ఈమాట » కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 3: బాబేజ్ యంత్రాలు

Expand to right
Expand to left

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 3: బాబేజ్ యంత్రాలు

బాబేజ్ జీవిత సంగ్రహం

ఛార్లెస్ బాబేజ్ 1791 సంవత్సరంలో లండన్‌లో పుట్టాడు. అతని పూర్వీకులు స్వర్ణకారులు. అప్పటికింకా ఇంగ్లాండు ప్రజలెక్కువ గ్రామీణులే. 1871లో బాబేజ్ చనిపోయేనాటికి ఇంగ్లాండు అనూహ్యంగా మారిపోయింది - ఎక్కువమంది పట్టణాల్లో నివసిస్తున్నారు. ఎనభై ఏళ్ళలో పారిశ్రామిక విప్లవం ప్రజల జీవితాలని పూర్తిగా మార్చివేసింది.

బాబేజ్ చిన్నతనం నుండీ గణితంలోనూ, మెకానికల్ పరికరాల్లోనూ ఆసక్తి చూపాడు. పదహారేళ్ళ వయసులో కాళ్ళకి బోర్డులు కట్టుకొని నీళ్ళమీద నడవొచ్చని చూపిస్తూ మునిగినంత పనిచేశాడు. యూనివర్సిటీ చదువు వలన రెండు లాభాలున్నాయన్నాడు: పుస్తకాలు, స్నేహితులు. అక్కడ కలుసుకున్న జాన్ హెర్షల్ ఆజన్మాంత స్నేహితుడు. బాబేజ్ తిరుగుబాటు స్వభావం కలవాడు. అప్పట్లో బ్రిటన్‌లో కలనగణితం న్యూటన్ పద్ధతి ప్రకారం బోధించేవాళ్ళు - లైబ్నిజ్ పద్ధతి మెరుగైనదయినా. బ్రిటన్ మిగిలిన యూరప్ దేశాల కంటె గణితంలో వెనుకబడి ఉండటానికి కారణం లైబ్నిజ్ పద్ధతుల్ని అనుసరించకపోవడమే అని బాబేజ్ ఒక ఉద్యమమే లేవదీశాడు.

హెర్షల్, బాబేజ్‌లిద్దరూ పారిస్ సందర్శించారు. పేరున్న శాస్త్రవేత్తలని కలిశారు. ఇంగ్లాండు సైన్సులో వెనుకబడి ఉన్నదని రాయల్ సొసైటీ లో సభ్యులకి చాలామందికి సైన్సు అవగాహన లేదని రాయల్ సొసైటీకి పోటీగా బాబేజ్ ఆస్ట్రొనామికల్ సొసైటి నొకదాన్ని స్థాపించాడు. సభ్యులకి ఉపన్యాసాలిచ్చి గణిత శాస్త్రవేత్తగా పేరు సంపాదించాడు.

బాబేజ్ జార్జియానా అనే ఆమెని ప్రేమించాడు. పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. ఉద్యోగం సద్యోగం లేదు, పెళ్ళెందుకని తండ్రి తిట్టాడు. బాబేజ్ తండ్రి డబ్బువిలువ బాగా జీర్ణించుకున్నవాడు. వ్యాపారం చేసీ, వడ్డీల కిచ్చీ బాగా సంపాదించి బ్యాంకర్ గా స్థిరపడ్డాడు; ఆయన నడివయసొచ్చి ఆర్థికంగా స్థిరపడినంతవరకూ పెళ్ళి చేసుకోలేదు. ఆయన కొడుకు తన అడుగుజాడల్లో నడవాలనుకున్నాడు. 1814లో బాబేజ్ ఓ సాయంత్రం తండ్రితో తగాదా పడి, వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుని లండన్‌లో కాపురం పెట్టాడు. తండ్రి నెల నెలా ఇచ్చే డబ్బూ, జార్జియానా తన కుటుంబం నుండి తెచ్చిన డబ్బూ వారి అవసరాలకు సరిపోయేది.

ఆస్ట్రొనామికల్ సొసైటీ బాబేజ్‌నీ, హెర్షల్‌నీ నావికా పంచాంగం (Nautical Almanac) పట్టికలని సరిచెయ్యమని పురమాయించింది. అందుకు గుమాస్తాలని పెట్టుకున్నారు. తప్పులుంటే కనుక్కోడానికి ఒకే పట్టిక ఇద్దరు గుమాస్తాలని వేరువేరుగా చెయ్యమన్నారు. 1821లో ఒక రోజు అవి సరిగా ఉన్నాయో లేవో మిత్రులిద్దరూ చూస్తున్నారు. చాలాచోట్ల ఇద్దరు గుమాస్తాల లెక్కల మధ్య పొంతన కుదరలేదు. వాళ్ళిద్దరికీ వాటిని చూస్తే తలనొప్పి వచ్చింది.

“ఈ లెక్కలు చేసే ఆవిరి యంత్రమొకటి ఉంటే బాగుండు,” అని బాబేజ్ విసుక్కున్నాడు ; హెర్షల్ అది సాధ్యమేనన్నాడు. ఆరు నెలలలో బాబేజ్ ఒక యంత్ర నమూనాని తయారు చేశాడు! గణించే యంత్రాల కలని సఫలం చెయ్యడం బాబేజ్ జీవితంలో పెద్ద భాగమయింది. యంత్రం తయారీకి ప్రభుత్వం సాయం చెయ్యడం మొదలెట్టింది.

బాబేజ్ కి ఒక జీవితభీమా సంస్థలో ఉద్యోగం వచ్చింది. జీవిత పరిమాణం (life expectancy) ఆధారంగా ప్రీమియం ఎంత కట్టాలో లెక్కలు వేశాడు. కంపెనీ వాళ్ళతో గొడవలొచ్చి ఉద్యోగం నిలవలేదు. కానీ, జీవితభీమా పట్టికల గురించి రచనలు చేశాడు. జార్జియానా తండ్రి చనిపోవడంటో ఆస్తిపాస్తులు సంక్రమించాయి. బాబేజ్ ఒట్టి అప్రయోజకుడని అతని తండ్రి భావించేవాడు. తండ్రీ కొడుకుల మధ్య సరయిన సంబంధాలెప్పుడూ ఉండేవి కావు. 1827లో తండ్రి మరణించాడు. తండ్రి ఆస్తి బాబేజ్‌కి సంక్రమించింది. దానితో బాబేజ్ జీవితాంతమూ బ్రతికాడు.

తండ్రి చనిపోయిన కొన్ని నెలలలకే భార్యా, ఇద్దరు పిల్లలూ హఠాత్తుగా మరణించారు. వికలుడైన బాబేజ్ స్వాంతన కోసం యూరప్ కి ప్రయాణించాడు. తిరిగి వచ్చి, 1828 నుండి 1839 దాకా ప్రొఫెసరుగా పనిచేశాడు. తన దేశం తనకి చేసిన గౌరవం ఇదొక్కటే అని తర్వాత తన కోపాన్ని ప్రకటించాడు. భార్య చనిపోయినతర్వాత బాబేజ్ ఇల్లు మారాడు. ఇల్లు పార్టీలకి కేంద్రమయింది. ఈ పార్టీలు ముందర తన పిల్లలని సొసైటీకి పరిచయం చెయ్యాలని చేసినా, తర్వాత అవి బాబేజ్ కబుర్లకీ, తన ప్రయోగాల్లో వాడే పరికరాలని ప్రదర్శించడానికీ వాహికలయ్యాయి. లండన్‌లో పేరున్న వాళ్ళంతా బాబేజ్ ఇంట్లో పార్టీకి హజరయే వాళ్ళు - డార్విన్, డికెన్స్ లతో సహా.

తన యూరప్ పర్యటనలో చూసిన ఫాక్టరీ పరిస్థితులని విశ్లేషిస్తూ బాబేజ్ 1832లో “ఆన్ ద ఎకానమీ ఆఫ్ మెషీనరీ అండ్ మాన్యుఫాక్చరర్స్” (”On the Economy of Machinery and Manufactures“) అన్న పుస్తకం ప్రచురించాడు. అది అతనికి చాలా పేరు సంపాదించి పెట్టింది. మిల్, మార్క్స్ లాంటి రాజకీయ ఆర్థికవేత్తల దృష్టి నాకార్షించింది. లాభాలు పంపే పథకాలు, యాజమాన్య పద్ధతులు - అన్నిటినీ శాస్త్రీయంగా ఎలా చూడాలో బాబేజ్ దీంట్లో రాశాడు.

1830లో బాబేజ్ “రిఫ్లెక్షన్స్ ఆన్ ద డిక్లైన్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంగ్లాండ్” (”Reflections on the Decline of Science in England,”) అన్న పుస్తకం ప్రచురించి రాయల్ సొసైటీని తూర్పారపట్టాడు. తన స్నేహితులతో కలిసి “ద బ్రిటీష్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్” (”The British Association for the Advancement of Science”) అనే సంస్థని స్థాపించాడు. సైన్సుని ప్రచారం చెయ్యడానికీ, సైన్సు పరిశోధనకి నిధులు సమకూర్చడానికీ ఇది సాయపడింది. దాని తరవాత ప్రత్యేకమైన సైన్సు సొసైటీలెన్నో ప్రారంభమయాయి.

ప్రభుత్వం బాబేజ్ తేడా యంత్రానికి ఇప్పటికే చాలా ఖర్చయిందని ఫిర్యాదు చేసింది. ప్రజల్లో బాబేజ్ అంటే అపనమ్మకం పెరిగింది. దీనికయిన ఖరీదు తలచుకుంటే గుండెలదురుతాయి - పదిహేడు వేల పౌండ్లు. ఇవాళ అది కొన్ని మిలియన్ల డాలర్లకి సమానం! అదే సమయంలో తయారు చేసిన ఆవిరి యంత్రం ఖరీదు ఏడు వందల పౌండ్లు మాత్రమే!

1834 నాటికి తేడా యంత్రం మీద పని ఆగిపోయింది. బాబేజ్ కూతురు చనిపోయింది. కోలుకోవడానికి బాబేజ్ పనిలో నిమగ్నమయ్యాడు. వైశ్లేషిక యంత్రం (Analytical Engine) గురించి ఆలోచించాడు. దీనిని నిర్మించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. తనకి భరించే స్తోమతు లేదు. అప్పటికే తేడా యంత్రంతో చాలా వరకు చేతులు కాల్చుకున్నాడు. కావలసిన డిజైన్లన్నీ చేశాడు. 1836 నాటికి ముఖ్యమైనవన్నీ పూర్తి అయ్యాయి. ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసినా మౌలికంగా మార్పులేమీ లేవు. ఆధునిక కంప్యూటర్ వైశ్లేషిక యంత్రానికి వారసురాలని చెప్పొచ్చు. అందుకని బాబేజ్ ని కంప్యూటర్ పితామహుడంటారు. కాని బాబేజ్ జీవిత కాలంలో అతని యంత్రాలు పని చెయ్యలేదు. ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగం దాకా బాబేజ్ యంత్రాలని పట్టించుకున్న వాళ్ళు లేరు.

తన పార్టీలకి వచ్చేవాళ్ళంతా కాలవాహినిలో కలిసిపోయారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక కొడుకు సెలవు మీద ఇంటికి వచ్చాడు. తన యంత్రాల రేఖాచిత్రాలని కొడుక్కి అప్పగించి, బాబేజ్ 1871 లో ఎనభయ్యో ఏడు దగ్గరకొస్తుండగా శాశ్వతంగా కన్నుమూసాడు. బావేజ్ మరణానికి విచారించిన వాళ్ళెందరో లేరు.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7 8 9