ఈమాట » కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 3: బాబేజ్ యంత్రాలు

Expand to right
Expand to left

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 3: బాబేజ్ యంత్రాలు

“మొదటి ప్రోగ్రామర్” ఏడా లవ్‌లేస్ (Ada Lovelace)

Is thy face like thy mother’s, my fair child!
ADA! sole daughter of my house and heart?
When last I saw thy young blue eyes they smil’d,
And then we parted — not as now we part,
But with a hope.
— Canto the Third in “Childe Harold’s Pilgrimage,” Lord Byron, 1816.

“Sweet is revenge - especially to women.” — Lord Byron.

ఏడా లవ్‌లేస్
ఏడా లవ్‌లేస్
వికీపీడియా సౌజన్యంతో

తమ రచనలతోనే కాక ప్రవర్తన వలన కూడా గొప్ప సంచలనం కలిగించిన రొమాంటిక్ కవులలో ప్రముఖుడు లార్డ్ బైరన్. యూరప్‌లో అనేక ప్రేమకలాపాలు సాగించి చివరకి గ్రీకు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ అనారోగ్యంతో ముప్ఫై ఆరేళ్ళకే చనిపోయాడు. బైరన్‌కీ అన్నాబిల్లా కీ కలిగిన బిడ్డ ఏడా. బైరన్‌కి పెళ్ళి కాకముందర ఉన్న అనేక ప్రేమసంబంధాల్లో ఒకటి - చెల్లెలు వరస అయిన ఆగస్టాతో! పెళ్ళి అయింతర్వాత కూడా అది కొనసాగుతున్నదన్న అనుమానంతో అన్నాబిల్లా వారాల వయసున్న కూతుర్ని తీసుకొని బైరన్‌ని వదిలి వెళ్ళిపోయింది. తండ్రీ కూతుళ్ళు మళ్ళీ కలుసుకోలేదు.

కూతురికి తండ్రి గుణాలేమీ రాకూడదనే పట్టుదలతో, బైరన్ మీద కసితో అన్నాబిల్లా ఏడాని కట్టుదిట్టమైన పరిస్థితుల్లో పెంచింది. బైరన్ బ్రతికున్నంత కాలం ఏడాని యూరప్‌లో ప్రయాణం చెయ్యనివ్వకుండా జాగ్రత్తచేసింది - బైరన్ కూతుర్ని ఎత్తుకుపోతాడని! ఉద్రేకం కలిగించే కవిత్వం లాంటివాటివి కాకుండా గణితం నేర్పడానికి ట్యూటర్లని పెట్టింది. అప్పట్లో ఆడవాళ్ళకి ఉన్నత చదవులకెళ్ళాలనే ఆకాంక్ష ఉన్నా అవకాశాలు తక్కువ - ముఖ్యంగా సైన్సులో. తల్లి కోరినట్లు ఏడా కులీనుడొకరిని వివాహమాడింది. ముగ్గురు పిల్లల్ని కన్నది. భర్త ధనవంతుడే కాని చెప్పుకోదగ్గ అభిరుచులేమీ లేవు. అతనిని తక్కువ చూపుతో చూసేది. ఏడా ఓ వివాహేతర సంబంధం పెంచుకుంది. అజీర్ణానికి నానారకాల మందులు వాడి తీవ్ర అనారోగ్యానికి లోనయింది. తలబిరుసు గల తల్లి తన నమ్మకాలను రుద్ది హింసించింది. వీటితో పాటు ఏడా గుర్రపు పందాల వ్యసనానికి లోనయింది. నగలు తాకట్టు పెట్టి అప్పులపాలయింది. చివరకు కాన్సర్ వ్యాధితో ముప్ఫయి ఆరేళ్ళకే చనిపోయింది. తను కోరుకున్నట్లే తండ్రి సమాధి పక్కనే ఏడాని సమాధి చేశారు.

నాటకీయతతో కూడిన జీవితమే కాని, ఈ వ్యాసంలో ఏడా గురించి చెప్పుకోడానికి ముఖ్య కారణం బాబేజ్ యంత్రాన్ని బయట ప్రపంచానికి ఏడా వివరించడమే. బాబేజ్ ఇంట్లో పార్టీలు లండన్ నగరంలోనే ప్రసిద్ధని చెప్పుకున్నాం. అందం, మేధ, హోదా - ఆహ్వానితులకుండాల్సిన అర్హతలు. ఒకసారి ఏడా, తల్లీ కలిసి బాబేజ్ ఇంట్లో పార్టీకి వెళ్ళారు. అక్కడ తేడా యంత్రాన్ని చూసి ఏడాకి ఉత్సాహమొచ్చింది. బాబేజ్‌తో స్నేహం చేసింది.

తేడా యంత్రానికి ప్రజలనుండీ, ప్రభుత్వం నుండీ సరయిన ప్రోత్సాహం రానందుకు బాబేజ్ నిరుత్సాహపడ్డాడు. వైశ్లేషిక యంత్రం మీద చాలా ఏళ్ళు, చనిపోయేదాకా పని చేసినా దానిగురించిన వివరాలు ప్రచురించడానికి బాబేజ్ ఇష్టపడలేదు. ఇంగ్లాండులో సైంటిస్టులకి సరయిన విలువలేదని కినుక వహించాడు. ఒకసారి ఇటలీ వెళ్ళిన సందర్భంలో, అక్కడ శాస్త్రజ్ఞులకి తన యంత్రం గురించి ఉత్సాహంగా వివరించాడు. విన్నవారిలో యువకుడైన గణిత శాస్త్రజ్ఞుడొకడు నోట్స్ తీసుకొని ఫ్రెంచి భాషలో ఒక పేపరు రాశాడు.

దానిని ఇంగ్లీషులోకి అనువదించమని ఏడాకి స్నేహితులొకరు సలహా ఇచ్చారు. ఏడా కి గణితంలోనూ ఫ్రెంచి లోనూ ప్రవేశం ఉంది; బాబేజ్ ప్రోత్సాహమూ సాయమూ లభించాయి. అప్పట్లో బాబేజ్ వైశ్లేషిక యంత్రాన్ని మరెవరూ ఇంగ్లీషులో ప్రచురించలేదు. అందుకు ఏడాని గుర్తించాల్సిందే. కేవలం అనువదించడమేకాక దానికి మరికొన్ని వివరణలు ఇస్తూ విపులీకరించింది.

వైశ్లేషిక యంత్రం తేడా యంత్రానికన్నా మౌలికంగా భిన్నమయినదనీ, వైశ్లేషిక యంత్రం చేత వివిధ రకాల పనులు - లెక్కలే కాక, symbol processing చెయ్యవచ్చనీ, దాని వలన ముందు ముందు అనేక రకాల ఉపయోగాలుంటాయనీ ఊహించింది. ఆవిడ ఊహలు నేటి కంప్యూటర్లకి వర్తిస్తాయి. ఏడాని “మొదటి ప్రోగ్రామర్” అని పొగిడారు. కాని బాబేజ్ ఆలోచనకన్నా ఏడాది చెప్పుకోదగ్గ సొంత ఆలోచనదేమైనా ఉన్నదా అన్నది అనుమానమే. ఏమయినా ఏడా ప్రజ్ఞ కి గుర్తింపుగా, 1980 ప్రాంతంలో అమెరికా దేశపు రక్షణ శాఖ (U.S. Department of Defense) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రోగ్రామింగ్ భాషకి ఏడా లవ్‌లేస్ జ్ఞాపకార్థం “ఏడా” అని పేరు పెట్టారు.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7 8 9