ఈమాట » కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 3: బాబేజ్ యంత్రాలు

Expand to right
Expand to left

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 3: బాబేజ్ యంత్రాలు

రెక్కవిప్పిన ఫ్రెంచ్ రివల్యూషన్

ఫ్రెంచ్ విప్లవం వచ్చాక పాత ప్రభుత్వంతో పాటు పాతకాలపు ఆచారాలు కూడా అంతరించాయి. వాటిలో ఒకటి పాత కొలమానాలు. ఫ్రాన్సులో రకరకాల కొలమానాలు ఉండేవి. పొడవుని రోమన్ కాలం నాటి అడుగు, అంగుళాలలో కొలిచేవాళ్ళు. కాని దేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళితే అంగుళం విలువ మారేది. అలాగే అడుగులు, గజాలు, ఫర్లాంగులు, మైళ్ళు, వీటితో లెక్క కట్టడం కష్టం. దీని మూలంగా ఆస్తిపాస్తుల అంచనాలలో అవకతవకలెన్నో జరిగేవి. పన్నులు సరిగ్గా వసూలు చెయ్యలేక ప్రభుత్వానికి ఆదాయం తగ్గేది. అన్ని కొలమానాల్నీ శాస్త్రీయం చెయ్యాలని కొత్త ప్రభుత్వం సంకల్పించింది.

పొడవుతోపాటు మిగిలిన కొలమానాలు - వైశాల్యం, ఘన పరిమాణం, బరువు - అన్నిటికీ మెట్రిక్ పద్ధతిని వాడమని ఆదేశించింది. మీటరు, కిలోమీటరు, గ్రాము, కిలోగ్రాము, లీటరు - ఇవన్నీ ప్రపంచమంతటా వాడుకలోకి రావడానికి ఫ్రెంచి విప్లవమే కారణం. భూమి సర్వే పనికి వాడే కోణపు కొలతల్లో కూడా ఇదే పద్ధతిని వాడమని ఆదేశించారు. అంటే లంబ కోణానికి తొంభై డిగ్రీలకి బదులు వంద గ్రాడులు (grads) అన్నమాట!

ఒక కొలమానం నుండి మరోదానికి మార్చడానికి పట్టికలు, ముఖ్యంగా సంవర్గమాన (logarithmic), త్రికోణమితుల (trigonometric) పట్టికలు అవసరమయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా, భూమి సర్వే చేసేవాళ్ళూ, సముద్ర నావికులూ, కోణ కొలమానం మీద ఆధారపడతారు. దానికి సంబంధించిన పట్టికలు లభ్యం కాకపోతే వాళ్ళు వాడరు. ఫ్రెంచి ప్రభుత్వం పట్టికల ప్రాజెక్టుని పర్యవేక్షించమని డీ ప్రోనీ (Gaspard de Prony) అనే సివిల్ ఇంజనీరును ఆదేశించింది.

తయారు చెయ్యాల్సిన పట్టికలనన్నిటినీ చూసి డీ ప్రోనీ కంగారుపడ్డాడు. అవతల ప్రభుత్వం తొందర పెడుతోంది. అసలే విప్లవకారులు. కాదంటే గిలొటిన్‌కి పంపగలరు! తొందరపడి తప్పుల పట్టిక తయారుచేస్తే అప్రతిష్ఠ. ఎలాగా అని ఆలోచిస్తూ, ఒక రోజు పారిస్ లో పాత పుస్తకాల దుకాణంలో ఆడం స్మిత్ (Adm Smith) రాసిన “ది వెల్త్ ఆఫ్ నేషన్స్” (”The Wealth of Nations“) అన్న పుస్తకం తిరగేస్తుంటే అందులో ప్రసిద్ధమయిన ఒక పేరాగ్రాఫు కనిపించింది.

అది స్మిత్ సందర్శించిన ఒక సూదుల ఫాక్టరీ గురించి. పది మంది పనివాళ్ళు సూదులెలా తయారుచేశారో స్మిత్ వివరించాడు. ఒకడు తీగ లాగుతాడు, మరొకడు దానిని నిటారుగా చేస్తాడు, ఇంకొకడు మొన సానబెడతాడు, వేరొకడు తల నునుపు చేస్తాడు, చివరకి సూదిని కాగితంలో పెట్టేవాడు కూడా వేరే! ఏ ఒక్కడూ ఒకటి రెండుకంటె ఎక్కువ రకాల పనులు చెయ్యడు. కానీ, పది మంది కలిసి రోజుకి కొన్ని వేల సూదులు తయారుచేస్తారు. ఎవరికివారే చేస్తే కనీసం ఒక్క సూది కూడా చెయ్యలేరు. ప్రపంప ప్రఖ్యాతి గాంచిన “శ్రమ విభజన ” (Division of Labor) సూత్రం ఇది. డీ ప్రోనీ ఇదే సూత్రాన్ని పట్టికలు తయారు చెయ్యడానికి వాడాడు.

పట్టికల పనిని డీ ప్రోనీ మూడు భాగాలుగా విభజించాడు. మొదటి భాగం– పట్టికలకి కావలసిన సమీకరణాలని కనుగొనడం– మేధోవంతులైన ఇద్దరు ముగ్గురు గణిత శాస్త్రవేత్తలు చేసేవారు. రెండోది, పట్టికలో ప్రతి పేజీకి మొదటి విలువ రాసి, పేజీలో మిగిలిన విలువలని కేవలం కూడికలూ తీసివేతలతో ఎలా పూర్తిచెయ్యాలో వివరించడం. వీళ్ళో పది మంది ఉంటారు. మూడోది - ఆ కూడికలు చేసి పేజీలు నింపడం. ఇందుకు ఓ వందమంది దాకా వాడొచ్చు. వీళ్ళకి గణిత శాస్త్రం, ఖగోళశాస్త్రం, నౌకాయానం - ఇవేమీ తెలియవు. అసలు ఆ కూడిక ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. కేవలం యాంత్రికంగా కూడికలు చెయ్యడమే వీళ్ళ పని.

ఈ మూడో గ్రూపులో పనిచేసినవాళ్ళు హెయిర్ డ్రెస్సర్లు! విప్లవానికి ముందు కులీనులు రకరకాల విగ్గులు ధరించేవాళ్ళు. దీనిని ఫ్యూడల్ సంస్కృతికి చిహ్నంగా గుర్తించి విగ్గులున్నవాళ్ళని విప్లవకారులు ద్రోహులుగా చూశారు. దానితో ఒక్కసారిగా విగ్గుల వాడుక పడిపోయింది. హెయిర్ డ్రెస్సర్లకి ఉపాధి పోయింది. డీ ప్రోనీ పుణ్యమా అని వాళ్ళు కంప్యూటర్లుగా మారారు.

ఆడం స్మిత్ వర్ణించిన సూదుల ఫాక్టరీ లాంటిదే ఇది. తయారు చేసేది సూదుల్లాంటి వస్తువులు కాదు. ఎక్కాల లాంటి పట్టికలు. రోజుకి ఏడు వందల లెక్కలు చేసేవారు. అయిదారేళ్ళలో ప్రాజెక్టు ముగించారు. హెయిర్ డ్రెస్సర్లు లేకుండా గణితశాస్త్రవేత్తలే చేస్తే వారి జీవిత కాలం సరిపోయేది కాదు. చరిత్రలో భారీ ఎత్తున జరిగిన మొదటి కంప్యుటేషన్ ఇదే.

1800 నాటికి ప్రాజెక్టు పూర్తి అయిందికాని, పట్టికలని ప్రచురించేనాటికి ప్రభుత్వం ఖజానా ఖాళీ అయి ఉంది. అవి డీ ప్రోనీ జీవితకాలంలో ప్రచురింపబడలేదు. ఈ పట్టికల నేపథ్యంలో పుట్టినవాడు బాబేజ్.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7 8 9