బారావుగారి అధ్యక్షత కింద ‘ఆంధ్ర భాషాభి వర్ధినీ సమాజం’ వారు బుర్రా శేషగిరిరావుగారి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజున ఆంగ్లంలోనూ మరునాడు తెలుగులోను ఉపన్యాసాలు జరిగాయి. అనంతరం సభాధ్యక్షులు ఖండనోపన్యాసం చేస్తూ (ఇది వారి ‘ఆధునిక వచన రచనావిమర్శన’ మనే గ్రంథానికి సంగ్రహం) అక్షర సంఖ్యను బట్టి చూచినా తెలుగు ఇంగ్లీషుకన్న ఏన్నో రెట్లు అభివృద్ధి పొందిన భాష అని తెలుస్తుందని, సంధి పాటించటం అవసరమని, గ్రాంథికభాషలో అన్యదేశ్యాలు అల్పసంఖ్యాకంగాను మాండలికాలు నిశ్శూన్యంగానూ ఉన్నాయని, వ్యావహారికమనే భాషకు ప్రత్యేకించి ఒక వ్యాకరణగాని, నిఘంటువుగాని లేనందున ప్రమాణనిర్ణయాసాధ్యమైన ఆ ‘భాష’ రచనకు పనికిరాదని ఆక్షేపించారు. ‘గ్రామ్యవాదులు’ తరచుగావాడే ‘internal sandhi’ ‘liaision’ అనే మాటలకు వారు చెప్పిన అర్ధం, ఇచ్చిన ఉదాహరణలు, చేసిన విపుల విమర్శా చదివి ఆనందించదగ్గవేగాని ఒకరు చెప్పగలవి కావు.

గ్రాంధిక వాదుల్లో చాలామంది జయంతి రామయ్యగారి లాగానే ఉన్నత రాజకీయోద్యోగాల్లో ఉన్నవాళ్ళే. వాళ్ళ ఒత్తిడి ఎక్కువైనందున మద్రాసు ప్రభుత్వం వ్యావహారికోపయోగాన్ని మరింత సంకుచిత పరుస్తూ 1913 జనవరి 10న (G . O. No. 20) మరో ఉత్తరువు విడుదల చేసింది. ఒక పాఠశాలలోని అధిక సంఖ్యాక విద్యార్థులు గ్రాంధిక వ్యావహారికాల్లో దేనివైపు మొగ్గు చూపుతారో ఆ శైలినే ఆ పాఠశాల మొత్తం అంగీకరించినట్లుగా భావించి సమాధాన పత్రాలమీద ఆ విధంగా గుర్తు రాయాలని పై ఉత్తరువు నిర్దేశించింది. ఇందువల్ల వ్యావహారికంలొ సమాధానాలు రాయటం, రాయకపోవటం అనేవి ప్రధానోపాధ్యాయుల అభిరుచి మీద ఆధారపడవలసి వచ్చింది. సంస్కరణ నేతి బీరకాయగా పరిణమించింది. గ్రాంథికవాదం అధికార బలం మీద ఆధారపడి మరో విజయం సాధించింది. ఈ ప్రభుత్వాదేశానికి ప్రత్యుత్తరంగా గిడుగు వేంకట రామమూర్తిగారు ఆంగ్లభాషలో ప్రచురించిన ‘A Memorandum on Modern Telugu’ అనే కరపత్రం ఆటో యెస్పర్సన్ వంటి ఖండాంతరభాషాశాస్త్రజ్ఞుల ప్రశంసలు కూడా సంపాదించింది. దీనికి ప్రతిగా జయంతి రామయ్యగారు ఇంగ్లీషు భాషలో ’A Defence of Literary Telugu’ అనే కరపత్రం ప్రకటించారు. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి ’గ్రామ్యవాద విమర్శనము’ (ఇది తాతా సుబ్బరాయశాస్త్రిగారి వ్యాసానికి సమాధానం), మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారి ’గ్రామ్యమా! గ్రాంథికమా?’, పి. సూరిశాస్త్రిగారు సంకలనం చేసిన ’The Gramya Controversy’ అనే వ్యాసపరంపర ఈ కోవకు చెందినవే. గిడుగు వేంకట సీతాపతిగారి ’సొడ్డు’, గురజాడ అప్పారావుగారు మద్రాసు విశ్వవిద్యాలయానికిచ్చిన ’ఆధునికాంధ్ర వచన’ అనే నివేదిక పై వాటికి ప్రత్యుత్తరాలు. ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు తృతీయ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఆ సంధర్భంలో ’గ్రామ్య గ్రాంథిక వివాదం’ విషయంలో పరిషన్నిర్ణయం తేల్చుకోవలసి వుంది. పరిషదభిప్రాయాన్ని నిరూపించటానికి గత సంవత్సరం నియమించిన ఉపసంఘంవారి నివేదిక అప్పటికింకా పూర్తి కాలేదు. నివేదిక అందేవరకూ నిర్ణయం వాయిదా వేయాలని గిడుగు గురజాడలు వాదించరుగాని ప్రయోజనం లేకపోయింది. 1912 మే నెల నాటి మద్రాసు పండితగోష్ఠి అభిప్రాయమే పరిషదభిప్రాయమనే తీర్మానం నెగ్గింది.

కొంతమంది గ్రాంథికవాదుల్లోనయినా కొంత వాదశిధిలత రావటం ఈ యేడే ఆరంభమయిందనటానికి కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. నండూరి మూర్తిరాజుగారు ’గ్రామ్యవాద విమర్శన’మనే వ్యాసంలో[4] వ్యావహారికవాదులు చెప్పే ’ధ్వని శాస్త్రమూ’ గ్రాంథికవాదుల ’వ్యాకరణమూ’ భిన్నమైనవనీ ఉభయపక్షాలవారూ రాజీపడి నవీన వ్యాకరణం రాయటం మంచిదనీ ఉద్భోదించారు. ’ఆంధ్రభాషా సంస్కార’ మనే వ్యాసంలో [5]పప్పు మల్లికార్జునుడుగారు ’కొందరు’ పద్యానికి గ్రాంథికమూ,గద్యానికి వ్యావహారికమూ మంచిదంటున్నారని, తమ వాదాన్ని సమర్ధించుకోవటానికి గిడుగువారు చూపిన కావ్య ప్రయోగాల కన్నింటికీ పాఠాంతరాలున్నాయని అటూ యిటూ గాకుండా వాదించారు. కాని శిధిలత వచ్చినా తీవ్రత తగ్గలేదనటానికి 1914 సంఘటనలే తార్కాణం.


1914 నాటి వాదోపవాదాలు మూడు రకాలుగా జరిగేయి : వాటిలొ మొదటివి మద్రాసు విశ్వవిద్యాలయంలొ దానికి సంబంధించిన సంఘాల్లొ జరిగిన వాదోపవాదాలు: రెండోవి బహిరంగసభల్లో జరిగిన ఉపన్యాసాలు : మూడోవి ఆంధ్రాంగ్లభాషల్లో పత్రికల్లో జరిగిన పోరాటాలు. ఆ యేడు జరిగినంత తీవ్రంగా, ముమ్మరంగా అంతకు ముందుగాని ఆ తర్వాతగాని ఖండనమండనాలు జరగలేదు. మద్రాసు విశ్వవిద్యాలయంవారు ఆ సంవత్సరం ‘Composition Committee’ అనే సంఘం నియమించారు. అందులొ మొట్టమొదటి గ్రాంథిక వ్యావహారిక వాదులకు సమప్రాతినిధ్యముండేది. తటస్థులు కొందరు ఉండేవాళ్ళు. ఇంటర్మీడియేట్ పాఠ్యగ్రంథాలుగా ఉండదగిన పుస్తకాలు పట్టికను జి. వెంకటరంగారావుగారు విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఆయా గ్రంథాల్లోని పదజాలాన్ని ప్రాచీనార్వాచీనాలుగా విభజించి, ఆర్వాచీనపదజాలాన్నే ఉపయోగించాలన్న అభిప్రాయం అందరికి ఆమోదయోగ్యమయింది. అయితే ఆ శబ్దాల విభజన నిర్వచల దగ్గర పేచీ వచ్చింది. ఇంతలొ ప్రాంతీయ ప్రాతినిధ్యం సరిగాలేదని ఆందోళనచేసి తమవారు మరియిద్దరు గ్రాంథికవాదులు సభ్యులయ్యేట్లు సాధించుకోగలగటంతో, సంఖ్యాబల ప్రాతిపదికమీద గ్రాంథికానికే అనుకూలనిర్ణయం జరిగింది. ఈ చర్చలూ తీర్మానాలు ఆగస్టు 2, సెప్టెంబరు 6 తేదీల్లో జరిగేయి. అధికారతీర్మానానికి వ్యతిరేకంగా వాదించిన గురజాడవారు తమ వ్యతిరేకతను సుదీర్ఘవ్యాసంలో చర్చించగా మరి ముగ్గురు ఆమోదిస్తూ సంతకాలు చేశారు. The Minute of Dissent to the Report of the Telugu Composition Sub-Committee’ అనే ఆ ఆంగ్లవ్యాసాన్ని వావిళ్ళవారు ఆ యేడే ప్రచురించారు. ఈ రచనకు ప్రధాన హేతువు కొమర్రాజు లక్ష్మణరావుగారు రాసిన ‘A Memorandum on Telugu Prose’ అనే వ్యాసం. వ్యావహారిక వచన రచనా సంప్రదాయం మనకు కొన్ని శతాబ్దాలుగా ఉన్నదని రుజువు చేస్తూ గిడుగు వేంకట రామమూర్తిగారు ’నిజమయిన సంప్రదాయ’మనే చిన్న పుస్తకం రాశారు. కిళాంబి రామానుజాచార్యులుగారు కూడా మరో చిన్న పుస్తకం ఇటువంటిదే రాశారు. ఈ వ్యావహారికవాదాన్ని ప్రతిఘటించటానికి కాకినాడలో జులై 1తేదీన ’ఆంధ్రభాషాసంరక్షక సమాజ’మనే సంఘమొకటి ఏర్పడింది. పురాణపండా మల్లయ్యశాస్తులుగారు, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారు మొదలైన పెద్దలిందులో సభ్యులు. వీరు గ్రాంథిక భాషోద్ధరణ దృష్టితో ‘Modern Telugu, క్రొత్త తెలుఁగు-మంచి తెలుఁగు’, ’పులుల దండులు-పూలదండలు’ అనే కరపత్రాలు ప్రకటించారు. కూచి నరసింహంగారు ’వ్యావహారిక భాషాసంప్రదాయవిమర్శనము’ అనే వ్యాసాన్ని ప్రచురించి ఉడతాభక్తిగా ఆంధ్రభాషామతల్లికి సేవ చేశారు.

రెండోదైన సభారంగం ఈ వివాద విషయంలోకి సామాన్య ప్రజలనూ అనిశ్చితంగా ఉన్న పండితులనూ ఆకర్షించటం మొదలుపెట్టింది. వ్యావహారికవాదులు ఎలమంచిలిలో జరిపిన విద్వత్సభలో శిష్టవ్యావహారికం గ్రామ్యం కాదనే వఝుల చిన సీతారామస్వామిగారి తీర్మానం నెగ్గింది. ఆగస్టు 3 న వర్లాకిమిడి కళాశాలలో బి.మల్లయ్యశాస్త్రిగారి అధ్యక్షతన సమావేశమైన విద్వాంసులూ, ఆగస్టు 27 న ఆంధ్ర సారస్వత పరిషదధ్వర్యువంలో వై. నారాయణమూర్తిగారి అధ్యక్షతన విజయనగరంలో జరిగిన వార్షికోత్సవలొ పాల్గొన్న పండితులూ పై వాదం సమర్ధించారు. చారిత్రక ధృక్పథంలో భాషాధ్యయనం చేయటం అవసరమని, పాఠ్యక్రమబోధనాభ్యవనాలు ఆధునిక భాషారూపంలోనే జరగాలని నారాయణమూర్తిగారు ఉపన్యసించారు. ఈ సభలకు పోటీగా 23-6-1914 న కాకినాడలో మొదలుపెట్టి, 23-8-1914 లో అన్నవరం సమావేశంతో ముగించిన గ్రాంథికవాది సభా కార్యకలాపాలు ఆ మధ్యకాలంలో 24 బహిరంగ సభలు జరిపి తమ వాదబలం నిరూపించాయి. గ్రాంథికవాదాన్ని సమర్ధిస్తూ చాలామంది న్యాయవాదులూ రాజకీయోద్యోగులూ కొందరు రచయితలూ ప్రసంగించారు. ఈ సమావేశాల విషయంలో గమనార్హమైన విశేషాలు మూడూ కనిపిస్తాయి:

  1. సంస్కృత భాషాపాండిత్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు వ్యావహారికాన్నే సమర్ధించారు.
  2. గంజాం వర్లాకిమిడి జిల్లాల్లో వ్యావహారిక వాదానికి బలం చేకూరగా, కృష్ణా గోదావరి మండలాల్లొ గ్రాంథిక వాదానికి మద్ధతు లభించింది.
  3. గ్రాంథిక వాదానికి అండగా నిలిచిన వారిలో అత్యధిక సంఖ్యాకులు ’పలుకుబడి’ కలవారేగాని తెలిసినవారు కారు.

ఈ మహా యుద్ధానికి మూడో రంగం పత్రికలు. పత్రికలవారు స్వయంగా ఏమీ కల్పించుకోలేదు గాని ప్రజాకర్షణ గమనించి రెండు పక్షాలవారూ చేసిన విమర్శన,ప్రతివిమర్శనలను, జరిపిన సభావిశేషాలను ప్రచురించారు. [6]ఉభయ పక్షాల వారిలోనూ ఏ కొందరో తప్ప చాలాభాగం మారుపేర్లతో వ్యాసాలు రాశారు. ఈ వాదాలమీద లోకానికి కలిగిన సదభిమాన దురభిమానాలను రొక్కరూపంలో సంపాదించుకోదలచిన ‘స్కేప్ అండ్ కంపెనీ ‘ (కాకినాడ)వారు ఆయా సమావేశవిశేషాలు, వదప్రతివాదాలు క్రోడీకరించి గ్రంధస్థం చేసి “Arguments for and against Modern Telugu” అనే పేర ప్రచురించారు. ప్రత్రికాముఖంగా వెలువడ్డ ఆనాటి వాదవివాదాల్లో ముఖ్యమైనవి ‘ఒక తెలుగు హెడ్‌మాస్టర్’ గారు[8] ‘ఒక తెలుగు మెడలిస్టు’ గారు[9], గ్రాంథికాన్ని సమర్ధిస్తూ రాసినవి: ఒక ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ గారిచ్చిన సమాధానాలు[10]. వాద విషయం ఎలావున్నా వాదతీవ్రత విషయంలో గ్రాంధికవాదులదే పైచెయ్యి. వారి వాదంలోని ప్రధానాంశాలివి :

  1. వ్యావహారికమనేది నింద్యగ్రామ్యం. అందులో కుల,మత, వృత్తి, ప్రాంత భేదాలవల్ల ఏకరూపత లేదు.ఈ మాండలికాల వల్ల అదిసులభంగా అర్ధంకాదు.
  2. గత వెయ్యేళ్ళుగా గ్రాంథికం మారలేదు.
  3. వ్యావహారికం వ్యాకరణవిరుద్ధం కాబట్టి ప్రామాణికం కాదు.
  4. వ్యావహారికం వల్ల ప్రాంతీయభేదాలేర్పడి ఆంధ్రోధ్యమం దెబ్బతింటుంది. కాబట్టి అది అనంగీకార్యం.
  5. ఆధునికభాషకు ప్రత్యేకంగా తనదని చెప్పుకోగల వ్యాకరణంగాని, సాహిత్యంగాని నిఘంటువుగాని లేవు. కాబట్టి అది రచనకూ పఠనపాఠనలకూ పనికిరాదు.
  6. ఆంగ్లభాషలాగా తెలుగు భాష మారుతూ ఉండేదికాదు. తెలుగులో లిఖిత వాగ్రూపాలకున్న భేదాలు ఇంగ్లీషులో వాటికున్న భేదాలకన్నా చాలా ఎక్కువ.
  7. వెయ్యేళ్ళ క్రితమే ‘స్థిరపడ్డ’ తెలుగును ‘కోయ, సవర, చచ్చట’ భాషల్లాంటి కేవలవ్యవహారదశకూ ఆటవికస్థితికి దించరాదు.
  8. గ్రాంథికాన్ని నీచస్థితికి దించేకన్నా వ్యావహారికాన్ని ఉచ్చస్థితికి తేవటం మంచిది.
  9. వ్యావహారికాన్ని అంగీకరిస్తే కాలక్రమాన ప్రాచీన సాహిత్యం అర్ధం కాకుండా పోవటమేగాక నశించికూడా పోతుంది.
  10. ఆధునిక భాషలో ఉన్న ఒకటి రెండు పుస్తకాలకన్నా నన్నయభాషే సులభంగా అర్ధమవుతుంది. కాబట్టి గ్రాంథికమే ఉపాదేయం.

‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ గారు వీటన్నింటికీ క్లుప్తమయిన సమాధానాలు ఇచ్చారు. మన పూర్వ వచనరచనా సంప్రాదాయం వ్యావహారికమేనని, భాష కెప్పుడూ వ్యాకరణముంటుందని, ‘శిష్టానా ముక్తౌ సూత్రాణా మభావే అనుశాసనకారిణ ఏవ దండనీయా’ అన్న దండి వాక్యాన్ని స్మరించమని. భాష మరదనటం మారలేదనటం అనూహ్యమని, రాజకీయోధ్యమాలకూ శాస్త్రచర్చలకూ సంబంధం లేదని – ఇలా ఎన్నో మొరబెట్టినా వినిపించుకున్న వారు లేరు విమర్శించినవారేగాని. ఇంత దూకుడుగా ఉద్ధృతంగా వచ్చిన గ్రాంథికవాద మహాప్రపంచం గ్రాంథిక పాఠ్యగ్రంధాలు రాగానే ఒక్కసారిగా ఎండిపోయింది! కథ కంచికి పోయిందనుకున్నారేమో !


వేదం వేంకటరాయశాస్త్రిగారి ‘ఆంధ్రభాషా సర్వస్వార్హ నియమ కతిపయములు ‘ 1915 లో వెలుగు చూశాయి. గ్రామనామాలు, మాండలికాలు, కొన్ని గ్రామ్యాలు, అస్ఫుటగ్రామ్యత్వా లయిన పదాలు ప్రయోగవ్యవహారరూఢీ సంపాదించిన అన్యదేశ్యాలు నిఘంటువుల కెక్కాలని, భాషాశాస్త్రం పరమపఠనీయ శాస్త్రమని, దానివల్ల శబ్దవ్యుత్పత్తులు పరిస్ఫుటంగా తెలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు. ‘పాశ్చాత్య కళాసంకేతాంధ్రపదాలను’ అనుబంధంగా ఇవ్వాలని, తెలుగుకు నూతనాక్షర గ్రహణం పనికిరాకపోయినా అన్యదేశ్యశబ్దానువాదంలో మాత్రం భాషాంతరా పూర్వవర్ణగ్రహణం ఉపాదేయమేనని వారు విశ్వసించారు. అంటే ఆయన దృష్టిలో పెద్ద మార్పులు రావటం మొదలైనట్లు. అయితే 1915లో గత సంవత్సర యుద్ధచిహ్నాలు సమసిపోయాయి. 1916 నవంబరు 19 న కొవ్వూర్లో జరిగిన సారస్వత మహసభలో వర్ధమాన మహాకవులు దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు, కందుకూరి వీరేశలింగంగారు, చిలుకూరి వీరభద్రరావుగారు మొదలైన విద్వాంసులు పాల్గొన్నారు. అప్పటికి వీరేశలింగంగారి దృక్ఫథంలో కూడా చాలా పెద్ద మార్పు వచ్చింది. ఆ సభవారు నూరేళ్ళుగా పెద్ద వాడుకలో ఉన్న మాటలన్నీ నిర్దుష్టాలని, పూర్వ(కవి) ప్రయోగాలు లేకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న రూపాలు సాధువులేనని తీర్మానించారు. ‘గ్రంధాలయ సర్వస్వము’ లో (సంపుటి:2, సంచిక:1) ‘ఆంధ్రభాష ‘ను గురించి తర్కిస్తూ వఝుల చినసీతారామస్వామిగారు ఆంధ్ర వ్యాకరణ పునారచన అవశ్యకమని సూచించారు. గ్రాంథికవాదానికి కంచుకోటలైన వేదం, కందుకూరిల దృష్టిలొ వచ్చిన మార్పు దాన్ని దుర్బలీకరించింది.

గిడుగువారు 1919 లో ‘తెలుగు’ పత్రికను స్థాపించి తమ ఉద్యమాన్ని యధావిధిగా సాగిస్తూనే వచ్చారు. ఆ యేడు ఫిబ్రవరి 28వ తేదీన, అంతవరకూ గ్రాంథిక వాదానికి మూల విరాట్టుగా ఉన్న వీరేశలింగంగారు వ్యావహారిక భాషావాదాన్ని అంగీకరించి ‘వర్తమానవ్యావహారికాంధ్రభాషాప్రవర్తకసమాజము’ స్థాపించి తామే అధ్యక్షులై వ్యావహారికానికి వ్యాకరణగ్రంథం రాస్తామన్నారు. గ్రాంధికవాదానికిది గొడ్డలిపెట్టయింది. ఈ సమాజానికి జయంతి గంగన్నగారు కార్యదర్శులైనారు. ఈ నూతన పరిణామాన్ని భరించలేక వేదం వేంకటాయశాస్త్రిగారి వంటి విద్వాంసులు కూడా పేరెత్తకుండా వ్యక్తి దూషణలోకి దిగవలసి వచ్చింది. [7] ఇది చివరి ప్రయత్నమేగాని ఫలవంతం కాలేదు: గ్రాంథికవాదం తిరుగు ముఖం పట్టింది.

1924 నుంచీ వెలువడుతున్న సాహిత్యపత్రిక ‘భారతి’ ఉభయపక్షాల రచనలకు సమప్రాధాన్యం ఇస్తుండేది. ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు కూడా కొండ దిగి 1924 అక్టోబర్ 13వ తేదీన తమ వ్యావహారిక భాషా బహిష్కారాన్ని రద్దు చేశారు: గిడుగు పిడుగు అప్పటికే విశ్రమించలేదు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు సూత్రధారులుగా 1933 మార్చి 10-12 తేదీల్లో జరిగిన ‘అభినవాంధ్ర కవిపండితసభ’ చిలుకూరి నారాయణరావుగారి అధ్యక్షతన సమావేశమై ఆధునిక వ్యావహారికమే ‘బోధనభాష’గా ఉండాలని తీర్మానించింది. (నవ్యాంధ్ర సాహిత్య వీధులు, 3. 553-55). ఆ యేడు డిసెంబరులో గిడుగువారు ప్రకటించిన ‘గద్యచింతామణి’ మొదటి భాగం వెలువడింది. తెలుగువారి వచనరచనా సంప్రదాయం 16-20 సతాబ్దాల మధ్య ఏ విధంగా వికసించిందో ససాక్షికంగా నిరూపించి వ్యావహారికవాదానికి ఇతోధికరచారగౌరవాలను కల్పించి ఆ మహాసంకలన గ్రంథం సనాతన పండిత మండలికి గండికొట్టింది.

1936 లో ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వెలిసింది. అభినవాంధ్రకవిపండితుల్లో వ్యావహారికవాదులందరూ ఇందులో చేరేరు. పరిషత్తు ‘ప్రతిభ’ అనే సాహితీ పత్రికను నడపటం మొదలుపెట్టింది. వ్యావహారిక రచనలు పుంఖానుపుంఖంగా రావటం మొదలయింది. 1937 లో ‘జనవాణి’ అనే దినపత్రికకు సంపాదకత్వం వహించి తాపీ ధర్మారావుగారు మొటమొదటిసారిగా వ్యావహారికాన్ని పత్రికాభాష చేసారు.ఈ రచనా విధానానికి, ఈ భాషావాదానికి ప్రజామోదం లభించింది. తల్లావజ్ఘల శివశంకరశాస్త్రిగారివంటి ఆధునిక విద్వత్కవులు శిష్టవ్యవహారమంటే సభాసాధుభాష అని, గద్య గేయ రచనలకు ఇది వినా మరో మార్గం లేదని, మాండలిక రూపాలు అపరిహార్మాలని వాదించారు (నవ్యాంధ్ర సాహిత్య వీధులు, 3. 553-55). గ్రాంథికం ‘సరళ గ్రాంథిక, సులభ గ్రాంథికాది’ అవతారాలెత్తుతూ గతానుగతికమైన అప్రతిభ రచనల్లో మిగిలిపోయింది. వ్యావహారిక భానూదయం భరించలేని దివాంధాలు విశ్వవిద్యాలయరక్షణలో పాఠ్యగ్రంధాల్లో తలదాచుకోవలసిన దుస్థితి వచ్చింది. పరిణామశీలమైన కాలం తన శక్తి నిరూపించింది. 1949 లో ‘తుది విన్నపము’ చేస్తూ గిడుగు వేంకట రామమూర్తిగారు ఆశించిన ప్రయోజనాలన్నీ ఇప్పటికీ పూర్తిగా నెరవేరకపోయినా ఆధునిక సాహిత్యంలో ఆధునికభాషా రూపాలకు సింహపీఠం లభించి తీరింది.

ఆధారాలు

  1. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 2, సంచిక 3 పేజీలు. 256-274
  2. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 2, సంచిక 3 పేజీలు. 275-285
  3. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 2, సంచిక 3 పేజీలు. 386-391
  4. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 3, సంచిక 4 పేజీలు. 137-157
  5. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, సంపుటి 3, సంచిక 5 పేజీ. 183
  6. ది హిందూ, 1914 జులై 3,9,10,13,15,17,20,23,29,30 తేదీలు
    ది హిందూ, 1914 ఆగస్టు 3,4,10,12,13 తేదీలు
    ఆంధ్ర పత్రిక, 1914 జులై 13,24,29 తేదీలు
    ఆంధ్ర పత్రిక ఆగస్టు 1914 12,17 తేదీలు.
  7. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక: ఆంధ్ర సాహిత్యపరిషదష్టమ సమావేశం, జూన్ 7, నెల్లూరు
  8. హెడ్‌మాస్టర్‌గారి చర్చలు – ది హిందూ, 21-7-1914, 1-9-1914, 18/19-6-1914
  9. మెడలిస్టుగారి చర్చలు – ది హిందూ, 20-7-1914
  10. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ గారి సమాధానాలు – 9-7-1914