ఈమాట » హిందోళ రాగం - అనుబంధం

Expand to right
Expand to left

హిందోళ రాగం - అనుబంధం

[ఈమాటలో లోగడ డా. లక్ష్మన్న రాసిన వ్యాసానికిది ఆడియో అనుబంధం. హిందోళం/మాల్కౌఁస్ రాగలక్షణాలను గురించీ, వివిధ లలిత గీతాల్లో ఈ రాగపు విన్యాసాలను గురించీ ఆ వ్యాసంలో వివరణలున్నాయి. ఔత్సాహికులు ఈ రాగపు సంగీతాన్ని విని ఆనందించటానికీ, రాగాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యటానికీ ఈ అనుబంధం పనికొస్తుంది. — రచయిత]

మామూలుగా మనమంతా విని ఆనందించే హిందోళంలో స గ1 మ1 ధ1 ని1 అనే స్వరాలే ఉంటాయి. (ఎవరైనా రిషభం పలికిస్తే శంకరశాస్త్రులు ‘శారదా’ అని గద్దించే ప్రమాదం ఉంటుంది!) హిందూస్తానీ శాస్త్రీయ సంప్రదాయంలో ఈ రాగాన్ని కచేరీల్లో అర్ధరాత్రి దాటాక వినిపించాలి. మాల్కౌఁస్ అనేది మాళవకౌశిక అనే పేరుకు వికృతి అంటారు. కౌశికధ్వని (కౌశీధనీ) అనే రాగం ఒకటి స గ2 మ1 ధ2 ని2 స అనే స్వరాలతో ఉంది కనక ఇది నిజమే అయిఉంటుంది. కర్ణాటకపద్ధతిలో ఈ రాగంలో సామజవరగమనా, నీరజాక్షి మొదలైన ప్రసిద్ధ రచనలున్నాయి. మనసులోని మర్మము తెలుసుకో అనే త్యాగరాజ కీర్తనను మాత్రం కొందరు విద్వాంసులు శుద్ధధైవతానికి బదులుగా చతుశ్రుతి ధైవతంతో (ధ2) పాడతారు. ఈమని శంకరశాస్త్రిగారు ఈ పద్ధతిలో వీణమీద వాయించగా నేను విన్నాను. దీనికి ఆధారమేమిటో తెలియదు.

కింద ఉదహరించిన కొన్ని సినీగీతాల్లో (*గుర్తు) పంచమం (కొండొకచో రిషభంకూడా) వినిపిస్తుంది. ఘంటసాల కంపోజ్ చేసిన పాటలన్నిటిలోనూ ఇది గమనించవచ్చు. నిజానికి జయంతశ్రీ అనే మరొక రాగంలో (మరుగేలరా కీర్తన) అవరోహణలో పంచమం వేస్తారు. (స గ1 మ1 ధ1 ని1 స - స ని1 ధ2 ప మ1 గ1 స). (దీన్ని హిందూస్తానీలో పంచమ్ మాల్కౌఁస్ అంటారు). అలా కాకుండా తమకిష్టమైన చోటల్లా పంచమం వాడి ‘కలుషితం’ చేసే హక్కు ఉపశాస్త్రీయ సంగీత రచయితలకు ఉంటుంది.

హిందోళం కర్ణాటక గాత్రసంగీతం:

  1. హరి రసమవిహారీ (బాలమురళీకృష్ణ అన్నమాచార్య కీర్తన)
  2. సామజవరగమనా (జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం)
  3. హిందోళం తిల్లానా (జాన్ హిగిన్స్)

కర్ణాటక వాద్యసంగీతం:

  1. సామజవరగమనా (టి.ఎన్. రాజరత్నంపిళ్ళై నాదస్వరం)
  2. సామజవరగమనా (యు. శ్రీనివాస్ మేండొలిన్)
  3. భజరే గోపాలం (ఎన్. రమణి వేణువు)

మాల్కౌఁస్ హిందూస్తానీ గాత్రసంగీతం:

  1. మందిర్ దేఖ్ డరే (బడేగులాం అలీఖాన్)
  2. ఆజ్ మోరే ఘర్ (అమీర్‌ఖాన్)
  3. మేరో మన్ (గంగూబాయి హానగల్)
  4. పగ్ ఘుంఘరూ (డి.వి.పలూస్కర్)

హిందూస్తానీ వాద్యసంగీతం:

  1. బిస్మిల్లాఖాన్ (షెహనాయి)
  2. రవిశంకర్ (సితార్)
  3. హరిప్రసాద్ చౌరాసియా (వేణువు)
  4. శివకుమార్‌శర్మ (సంతూర్)

తెలుగు సినీగీతాలు:

(* : పంచమం లేదా రిషభం)

  1. సందేహించకుమమ్మా (లవకుశ) *
  2. కలనైనా నీ తలపే (శాంతినివాసం)
  3. నారాయణా హరి (చెంచులక్ష్మి)
  4. పగలే వెన్నెల (పూజాఫలం)
  5. నేనే రాధనోయీ (అంతా మన మంచికే)
  6. పిలువకురా (సువర్ణ సుందరి)
  7. మోహనరూపా గోపాలా (కృష్ణ ప్రేమ)
  8. వీణ వేణువైన (ఇంటింటి రామాయణం) (అన్యస్వరాలు)
  9. చూడుమదే చెలియా (విప్రనారాయణ)
  10. సామజవర గమనా (శంకరాభరణం)
  11. రాజశేఖరా (అనార్కలి) *
  12. అందమె ఆనందం (బ్రతుకుతెరువు) *
  13. శ్రీకర కరుణాలవాల (బొబ్బిలియుద్ధం) *
  14. రామకథను వినరయ్యా (లవకుశ) *
  15. మనసే అందాల బృందావనం (మంచి కుటుంబం)
  16. సాగర సంగమమే (సీతాకోక చిలుక)
  17. ఓం నమశ్శివాయ (సాగర సంగమం)
  18. అంతా రామమయం (శ్రీ రామదాసు)
  19. చిలిపి నవ్వుల నిను చూడగానే (ఆత్మీయులు) (అన్యస్వరాలు)
  20. కొండలలో నెలకొన్న (అన్నమాచార్య)

హిందీ సినీగీతాలు:

  1. మన్‌ తడపత్‌ (బైజు బావరా)
  2. ఆధాహై చంద్రమా (నవ్‌రంగ్‌)
  3. నిర్బల్‌సే లడాయీ (తూఫాన్ ఔర్ దియా)
  4. అఁఖియన్ సంగ్ అఁఖియాఁ (బడా ఆద్మీ)
  5. దీప్ జలాయే (కలాకార్)
  6. పంఖ్ హోతేతో (సెహరా)
  7. తూ ఛుపీహై కహాఁ (నవ్‌రంగ్) (అన్యస్వరాలు)
  8. బల్‌మా మానేనా (ఒపేరాహౌజ్)

కీబోర్డు

కీబోర్డుమీద అంతగా భయపడకుండా ఈ రాగాన్ని వాయించాలంటే బొమ్మలో చూపిన నల్లమెట్లను మాత్రమే వరసగా వాయిస్తే సరిపోతుంది. దీనికి ఆధారశ్రుతి ఆరున్నర (ఏ షార్ప్) అని గమనించాలి. ఈ పద్ధతిలో ‘పగలే వెన్నెలా’ మొదలైన పాటలను తెల్లమెట్ల జోలికి పోకుండానే పలికించవచ్చు.

ఈ రాగం గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకు అయిదారేళ్ళ వయసు ఉన్నప్పుడు నేను మొదటగా గుర్తించిన రాగం మాల్కౌఁస్. అప్పుడు నేను విన్నది ఒక పాత మరాఠీ పాట; 78ఆర్‌పీఎం రికార్డు. దీనానాథ్ మంగేశ్కర్ (1900-1942) ఆడవేషం కట్టి పాడిన ‘రణదుందుభి’ అనే మరాఠీ నాటకగీతం దివ్యస్వాతంత్ర్యరవి.

ఆ పాట ఆనాడు నామీద ఎంత ప్రగాఢమైన ముద్ర వేసిందో నేను వర్ణించలేను. హిందూస్తానీ పద్ధతిలో వీరరసప్రధానమైన ఈ రాగపు స్ఫూర్తి అంతకన్నా ఎక్కువగా నేను మరెక్కడా ఈనాటికీ వినలేదంటే అతిశయోక్తిగా అనిపించవచ్చు. చిత్రమేమిటంటే ఈ పాట చరణంలో గాయకుడు బుద్ధిపూర్వకంగా ఎన్నో స్వరాలను చేర్చినప్పటికీ అది అద్భుతంగానే అనిపిస్తుంది. ఇన్ని దశాబ్దాలుగా గాత్రంలో బడేగులాం, అమీర్‌ఖాన్, సితార్‌మీద విలాయత్‌ఖాన్ మొదలైన మహామహుల మాల్‌కౌఁస్ విన్నాక కూడా నా అభిప్రాయం మారలేదు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...

 

(9 అభిప్రాయాలు)

  1. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    May 6, 2008 9:40 am

    హిందోళ రాగం చాలా ఉల్లాస వంతమైన రాగం. మనకి తెలుసున్న హిందోళ రాగంలో పాటలన్నీ జనరంజకమైనవే ! ఈ గంభీరమైన రాగాన్ని విషాదం గా పాడిన ఓ పాట ఉంది. అది “బాల్య మిత్రుల కథ” సినిమాలో “గున్న మామిడీ కొమ్మ మీదా గూళ్ళు రెండున్నాయి” అనే పాట. ఈ పాట రెండు రకాలుగా ఉంటుంది. మొదటిదేమో హుషారుగా ఉంటుంది. రెందోది విషాద ఛాయలతో ఉంటుంది. ఛాలెంజింగ్ పాటల ప్రస్తావన వచ్చినప్పుడు, ఓ సందర్భంలో ఎస్. జానకి ఈ రెండో పాట గురించి చెబుతూ “హిందోళ రాగం విషాదం” గా పాడడం చాలా కష్టం అని చెప్పారు. ఇక్కడ ఈ రెండు పాటలూ వినచ్చు.

    గున్నమామిడీ ( హుషారు )
    http://www.chimatamusic.com/playcmd.php?plist=6523

    గున్నమామిడీ ( విషాదం )
    http://www.chimatamusic.com/playcmd.php?plist=6524

    ఈ వ్యాసంలో హిందోళం రాగం స్వరాలు ఇలా రాసారు. (స గ1 మ1 ధ1 ని1 స - స ని1 ధ1 మ1 గ1 స) . ఇక్కడ “ధ” వత్తు ధ వాడారు. మామూలు “ద” వాడాలి. నాకు తెలిసి తమిళులే ఇలా పలుకుతారు. మనం తెలుగు వాళ్ళమయ్యిండీ “ధ” ప్రయోగం నాకు రుచించలేదు. “ద” అని రాస్తే బాగుండేది. అచ్చు తప్పో లేక వ్యాస కర్త గారే అలా రాసేరో తెలియదు. “ధ” అని కొంత మంది తమిళ సంగీత విద్వాంసులు పాడగా విన్నాను. అలా పాడినప్పుడు వినడానికి ఇబ్బంది కరంగా ఉంటుంది.

    ఈ క్రింది వెబ్ సైట్ లో కర్ణాటక సంగీత కృతులున్నాయి. కానీ ఈ పాటలు పాడిన వ్యక్తి ( పాఠాలు నేర్పుతూ ) “ద” ని మాత్రం “ధ” గా పాడడం నాకు వినడానికి బాగుండదు.

    http://www.ecse.rpi.edu/Homepages/shivkuma/

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  2. mOhana అభిప్రాయం:

    May 6, 2008 11:31 am

    సాయి గారూ: నాకు తెలిసి ధైవతమునుండి ధ వచ్చింది.
    కాబట్టి ధ సరియైనదే. నిజంగా ధ-కు బదులు ద అని
    చెప్పినప్పుడల్లా నాకు ఒక విధంగా ఉంటుంది. హిందూస్తానీ
    సంగీతకళాకారులు ధ అనే ఎప్పుడూ వాడుతారు.
    కర్ణాటక సంగీతంలోనే ద అంటారు. ఇది నాకు తెలిసింది.
    సంగీతం బాగా తెలిసినవాళ్లు ఇంకా చెబుతారు అని
    ఆశిస్తున్నాను. - మోహన

  3. Rohiniprasad అభిప్రాయం:

    May 6, 2008 6:02 pm

    ధైవతం గురించి మోహనరావుగారు రాసినది రైటు. నేను హిందూస్తానీ నేర్చుకున్నాను కనక ద అనడానికి నాకు మనసొప్పదు.

  4. Sai Brahamanandam Gorti అభిప్రాయం:

    May 11, 2008 11:23 am

    మోహన రావు గారూ,

    హిందూస్తానీ సంగీతకళాకారులు కి బదులు అని అన్ని సందర్భాలలోనూ పాడరు. కానీ రాయడం మాత్రమే ధ అని రాస్తారు. మీరు చెప్పిన తరువాత నా దగ్గర ఉన్న పాత పుస్తకాలు వెతికాను. గాంధర్వ వేదం అనే పుస్తకంలో దైవతం గురించి ఈ క్రింది శ్లోకం ఉంది.

    ధీర్యస్తి సధీనాం తత్సంబంధీ దైవతః స్మృతః
    షష్టస్థానే ధృతో యస్మాత్తతో సౌ ధైవతో మతః

    ఆరవ స్థానమున ధరింపబడినది ధైవతము అని ఇందులో ఉంది. కానీ స్వరాల పుట్టుక గురించి చెప్పే ఇంకో పద్యంలో -

    పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమం
    దైవతం హేషతే వాజీ నిషాదం బృహంతే గజః

    పూవులు పూచు కాలమున కోయిల పంచమ ధ్వని పలుకుతుంది. గుర్రము హి హి అని సకిలించుట పోలి దైవతముంటుంది. ఏనుగు ఘీంకారం నిషాదానికి మూలం. ఇలా ఈ శ్లోకంలో చెప్పబడింది.,
    ఈ శ్లోకం గమనిస్తే - ఇక్కడ ధైవతము అని లేదు. దైవతమనేఉంది. ఇంకా కొన్ని పుస్తకాలు తిరగేస్తే నీ నీ పరస్పరం వాడడం ఉంది. ఇది చూసాక ఏది సరిఅయినదనీ, నేను ఇండియాలో కర్ణాటక సంగీత పెద్దల్నీ సంప్రదించాను. మనం ఎలా ఉచ్చరిస్తామో ( పాడతామో ) అలాగే రాయడం సంప్రదాయం అని చెప్పారు. పూర్వం ధ అని రాసినా ద అనే పలుకుతూ పాడేవారట.
    ఇది హిందుస్తానీ కీ వర్తిస్తుంది.
    మాల్కోస్ పాట వినండి.

    మీరన్నట్లుగా ధ అని ఎక్కడా వినిపించదు. హిందీలో రాసేటప్పుడు ధ అని రాసినా మామూలు ద గానే పలుకుతున్నారు, అక్కడక్కడ తప్ప. కానీ కర్ణాటక సంగీతంలో మాత్రం ద గానే రాస్తున్నారు. కొంతమంది తమిళ గాయకులు తప్ప, అందరూ ద అనే పాడుతున్నారు. కర్ణాటక రాగాలపైల వ్యాసాలు రాస్తూ, ద నీ ధ నీ కావల్సినట్లుగా వాడడం చూసి రాసాను. అంతే!

    - సాయి బ్రహ్మానందం గొర్తి

  5. shAradA.. అభిప్రాయం:

    May 15, 2008 10:27 am

    మీరు రాషిన వ్యాషం కూలంకషంగా పరిషీలించి, కాచి, వడపోషి, షేవించిన మీదట రాష్తున్న నా అమూల్యాభిప్రాయం :-)

    1) హిందోళం అషలు పేరు ఇండోరం, అది ఇండోర్ లో పుట్టింది కాబట్టి దాన్ని అలా అనేవారుట. ఇప్పుడు వడోదరం అనవచ్చుట. ఈ విషయం మీకు తెలియదు, అషలిప్పడివరకూ నాకే తెలియదు,. వొప్పేషుకోండొప్పేషుకోండి.

    2) వ్యాషం మొదట మీరు రాషిన కామెంట్లకి ష్క్వేరు బ్రాకెట్లు వాడడం వల్ల వ్యాషం అందం చెడిపోయిండి. ఫ్లవర్ బ్రాకెట్లు వాడితే బాగుండేది. అషలు ఫ్లవర్ బ్రాకెట్లే ఎందుకు వాడాలో తెలియాలంటే నా పరిషోధనా వ్యాషం చదివి తెలుషుకోవాళి. రాయంగానే పంపిష్తాను.

    3) మీరువాడిన కీబోర్డు బొమ్మ బాగాలేదు, కలర్ పిక్చరు వాడుంటే మీ వ్యాషం అందంగా వుండేది.

    దొరకునా ఇటువంటి షేవా..ఆ..ఆ..ఆ..వా..వా..వా..

  6. Patakudu అభిప్రాయం:

    May 16, 2008 7:37 am

    As a reader I want these discussions to be more productive and enlightening . But unfortunately it looks like some of the comments are emanating from ego. They appear to be made just for the sake of embarrasing the writers. I sincerely thank Eemaata and Rohini Prasad garu for publishing the good articles on Ragas. These are very useful for the people like me who have limited knowledge on Classical Music.

  7. Jayasri అభిప్రాయం:

    May 18, 2008 5:14 am

    Thanks to the Author & to Eemaata for giving one more informative, interesting piece of article to all music enthu people and students. Links are interesting and enjoyable.
    I wish, before publishing, Editors should filter off unwanted, and useless comments. It would save us [readers’] our time.
    Shaaradaagaru , did I write your point well?

  8. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    May 19, 2008 9:23 am

    Patakudu, Jayasri గార్లకి,

    మీకు ఈ శీర్షిక నచ్చితే ఆనందించండి. దానికి నాకేమీ అభ్యంతరంలేదు. ఈ సంగీత పరమైన వ్యాసాల్లో అభ్యంతర కరమైనవి అనిపించినప్పుడు నేనే అభిప్రాయాలు రాయడం జరిగింది. “embarrasing the writers” అవసరం నాకు లేదు.
    నా అభిప్రాయాలు మీకు ఎలా useless అనిపించాయో నాకూ మీ అభిప్రాయాలు అలా అనిపించచ్చు. అది గమనిస్తే సంతోషిస్తాను.

  9. satya rama prasad kalluri అభిప్రాయం:

    August 19, 2008 10:40 am

    హిందోళంగురించి శ్రీ కొడవటిగంటి వ్రాసిన వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉన్నది.

    1) జేసుదాసు ‘మనసులోని మర్మము (త్యాగరాజకీర్తన)ను’ చతుశ్శ్రుతి రిషభంతో పాడగా (రికార్డు) మొదట విని ఆశ్చర్యపోయాను. అతడు చెంబై శిష్యపరంపరవాడట. అంతకు ముందు శ్రీరంగం గోపాలరత్నం, మరికొందరు శుద్ధరిషభంతోనే పాడారు. నాకు తెలిసిన ఒక విద్వాంసుడు త్యాగయ్య కీర్తనలు రెండిటిలోనూ ఒకటి ఇలాగ అయిపోయిందని బాధపడ్డాడు

    2) ‘మామవతు శ్రీ సరస్వతీ’ కూడా ఇస్తే బాగుండేదనిపించింది. అయినా దీనికి అంతమెక్కడ?

    ఎంతో శ్రమతో చక్కటి వ్యాసం ఇచ్చిన శ్రీ కొడవటిగంటివారికి అభివాదాలు.

    సత్యరామ ప్రసాదు కల్లూరి
    kalluriprasad@hotmail.com