నీటి అద్దాలు
రోడ్డు వారగా పగిలిన నీటి అద్దాలపై
కాలు మోపి ఆకాశంలోకి,
అలా తెలి మబ్బుల మీదకి
జారిపోయిన ఆ బాల్యం లేదిప్పుడు
రెండుచక్రాల విమానమెక్కి
రెక్కలు విప్పి, బార్లు గాలికొదిలేసి
విసురుగా నీటి అద్దాల్ని ఛేదిస్తూ
నేలమీదే ఎగిరిన ఆ కుర్రతనమూ లేదు
జవరాలి ధ్యాసలో పడి
జగత్తునే మరిచిపోయి,
ఆమె వెనకే నడుస్తూ
బాటేదో, ఊటేదో కానక,
చెమ్మగిల్లిన పాదాలతో ఆమెని
కోవెలదాకా సాగనంపిన
ఆ యవ్వనమూ లేదు
కాళ్ళదగ్గరి కూరలసంచీ
పడిపోకుండా బ్రేకులేస్తూ,
పల్లం రాగానే పెట్రోలు ఆదాకోసం
ఇంజనాపుచేస్తూ,
వడుపుగా నీటిగుంటల్ని తప్పించుకుంటూ,
బండితో ఇల్లు జేరిన ఆ పెద్దరికమూ లేదు
నీటిపై రాలిన దేవకాంచనాలని
వంగలేక వంగలేక వంగి ఏరుకొని,
ఇంటికెళ్ళి ఈశ్వరుడికర్పించిన
వృద్ధాప్యపు వైనమూ లేదు
ఉన్నదల్లా
భూమ్యాకాశాల మధ్య ఊగిసలాడుతూ
వింతపల్లకి నెక్కి వీధులేగుతున్న అతనూ
విరుల దండను కప్పి, వినువీధినూరేగిస్తూ
వీడ్కోలు చెబుతున్న ఆ నీటి అద్దాలూ

రచయిత శ్రీనివాస ఫణి కుమార్ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ... పూర్తిగా »
kosyasura అభిప్రాయం:
May 5, 2008 8:57 am
నీరు జారుతున్న అద్దాలపై ,నీరు కారుతున్న జీవిత ప్రతిబింబాలు చూపకనే చూపారు.మసకబారుతున్న అద్దాలలొంచి చదువుకున్నాను.
కొ శ్యా సు రా
bollojubaba అభిప్రాయం:
May 9, 2008 12:17 am
ఫణి గారికి
మీ కవిత మంచి ఆర్ధ్రతతో ఉంది. ఒక మంచి లైఫ్ సైజ్ స్కెచ్ ని అక్షరబద్దం చేసారు. చాలాబాగుంది.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
giri అభిప్రాయం:
May 19, 2008 6:48 am
చల్లా గారు,
బాగా రాసారు. సంతోషం.
గిరి
Phani DokkA అభిప్రాయం:
May 19, 2008 9:41 am
కొశ్యాసురా గారూ, బొల్లోజుబాబా గారూ,
కవితపై మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.
గిరి గారూ,
ఇంతకీ “చల్లా” గారెవరు స్వామీ ? నా పేరుని ఎటునించి కుదించినా “చల్లా” అని రాదుకదా? అర్థంకాలా :-(
ఫణి డొక్కా.
Giri అభిప్రాయం:
May 21, 2008 7:15 am
ఫణీ స్వామీ,
మీ పేరు తప్పు రాసినందుకు సారి. దానికి మీ సమాధానం బావుంది.
కవిత బావుంది.
ఇట్లు
గిరి
Ananth అభిప్రాయం:
June 5, 2008 9:22 pm
ఫణి గారు,
నీటి అద్దాలు, ఊట, నీటి గుంటలు, వయసునిబట్టి మారేతీరు బాగుంది. మంచి కవిత.