కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు

కంతలున్న కార్డులతో అందమైన వస్త్రాలు


మగ్గంతో అల్లిన చిత్రం

వికీపీడియా సౌజన్యంతో

అయిదారు వేల ఏళ్ళ క్రితం ఓ రోజు చైనాలో రాణీగారు తోటలో విహరిస్తున్నారు. తనకిష్టమైన తెల్లటి మాల్బెర్రీ చెట్టునుంచి ఓ కాయనొకదానిని తీసుకొని టీ త్రాగడానికి టేబిల్ దగ్గర కూర్చున్నారు. చేత్తో ఆడుకుంటూన్న కాయని వేడి వేడి టీ ఉన్న కప్పులో ఏమరుపాటున పడేశారు. దానిని బయటకి తీస్తూంటే దాన్నుంచి దారం లాగ లాగే కొలదీ వస్తూనే ఉంది. ఆ విధంగా పట్టుని కనుక్కున్నారని కథ! ఓ చిన్న కాయ నుండి కిలోమీటరు కన్నా పొడవైన పట్టు దారం లాగొచ్చు. ఆ దారాల్ని కలిపి మెత్తటి వస్త్రాలని చెయ్యొచ్చు. అంత మృదువైన బట్టల్ని మనుషులు అంతకు మున్నెన్నడూ వేసుకోలేదు. వాటికోసం జనం తహతహలాడేవాళ్ళు. చాలా కాలం చైనీయులు పట్టుని మిగిలిన దేశాల వాళ్ళకి తెలియకుండా చాలా రహస్యంగా ఉంచారు.

రాజులకి పట్టు వస్త్రాలమీద మోజు ఉండేది, పట్టు విలాస వస్తువుల వాణిజ్యంలో ముఖ్యభాగంగా అయింది. ఫ్రెంచ్ రాజులు పట్టు పరిశ్రమని ప్రోత్సహించారు. లయన్స్ (Lyons) నగరం పట్టు వస్త్రాలకి పేరెన్నికగన్నది. అప్పట్లో మంచి డిజైన్లున్న బట్టలు నేయడం చాలా శ్రమతో కూడినపని. అది అర్థం కావాలంటే నేత గురించి కొంచం తెలియాలి.

మన దేశంలో నవారు మంచాలని చూసే ఉంటారు. నవారు మార్చాలంటే ఏం చేస్తారు? ముందు నిలువుగా నవారు పక్కపక్క పట్టీలకి కాస్త ఎడం ఉండేటట్లు బిగిస్తారు. తర్వాత ఒక్కో వరసా అడ్డంగా అల్లుతారు – ఒక నవారు పట్టీ మీదా, తర్వాత నివారు పట్టీ క్రిందా. బట్టలు నేసేది కూడా ఇలాగే.

నిలువు లేదా పడుగు పోగులని (warp threads) సమాంతరంగా బిగిస్తారు. వాటిలో కొన్నిటిని పైకి లాగితే పందిరి (shed) లాగా ఏర్పడుతుంది. ఆ పందిరిలోగుండా ఓ అడ్డ లేదా పేక పోగుని (weft thread) లాగుతారు. ఇప్పుడు పైకి లాగిన వాటిని వదిలి కింద వున్నవాటిని పైకి లాగుతారు; పందిరిలో నుంచి అడ్డపోగుని లాగుతారు. ఇలా ప్రతి అడ్డపోగుకీ నిలువు పోగుల్లో కొన్ని మార్చి లాగితే బట్ట తయారవుతుంది. ఏ నిలువు పోగులు లాగుతామన్నదాని మీద ఆధారపడి రకరకాల డిజైన్లని నెయ్యవచ్చు. నవారు మంచానికి ఒకదానిని వదిలి తర్వాత దానిని లేపుతాము కాబట్టి దానికి వచ్చే డిజైను చాలా సాధారణంగా ఉంటుంది.

అందమైన పువ్వులున్న చీరలకి గిరాకీ ఎక్కువ. ఇటువంటి డిజైన్లని నేయడానికి ప్రతి అడ్డపోగుకీ నిలువుపోగుల్లో వేటిని పైకి లేపాలి అన్నది చేత్తో లెక్క కట్టేవాళ్ళు. దానికి వేరే మనిషన్నమాట. ప్రతి అడ్డపోగుకీ ఇలా చెయ్యడమంటే ఎంత కష్టమో గ్రహించండి. దీనికో అమోఘమైన మార్గాన్ని కనిపెట్టినవాడు జాకార్డ్ (Jacquard) అనే ఓ ఫ్రెంచ్ నేతకారుడు. అతను కనుక్కున్న మగ్గం ఈ బొమ్మలో చూడచ్చు.



నిలువుపోగులు (warp threads) కింద కట్టి ఉంటాయి. ప్రతి నిలుగుపోగుకీ ఓ తీగె పైకివెళ్తుంది. ఆ తీగెకి అవతలవైపున ఒక కొక్కెం ఉంది. ఆ కొక్కెం పోయి పైనున్న దండెం మీద వాలడానికి అనువుగా ఉంటుంది. తీగె మధ్యలో ఓ స్టీలు బద్దలోని కన్నంగుండా వెళ్తుంది. స్టీలు బద్దలు ఒకవైపు స్ప్రింగుతో కడ్డీకి కట్టి ఉంటాయి. బద్ద అవతలవైపు సానదీసిన మొనలా ఉంటుంది.

ఆ మొనలవైపు రంధ్రాలున్న కార్డు తగులుతుంది. మొన రంధ్రంలోగుండా దూసుకుపోతే స్టీలు బద్ద కాస్త జరిగి దాని కన్నంలో ఉన్న తీగె కూడా కదులుతుంది. తీగె కదిలితే దానికున్న కొక్కెం పోయి పైన ఉన్న దండెం మీద వాలుతుంది. రంధ్రం లేకపోతే, కన్నంలోని తీగె కదలదు. ఇప్పుడు దండాన్ని పైకి లాగితే రంధ్రాలని తాకిన స్టీలు బద్దల కన్నాల గుండా వెళ్ళిన తీగెలు పైకి పోయి, వాటితో కట్టివున్న నిలువుపోగులు లేస్తాయి. మిగిలిన నిలువు పోగులు లేవవు. ఆ పందిరి (shed) లో నుంచి అడ్డపోగుని షటిల్ అనే యంత్రభాగం ద్వారా లాగుతారు. దండెం దిగుతుంది.

తరవాత వేరే కార్డు వస్తుంది. దాని రంధ్రాలను బట్టి నిలువుపోగులు లేస్తాయి. ఈ విధంగా ప్రతి అడ్డపోగుకీ ఓ కార్డు ఏ నిలువుపోగులు లేపాలో తెలిపి బ్రహ్మాండమైన బాణీలని అల్లే వీలు కలుగుతుంది. పైన ఉన్న జాకర్డ్ బొమ్మ జాకర్డ్ మగ్గంతో అల్లినది అంటే ఆశ్చర్యం కలగక మానదు!

మనక్కావల్సిన డిజైనుని కార్డుల మీద రంధ్రాలతో వర్ణిస్తే, మగ్గం ఆటొమాటిక్‌గా నేస్తుంది! ఒకే చీరెలో ఒకే పువ్వుని రెండు మూడు చోట్ల వెయ్యాలనుకోండి. ఆ పువ్వుకి సంబంధించిన కార్డులు తిరిగివాడుకోవచ్చు.

సిల్కు బట్ట మీద నేసిన జాకర్డ్ బొమ్మనొకదానిని బాబేజ్ కొని తన ఇంట్లో ప్రదర్శించేవాడు. దానిని చూసినవాళ్ళు అది నేసినదంటే నమ్మేవాళ్ళు కాదు. మగ్గం కేవలం యంత్రం – ఏపోగులు లేపమంటే ఆపోగులని లేపుతుంది. ఏపోగులు ఏవరసలో లేపాలో చెప్పేది రంధ్రాలున్న కార్డులు. మనకి కావలసిన డిజైన్ ని ఆ కార్డులమీద రంధ్రాల ద్వారా సూచిస్తే ఆ డిజైనుతో బట్టని నేయవచ్చు.

ఇది ఆధునిక కంప్యూటర్కి దగ్గరగా ఉంది. కంప్యూటర్ కూడా నియమితమైన కొన్ని ఆపరేషన్స్ – స్టోరు నుండీ సీపీయూకి తీసుకురావడం, కూడడం, ఫలితాన్ని స్టోరులో పెట్టడం – ఇలాంటి వాటిని చేస్తుంది. ఏవి ఏవరుసలో చెయ్యాలో చెప్పేది మనం రాసే ప్రోగ్రాం. అప్పట్లో దీని ప్రాధాన్యత గ్రహించిన అతికొద్దిమందిలో ఒకావిడ, బాబేజ్ స్నేసితురాలు – ఏడా లవ్‌లేస్ (Ada Lovelace).