ఈమాట » పేరులేదు

Expand to right
Expand to left

పేరులేదు

గులాబీ పూలు కాదుకదా కనీసం గరిక పూలు
కూడా నా మనసులో విచ్చుకోవటం లేదు
తుళ్ళుతూ పారే సెలయేర్లేవీ నా గుండెలో జాలువారటం లేదు
వాటి పాటల తాలూకు స్వరాలేవీ నా మనసుకెక్కటంలేదు
సంధ్యతో కబుర్లు చెబుతున్న ఆకాశం నా కళ్ళకానటం లేదు
పడీ పడని ఈ చిరు జల్లుల వర్షం నా మెదళ్ళో ఏ ఙ్ఞాపకాలనీ గెలకటం లేదు
చక్కనైన ఊహలతో, అందవైన పదాలతో, బతుకులో సన్న జీరలాటి
భావుకతని ఆకాశంలా అల్లుకున్నాను, బతుకునిండా పరచుకున్నాను
ఏవిటివాళ ఆ ఆకాశం పెళుసుతేలి పఠపఠమని పగిలిపోతుంది
పదాలతో నింపుకున్న ఆ అందవంతా ఇగిరిపోతుంది
వాస్తవం కత్తిలా నా మనసులో పొడుస్తుంది
ఏవి చెయ్యను గుట్టలు గుట్టలు గా పడున్న ఈ పదాల్ని
అందవైన ఈ పదాల్ని, సున్నితవైన ఈ పదాల్ని
అందంకోసవే సృష్టించబడిన తళతళలాడే తళుకుళ్ళాంటి ఈ పదాల్ని
ఏంచేయను ఈ చక్కచక్కని ఊహల్ని, సున్నితవైన ఈ ఊహల్ని
గుండెనిండా శూన్యం నింపుకొని ఎంత ఎత్తుగా ఎగురుతాయోకదా
మంచి పసందైన సురని నరనరాన నింపి
వాస్తవాన్ని ఎంత చక్కగా చంపుతాయో కదా
ఈ పదాలు, ఈ ఊహలే కదా బతుకుని
ఈ మత్తుమందు లాంటి భావుకతతో నింపింది
నా కవితకి ఈ జిలుగు కలల ఆల్కెమిని నేర్పించింది
శవాల గుట్టలముందు కూర్చొనికూడా
ఉషాదేవిని అలింగనం చెయ్యటం ఎలాగో చూపించింది
అయ్యో దేవుడా ఇప్పుడెలాగ? ఈ రక్తపు సుడిగుండంలో
పాటలుపాడే సెలఏర్లని నేనిప్పుడేలా సృష్టించను?
కళ్ళముందు జిగేల్మని మెరుస్తున్న ఈ జీవన వాస్తవికతని
నేనే చలువ కళ్ళద్దాలతో స్వాంతన పరచను?
ఏ మెట్ట వేదాంతంతో, ఏ కర్మ సిద్దాంతంతో నా రంగుల కుంచెని తడపను?
ఎముకలు తప్ప గుండెలెండిపోయి బిడ్డని పోగొట్టున్న తల్లికి
నాట్యం చేసే ఏ వాన చినుకుని చూపించను?
ఏ ప్రియురాలి విరహ బాధని గూర్చి వెచ్చవెచ్చగా కథలు చెప్పను?
తొడలమద్య పుండైపోయినా అన్నం కోసం పైట జార్చే చెల్లికి
అప్పులు తప్ప కుప్పలు మిగలని రైతుకీ ఏ వెన్నెల గురించి చెప్పను?
ఏ పువ్వులూ, ఏ ఆకులు, ఏ సెలయేళ్ళు, ఏ అకాశాలని చూపించను?
ఏ వసంతం గురించి, ఏ అర్థంలేని ఆశలని నూరిపోయను?
అందవైన, అసంగతమైన, ఈ మత్తుమందుని
ఈ భావుకత తెరని ప్రపంచం చుట్టూ ఎలా చుట్టను?
దేవుడా, పగలు పొద్దస్తం నా మనసులో ఈ అబద్దాల కోటలెలా కట్టను?

 

(7 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. డా.స్మైల్ అభిప్రాయం:

    May 3, 2008 2:33 pm

    సంప్రదాయ సాహిత్యానికి, ఇంకా చెప్పాలంటే…

    ‘మృగమదసౌరభవిభవ
    ద్విగుణితఘనసారసాంద్రవీటీగంధ
    స్థగితేతరపరిమళమై
    మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్’

    అతఁడా వాతపరంపరా పరిమళ వ్యాపార లీలన్‌ జనా
    న్విత మిచ్చోటని చేరబోయి కనియెన్‌ విద్యుల్లతావిగ్రహన్‌
    శతపత్రేక్షణఁ చంచరీకచికురన్‌ చంద్రాస్యఁ చక్రస్తనిన్‌
    నతనాభిన్‌, నవలా ,నొకానొక మరున్నారీ శిరోరత్నమున్‌

    అన్న పద్యానికీ-ఈ కింది అభ్యుదయ కవితకు

    ‘దారిపక్క చెట్టుకింద,ఆరిన కుంపటి విధాన
    కూర్చున్నది ముసల్దొకతె
    మూలుగుతూ-ముసురుతున్న ఈగలతో వేగలేక
    ముగ్గుబట్టవంటి తలా, ముడుతలు తేరిన దేహం,
    కాంతిలేని గాజుకళ్లు-తనకన్నా శవం నయం.
    పడిపోయెను జబ్బుచేసి, అడుకొన్నే శక్తిలేదు,
    రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు,
    ఏళ్లు ముదిరి, కీళ్లు కదిలి, బతుకంటే కోర్కెసడలి-
    పక్కనున్న బండరాతి పగిదిగనే పడిఉన్నది.
    “ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి”దని
    వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది!
    ఎముకముక్క కొరుక్కొంటూ ఏమీ అనలేదు కుక్క,
    ఒక ఈగను పడవేసుక తొందరగా తొలగె తొండ;
    క్రమ్మె చిమ్మచీకట్లూ, దుమ్మురేగె నంతలోన
    “ఇది నా పాపం కా”దనె ఎగిరివచ్చి ఎంగిలాకు.

    గల తేడాను మీ కవితలో చూసుకొన్నాను. మనస్సు కదిలించిన కవిత, పేరులేక పోయినా గొప్పదనానికి లోటులేదు.

  2. bollojubaba అభిప్రాయం:

    May 9, 2008 12:20 am

    చాలా అద్బుతమైన కవిత
    పైకామెంటు చదివిన తరువాత కవితపై ఇంకా గౌరవం పెరిగింది. డా. స్మైల్ గారి కన్నా మించి నేనేమి చెప్పగలను. ఏకీభవించటం తప్ప.
    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  3. meenakshi అభిప్రాయం:

    May 11, 2008 3:31 am

    చాలా చాలా బాగా రాసారు.అసలు ఆ పదాలు ……వాటి గూర్చి చెప్పలేను సర్. It is nice.

  4. Sivasankar అభిప్రాయం:

    May 22, 2008 4:08 am

    Its so nice, the way daily we see lives you expressed in a poetic style.. its really superb.. its touching hearts..

  5. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    May 23, 2008 9:29 pm

    “ప్రశ్నలే శాశ్వతం”

    శ్రీశ్రీ షష్టిపూర్తికి ఇస్మాయిల్ రాసిన “శ్రీశ్రీ జన్మ వృత్తాంతం,” అన్న వ్యాసంలో, “కవిత్వమైనా తత్త్వమైనా సందేహాల్లోంచి, ఆందోళన నించి, తిరుగుబాటు నించీ పుడుతుంది. ప్రశ్నలే శాశ్వతం. సమాధానాలు కావు. సమాధానాలతో సంతృప్తి పడితే వెంటనే చస్తుంది కవి ప్రతిభ,” అన్నారు.

    ప్రశ్నలతో కూర్చిన పదచిత్రాలతో నిండిన కవిత మనసుని పట్టేసింది. తూచేరాళ్ళని కాదు గాని, నేను స్థూలంగా కవితలని - అర్థంకాని, మామూలు, మంచి, గొప్ప అని - నాలుగు రకాలుగా చెప్పుకుంటాను. ఇది నిస్సందేహంగా మంచి కవిత. నా దృష్టిలో గొప్ప కవిత్వానికున్న ఒక గుణం - కంఠస్థనీయం కావడం. ఈ కవిత గొప్పది కాగలిగి ఉండీ కాలేదనిపించింది. అందుకు అక్కడక్కడా అనవసరంగా వాడిన మాటలే కారణం. క్లుప్తత ముఖ్యం అంటారు, ముఖ్యంగా కవిత్వానికి.

    తనకి పేరులేకపోయినా కవికి పేరుతెచ్చే కవిత.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    May 27, 2008 12:09 am

    వరూధిని అందం, సరస్వతి సౌందర్యం

    సంప్రదాయ సాహిత్యాన్నీ, అభ్యుదయ సాహిత్యాన్నీ జమిలిగానే కాదు, విడిగా నయినా విమర్శించడానికి నాకు కనీస యోగ్యత కూడా లేదు. కాని డాక్టర్ స్మైల్ గారి అభిప్రాయం రెండురోజుల నుండి నా మనసును పట్టి వదలకపోవడాన ఇది రాస్తున్నాను. ఇది వారిపై విమర్శ కాదు. దీంట్లో సాహిత్యాభిమానులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉండొచ్చనే ఆశ.

    పాతసాహిత్యం సామాన్యప్రజల జీవితాన్ని కావ్యవస్తువుగా తీసుకోలేదనీ, అభ్యుదయసాహిత్యానికీ సంప్రదాయ సాహిత్యానికీ గల ముఖ్యమైన తేడా అదేననీ అంటే నేనొప్పుకుంటాను.

    వరూధిని సంప్రదాయసాహిత్యానికి ప్రతీక అయితే నష్టం లేదుగాని, “భిక్షువర్షీయసి” అభ్యుదయసాహిత్యానికి ప్రతీక అయితే మనకి లోటుగానే ఉంటుందనుకుంటాను. “భిక్షువర్షీయసి” మంచి కవిత కాదని కాదు, ప్రతీక కాకూడాదనే నాఉద్దేశం.

    వరూధిని ప్రవరులది ప్రేమకథ. ప్రేమకథల్లో అందానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందం బాహ్య సౌందర్యం గురించీ, హృదయ సౌందర్యం గురించీ కూడానూ. అయితే ఎవరికైనా మనిషిని చూడటంతోటే ఆకట్టుకునేది బాహ్య సౌందర్యమే. నాభి లోతు దాకా పోవాలో లేదో నాకు తెలీదు కాని, వరూధినిని పరిచయం చేసిన విధం ఆకర్షణీయమే. “మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్,” అన్న మాటలు కవితా సౌరభం తో నిండినవే. ఈతరం కవులు కూడా స్వీకరించదగ్గవే.

    ఆ పద్యాల వెనువెంటనే వరూధినిని మన కళ్ళముందట నిల్పే పద్యమిది:

    “తతనితం బాభోగ ధవళాంశుకములోని
    అంగదట్టపు కావిరంగువలన
    శశికాంతమణిపీఠి జాజువారగ కాయ
    లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల
    తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో
    జిలిబిలిపాట ముద్దులు నటింప
    ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి
    రతిపారవశ్య విభ్రమము తెలుప

    ప్రౌఢి పలికించు గీతప్రబంధములకు
    కమ్ర కరపంకరుహ రత్న కటక ఝణఝ
    ణధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప
    నింపు తళుకొత్త వీణ వాయింపుచుండి.”

    తిక్కన, సూరన లను మించి ఇంత సుకుమారమైన పద్యం మన భాషలోనే లేదన్నారు పుట్టపర్తి [1]. అదెందుకో తెలుసుకునే పరిజ్ఞానం నాకు లేదు కాని, “ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమము తెలుప,” అన్నది నన్నాకర్షించింది.

    కారణం దానిపై రారా ఇచ్చిన వివరణలు. ఆయన దానిని “రసపారవశ్య” మని చదువుకున్నాడు. సుకుమార హృదయం గలవాళ్ళే సాహిత్యంలోనైనా ఏకళలోనైనా పారవశ్యం చెందుతారనీ, “కవితా! ఓ కవితా!” లో శ్రీశ్రీ చెప్పిన “క్షణికమై, శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం,” పెద్దన చెప్పిన పారవశ్యమూ ఒకటేననీ అన్నాడు. నాకది నచ్చింది.

    ఇంతకీ రారా ఈ మాటలన్నది కొడవటిగంటి కుటుంబరావు రాసిన కొన్ని ప్రేమకథలను విశ్లేషించే సందర్భంలో [2]. కుటుంబరావు రాసిన పెద్దకథ “కురూపి” లో అనాకారిగా కనకం ప్రపంచంలోకి ప్రవేశించిన సరస్వతి అతనిని తన హృదయసౌందర్యం ద్వారా చివరికెలా వశం చేసుకుంటుందీ వివరిస్తూ శిల్పానికి గల ప్రాముఖ్యతని వివరించాడు.

    సమాజంలో అందవిహీనమైన స్త్రీ పురుషులు ఉండితీరతారు. మరి వాళ్ళ ప్రేమా పెళ్ళీ లాంటి చిక్కు సమస్యలు తీరేదెలా? దీనికి కుటుంబరావు ఇచ్చిన సమాధానం - ఆధ్యాత్మికం. అంటే అదేదో పరలోకానికి సంబంధించిందని కాదు. మనిషి నుండి వేరే మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటేననీ, అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయనీ, వీటి మూలంగా ప్రేమా పెళ్ళి సఫలం అవుతాయనీ వ్యక్తం చెయ్యడనికే “కురూపి” రాశానన్నాడు.

    “అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలున్నట్టు నాకు చిన్నతనం నుండి కూడా తెలుసు. నాకు తెలియనిదల్లా నేటి మన సమాజం కిందకే దిగుతున్నదో, మీదికో ఎక్కుతున్నదో, నేటీ యువకులు పైనే చూస్తున్నారో, కిందకో చూస్తున్నారో … అది మాత్రమే,” అని కొంత నిరాశపడ్డాడు.

    కుటుంబరావువి చదవ్వలసిన ప్రేమకథలు. అవి అభ్యుదయసాహిత్యాన్ని “భిక్షువర్షీయసి” కవితా పరిమితుల్ని దాటి విస్తరింపచేస్తాయి.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    [1]. “వ్యాసవల్మీకం” లో “వరూధిని” అన్న వ్యాసం. పుట్టపర్తి నారాయణాచార్యులు, 2004. “వరూధిని హృదయమున రససముద్రమున్నది. మాటలలో కవిత యున్నది. ప్రకృతి యొక్క విచికిలస్వరూపము వరూధిని…” అని ముగించారు. ఈయనా, రారా, ఇద్దరూ ప్రొద్దుటూరు వారే! వాళ్ళూ, శ్రీశ్రీ, కొకు, ఇంకా కొందరు అభ్యుదయరచయితలూ కలిసి “సంవేదన” ఆవిష్కరణ సందర్భంగా తీయించుకున్న ఫొటొ ఈ పుస్తకంలో ఉంది.

    [2] “కుటుంబరావు సాహిత్యం,” అయిదవ సంపుటం లో “భావుకుల రచయిత కొకు,” అన్న వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి. 1983. కవులలోకెల్లా అల్లసాని పెద్దన తన అభిమాని కవి అని చాటుకుని, “కవిత్వానికి కావలసింది ఆవేశబలం కాదు, అనుభూతి సౌకుమార్యం,” అన్న విలక్షణ విమర్శకుడు రారా.

  7. baabjeelu అభిప్రాయం:

    July 6, 2008 3:21 am

    కొడవళ్ళ వారి క్లుప్తత గురించి కిరN గారు ఖచ్చితంగా పట్టించుకొవాలి. స్మైలు గారి అభిప్రాయము గురించి కొడవళ్ల వారి వ్యాఖ్య అనవసర ప్రసంగము. ఇలాటివే మన కవిత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. స్మైలు గారు రాసింది ఒకటి, ఈయన చెప్పుకొచ్చింది ఇన్కొకటి. కిరణూ మంచి భావము ఉన్నప్పటికీ, మంచి భాష ఉన్నప్పటికీ పద్యము మంచి పద్యము అవదు, క్లుప్తత లేకపొతే.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a