ఈమాట » జ్యోతిషమూ – లోపలి సంగతులూ - 2

Expand to right
Expand to left

జ్యోతిషమూ – లోపలి సంగతులూ - 2

జాతకం చెప్పడం – యుగళ గీతం (Duet)

ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గరకి ఒక వ్యక్తి వచ్చి జాతకం చెప్పమని కోరినప్పుడు ఆ జ్యోతిష్కుడి మనస్సు పూర్తిగా జ్యోతిష సంకేతాల దృష్టికోణంలోకి వెళ్ళిపోతుంది. అయితే వచ్చిన వ్యక్తి ఊరకే ఉండడు కదా. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే జ్యోతిష్కుడు కూడా ఊరకే ఉండడు. ఏదో చెప్పడం మొదలుపెడతాడు. మీరు చాలా సంపన్నుల కుటుంబంలో పుట్టి ఉండాలి. మీ నాన్నగారు ప్రభుత్వోద్యోగి అయ్యి ఉండాలి. మీ అమ్మగారికి అనారోగ్యం అయి ఉండాలి. ఇలా మొదలుపెడతాడు. వచ్చినవాడు కూడా వెంటనే సమాధానలివ్వడం మొదలుపెడతాడు. మేము పెద్ద సంపన్నులం కాదనుకోండి, కానీ మా బంధువులందరికన్నా మెరుగే. అవునండీ, నాన్నగారు రెవెన్యూ డిపార్టుమెంటులో పని చేస్తారు. మా అమ్మగారికి మూర్ఛ రోగం ఉందండీ. ఇలా నడుస్తూ ఉంటుంది. తనకి తెలియకుండానే జాతకుడు తన గురించి మొత్తం సమాచారం ఇచ్చేస్తూ ఉంటాడు. జ్యోతిష్కుడు తనకి తెలియకుండానే ఆ సమాచారాన్ని గ్రహించి తన జ్యోతిష సంకేతాల పరిభాషలో అర్ధం చేసుకుని కథ నడిపిస్తుంటాడు.

జ్యోతిష్కుడు ఒక క్లూ లేక హింటు ఇస్తాడు. జాతకుడు దాన్ని పూర్తి చేస్తాడు. ఆ పూర్తి చెయ్యడంలో తాను జ్యోతిష్కుడికి ఎంతో సమాచారం తిరిగి ఇస్తాడు. తనగురించి తానే చెప్పుకుని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నల్లోనే చాలా సమాచారం ఉంటుంది. వివాహానికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా అని జ్యోతిష్కుడంటే, వెంటనే పెళ్ళైన దగ్గరనుంచీ మొత్తం కథ అంతా చెప్పుకొచ్చేస్తాడు. చివరికి మా అవిడకి విడాకులిమ్మంటారా అని అడుగుతాడు. అతడు చెప్పే సమాచారమంతా తనకు తెలియకుండానే జ్యోతిష్కుడు గ్రహిస్తాడు. ఓహో, సప్తమాధిపతి నీచ రాశిలో పడి కుజ సమాగమం చెందాడు. ప్రస్తుతం వాడి దశ నడుస్తోంద’ అనుకుని, ప్రస్తుతం బాగుండదయ్యా, ఒక్క ఏడాది ఓపికపట్టి చూడు అంటాడు. లేదా కుజ జపమో ఏదో చేయించుకోమంటాడు. అలా కాక మొదట ఇచ్చిన హింటుకి, అబ్బే లేదండీ, నా భార్యతో ఏమీ ఇబ్బందులు లేవు, మామగారితోనే అని జాతకుడన్నాడనుకోండి. జ్యోతిష్కుడు ఫలితాలు చెప్పే దిశ మారుతుంది. ఓహో, సప్తమాధిపతి కుజ సమాగమంలో ఉన్నాడు కాబట్టి ఆ కుజుడు మామగారు అని మనసు చెప్తుంది నిశ్శబ్దంగా. వీళ్ళ ఆవిడమీద మామగారి ప్రభావం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. కొంతకాలం మీ ఆవిడని వాళ్ళ పుట్టింటికి దూరంగా ఉండేలా చూసుకో, ఈ కుజ దశ అయ్యేవరకూ అని సలహా ఇస్తాడు.

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే జ్యోతిష్కుడిచ్చే హింట్లు చాలా విస్తృతంగా ఏదో రాయి వేసినట్టు ఉంటాయే తప్ప ఖచ్చితంగా సమాచారం ఇవ్వవు. మీ నాన్నగారికి ప్రభుత్వోద్యోగం అంటే అది చాలా విస్తృతమైన పరిధిలో చెప్పిన విషయం. అంతేగానీ మీ నాన్నగారికి రెవెన్యూ బోర్డులో ఉద్యోగమనో, పంచాయితీ ఆఫీసులో క్లర్కు అనో చెప్పడు, చెప్పలేడు. అయితే జాతకం చెప్పించుకునేవాడు చాలా ఆతృతతో ఉంటాడు కాబట్టి ఆమాత్రం హింటుకే ఉత్సాహపడి తన సమాచారం ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలా జాతకం చెప్పడం ఒక యుగళ గీతం లాగా సాగుతూ ఉంటుంది.

ఆఖరిగా జ్యోతిష్కుడు సమస్యల బాధ తగ్గడానికి ఏవో నివారణోపాయాలు సూచిస్తాడు. పూజలు, జపాలు చేయించడమో, ప్రత్యేకమైన రాళ్ళూ, రత్నాలూ ధరించడమో చెయ్యమంటాడు. అలాగే భవిష్యత్తు గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాడు. రాబోయే ఫలానా దశలో బాగుండదు. ఇప్పటినుంచీ రెమెడీస్ పాటించు. ఇంట్లో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం బాగుండదు. ఈ రెమెడీస్ పాటిస్తే గట్టెక్కుతావు. ఇలా ఏదో చెప్తాడు. ఈ భవిష్యత్తు గురించి చెప్పినవి కూడా చాలా విస్తృతమైన పరిధిలో ఉంటాయి తప్ప, ఖచ్చితంగా ఉండవు. సమస్యలు అంటే ఏమైనా కావచ్చు. ఆరోగ్యం బాగుండదు అంటే జలుబు చెయ్యడం దగ్గరనుంచీ, హార్ట్ ఎటాక్ వరకూ ఏమైనా కావచ్చు. వచ్చే నవంబరులో నీకు కాలు విరుగుతుంది అని చెప్పగలిగే జ్యోతిష్కుడు నాకు తెలిసినంతవరకు ఎవరూ ఉండరు.

దీన్నిబట్టి మనకి కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. జాతకం చెప్పేవాడికి జాతకం చెప్పించుకునేవాడి సహకారం చాలా అవసరం. జ్యోతిష్కుణ్ణి పరీక్షించడానికి జాతకుడు తప్పుదోవ పట్టించే సమాచారం ఇస్తే జ్యోతిష్కుడు సరైన ఫలితాలు చెప్పలేడు. నేను చాలామంది జ్యోతిష్కులకి ఒక వ్యక్తి జాతకం ఇచ్చి ఈ జాతకుడికి ఉద్యోగం లేదు, స్థిరపడలేదు, మీరేమైనా భవిష్యత్తు చెప్పగలరా అని అడిగాను. అలా అడిగిన జ్యోతిష్కుల్లో ఒకతను చాలా ప్రతిభావంతుడు, పేరు గలవాడు. ఒక గంట జాతకం చెప్పడానికి వంద యూరోలు పుచ్చుకుంటాడు. అతనితో సహా అందరూ ఉద్యోగం రాకపోవడానికి ఫలానా గ్రహం కారణమనీ, ఫలానా రెమిడీస్ పాటించాలి అని మాత్రమే చెప్పారు. వాళ్ళెవ్వరూ చెప్పలేకపోయిన సంగతి ఏమిటంటే ఆ జాతకుడు పుట్టుకతోటే వికలాంగుడు. అతనికి ఉద్యోగం లేకపోవడం నిజమేగానీ, అసలు సమస్య అది కాదు. నేను వాళ్ళని తప్పుదోవ పట్టించకుండా అసలు సమస్య ఏమిటో చెప్తే, ఆ జాతకంలో వాళ్ళకి ఆ సమస్య వెంటనే కనపడి ఉండేది. నేను చెప్పలేదు కాబట్టి కనపడలేదు. ఏ సమస్య ఉందని చెప్పానో అదే కనపడింది.

అదే విధంగా జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళినప్పుడు జాతకుడు మాట్లాడకుండా కూర్చుంటే జ్యోతిష్కుడు సరైన ఫలితాలు చెప్పలేడు. అసలు జ్యోతిష్కుణ్ణి వ్యక్తిగతంగా కలవకుండా, జాతకం మాత్రం ఇచ్చి ఫలితాలు రాసి ఇమ్మన్నాకూడా జ్యోతిష్కులు సరైన ఫలితాలు చెప్పలేరు.

ఇక్కడ గమనించవలసిన మరొక సూక్ష్మాంశం ఏమిటంటే, జ్యోతిష్కులు తమ ఎరుకతో సంబంధంలేకుండా (unconscious) ఈ యుగళగీతం పాడడానికి జ్యోతిష సంకేతాల సహాయం అవసరం అవుతుంది. జ్యోతిష సిద్ధాంతాలూ, సంకేతాలూ అవగాహన చేసుకోకుండా, వాటిని మానవ జీవితానికి అన్వయించడం అభ్యాసం చేయకుండా ఈ యుగళగీతం పాడడం సాధ్యం కాదని నా అభిప్రాయం. జ్యోతిషాన్ని నమ్మి, జ్యోతిష సంకేతాలు జీర్ణించుకొని, ఆరకమైన ప్రాపంచిక దృష్టిని అలవరచుకోవడం వల్ల జ్యోతిష్కులకి శాస్త్రం పైన ఒక సహజమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఆ కళ్ళజోడులోంచి చూసినప్పుడు ఒక వ్యక్తి జీవితంలోని పరిస్థితులు గ్రహసంకేతాలరూపంలో కనిపించి, జ్యోతిషం సత్యమే అన్న దృఢమైన భావనని కలుగజేస్తాయి. ఒకసారి అటువంటి నమ్మకం స్థిరపడ్డాకా, ఒక జాతకుడితో కలిసి యుగళగీతం పాడడానికి కావలసిన సామర్ధ్యం వచ్చేస్తుంది. అయితే తాము జ్యోతిష్కులుగా సఫలమౌతున్నది జాతకం చెప్పించుకునేవాళ్ళు సహకరించడం వల్లనే అన్న సంగతి జ్యోతిష్కులకి తెలియదు. జాతకాలు చెప్పించుకునేవాళ్ళకీ తెలియదు. అయినప్పటికీ ఒక్కో జాతకం చెప్పేకొద్దీ జ్యోతిష్కుడికి శాస్త్రం మీద నమ్మకం దృఢమవ్వడం, విశ్వాసం పెరగడం జరుగుతుంది. అలాగే జాతకుడికి ఒక జ్యోతిష్కుడితో మాట్లాడాకా ఆయన అంతా నిజమే చెప్పాడనీ, ఒక దారి చూపించాడనీ తృప్తి కలుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో తెలిసి మోసం చెయ్యవలసిన అవసరం లేకుండానే పని జరిగిపోవడం. అందుకే హేతువాదులు జ్యోతిషం తప్పంటే జ్యోతిష్కులకి అంత కోపం వస్తుంది. మా అనుభవంలో జ్యోతిషం నిజంగానే పనిచేస్తుంది అని వాళ్ళు వాదించడానికి కారణం కూడా ఇదే.

మరి ఈ రకంగా పాట పాడడానికి ఏవో కొన్ని సంకేతాలూ, తత్సంబంధమైన ప్రాపంచిక దృక్పథమూ కావాలే తప్ప అవి అన్నీ నిజంగా తప్పా, ఒప్పా అన్నది అనవసరం. అందుకనే జ్యోతిషంలో అనేకమైన సాంప్రదాయాలూ, విచిత్రమైన సిద్ధాంతాలూ, పరస్పర విరుద్ధమైన సూత్రాలూ పుట్టి, పెరిగి, పాతుకుపోవడం సాధ్యమౌతోంది - అవి నిజమైనా కాకపోయినా సరే. హోరాశాస్త్రం నుంచి, చిలకజోస్యందాకా వందల ఏళ్ళుగా జ్యోతిషం నిలబడిపోవడానికి ఇదే కారణం కావచ్చు.

విచిత్రవ్యక్తి విశేషాలు మరికొన్ని

ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి విచిత్రవ్యక్తి విశేషాలు మరికొన్ని మనవి చేస్తాను. పైన చెప్పిన యుగళగీతానికి ఉదాహరణలుగా ఇవి పనికొస్తాయి. తనకు అస్సలు పరిచయం లేని వాళ్ళకు కూడా విచిత్ర వ్యక్తి కొన్ని ఫలితాలు చెప్పగా నిజమవ్వడం నేను చూశాను. అప్పట్లో ఆశ్చర్యమనిపించినా, తరవాత తెలిసిందేమిటంటే ఆయన కేవలం ఒక రాయి విసిరాడని.

ఒకాయన విచిత్రవ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఆయన జాతకం చూడకుండానే గురువుగారు ఇలా అన్నారు - మీ తండ్రిగారు బాధ్యతలు తీరకుండానే మరణించారు కదూ?. అది విని వచ్చినాయన చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన చిన్నతనంలోనే తండ్రి పోయి చాలా కష్టపడ్డాడుట. అయితే గురువుగారు చాలా విస్తృత పరిధిలో రాయి విసిరాడని ఆయన గ్రహించలేదు. మా నాన్నగారు ఎన్నవ యేట చనిపోయారో చెప్పగలరా? అని ఆయన తిరిగి ప్రశ్న వేసి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది.

జ్యోతిష్కులు చెప్పేది తప్పైనా జాతకులు చాలా తేలిగ్గా క్షమించేస్తారు. జ్యోతిష్కుడితో సహకరించడానికి వాళ్ళు ఎంత ఉత్సుకతతో ఉంటారో చెప్పడానికి ఇంకో ఉదాహరణ. మరొకాయన విచిత్రవ్యక్తి దగ్గరకి వచ్చాడు. ఇందాకట్లాగే విచిత్రవ్యక్తి నాలుగు రాళ్ళు విసిరాడు. దురదృష్టవశాత్తూ నాలుగూ తప్పయ్యాయి. అప్పుడు విచిత్రవ్యక్తి ఏమన్నాడంటే, నా లగ్నమూ, మీ లగ్నమూ ఒకటే, కాబట్టి నేను మీకు చెప్పే ఫలితాలు అన్నీ తప్పైపోతాయి అని. ఆ వచ్చినాయన చాలా ఆనందపడిపోయాడు. ఇంతటి గొప్ప జ్యోతిష్కుడు నాకు ఫలితాలు చెప్పలేకపోయాడు, కారణం ఇదీ అని ఆయన కొంతమందితో గొప్పగా చెప్పుకోవడం నేను ఎరుగుదును. చెప్పింది తప్పైనా తెలివిగా తప్పించుకోడానికీ, దాన్ని మళ్ళీ తనకే గౌరవంగా మలచుకోడానికీ అసాధారణమైన తెలివితేటలు కావాలి.

మరో సంగతి. విచిత్రవ్యక్తి అద్భుతమైన మాటకారి. అస్పష్టంగా, ఏదో ఒకానొక గొప్ప శాస్త్ర విషయం చెప్తున్నట్టుగా గాలి పోగేసి మాట్లాడడంలో ఆయనని మించినవారు లేరు. ఆయన ఫలితాలు చెప్తున్నప్పుడు మాటల్లో చాలా గందరగోళం కావాలనే చొప్పించేవాడు. జాతకులు ఒకానొక విభ్రాంతికి గురయ్యేలాగా మాట్లాడడం, ఎవర్నో ఉద్దేశించి కఠినంగా తిట్టడం, మధ్య మధ్యలో ఏవో ఫలితాలు చెప్తూనే అనేక విషయాలు దొర్లించడం - ఇదీ ఆయన జాతకం చెప్పే తీరు. ఒక జాతకం చూసి ఈ జాతకాన్ని ఏమంటామంటే, మంచి ఎండ కాస్తున్నప్పుడు బురదలోంచి వచ్చి ఇసుకలో పాము పొర్లాడుతుంది. అటువంటి జాతకమిది అని మొదలు పెట్టేవాడు. ఇలా అస్పష్టమైన చిత్రాలేవో కళ్ళకు కట్టిస్తూ, ఆయన ఏమి చెపుతున్నాడో అర్ధమయ్యీ అవని ఒకానొక గందరగోళంలోనే ఫలితాలు దొర్లించేవాడు. ఉత్సాహం అధికంగా గల జాతకులు ఎన్ని అర్ధాలైనా తీసుకునేవారు. అన్నీ నిజమే అనేవారు.

విచిత్రవ్యక్తి ఉచితంగా జాతకాలు చెప్పడం అన్నది ఒక ప్రచారాయుధం మాత్రమే. ప్రతీ జాతకుడికీ ఏవో కొన్ని నివారణోపాయాల పేరుతో ఆయన దగ్గర ఉండే చవక రకం రాళ్ళు మంచి ధరకి దొరికేవి. మరి ఆయనకి తన బండారం బయటపడుతుందేమో అన్న భయం లేదా అని నేను చాలా ఆలోచించాను. లేదు, ఎందుకంటే ఆయన పాతుకుపోయిన సాంప్రదాయాల రక్షణలో ఉన్నాడు కాబట్టి. ఆయన తన చుట్టూ ఉన్న సమాజం ఏమి నమ్ముతుందో ఆ నమ్మకాల ముసుగులోనే తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సమాజం నమ్మకాలు రాత్రికి రాత్రి మారిపోవు. ఒక నమ్మకాల సమాహారాన్ని (Belief System) ఎంత విమర్శించినా ఆ నమ్మకాలు బలంగా ఉన్నంతకాలం వాటి వెనక ఉన్నవాళ్ళకి రక్షణ ఉండనే ఉంటుంది. అయితే నా అనుభవంలో అందరు జ్యోతిష్కులూ ఆయనలాగే మోసగాళ్ళు కారని మాత్రం మరొక్కసారి మనవి చేస్తున్నాను.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5