ఈమాట » అలిగితివా…

Expand to right
Expand to left

అలిగితివా…

(న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి వెలువరించే “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో ప్రథమబహుమతి పొందిన కవిత)

నవ్వుతూ పలకరించే
నడుమ్మీద పుట్టుమచ్చ
ముఖం చాటేస్తే
వాలుజడలోని ముద్దమందారం
ముభావంగా చూసింది..

కాలిమువ్వలూ చేతిగాజులు
మధ్య మౌనం
మందాకినిలా ప్రవహిస్తూ..

రాయబారానికి పంపిన
మల్లెలూ మరువం
పూజగదిలో బందీలై

శిశిరం తలుపు తోసుకుని
ఇంట్లోకొచ్చినట్టు
అర్ధంకాని స్తబ్ధత..

వేడికోలు చూపుల్ని
ఇంక మోయలేనని
గాలి భీష్మిస్తే
గుండె పట్టేసి..
దైన్యం గొంతులోకి జారి
‘నన్ను క్షమించవూ’!

లిప్త మాత్రంలో నన్ను చుట్టేసిన
నీ ఒంటి మెత్తదనం
‘అసలెందుకూ ‘ అంటున్న
మెదడుని కప్పేస్తుంటే..

నీరెండ మెల్లగా
గదిలోంచి తప్పుకుంది!

 

(4 అభిప్రాయాలు)

  1. kosyasura అభిప్రాయం:

    May 3, 2008 9:02 pm

    అబ్బ !! అలక ఇంత అందంగా కూడా ఉంటుందా. !!
    కొ శ్యా సు రా

  2. Srini Chimata అభిప్రాయం:

    May 4, 2008 6:55 pm

    చాలా బాగుందండి.. మీ రచనా శైలి నన్ను ఎప్పుడూ అచ్చెరువొందిస్తుంది. Keep it up.

    Srini Chimata
    http://www.ChimataMusic.com

  3. arunkumar అభిప్రాయం:

    May 9, 2008 12:51 pm

    చాలా కాలానికి మంచి కవిత చదివాను.
    అరుణ్ కుమార్

  4. A.Prasuna అభిప్రాయం:

    June 4, 2008 8:34 pm

    చాలా బావుందండీ.