ఈమాట » గ్రంథచౌర్యం గురించి …

Expand to right
Expand to left

గ్రంథచౌర్యం గురించి …

“నేను చదివిన పుస్తకాల్లో ఉన్నదంతా నేను రాసేపుస్తకాల్లోకి వెళ్తుంది,” అని అన్నాడట డీన్‌ బీచింగ్ [1]. ఇదేదో అక్షర సత్యమని నమ్మి ధీమాగా ఈ రోజుల్లో కాపీకొడితే, కోర్టులచుట్టూ తిరగటం తప్పదు. ఎంత అధ్వాన్నదశలో ఉన్నా, ‘కాపీరైట్‌’ చట్టాలు ఉన్నాయికదా! అయినా కాపీచెయ్యడం రైటేనని కాపీచేసి, గొడవలు పడ్డవాళ్ళు లేకపోలేదు. ఏగొడవా లేకండా గూఢంగా డబ్బులు చేసుకున్నవాళ్ళూ లేకపోలేదు.

పదో శతాబ్దపు (900-950) లాక్షణికుడు రాజశేఖరుడు [2], కావ్య మీమాంసా అనే లాక్షణిక సూత్ర గ్రంథంలో, గ్రంథచౌర్యం గురించి ముచ్చటిస్తూ శబ్దహరణప్రకరణంలో ఇలా అంటాడు:

పుంసః కాలాతిపాతేన చౌర్యమన్యద్విశీర్యతి
అపి పుత్రేషు పౌత్రేషు వాక్చౌర్యం చ న శీర్యతి.

కొంత కాలం గడచిన తరువాత ఏ చౌర్యం అయినా సమసిపోవచ్చు కానీ, సాహిత్య చౌర్యం పుత్రపౌత్రాది పరంపరగా వెంటాడుతుంది అని భావం. ఆ రోజుల్లో పాపభీతితో గ్రంథచౌర్యం చెయ్యరని అతగాడి నమ్మకం అయి ఉండాలి. రాజశేఖరుడు చాలా తెలివైన వాడు. పాపంసంగతి అలా వదిలిపెట్టి, గ్రంథచౌర్యం గురించే ఇంకా ఇలా అన్నాడు:

నాస్త్యచౌరః కవిజనో నాస్త్య చౌరా వణిగ్జనః
స నన్దతి వినా వాచ్యం యో జానాతి నిగూహితుమ్.

(గ్రంథ) చౌర్యం చెయ్యని కవి ఉండడు. మోసం చెయ్యని వర్తకుడూ ఉండడు. చేసిన దొంగతనం గూఢంగా దాయగలవాడు వృద్ధిలోకి రాకుండా ఉండడు, అని భావం.

అయితే, ఏయే విషయాలు నిజంగా గ్రంథచౌర్యంగా గుర్తించాలో, ఏయే విషయాలు గ్రంథచౌర్యంగా పరిగణించనక్కరలేదో శబ్దహరణం అర్థహరణం అన్న రెండు ప్రకరణాలలో పదకొండువందలఏళ్ళ క్రిందటే రాజశేఖరుడు సోదాహరణంగా వివరించాడు. ఇప్పటికీ ఆయన చెప్పిన ఉదాహరణలు మన సాహిత్యానికి వర్తిస్తాయి. ఆయన చెప్పిన చాలా ‘సూత్రాలు’ ఒప్పుకోక తప్పదు. అయితే, ఆ వివరణలన్నీసంస్కృతంలో ఉన్నాయి.

గ్రంథచౌర్యం అనేమాటని నేను చాలా విస్తారమైన పరిథిలో వాడుతున్నాను. ఈ వ్యాసంలో సాహిత్యంలో “దొంగతనాలు” పాల్‌ గారి పుస్తకంలో చెప్పినట్లు మూడు రకాల చౌర్యచర్యలుగా పరిశీలిద్దాం: మొదటిది సాహిత్యంలో ఫోర్జరీ. రెండవది సాహిత్యంలో బందిపోటుతనం. మూడవది మనం అందరం మామూలుగా అర్థంచేసుకునే చౌర్యం - గ్రంథచౌర్యం; అదే ప్లేజియరిజమ్‌ (Plagiarism). ప్రస్తుతకాలంలో ప్లేజియరిజమ్‌ అన్న మాట ఎక్కడ సబబు, ఎక్కడ కాదు అని నిర్థారించేముందు, పూర్వకథలు గుర్తుకుతెచ్చుకోవడం అవసరం.

పాశ్చాత్య సాహిత్యంలో ప్రతిచిన్నమాట, ప్రతిచిన్న వర్ణనా గ్రంథచౌర్యం అని గలాభాచేసిన విమర్శకులని టెన్నిసన్‌ దులిపేశాడు. ” సముద్ర గర్జన, నిర్గృహసముద్రరోదన,” లాంటి మాటలు ఏ కవైనా వాడితే చాలు, “ఇవన్నీ హొరేస్‌ (Horace) నుంచో, హోమర్‌ (Homer) నుంచో కాపీ కొట్టేశారు మొర్రో” అంటారు వీళ్ళంతా! అదేదో సముద్రగర్జన వినడం హొరేస్‌ స్వంత ఆస్తిలాగా! అటువంటి కువిమర్శకులు మనకి ఇప్పటికీ అక్కడక్కడ తగులుతూ ఉంటారు.

చాసర్‌ (Chaucer) రాసిన గాబొలిన్‌ కథలోని ఇతివృత్తం తీసికొని థామస్‌ లాడ్జ్‌ (Thomas Lodge) [3], రోజలిండ్‌ అనే “నవల” రాస్తే దానిని గుట్టుగా తీసుకొని షేక్స్పియర్‌ యాజ్‌ యూ లైక్ ఇట్‌ ( As You Like It) అనే నాటకం రాసాడు. ఇది గ్రంథ చౌర్యమా కాదా అన్న రభస చాలాకాలం నడిచింది. అసలు ఇంతకన్నా విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, అసలు రచయితకి తెలియకుండా వాడు రాసిన పుస్తకం ఎత్తుకోపోయి, అక్కడక్కడ చిన్ని మార్పులు చేసి ఇంకొకడిపేరుతో అచ్చు వేసుకోవడం. దీనిని బందిపోటుతనం అనచ్చునేమో! పేరుపడ్డ రివరెండ్ల దగ్గిరనుంచి, రోడ్డున పోయే సామాన్యుడిదాకా చాలామంది ఈ రకమైన దొంగతనాలు చేసారు. ఇలాంటి పనులు కొందరు కీర్తికోసం, మరికొందరు ధనాశతోటీ చేసారు.

కేవలం డబ్బుకోసం, ఏదో తోచింది రాసిపారేసి, అప్పట్లో ప్రసిద్ధ రచయిత పేరుతో అచ్చేసి, అమ్ముకోవడం కూడా జరిగింది. వోర్టిగర్న్‌ (vortigerne) అన్న నాటకం షేక్స్‌పియర్‌ రాసిందేనని ఐర్లండ్‌ (W H Ireland [4]) అనే అతను చాలాకాలం జనానికి టోపీవేసాడు. వ్రాత ప్రతులుకూడా తయారుచేసి పెట్టాడు, జనాన్ని నమ్మించడంకోసం. చివరికి, పట్టుబడితే, “చిన్నతనపు చిలిపిచేష్ట, క్షమించండి” అన్నాడట. ఈ దురవస్థ స్విఫ్ట్‌ (Jonathan Swift) కీ, పోప్‌ (Alexander Pope) కీ కూడా పట్టింది. వాళ్ళ పేర్లతో బోలెడు పనికిరాని చెత్త సాహిత్యంగా అచ్చు వేసేశారట! ఇటువంటి చౌర్యాన్ని, ఫోర్జరీ అనవచ్చు. మరొకరకమైన ఫోర్జరీ అన్ని దేశాలలో, అన్ని కాలాలలో ఉన్నది. మతప్రచారంకోసమో, రాజకీయ, ” వేదాంత” విషయాలు జనానికి నమ్మిక కలిగించడం కోసమో, రకరకాల ఫోర్జరీలు జరిగాయి. ఉదాహరణకి క్రీస్తు జాతకంలోను, క్రీస్తు చరిత్రలోనూ, ముఖ్యంగా క్రీస్తు బాల్యదశ అంతా రకరకాల మాయలు, మంత్రాలతో నింపేసి వ్యాఖ్యాన గ్రంథాలు రాసారు. భక్తి కీర్తనలు ఎవడో దారిన పోయే దానయ్య రాసి, ల్యూక్‌ (St. Luke) కో, జాన్‌ (St. John) కో కర్తృత్వం అంటగట్టడం అప్పట్లో పరిపాటి. మనకీ, సంస్కృతంలో ఏ అనుష్టుప్‌ చందస్సులోనో నీతి సూత్రాలు రాసి, ఇవన్నీ వ్యాసుడికో, వేదాలకో అంటగట్టడం మామూలే!

ఈ సందర్భంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని పిట్ట కథలు చెప్పుతాను. కృష్ణదేవరాయలుగారికి మోహనాంగి అనే కూతురు ఉండేదట. “మరీచీపరిణయము ” అనే కావ్యం ఆమె రాసిందేనని, దానిని సంస్కరించి, సవరించి, పరిష్కరించి పునర్ముద్రించారు కూడాను! ఈ కావ్య కర్తృత్వం మీద చాలా రభస జరిగింది. చివరకి తేలిందేమిటంటే, కూచి నరసింహం పంతులు గారనే ఆయన దీనిని రాసి, మోహనాంగికి అంటగట్టారట! అలాగే, చిన్నయసూరి గారి బాలవ్యాకరణానికి సంస్కృతమూలం “హరికారికలు” అనే గ్రంథం మూలం అని సృష్టించడం జరిగింది, చిన్నయసూరి గారికి గ్రంథచౌర్యం ఆపాదించే దురుద్దేశంతో! ఈ పని శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారు చేసారట! అలాగే భీమఖండానికి మూలం స్కాందపురాణంలో ఉన్నదని శ్రీనాథుడు రాసాడు. ఆ సంస్కృతమూలం శ్రీనాథుడే రాసాడట! ఫోర్జరీ దైవసంబంధమైన విషయాలదాకా పోయినప్పుడు, అది అనంతాన్నిఅంటుకుంటుంది.

ఇలా రకరాల సాహిత్య చౌర్యచర్యలు రకరకాల పేర్లతో ప్రసిద్ధికెక్కినాయి; ఫొర్జరీ, బందిపోటుతనం, గ్రంధచౌర్యం వగైరా! ప్లేజియరిజంని మనం గ్రంథ చౌర్యం అని చెప్పుకుందాము. గ్రంథచౌర్యం చేసే చోరుడికీ, సాహిత్యంలో బందిపోటుదొంగకీ భేదం కేవలం సాంకేతికభేదమే! బందిపోటుదొంగ దొరికిపోయినా ఫరవాలేదు అన్న ధీమాతో దొంగతనం చేస్తాడు. గ్రంథచోరుడు, “మనం దొరకంలే,” అన్న ధీమాతో దొంగతనం చేస్తాడు. వీడిది కళ్ళు మూసుకొని పాలుతాగే పిల్లితంతు.

సాహిత్యంలో నైతికవిలువలు, సాంఘికవిలువలతో పాటు మారిపోతున్నాయి. నిర్దిష్టమయిన కాపీరైట్‌ హక్కులు లేనిరోజుల్లోనే, మిల్టన్‌, పోప్‌ మొదలైనవాళ్ళు, ఇతివృత్తాలు ఇతరరచనలలోనుంచి తీసుకొని, వాటిని మరింత అందంగా, కాలానుగుణ్యంగా తిరిగి చెప్పడం తప్పు కాదని అందరూ ఒప్పుకున్నారు. మళ్ళీ రామాయణం ఎందుకు స్వామీ అని విశ్వనాథ సత్యనారాయణగారిని అడిగితే, “రోజూ తిన్న అన్నమే కదా అందరం తింటూన్నది” అని ధీమాగా సమాధానం ఇచ్చారు. పురాణాలు మళ్ళీ మళ్ళీ కాలానుగుణ్యంగా తిరిగి రాయాలనే సిద్ధాంతం ప్రతిపాదించిన వాళ్ళు లేకపోలేదు. “ఈ గ్రంథానికి మూలకథ ఫలానా ప్రాచీన గ్రంథంనుంచి తీసుకున్నాను,” అని ప్రస్తావనలో చెప్పితే, చౌర్యం అని ఖండించడం నాగరికం కాదు. “నేను చెప్పదలచుకున్నదంతా ఎవడో ప్రాచీనుడు ఇదివరకే చెప్పేశాడు, నా ఖర్మకాలి నేను కొంచెం లేటుగా పుట్టాను” అని వాపోని రచయిత ఉండడు. అయితే, మూలకథ నీది కాక పోయినా, నీవు చెప్పే పద్ధతిలో ప్రత్యేకత, కొత్తదనం ఉంటే, సహృదయులు మెచ్చుకుంటారు అన్న జ్ఞానం ఉంటే, ఏ విధమైన గ్రంథచౌర్యం ఉండదు.

ఇది గ్రంథచౌర్యం, ఇది కాదు అనే కొలబద్ద ఇప్పుడు తయారు చేసి ప్రాచీన గ్రంథాలని ఆ కొబద్దతో కొలవడం న్యాయం కాదు. గ్రంథచౌర్యం దేశ, కాల, చారిత్రిక, సాంఘిక పరిస్థితులతో లంకెపడి ఉన్నది. అచ్చు యంత్రం పదిహేనవశతాబ్దంలోనే ఉన్నప్పటికీ, ఆథునిక యంత్రాంగం పంథొమ్మిదవ శతాబ్దపు మధ్యభాగం వరకూ రాలేదు. అప్పుడే వందలకొలదీ కాపీలు అచ్చువేయడం మొదలయ్యింది; విరివిగా డబ్బుచేసుకోవడంకూడా ప్రారంభం అయ్యింది. ఎప్పుడైతే డబ్బుచేసుకోవడం ప్రథానంగా పరిణమించిందో, అప్పుడే సాహిత్యంలో బందిపోటుతనం కూడా మొదలయ్యింది. “కాపీరైటు” అనే చట్టం ఇంగ్లాండులో పద్ధెనిమిదవశతాబ్దంలోనే ఉన్నా, ఇరవైయవ శతాబ్దం మధ్యభాగం వరకూ నిర్దిష్టమైన కాపీరైటు హక్కులగురించి వివాదం ఉన్నది. పంథొమ్మిదివందల యాభైఐదు వరకూ జెనీవా హక్కులను అమెరికా ఒప్పుకోనే లేదు.

పద్ధెమినిమిదశతాబ్దపుముందు వచ్చిన పాశ్చాత్యసాహిత్యం, పంథొమ్మిదవశతాబ్దపు మధ్యకాలం ముందు వచ్చిన తెలుగు సాహిత్యం గ్రంథచౌర్యం అనే కొలబద్దతో కొలవటం ధర్మం కాదు. అంతే కాదు. సాంఘిక విలువలు, నైతికన్యాయాలు, సాహిత్యంలో ప్రైవేటు హక్కులు, “నాది ” “మనది” అనే మాటల్లో అంతర్గతంగా ఉన్న భావాలు ప్రాక్ పశ్చిమ దేశాల్లో ఒకే అర్థాన్నిఇవ్వవు. అందుకని, వాటిని ఒకేమూసలో పోసి వ్యాఖ్యానించడం సబబుకూడా కాదు. ప్రస్తుతానికి, పద్ధెనిమిదవశతాబ్దం తరువాతవచ్చిన పాశ్చాత్య సాహిత్యాన్ని, పంథొమ్మిదవశతాబ్దపుమధ్యభాగం తరువాత (కందుకూరి వీరేశలింగంగారి తరువాత) వచ్చిన తెలుగు సాహిత్యాన్నీ ఈ గ్రంథచౌర్యం కొలబద్ద తో కొలవడం సబబేనని అనిపిస్తుంది. ఏమిటి, ఈ కొలబద్దకి ప్రమాణాలు అని అడిగితే, మన నైతికవిలువలే ముఖ్యమైన ప్రమాణాలు అని చెప్పక తప్పదు.

గ్రంథచౌర్యం కి సంబంధించిన చట్ట ప్రమాణాలను పక్కకు పెట్టి, ప్రస్తుతం పుస్తకరూపంగా “అచ్చు” లోకి వచ్చే సాహిత్యానికి ముఖ్యమైన నైతికవిలువ ఏమిటి అని అడిగితే, ఒకే సమాధానం కనిపిస్తుంది. మూలగ్రంథం ఉంటే, ఆ మూలగ్రంథం గురించి చెప్పడం. ఇది, వ్యాసాలకి, కావ్యాలకీ తప్పకుండా వర్తిస్తుంది. సాహిత్యంలో సృజనాత్మకత (Creativity) కి ఒక ప్రత్యేక స్థానం ఉండబట్టి, “ఇది నా స్వంతబుర్రలోనే పుట్టింది సుమీ,” అని జనాన్నీ నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేయడం పరిపాటి. ముఖ్యంగా లఘు కవితల్లో, నవలల్లో, కథల్లో ఈ చౌర్యం ఉన్నప్పటికీ పట్టుకోవడం సులువైన పనికాదు. ఒకవేళ పట్టుబడినా రుజువుచెయ్యడం తేలికైన పనికాదు. సృజనాత్మక రచనలకు సంబంధించినంతవరకూ, రచయిత నిజాయితీయే నిజమైన కొలబద్ద.

ఇక ఇంటర్నెట్ యుగంలో గ్రంథచౌర్యం పరాకాష్టనందుకోవడానికి చాలా సదుపాయాలున్నాయి. మరొకళ్ళ రచనలనుండి పేరగ్రాఫులకు పేరగ్రాఫులు తమ వ్యాసాల్లో గుప్పించి, మూలాలు ఇవ్వడం గురించి తర్జనభర్జనలు తలకెత్తుతున్నాయి. మూలాలు ఇవ్వకుండా తమదిగానే కబ్జా చేసుకోవడం కూడా కనిపిస్తుంది. ఇంటర్‌నెట్‌ కాపీరైట్‌ చట్టాల గురించి, వాటిని అమలు పర్చడంలో ఉన్నసాధకబాధకాలగురించీ, కోకొల్లలుగా వ్యాసాలున్నాయి. అవన్నీ ఇక్కడ పొందుపరచడం సాధ్యం కాదు. వాటికోసం వెతకటం అసాధ్యమూ కాదు. నాకు నచ్చిన ఒక చోటు [5] పాదసూచికలో ఇస్తున్నాను. ఇటువంటి ఉపయోగకరమైన చోటులు చాలా ఉన్నాయి.

ముగింపుగా, రచయితయొక్క నైతికవిలువకి మించిన ప్రమాణం ఏదీ లేదు.

  1. 1. H. M. Paull, “Literary Ethics,” Thornton Butterworth, 1928
  2. రాజశెఖరుడు, ” కావ్యమీమాంసా.”
  3. Thomas Lodge (1556 - 1625), Rosalynde or Euphues’ Golden Legacy (If you Like it, So)
  4. W H Ireland, Kynge Vortigerne
  5. Copyright Explained: I May Copy It, Right?

____

అట్లాంటా లో పెమ్మరాజు వేణుగోపాలరావుగారి సంపాదకత్వంక్రింద 1970 నుండి 1975 వరకూ తెలుగుభాషాపత్రిక, వ్రాతపత్రికగా మొదలై, తరువాత అచ్చుపత్రికగా వచ్చిన సంగతి పాఠకులలో చాలామందికి తెలిసే ఉండవచ్చు. ఆ పత్రిక వాళ్ళు 1973 వ సంవత్సరాంతంలో , ” నిత్యజీవితంలో విజ్ఞానశాస్త్రం (Science) తెచ్చిన మార్పులు,” గురించి తెలుగునాడులో వ్యాసరచనపోటీ పెట్టారు. అప్పుడు అక్కడనుండి చాలా వ్యాసాలు వచ్చాయి. వాటిలో మొదటి మూడుబహుమతులకూ ఎంపికచేసిన వ్యాసాలను చదివి నా అభిప్రాయం చెప్పమని నన్ను వేణుగోపాలరావు మేష్టారు ఆదేశించారు (!). మొదటిబహుమతికి ఎంపిక చేసిన వ్యాసంలో పేరగ్రాఫులకి పేరగ్రాఫులు మక్కీకిమక్కీ నండూరి రామమోహనరావుగారి ” విశ్వరూపం,” నుంచి దొంగిలించబడ్డాయి. ఇది నాకళ్ళబడడం ఆ రచయితగారి దురదృష్టం! తరువాత, 1974 ఏప్రిల్ సంచికకి గ్రంథచౌర్యం పై వ్యాసం రాయమని కోరారు. ఈ పై వ్యాసంలో చాలా భాగాలు ఆ పాత వ్యాసంనుంచి తీసుకున్నాను. అంటే, ఒకరకంగా చూస్తే, నా పాత వ్యాసంనుంచి నేనే దొంగిలించాను అన్నమాట. పోతే, ఇన్నేళ్ళల్లో, చాలా విషయాలపై నా అవగాహన మారడంతో, వ్యాసంలో చాలా మార్పులుకూడా చేయడం జరిగింది.పాశ్చాత్యసాహిత్యంలో ఫోర్జరీ, బందిపోటుతనం, ప్లేజియరిజం పై ఇచ్చిన ఉదాహరణలు పాల్‌ పుస్తకంనుంచి కబ్జా చేసాను. పాల్ పుస్తకంలో ఈ విషయాలు ఇంకా విపులంగా చర్చించబడ్డాయి. 1974 లో వెల్చేరు నారాయణరావు గారితో సంభాషణలు, తెలుగు సాహిత్యంలో ఇచ్చిన ఉదాహరణలకి నీరు పోసాయి. అంటే, నేను చెప్పింది బహుకొద్ది అని అర్థం!

 

(9 అభిప్రాయాలు)

  1. Gulti reader అభిప్రాయం:

    May 2, 2008 8:55 am

    బట్టతల పోవడం/రాకుండా ఉండటం ఎలా అని ఆ మధ్యొక టివీ వారు కార్యక్రమం ఏర్పాటు చేసారు (నాకు బట్టతల లేదు కానీ ఆ కార్యక్రమం నేను చూసేను). అందులో ఆ సలహాలు చెప్పేవాడికి ఉన్నది బట్టతల.

    మీ వ్యాసం మీరే సంగ్రహించి చెప్పటం కొంతవరకూ అలాగే ఉంది ;)

  2. జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:

    May 2, 2008 5:52 pm

    ఆధునిక తెలుగు సాహిత్యంలో వున్న చౌర్యాల ఉదాహరణలు కూడా కొన్ని ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పేరున్న రచయితల రచనల గురించి.

    చాలా కాలం కిందట నేను, సూర్యదేవర రామమోహనరావు రాసిన నవల, “నైమిష”, మద్రాసులో వుండే రోజుల్లో కొని చదివాను. చక్కటి థ్రిల్లర్ అని కూడా అనుకున్నాను. అమెరికాకి వచ్చాక, షిడ్నీ షెల్డన్ రాసిన, “ఇఫ్ టుమారో కమ్స్” (If Tomorrow Comes) అనే నవల చదివాను. అరే ఈయన నైమిష నవలని బాగా కాపీ కొట్టాడే అని చాలా ఆశ్చర్యపోయాను. నాకు తెలిసీ నేను చదివిన కాపీ నవల (అంత బాగా కాపీ కొట్టిన) అదొక్కటే. మిగిలినవి వినడమే గానీ, చదవలేదు. కానీ చాలా వుండే వుంటాయి.

    - ప్రసాద్

  3. Sai Brahmanandam Gorthi అభిప్రాయం:

    May 2, 2008 8:47 pm

    ఈ భావ చౌర్యం బెడద అన్నమాచార్యకీ తప్ప లేదు. ఈ భావ చౌర్యం చేసిన వాళ్ళకి “ఛాయాపహారులు” అన్న ముద్దు పేరు కూడా పెట్టి చురకలేసాడా వాగ్గేయకారుడు.

    వెర్రులాల మీకు వేడుక గలితేను
    అర్రు వంచి తడుకల్లంగ రాదా?

    ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యముగాదు
    కుడుచి వేసిన పుల్లె కుడువుగా గాదు
    బడి నొకరు జెప్పిన బ్రతి జెప్పబోతేను
    ఆడరి శ్రీ హరి కది అరుహము గాదు

    ఉమిసిన తమ్మలో నొక కొంత కప్రము
    సంకూర్చి చవిగొని చప్పరింపనేల
    అమరంగ ఛాయాపహారము చేసుక
    తమ మాట గూర్చితే దైవము నగడా

    ఇలా దాదాపు ఓ పది చరణాలు పైగా దుమ్మెత్తి పోసాడు, తన పద కవితలని కాపీ కొట్టిన వాళ్ళని. ఆయన వాళ్ళని “ఛాయాపహారులు” అంటూ నిందించాడు. ఈ కీర్తన పూర్తిగా పధం -దృక్పధం లో చదవగలరు

    కాబట్టి కాపీరాయుళ్ళు ఈ మధ్యనే పుట్టుకొచ్చేరనుకోనక్కరలేదు. ముందునుంచీ ఉన్నారనుకోవచ్చు.

    - సాయి బ్రహ్మానందం గొర్తి

  4. kosyasura అభిప్రాయం:

    May 3, 2008 6:30 pm

    హమ్మయ్య, గ్రంథ చౌర్యం అంటే నగరపాలకసంస్థ గ్రంధాలయం నుంచి తెచ్చి ఇంట్లోపదేళ్ళుగా “మరిచి”పోయిన పుస్తకాలూ, సుబ్బారావుగారింటినుంచి ఇదిగోచదివేసి మళ్ళా ఇచ్చెయనూ అని మరిచిపోయిన పుస్తకలూ కాబోలునని ఉలిక్కి పడ్డాను.
    ఇహ రచయితల” నామచౌర్యం” విషయం కొస్తే ఆ మద్య Sidney Sheldon బొంబాయి ( ముంబాయి కాదు) Church Gate దగ్గర foot path మీద పుస్తకాలు చూసి ఆస్చర్య పోయట్ట ” నేనే .. ఇన్ని .. పుస్తకాలు రాసానా ” అని.
    James Hadley Chase, Irwing Wallace లు రాయని పుస్తకాలు మనమెన్ని చదవలేదు గనక.
    అదేంటో తెలుగు రచయితలలో ఈ నామచౌర్యం నామ మాత్రంగానైనాలేదు
    కొ శ్యా సు రా

  5. bollojubaba అభిప్రాయం:

    May 5, 2008 10:41 am

    ప్రసాద్ గారు అభిప్రాయ పడినట్లుగా ఆధునిక సాహిత్యంలోని గ్రంధచౌర్యాన్ని గురించి ఎప్పుడు రాస్తారు.
    వినాలని ఉంది.
    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  6. విమర్శకుడు అభిప్రాయం:

    May 27, 2008 12:40 pm

    “ఆధునిక తెలుగు సాహిత్యంలో వున్న చౌర్యాల ఉదాహరణలు కూడా కొన్ని ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పేరున్న రచయితల రచనల గురించి.”

    మీ కోసమే అన్నట్టు డా.గోపీ నోబెల్ బహుమతి గ్రహీత Octavio Paz ను కాపీ కొడుతూ దొరికి పోయాడు.

    వివరాలకు ఈ లింకును చూడుడు:

    ఔరా! ఏమి ఈ ‘దిగుమతి’? (ఆంధ్రజ్యోతి వివిధ)

    నానీల నాన్నగా గోపీ ఖ్యాతి ఖండాంతరాల్లొ వ్యాపించి, ఆయనకు గురు పీఠాన్ని ప్రసాదించి పెట్టింది. దీర్ఘ కవితలు రచించి చిరయశస్సునార్జించిన గోపీ ప్రస్తుతం తెలుగు విశ్వ విద్యాలయ వీసీ ; ఘనత వహించిన కవి గారి ఛాయాచిత్రం కోసం క్రింది లింకును చూడండి.

    A `Water Song’ to die for, to pray for - The Hindu story

    విమర్శకుడు

  7. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    May 27, 2008 1:46 pm

    విమర్శకుడు గారూ,

    దీన్నే అనువాద ప్రేరణ అంటారని మీకు ఆమాత్రం తెలియదా? పదాల అందం చూడాలి లేదా ఏ సందర్భంలో రాసారో చూడాలి. అంతేకానీ ఇలా కాపీ అంటే ఎలా చెప్పండి? నానీల నాన్న గారికి కూడా ఒక నాన్నుంటారన్న విషయం గుర్తించాలి. చిత్రం ఏమిటంటే దీన్ని సదరు కవిగారు పట్టించుకోనట్లు నటిస్తారు. కానీ ఆయన భక్త బృందం వచ్చే సంచికలో విరుచుకు పడేవరకూ కాస్త ఓపిక పట్టండి. ఈ రోజుల్లో కవిత్వానికి కాదు, కవికి అనుచరులుంటే చాలు. పబ్బం గడుపోడానికి.

  8. satya rama prasad kalluri అభిప్రాయం:

    August 19, 2008 4:06 am

    త్యాగరాజ స్వామి కీర్తనలకు కూడా ఈ బెడద తప్పలేదు!
    నేనొక పుస్తకాన్ని వ్రాస్తూ ఒక పెద్దాయనవద్దకు వెళ్ళగా ఆయన ఈ క్రింది విషయాలను చెప్పి, దిగ్భ్రాంతపరచాడు - ఏతావాతా తేలినదేమిటంటే క్రింది కృతులు త్యాగరాజకృతులు కావు!
    1) వెడలెను కోడండపాణి (తోడి)
    2) నీదు చరణములే (సింహేంద్రమధ్యమం)
    3) పరాంగ్ముఖ .. (సురటి)
    4) వినతాసుతవాహనుడై (హరికాంభోజి)

    కల్లూరి సత్యరామ ప్రసాదు
    kalluriprasaad@hotmail.com

  9. పాఠకుడు అభిప్రాయం:

    August 20, 2008 7:21 am

    త్యాగరాజు రాసినట్టు కృతులు రాసి, వాటిని త్యాగరాజు పేరు మీదే చలామణీ చేస్తే, దాన్ని గ్రంధ చౌర్యం అనరు. దాన్ని ప్రక్షిప్తం అంటారు. రామాయణం తిరగరాసి నప్పుడు అనేక మంది కవులు తమ సొంత పైత్యాన్ని కూడా కలిపేసి రాసేవారు. అయితే ఈ ప్రక్షిప్తాలు మూల కధకి గానీ, మూల కవికి గానీ హాని చెయ్యవు. అపఖ్యాతి తీసుకురావు. ప్రక్షిప్తాలు సమాజ పరిణామ క్రమంలో భాగంగా వుంటాయి. దీనికీ, గ్రంధ చౌర్యానికీ పోలికే లేదు.

    పాఠకుడు