ఈమాట » జ్యోతిషమూ – లోపలి సంగతులూ - 2

Expand to right
Expand to left

జ్యోతిషమూ – లోపలి సంగతులూ - 2


జ్యోతిషం పనిచేస్తున్నట్టెందుకనిపిస్తుంది?

జాఫ్రీ డీన్ వంటి శాస్త్రజ్ఞులూ, హేతువాదులూ చెప్పేదేమిటంటే, జ్యోతిషం పనిచెయ్యడం అన్నది కేవలం ఒక ఆభాస లేదా భ్రమ (ఈ విషయమై డీన్ చేసిన పరిశోధన గురించి తరవాత వివరిస్తాను). జ్యోతిష్కులు కారకత్వాల పేరుతో ఒక సాంకేతిక పదజాలాన్నీ, తత్సంబంధమైన ప్రాపంచిక దృష్టినీ అలవర్చుకుంటారు. ఉదాహరణకి ఈ రోజు అనుకోకుండా బయటకి వెళ్ళాను. ఒకాయన పరిచయమయ్యాడు. చాలా పండితుడు, దైవభక్తిగలవాడు. ఓహో, ఈ రోజు గురుడు నా జాతకంలో ఈ పరిచయాన్ని కలగజేశాడన్నమాట. లేదా, ఈ రోజు ఇన్కమ్ టాక్స్ వాళ్ళతో సమస్య వచ్చింది. ఓహో, బుధ, శనుల పాపదృష్టి వల్ల ఇలా అయింది అన్నమాట. మా పక్కింటివాడికి ఎప్పుడూ అందరితోనూ గొడవలే. వాడి లగ్నంలో కుజుడు ఉన్నాడు, అదీ కారణం. ఇలా జ్యోతిష్కులు ప్రతీ విషయాన్నీ, ప్రతీ సన్నివేశాన్నీ జ్యోతిష సంకేతాల రూపంలో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టికోణం మొత్తం జ్యోతిషమయమై ఉంటుంది.

జ్యోతిష సూత్రాలతో జిమ్నాస్టిక్సు

అయితే జ్యోతిషంలో ఖచ్చితమైన సూత్రాలు లేనందువల్లా, అలాగే ఏ సంకేతాన్నైనా దేనికైనా అన్వయించగల వెసులుబాటు చాలా ఎక్కువగా ఉండడంవల్లా జ్యోతిష సూత్రాలు జిమ్నాస్టిక్స్ చేసే వీరుల్లాగా ఎటైనా వంగగలుగుతాయి, ఏమైనా చెయ్యగలుగుతాయి. ఉదాహరణ- కొంతమంది జ్యోతిష్కులు గురు, శుక్రుల సమాగమం (రెండూ శుభగ్రహాలు) చాలా అదృష్టంగా భావిస్తారు. కానీ ఒకాయన సిద్ధాంతం చూడండి. గురుడు దేవతలకి గురువు. శుక్రుడు రాక్షసులకి గురువు. ఈ ఇద్దరికీ బద్ధ వైరం. కాబట్టి గురు,శుక్రుల సమాగమం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ ఆయనకి ఈ సమాగమం ఎలా పనిచేసిందో చూడండి.
ఆయనకి కన్యా లగ్నంలో ఈ గురు,శుక్రుల సమాగమం ఏర్పడిందట. శుక్రుడికి కన్య నీచస్థానం, గురుడికి శతృస్థానం. అయినప్పటికీ ఆ నీచత్వం భంగమై, రాజయోగం పట్టిందట. రాజయోగం పట్టడం మూలాన ఆయన విదేశాలు వెళ్ళి, డబ్బు సంపాదించి సుఖభోగాలు అనుభవించాడట. శుక్రుడు నీచ కాబట్టి ఈ భోగాలు కొంచం ఎక్కువగానే అనుభవించాడట. అయితే ఎంతైనా గురుడు గురుడే కదా. భక్తి కూడా కలిగిందిట. సిగరెట్టు కాలుస్తూనే విష్ణుసహస్రనామం చదివేవాడట. ఆయన కబుర్లు వింటుంటే నాకు నవ్వాపుకోవడం చాలా కష్టంగా ఉండేది.

పోనీ ఆయన పెద్ద పేరున్న జ్యోతిష్కుడు కాడు, ఏదో చిన్నవాడే అనుకోండి (జ్యోతిషంలో నలభై సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ). గొప్ప జ్యోతిష్కులు ఇష్టం వచ్చినట్టు జ్యోతిష సూత్రాల్ని వంగదియ్యరు అనుకోడానికి లేదు. ఒక వ్యక్తి గురించి ముందే తెలిసిన సమాచారాన్ని ఉపయోగించి (అంటే కామన్ సెన్సు ని ఉపయోగించి) జ్యోతిష సూత్రాల్ని తదనుగుణంగా సమన్వయించడాన్ని మనం జ్యోతిష పత్రికల్లోనూ, గ్రంథాల్లోనూ మన ఓపిక కొద్దీ తవ్వుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ మాత్రం ఇస్తాను. బృహత్ పరాశర హోరా శాస్త్రంలోని ఈ సూత్రాల్ని చూడండి -
(అధ్యాయం 24, భావేశ ఫలాధ్యాయం. ఇక్కడ లాభం అంటే పదకొండవ ఇల్లు. వ్యయంఅంటే పన్నెండవ ఇల్లు.)

శ్లో. 132. లాభేశే వ్యయభావస్థే సత్కార్యేషు వ్యయః సదా,
     కాముకో బహుపత్నీకో మ్లేచ్ఛసంసర్గకారకః ||

లాభాధిపతి వ్యయ భావంలో ఉంటే, జాతకుడెప్పుడూ మంచి పనులకోసం విపరీతంగా ఖర్చుపెడతాడు. కాముకుడూ, చాలామంది భార్యలు కలిగినవాడూ అవుతాడు. మ్లేచ్ఛులతో స్నేహం చేస్తాడు.

శ్లో. 133. వ్యయేశే లగ్నగే జాతో వ్యయశీలో జతో భవేత్,
     దుర్బలః కఫరోగీ చ ధనవిద్యావివర్జితః ||

వ్యయాధిపతి లగ్నంలో ఉంటే, విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవాడౌతాడు. బలహీనంగా ఉంటాడు. శ్లేష్మదోషాలతో బాధపడతాడు. వాడికి విద్యగానీ, సంపదగానీ ఉండవు.

ఒక ప్రసిద్ధుడైన వ్యక్తికి పైన చెప్పిన గ్రహస్థితులు ఉన్నాయి. ఆధునిక వరాహమిహిరుడని పేరుగాంచిన ప్రముఖ జ్యోతిష్కుడొకాయన ఆ జాతకుడి గురించి ఇలా అన్నాడు: “ఆత్మకారకుడైన సూర్యుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఇతను చాలా ఆధ్యాత్మికుడౌతాడు. లగ్నంలో బుధుడున్నాడు కాబట్టి బుధ్ధిసూక్ష్మత హెచ్చు.” (Notable Horoscopes, p. 227). అయితే ఆయన వదిలేసిన విషయం ఏమిటంటే లగ్నంలో ఉన్న బుధుడు వ్యయాధిపతి; వ్యయంలో ఉన్న సూర్యుడు లాభాధిపతి. వాటికి పైన చెప్పిన సూత్రాల్నీ, దోషాలనీ ఆయన అన్వయించలేదు. ఎందుకంటే అది గాంధీగారి జాతకం కాబట్టి. (కామన్ సెన్సు నియమం అంటే ఇదే కాబోలు.)

ఈవిధంగా జ్యోతిష్కులు ప్రముఖుల జాతకాల గురించి రాసిన వ్యాసాల్ని తీసుకుని ఇలాంటి అసంబద్ధతలని ఎన్నైనా చూపించవచ్చు. జ్యోతిష్కులకున్న ఈ కామన్ సెన్సు సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్షంగా ఒక జాతకం చెప్పడం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5