లింకన్ తో ఓ రాత్రి
[మే రెండవ తేదీ సత్యజిత్ రాయ్ పుట్టినరోజు. నాకు ఈ కథ రాయడానికి ప్రేరణ ఆయన కథలే కనుక, ఈ కథ ఆయన స్మృతికి. — రచయిత్రి]
వంటగదిలో బ్రేక్‌ఫాస్ట్ పనిలో మునిగి ఉన్న స్నేహ డోర్‌బెల్ అరవడంతో ఆదివారంపూట ఇంతపొద్దున్నే వచ్చిందెవరా? అనుకుంటూ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా హేమంత్, తనతోనూ రాజాతోనూ కలిసి చదువుకున్న సహాధ్యాయి.
“ఏమిటి హేమూ పొద్దున్నే దిగబడ్డావు?”
“అది కాదు స్నేహా… మన రాజా గాడు ఏంటో తేడాగా ఉన్నట్లు కలొచ్చిందిలే. పన్లోపనిగా మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ కూడా కానిచ్చేయొచ్చని వచ్చేసా.”
“నీకు కల వచ్చిందన్న విషయం నమ్మమంటావా? నాకెందుకో నువ్వు తినడానికే వచ్చినట్లు అనుమానం. బ్యాచిలర్ గా ఉన్నప్పుడు రాజా కూడా ఇలాగే ఏదో ఒకటి చెప్పి ఆదివారం వచ్చేవాడు మా ఇంటికి .. ఇంటి భోజనం తొక్కా తోలూ అంటూ. నేను మా నాన్నకి జవాబు చెప్పలేక నానా అవస్థా పడేదాన్ని అప్పట్లో.”
“కనిపెట్టేసావన్నమాట. ఏమైనా నువ్వు చిన్నప్పట్నుంచి బాగా తెలివైనదానివి కదా స్నేహా….”
“సర్లే .. నీకు బ్రేక్‌ఫాస్ట్ శాంక్షన్డ్.”
“థాంక్స్! ఇంతకీ వాడేడీ? కనబడ్డే?”
“నీకు కల వచ్చినా రాకున్నా అది మాత్రం నిజమే… మన రాజా మన రాజా కాదు. నిజంగానే తేడా మనిషై పోయాడు పొద్దున్నుంచి.”
“ఏమిటీ? ఏమైంది?”
“అసలు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతావు .. అసలు నువ్వు ఊహించలేవు ఏమి చేస్తున్నాడో!”
“అబ్బ, స్నేహా! టెన్షన్ పెట్టకు నన్ను. ఏమైంది వాడికి? తలకేమైనా దెబ్బ తగిలి గతం మర్చిపోయాడా ఏమిటి కొంపదీసి?”
“వెటకారాలాడకు. ఇప్పుడు రాజా ఏమి చేస్తున్నాడో తెలియాలంటే, అలా కుడిపక్కకి తిరిగితే గెస్ట్ రూమ్ కీ, బెడ్‍రూమ్ కి మధ్య ఓ చిన్న గది ఉంటుంది. వెళ్ళి చూసి రా అక్కడ.”
“చిన్న గదేమిటి? పూజగదేగా ఉండేది? వీడి నాస్తికత్వం ఎక్కువై అది కూడా తీసేసి ఏమన్నా సర్దేస్తున్నాడా ఏమిటీ అక్కడ?”
“వెళ్ళుము … చూడుము …రమ్ము … మాట్లాడుము..”
“రమ్మా! అదికూడా అరేంజ్ చేసారా ఇంట్లో?”
“ఏహె! జోకులాపి చూసిరా…”
రెండు నిముషాల తరువాత అక్కడ్నుంచి మళ్ళీ స్నేహ వైపుకి వచ్చిన హేమంత్ కళ్ళు ఆశ్చర్యంతో వెండితెరంత పెద్దగా అయ్యాయి.
“స్నేహా .. ఏమిటిది? వాడు .. ఆ పుట్టు నాస్తికుడు … వాడెళ్ళి పూజ గదిలో కూర్చుని నమస్కారం చేయడమేంటి దేవుడికి? ఆ హారతియ్యడం ఏమిటి?”
“ఓ హారతిచ్చేస్తున్నాడా అప్పుడే … గుడ్. ఇప్పుడే ఓ పదిహేను నిముషాలే ఐందిలే వెళ్ళి … అప్పుడే బైటకి వస్తాడనుకోలేదు. కొత్తకదా … ఇంకా పెద్దగా పూజలూ అవీ తెలీవు కదా .. అందుకని త్వరగా అవజేసి ఉంటాడు.”
“అదికాదు .. నువ్వేంటి? నీకు ఆశ్చర్యంగా లేదూ?”
“హేమూ! నీకు ఇప్పుడే తెలిసింది కనుక నీకు అలా ఉంది. నాకు పొద్దున్న ఐదింటికి నిద్రలేపి మరీ చెప్పాడు నాయనా! అప్పటి షాక్ నుండి ఇప్పుడిప్పుడే తేరుకున్నా కనుక .. ”
“కారణమేంటి? చెప్పు .. చెప్పు .. కమాన్ కమాన్ టెల్మీ ఐ సే!” సాయికుమార్ స్టైల్లో అన్నాడు హేమంత్.
స్నేహ నోరు విప్పేంతలో,
“అరే! హేమూ … ఎప్పుడొచ్చావ్ రా? నేను పూజలో ఉన్నా కదా … చూస్కోలేదు. ఇదిగో హారతి” అంటూ వచ్చాడు రాజా.
“అదికాదొరే … నిన్నటిదాకా బానే ఉన్నావు కదా … ఈరోజేమిట?” నుదుట కుంకుమతో, చేతిలో హారతిపళ్ళెంతో ఎదురువచ్చిన రాజాని చూస్తూ అడిగాడు హేమంత్.
“అదొక పెద్ద కథ రా … చెప్తాను ఉండు. గెటప్ మార్చుకుని వస్తాను. తీరిగ్గా మాట్లాడుకుందాం.”
“స్నేహ పూజగది పెట్టించుకుంటేనే నానా హడావుడీ చేసావు కద అప్పట్లో… అసలు నీకూ, తనకీ ఈ విషయంలో ఇంత తేడాగా ఉండగా ఇద్దరూ ఎలా కలిసారో? అని కాలేజీలో అందరూ అనుకునేంత లెవెల్ లో నువ్వు నాస్తికుడిలా కటింగ్ ఇచ్చేవాడివి కదరా … ఒక్క రాత్రిలో ఏమైంది నీకు?”
“ఉండరా … వచ్చి చెప్తా” రాజా డ్రస్ మార్చుకోడానికి వెళ్ళాడు.
“స్నేహా! ఏమైంది వీడికి? అసలా కథేంటి?”
“ఏం చెప్పను హేమంత్! నాకు కథ విన్నాక మహేశ్‍బాబు కొడితే ఎలా దిమ్మతిరిగి మైండ్ బ్లాకౌతుందో .. అలా ఐపోయింది. ఏమన్నా అంటే ఫీలౌతాడని ఏమీ కామెంటెయ్యలేదు”
“అంత భయంకరమైన కథా!”
“ఇప్పుడు చెప్తాడు విను. నేను మళ్ళీ వినలేను గానీ .. అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తా. మళ్ళీ రాజా సీరియస్ గా చెబుతూ ఉంటే, నేను నవ్వడమో, ఏదో ఒకటి అనడమో చేసి .. అతను ఫీలయి .. నేను ఫీలయి … ఇదంతా ఎందుకు? అల్రెడీ పొద్దున్నే ఓసారి అయింది.”
“ఓహో! మేటర్ ఆసక్తికరంగా ఉంది. సర్లే. నువ్వెళ్ళు. వాడికి నే చెప్తాలే.”
“ఒకే! జాగ్రత్త.” అని నవ్వి “రాజా! నేను మార్కెట్ కి వెళ్ళొస్తా.” అని రాజాకి అక్కడ్నుంచే కేకేసింది.
“ఓ, అప్పుడే వెళ్తున్నావా!ఓకే ఓకే.” అంటూ బయటకి వచ్చాడు రాజా.
“మీరు తినేయండి .. పూరీ-కూర్మా చేసాను. టేబుల్ మీద ఉంది.” అంటూ వెళ్ళిపోయింది స్నేహ.
“ఇప్పుడు చెప్పవోయ్ అసలేమైందో.” టేబుల్ వద్ద కూర్చుంటూ అడిగాడు హేమంత్.
“చెప్తాగానీ … నువ్వు నమ్మాలని నేను కోరుకోడం లేదు. చెప్పాలి కనుక చెప్తున్నా. నమ్మడం నమ్మకపోడం నీ ఇష్టం కానీ … నా నమ్మకాలని హేళన చేయకుండా ఉంటే చాలు.”
“అబ్బ సర్లేరా! అంత కష్టపడకు .. నేనేమీ అననులే. చెప్పు.”
“రాత్రి నాకు జ్ఞానోదయమైందిరా. బుద్ధుడికి బోధిచెట్టుకింద అయింది కానీ … నాకు పడగ్గదిలో ఫ్యానుకిందే అయిపోయింది.”
“హుం! ఇలా కష్టం కానీ .. నువ్వు నీ ఫ్లో లో నువ్వు కథ కానివ్వు. నేను ఏమన్నా ఉంటే చివర్న అడుగుతా. మొత్తం స్క్రీన్‍ప్లే కానిచ్చేయ్. గెట్ సెట్ గో.”
“ఎప్పటిలాగే నేను రాత్రి డిన్నరయ్యాక కాసేపు వాకింగ్ కి వెళ్ళొచ్చాము ఇద్దరం. తను టీవీ చూస్తా అని వెళ్ళింది. నేను అక్కడ దయ్యాలమీద ఏదో పుస్తకం ఉంటే చదువుతూ కూర్చున్నా కాసేపు. అందులో, ఓ కథ ఆకర్షించింది నన్ను. అది లింకన్ దయ్యం గురించి. అబ్రహాం లింకన్ చనిపోయాక కూడా చాలా మందికి కనిపించాడంట. ఆ వైట్ హౌస్ భవనం లో నౌకర్లకి చాలాసార్లు కోపంగా చూస్తున్న పోజులో కనిపించాడట. ఇలాంటి సంఘటనల గురించిన వ్యాసం అది. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించి చదివాను. రాత్రిపూట దయ్యాలకథలేమిటి? అనకు. నాకు నమ్మకాల్లేవని నీకు తెలుసు కదా. ఏదో .. టైంపాస్ అని చదువుతూ ఉంటా వాటిని. అంతే. సరే, తరువాత స్నేహ వచ్చి అడిగింది ఏమి చదువుతున్నానని. నేను చెప్తే, “నాకు భయం, ఇప్పుడు చెప్పకు ఆ కథంతా” అనేసి పడుకుంది. సరే, తరువాత కాసేపటికి లైటాపి, బెడ్‍లైట్ ఆన్ చేసి పడుకున్నాను. ఇదంతా పదిన్నర ప్రాంతంలో జరిగింది.
“ఆ .. తర్వాత?” అన్నాడు హేమంత్.
“కాసేపటికి నాకు మెలుకువొచ్చింది. దాహంగా అనిపించడంతో, ఫ్రిజ్లో ఉన్న వాటర్ తాగుదామని లేచాను. లేచిన మనిషిని లేచినట్లే అలా నోరు తెరిచి ఉండిపోయాను. కొయ్యబారడం అంటే ఏమిటో అప్పుడే తెలిసొచ్చింది. రోమాలు నిక్కబొడుచుకోవడం కూడా అనుభవంలోకి వచ్చింది. ఎందుకంటావా? ఎదురుగా నిలబడి ఉన్నాడు .. లింకన్! నా వైపు అభావంగా చూస్తున్నాడు! నేను షాక్ లో లేచిన వాడినల్లా మళ్ళీ మంచం మీద పడిపోయాను. నేను లింకన్ వైపూ, లింకన్ నా వైపూ చూసుకున్నాం కాసేపు. ఇందాక అభావంగా చూసిన లింకన్ కళ్ళలో నాకు కోపం కనబడ్డది. ఇంతసేపూ షాక్లో మాత్రమే ఉన్న నాకు ఆ చూపు చూసి భయం వేసింది. తెలీకుండానే ముడుచుకు పోయాను. స్నేహని లేపుదామా అనుకున్నా… కానీ, చేయి కదల్లేదు. అప్పుడే అర్థమైంది నేనెంత భయంతో బిక్కచచ్చి ఉన్నానో.”
“ఏమైందిరా మరి? చివరాఖరికి మెలుకువొచ్చిందా అప్పుడు?”
“ఏరా … మధ్యలో ఆపను అన్నావ్ కదా… ఇలా వెధవ డౌట్లడిగితే నే చెప్పను పో!”
“సరే .. సరే … చెప్పు.”
“సరే, అది కలేమో అని అనుమానం వచ్చింది. కల్లో అది కలేమో అన్న అనుమానం రావడమేమిటి? అనుకున్నాను. అయినప్పటికీ ఓ సారి గిల్లి చూసుకున్నాను … నిజంగానే నొప్పేసింది. దానితో, నేను కలగనడంలేదు అని అర్థమైంది. నేను అలా గిల్లుకోడం చూసి లింకన్ పెదాలపై ఓ విషపు నవ్వు మెరిసింది. నాకు భయం పెరిగింది. కానీ, లింకన్ తో నాకు చెప్పుకోదగ్గ పరిచయమూ లేదు. లింకన్ కి నాపై తీర్చుకు తీరాల్సిన పగా లేదు … మరి ఎందుకు వచ్చాడు? అని అనుమానం వచ్చింది. కానీ … ఎలా అడగను? అయినా వెళ్ళడేంటి ఈ మనిషి … అదే దయ్యం? వచ్చినప్పట్నుంచి అదే స్థానం లో నిలబడి ఉన్నాడు .. చూస్తూ ఉన్నాడు. కాస్త ఇందాకటికంటే రెండుమూడు అడుగులు ఎత్తులో ఉన్నట్లు అనిపిస్తున్నాడు .. అంతే. ఎంతకీ వెళ్ళడేంటి? అని ప్రశ్నించుకున్నాను … నేనే. జవాబు తెలిస్తే కదా … ముందే దాహంగా ఉంది … ఇక ఇదంతా చూసేసరికి పూర్తిగా ఎండిపోయింది నాలుక. ఫ్యాన్ తిరుగుతున్నా కూడా చెమట్లు. దాహం వేస్తోంది … కదలాలంటే ఆ లింకన్ చూస్తూ ఉన్నాడు … ఏం చేస్తాడో ఏమో అని భయం!
ఇంతలో “కొంపదీసి పూర్వజన్మలు గానీ నిజంకాదు కదా! ఈ లింకన్ గాడిని …” అని అతని చూపు గుర్తొచ్చి మళ్ళీ …”సారీ! లింకన్ గారిని చంపిన వెధవని నేనే కాదు కదా అప్పట్లో!” అని సందేహం!
మళ్ళీ ఇంతలోనే నాలోని హేతువాది “ఛ! దయ్యాలేంటి? పునర్జన్మలేంటి? అంతా ట్రాష్!” అని అరిచాడు. కానీ ఎదురుగ్గా ఎప్పుడో ఎన్నో ఏళ్ళ క్రితం చనిపోయిన మనిషి కనబడుతూ ఉంటే, దాన్ని ఎలా అర్థం చేసుకోను?
నాకు తెలిసిన జవాబేదీ దొరకలేదు. తెలియంది ఎలాగో దొరకదు ఇప్పుడు. ఓ క్షణం కళ్ళు మూసుకున్నాను. మూతబడ్డ కళ్ళ సందులోంచి, కీహోల్ నుండి గదిలోకి చూసినట్లు, మళ్ళీ ఆ వైపు చూసాను.
లింకన్ ఈసారి “నిను వీడని నీడను నేనే” అని నవ్వుతున్నట్లు అనిపించింది. పాటల్లా కూడా నవ్వొచ్చని అప్పుడే అర్థమైంది. అలా కళ్ళార్పకుండా అంత సేపు అతను ఎలా నన్ను తదేకంగా చూడగలుగుతున్నాడో అర్థం కాలేదు నాకు. కానీ, అతన్ని అడగాలన్నా, అటకాయించాలన్నా, పలకరించాలన్నా - ఏమి చేయాలన్నా కూడా నాలోని ఏ భాగమూ కదలడంలేదు. పక్షవాతం వచ్చినట్లు అయిపోయింది నాకు. స్నేహ లేస్తే లింకన్ నన్ను వదుల్తాడు అనిపించింది ఎందుకో గానీ. నేను లేపలేకపోతున్నా గనుక త్వరగా పొద్దున్నైతే బాగుండు అనిపించింది. పైగా .. దయ్యాలు పగళ్ళు కనబడవంటారు కదా. ఇతను వెళ్ళిపోతాడేమో అనుకున్నా.
అసలు దయ్యాలని ఇతను, ఈవిడా వంటి సర్వనామాలతో పిలవొచ్చా? నాలోని లాజికల్ మనిషి ప్రశ్నలేయడం మొదలుపెట్టాడు.
నా బుర్ర కూడా నా అధీనం తప్పి … ఇలా ఇష్టమొచ్చినట్లు ఆలోచించడం మొదలుపెట్టింది. అసలైన నేను తప్ప నాలోని ఇతర “నేను” లు అందరూ విజృంభించేస్తున్నారు ఇలా .. ఈ లాజిక్ వెధవా, ఆ హేతువాది వెధవా అయితే మరీనూ!”
“అసలైన నేను .. ఇతర నేనులు ఏమిట్రా, తమ వదనం!” హేమంత్ మధ్యలో సందేహం వెలిబుచ్చాడు.
“అది కాదు .. అసలైన నేను అంటే … ఈ నేనుల సమాహారం అనమాట. అంటే … అందరూ వారి వారి పాళ్ళలో ఉంటారు. కానీ … నిన్న రాత్రి .. ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తించారు.”
“భయం అని చెప్పడానికి ఈ డొంకతిరుగుడు కాబోలు.” మనసులో అనుకుని హేమంత్ పైకి మాత్రం “ఆహా … సరే చెప్పు.” అన్నాడు. రాజా కొనసాగించాడు.
“అప్పుడు నాకు మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. నా ధైర్యం పరీక్షించడానికి మీరే ఎవరన్నా స్నేహతో కుమ్మక్కై ఈ ప్లానేసి ఎవర్నో పెట్టారేమో అక్కడ అని. కానీ … అక్కడ నిలబడ్డ ఆకారమేమో లింకన్ లానే ఉంది. ఇప్పటి దాకా రాని ఆలోచన అప్పుడు వచ్చింది. ఓసారి భయంగానే తల కిందకు వచ్చి, లింకన్ కాళ్ళ వంక చూసాను. అక్కడ కాళ్ళంటూ ఏమీ లేవు. ప్యాంటువరకూ కనిపిస్తోంది కానీ … కింద మరి .. ఏముందో .. ఆ బెడ్లైటు వెలుతురు చాలక తెలీడంలేదు. అనుమానమొచ్చి లింకన్ వంక చూసాను.
ఆ పెదాలపై ఇందాకటి విషపు నవ్వు. “ఇప్పుడర్థమైందా, నేనెవర్నో?” అన్నట్లు ఉంది ఆ నవ్వు. సాధారణంగా ప్రేమికులకి తెలుస్తుందేమో ఈ కళ్ళభాష, నవ్వుల భాషా! నాకు ఈ సందర్భంలో ఇలా తెలుస్తుందని అసలు ఊహించలేదు.
నేనూ, లింకన్ అలా ప్రేమికుల్లా కళ్ళతో మాట్లాడుకోడం వింతగా అనిపించినప్పుడొచ్చిందా ఆలోచన .. ఏదో ఓ పూర్వజన్మలో నేను అమ్మాయినేమో, లింకన్ లవర్నేమో .. అని. కానీ .. నవ్వొచ్చినా నవ్వలేనంత భయం. ఓపక్క లింకన్ నా ఆలోచనల్ని చదువుతున్నాడేమో అన్న అనుమానం.
ఈ కంగార్ల మధ్య ఇక దాహం ఆపుకోవడం నా వల్ల కాలేదు. దాహంతోనే ప్రాణం పోతుందేమో అన్న అనుమానం వచ్చింది. సాధారణంగా భయంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారు కదా అందరూ. నిన్నటిదాకా అది వెటకారంగా అనిపించింది కానీ, ఆ క్షణంలో నాకూ తలుచుకోవాలని అనిపించింది. కానీ, ఏ దేవుణ్ణి తలుచుకోవాలో కూడా అర్థం కాలేదు. “దేవుడా!” అని మాత్రం అనుకోగలిగాను పెదాలు కదల్చకుండానే. లింకన్ విషపు నవ్వు తీవ్రత తగ్గినట్లు అనిపించింది. నాకు ధైర్యం చిక్కి, కాస్త లేచి కూర్చున్నాను. లింకన్ అలాగే నిలబడి చూస్తున్నాడు. నేను మరోసారి “దేవుడా!” అనుకుని లేచాను. లింకన్ విషపు నవ్వు తీవ్రత ఇంకాస్త తగ్గినట్లు అనిపించింది. నేను మరింత ఉత్సాహంగా మంచం పైనుంచి కాలు బయటకు పెట్టాను .. అందులోని వణుకును గమనించినా కూడా. లింకన్ ఇంకా అక్కడ్నుంచి కదలనూ లేదు .. ఆ దృష్టి నాపైన్నుంచి మరలనూ లేదు. నేను మంచంపైనుంచి లేస్తూనే పరుగులాంటి నడకతో వెనక్కి చూడకుండా హాల్లోకి వచ్చాను. అప్పుడు వెనక్కి చూస్తే లింకన్ లేడు. “హమ్మయ్య!” అనుకుని వడివడిగా ఫ్రిజ్ వద్దకెళ్ళి ఓ బాటిల్ నీళ్ళు తాగి, ఇంకో బాటిల్ తెచ్చుకుని మళ్ళీ పడగ్గదిలోకి అడుగుపెట్టాను. యధావిధిగా లింకన్ ప్రత్యక్ష్యం మళ్ళీ! నాకు ఆ కళ్ళలోకి చూస్తూ వెళ్ళి మంచం మీద ఎలా పడుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడే రెండుసార్లు పనిచేసిన మంత్రం మళ్ళీ ఉపయోగించి కళ్ళుమూసుకునే మంచందాకా వెళ్ళాను. మంచానికి మోకాలు కొట్టుకుని నొప్పి పుట్టగానే గమ్యం చేరానని అర్థమైంది. వెంటనే దూకబోయి … ఒకవేళ లింకనొచ్చి నా మంచంపై పడుకుని ఉంటే ఎలా? అన్న సందేహమొచ్చి ఓ క్షణం ఆగాను. ఇంతలోనే .. ఇంతసేపు కదలని శాల్తీ ఇప్పుడు కదుల్తాడా? అనిపించి దూకేశాను. మంచంమీద ఉన్నానని నిర్థారించుకున్నాక కళ్ళు తెరిచాను. ఎదురుగా అవే కళ్ళు, అవే చూపులు. ఆ పుస్తకంలో వేసిన ఫొటో లాగానే ఉన్నాడు. నేను చివరిసారిగా దేవుడా అనుకుని కళ్ళుమూసుకుని, ఎందుకన్నా మంచిదని ముసుగువేసుకున్నాను. వేసుకున్నానే కానీ … నిద్రపోలేదు. ఆ దుప్పటి దారాల మధ్య ఉన్న సందుల్లోంచి వీలైనంత ప్రయత్నం చేస్తూనే ఉన్నాను … అతను ఉన్నాడా లేడా? అని చూస్తూనే ఉన్నాను.
రాత్రంతా గడిచిపోయిందని నాకు ఎప్పుడు తెలిసిందంటే … ఈ మధ్య స్నేహ యోగా మొదలుపెట్టిందిలే … ఐదుకి తను లేచింది. తను లేచిందని అలికిడి తెలిసి నేను ధైర్యంగా ముసుగు తీసాను. ఆశ్చర్యం! ఎదురుగా లింకన్ లేడు. వెంటనే స్నేహని పిలిచాను … పిలవడం కాదు అరిచాను … అప్పుడే లేచిన స్నేహ నేనలా అరవడంతో ఉలిక్కిపడింది.
“రాజా! ఎందుకలా అరిచావు? ఎంత భయపడ్డానో తెలుసా!” భయంగానే అడిగింది నన్ను.
“దీనికే ఇలా భయపడ్డావు .. రాత్రంతా నేనెంత భయపడ్డానో తెలుసా? నేను దయ్యాన్ని చూసాను రాత్రి.”
“ఆ కథలన్నీ పడుకునే ముందు చదవొద్దంటే వినవు కదా!”
“అబ్బ! నేను కథలు చదివి భయపడ్డం ముందెప్పుడన్నా చూసావా? ఇదేకదా మొదటిసారి! అంటే .. ఇది నిజంగా జరిగినట్లే కదా!”
“కలొచ్చిందా?”
“నేను నిజమంటే కల అంటావేంటి?” అని తనని కూర్చోబెట్టి కథంతా చెప్పాను.” రాజా ఊపిరి పీల్చడానికి అన్నట్లు ఆగాడు.
“ఇక్కడిదాకా బానే ఉంది … కానీ, దీనికీ, నువ్వు పొద్దున్నే పూజ చేయడానికి ఏమిటీ సంబంధం?” హేమంత్ సందేహంగా అడిగాడు.
రాజా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు “నిజానికి, నిన్న లింకన్ కనబడ్డప్పుడే నాలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. నిన్న అతనితో నా మొదటి మీటింగ్ అయ్యేసరికి ఆ ప్రశ్నలకి జవాబుకూడా దొరికిందా అనిపించింది. పొద్దున్న లేచేలోపు ఆ జవాబు కాస్తా జడివానై నాలో పేరుకున్న నా పూర్వపు విశ్వాసాలన్నీ కడిగేసింది. దాంతో … ఈ నా కొత్త అవతారం…”
“అంటే … నీ ధోరణి నీదే కానీ … మామూలు మనుష్యులు మాట్లాడే భాష మాట్లాడవు అనమాట…”
“అబ్బ! సరే… నీ భాషలో చెబుతా విను. నీకు డాన్ బ్రౌన్ అంటే ఇష్టం కదా… ఆయన నవల్లలో ఏది ఎక్కువ ఇష్టం?”
“ఏంజెల్స్ అండ్ డెమన్స్”
“ఏమిటి నీకందులో ప్రత్యేకంగా నచ్చింది?”
“ఎందుకురా ఇప్పుడు ఇది అంతా?” హేమంత్ కి విసుగు వస్తోంది.
“చెప్పు .. అది చదివినరోజుల్లో దీని గురించి ఏది నచ్చిందని చెప్పేవాడివి? ఓసారి గుర్తు తెచ్చుకో. మన మధ్య దీని పై ఓ చర్చ కూడా జరిగింది. నీ ప్రశ్నకి జవాబు ఆ చర్చలోనే ఉంది.”
“ఏది నచ్చింది .. ఓ! గుర్తొచ్చింది … సిమెట్రీ! అదేనా నువ్వు నా నుంచి ఎదురుచూస్తున్నది …??”
“సరిగ్గా అదే. సిమెట్రీ .. మంచి ఉంటే, చెడు ఉంటుంది. ఒకటి ఉన్నచోట ఇంకోటి ఉండకపోవడం కాదు. ఒకదానికొకటి దోహదం చేసుకుంటాయి. నీల్స్ బోర్ అన్నట్లు “ఆపోజిట్స్ ఆర్ కాంప్లిమెంటరీ”. ఏమంటావు?”
“అవును, అప్పుడు ఇదంతా మాట్లాడుకున్నాము. “యిన్ యాంగ్” గురించి కూడా అనుకున్నాము.”
“ఈరోజు సూర్యోదయమన్నా కాకుండానే నాకు జ్ఞానోదయమైంది అన్నానే. ఇదే చర్చని ఇక్కడికి అన్వయించుకున్నాను.”
“ఊహూ … ఇంకా అర్థం కాలేదురా.”
“అరే … రాత్రంతా లింకన్ నాకు కనిపించాడు కదా. చనిపోయిన మనిషి కనిపించాడు అంటే. దయ్యాలున్నట్లే కదా? దయ్యముంటే దేవుడూ ఉండాలి కదా?”
“ఆహా శ్రీకృష్ణపరమాత్మా! ఎంత బాగా సెలవిచ్చావురా! దయ్యాలున్నాయి కాబట్టి దేవుణ్ణి నమ్ముతున్నావా నాయనా నువ్వు?”
“హమ్మయ్య! యు గాట్ ది పాయింట్!”
“నీ మొహం పాయింట్. అసలు అక్కడ దయ్యముంటే కదా. నీకు కలొచ్చింది. అంతే. సో … నీ లాజిక్ ప్రకారం నువ్వు నాస్తికుడిగా కొనసాగొచ్చు.”
“కలకాదు అని నేనంటున్నాను. నిజంగా జరిగింది అంటున్నాను. అదే నమ్మటంలేదు ఎవరూ. నువ్వూ నమ్మలేదు. స్నేహా నమ్మలేదు.”
ఇక్కడే స్నేహ లోపలికొచ్చింది మార్కెట్ నుండి బోలెడు సామానుతో. ఈ మాటలు విని
“అయితే హేమంత్ … రాజా మొత్తం చెప్పేశాడా?”
“అబ్బో! చెప్పాక నువ్వన్నట్టే నాక్కూడా కాస్త మైండ్ బ్లాకైందిలే.”
“అదన్నమాట సంగతి …” రాజా తాపీగా సోఫాలో కూర్చుంటూ అన్నాడు.
“ఆహా .. ఎంత బాగా చెప్పాడో! స్నేహా .. నువ్వు అదృష్టవంతురాలివి. దీనికి తొలి శ్రోతవి నువ్వే కావడం నీ పూర్వజన్మ ఫలం.” హేమంత్ ఆవేశంగా అన్నాడు.
“నా అదృష్టం గురించి ఇప్పుడా … సంవత్సరం క్రితం పెళ్ళాడినపుడే తెలిసింది లే.” అని నవ్వుతూ రాజా పక్కన కూర్చుంది స్నేహ.
“కానీ .. ఇప్పుడు నాకో కొత్త సందేహం వచ్చి పడింది. ఇప్పుడే తట్టింది ఈ ఐడియా…” ఇంతలో రాజా అన్నాడు.
“అమ్మో! ఇంకో కొత్త సందేహమా .. బాబోయ్!” అన్నాడు హేమంత్. పైకి చెప్పకపోయినా కూడా స్నేహ మొహంలో అదే భావం.
“కంగారు పడకు. చిన్నదే. మరి … చెప్పనా??” మీ జవాబుతో సంబంధం లేదు ఎలాగైనా చెప్పేస్తా అన్నట్లు అన్నాడు రాజా.
“ఏం చేస్తాం. చెప్పు. బయటకెళ్ళి ఇట్లాంటివి అడిగితే కష్టం కదా. వాళ్ళెవరో రాళ్ళూ అవీ తీసుకుని ఇక్కడికి రావడం దేనికి .. అదేదో మేమే పడతాం.” హేమంత్ అన్నాడు.
“లేటెందుకు … అడిగేయ్” స్నేహ కూడా పర్మిషనిచ్చింది.
“ఇప్పుడు … మరి … దయ్యాలు చాలా ఉంటాయి కదా … సిమెట్రికల్ గా దేవుళ్ళూ చాలా మంది ఉండొద్దూ? మరి … నేను ఎవరికి పూజ చేయాలి? ఈరోజంటే కొత్త కనుక ఇంట్లో ఉన్న అందరికీ చేసేసాను. రేపట్నుంచి?”
రాజా ప్రశ్న అడిగి తల ఎత్తి చూస్తే, జుట్టు పీక్కుంటున్న హేమంత్, ఏమి చేయాలో తెలీక తలపట్టుకు కూర్చున్న స్నేహా కనిపించారు. తనలోని మార్పు వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంకా తేరుకోలేదని అర్థమై తన ప్రశ్నకు తానే సమాధానం వెదుక్కునే ప్రయత్నంలో తను కూడా తలపట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు రాజా.
malathi అభిప్రాయం:
May 4, 2008 2:54 pm
బాగుంది రాయ్ గారికి నివాళి. శీర్షిక కూడా చాలా బాగా కుదిరింది. అభినందనలు.
cbrao అభిప్రాయం:
May 4, 2008 6:31 pm
మనము ఎవరు లేక దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే వారు లేక అవి కలలోకి వచ్చే అవకాశముంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నల్లవారికి, స్వేఛ్చావాయువులు పీల్చే కొత్త జీవితాన్నిచ్చిన లింకన్ మహాశయుడు దేవుడు లాంటివాడే, మానవతావాదులకు. రాజా లింకన్ దేవుడికే పూజ చేసినా,ఆ మహనీయుడు దానికర్హుడే. కథ - కథనం బాగుంది.
"Sailakshmi" అభిప్రాయం:
May 4, 2008 11:48 pm
సాయిలక్ష్మి స్వాభిప్రాయం
అర్ధరాత్రి (నిజంగా) అపరాత్రి హ్హా, హ్హా, హ్హా! అని నవ్వి,నవ్వి, నవ్వి ఇంక నవ్వలేక లింకను వస్తాడేమోనని భయపడి అలసిపోతే, పక్కవాళ్ళు ఈ కధ చదివి హ్హా, హ్హా, హ్హా! అని నవ్వి, నవ్వి, నవ్వి నవ్వలేక లింకను వస్తాడేమోనని భయపడి అలసిపోతే, ఇంకో పక్క వాళ్ళు హ్హా, హ్హా, హ్హా! అని నవ్వి,నవ్వి, నవ్వి నవ్వలేక …
చాలా బాగుంది!
K.Mahesh Kumar అభిప్రాయం:
May 6, 2008 8:40 am
బాగుంది. “పాటల్లా నవ్వడం”, ఇంకా బాగుంది.
vijay అభిప్రాయం:
May 7, 2008 12:46 am
చాలా బాగుందండి… చాలా బాగా హాస్యాన్ని పండించారు…
kosyasura అభిప్రాయం:
May 7, 2008 9:08 am
కథ కన్న, కథనం బాగుంది.
నాకూ “లింకన్న గారు” కలలోకొస్తే బాగుండు ననుకున్నాను.
కొ శ్యా సు రా
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
May 7, 2008 9:32 pm
“సత్యజిత్ రాయ్ ఎవరు”
నాకు సత్యజిత్ రాయ్ సాహిత్యంతో పరిచయం లేదు; డాన్ బ్రౌన్ ఎవరో తెలియదు. నీల్స్ బోర్ principle of complementarity గురించి కొంచం తెలుసు. ఈ కథ సారాంశం నాకర్థం కాలేదు. వింత మనుషులతో కాపురం/స్నేహం ఎలా ఉంటుందనా? దీనికి ప్రేరణ ఇచ్చిన రాయ్ సాహిత్యం చదువుదాం అన్న ఆసక్తి నాకు ఎంతమాత్రమూ కలగలేదు.
పోల్చి కించపరిచే ఉద్దేశం లేదు కాని, రాయ్ పుట్టినరోజన్నారు కనుక చెప్తాను. నిన్న రాత్రి ఎందుకో శ్రీపతి కథలు చదువుతుంటే, ఒకటి నన్ను గట్టిగా కదల్చింది. ఇవాళంతా నా ఆలోచనల్లోనే ఉంది. కథ పేరు, “సత్యజిత్ రాయ్ ఎవరు.” అది చదివి, నేను రాయ్ చిత్రాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది అని తీర్మానించుకున్నాను.
కొడవళ్ళ హనుమంతరావు
rajasankar kasinadhuni అభిప్రాయం:
May 9, 2008 7:29 am
పూజారిగారు మంత్రం చెప్పి మమ అనుకోమన్నట్లు, కొడవళ్ళగారి అభిప్రాయం చదివి మమ అనుకున్నాను. ఈ కథ ముఖ్యోద్దేశం నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. అమెరికాదేశ చరిత్రని మలుపు తిప్పిన లింకన్ అంతటివాడు కనబడితే సదరు ‘రాజా’ పాత్ర దుప్పటి ముసుగు తన్ని భయంతో నాస్తికత్వాన్ని వదిలిపెట్టి పొద్దున్న దేవుడికి హారతి ఇస్తాడు. పాత్రల మధ్య చక్కిలిగింతలు పెట్టుకున్నా నవ్వు రాని సంభాషణ అంతా ఈ విషయం మీదే, కాబట్టి, అసలే పసలేని కథ ఇంకా చప్పగా తయారయింది. పైగా ముగింపు కూడా రేపటినుంచి ఏ దేవుడికి పూజ చెయ్యాలన్న ఒక అర్థంలేని ప్రశ్నతో. కనీసం లింకన్ తో జరిగిన సంభాషణ వలన రాజాకి సంఘంలోని అసమానతల విషయంలో కనువిప్పు కలిగినట్లు కథ అల్లి ఉంటే ఆ మార్పు పాఠకులకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఉండేది.
భవదీయుడు,
రాజాశంకర్ కాశీనాథుని
CJ అభిప్రాయం:
May 9, 2008 9:12 am
ఎంటో ఒక్క ముక్క అర్ధమయితే ఒట్టు. లేదా నేను యిలాంటి ఆధునిక సాహిత్యమ్ కి దూరమేమో?
Sowmya అభిప్రాయం:
May 9, 2008 4:12 pm
@Malathi garu, Vijay, Mahesh, Sai Lakshmi and kosyasuraa: Thanks.
@Raja Sankar: నాకు సందేశాత్మక ముగింపు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. ప్రతి కథకీ ఓ సందేశం ఉండాలన్న పట్టుదలేదీ నాకు లేదు. ఈ కథ రాయడంలో నా ఉద్దేశ్యం కేవలం చదివి నవ్వుకోవడం కోసమే. ఇలాంటి సంఘటనలు మన జీవిత స్రవంతిలో ఎంత విరివిగా ఉన్నా కూడా కథ విషయానికొస్తే వాటి సహజమైన దోవలో పోనీయం మనం చాలావరకు. అలా కాకుండా దాని దోవన దాన్ని పోనిచ్చే విధంగా రాయాలనిపించి రాసిన కథ ఇది.
@కొడవళ్ళ గారు: పైన చెప్పినట్లే, ఈ కథకి ప్రత్యేకంగా ఓ ఉద్దేశ్యం అంటూ లేదు. ఏదో ఒక సమయంలో పేజీ తెరిచి, చదువుకుని, ఒకటో అరో చిర్నవ్వులు (వస్తే) నవ్వుకుని, ఇలాంటి బలహీనత ఒకటో అరో మీలో ఉన్నది గుర్తొస్తే , గుర్తుతెచ్చుకోడం. అది జరిగితే ఈ కథ ఉద్దేశ్యం నెరవేరినట్లే.
@CJ: నో కామెంట్స్. :)
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
May 9, 2008 10:51 pm
“ఇందిరా గాంధీ, నేనూ రెండు దోసెలూ!”
సౌమ్య గారూ,
ప్రతి కథా ఏదో సందేశం ఇవ్వాలని నేనూ ఆశించను కానీ, హాస్య రచనకి ప్రత్యేకమైన ఉద్దేశం లేనపుడు, భాషలో, సంభాషణలో చతురత అన్నా ఉండాలి. దయ్యాలూ, దేవుళ్ళూ, సిమెట్రీ, క్వాంటం థియరీ - ఇవేవీ నా బలహీనతలని గుర్తు తేలేదు - అన్వయించుకొని నవ్వుకోడానికి. పూజా, పూరీలకు మించి కథలో తెలుగు వాతావరణమే తక్కువనిపించింది. (తెలుగుతనం గురించి పెద్దగా తెలుసని కాదు. దేశం వదిలి పాతికేళ్ళవుతోంది. చదువుకున్న అమ్మాయిలు, తొక్కా, తోలూ, ఏహె లాంటి మాటలు వాడటం చదివి, ఔరా అనుకున్నాను.)
నాయకులు కలలోకి రావడమంటే గుర్తొచ్చింది. పురాణం సీత “ఇల్లాలి ముచ్చట్లు” లో సీత భర్తకి ఇందిరా గాంధీ కలలోకొచ్చి దోశెలు తిన్న వైనం ఉంది. అది చదివి నవ్వకుండా ఉండలేము. అదీ ఇతరులవి మరి కొన్నీ, భార్గవీరావు గారు సంకలనించి “ఆహా … ఓహో! (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు)” క్రింద ప్రచురించారు. హాస్య రచనలంటే ఇష్టమున్నవాళ్ళు చదవదగ్గది.
కొడవళ్ళ హనుమంతరావు
Sowmya అభిప్రాయం:
May 11, 2008 10:57 am
@Hanuma garu:ఒక్కసారి మా హైదరాబాదొచ్చి కాలేజీపిల్లల మాటలు వినండి. ఇంతకన్నా వివరణ ఏమీ లేదు. వింటే చాలు. నేనుగా ఈ పదాలు వాడకున్నా కూడా. నేను రోజులో పదుల సంఖ్యలో ఇవన్నీ వింటూనే ఉంటాను. హైదరాబాదనే కాదు, ఇక్కడి ఏ ఊర్లో అన్నా ఇంతే ఉండొచ్చని నేను అనుకుంటూన్నా.
రాజేంద్ర అభిప్రాయం:
May 11, 2008 12:00 pm
ఇప్పటివరకూ నేను చదివిన సౌమ్యరచనల్లో నన్ను అసలు ఏమాత్రం ఆకట్టుకోని రచన ఇది.
వాడు .. ఆ పుట్టు నాస్తికుడు …
అబ్రహాం లింకన్ని ఒక దెయ్యపు పాత్రగా ప్రవేశపెట్టటం
పైగా..లింకన్! నా వైపు అభావంగా చూస్తున్నాడు!
లింకన్ కళ్ళలో నాకు కోపం కనబడ్డది,
లింకన్ పెదాలపై ఓ విషపు నవ్వు మెరిసింది.
ఆ పెదాలపై ఇందాకటి విషపు నవ్వు. “ఇప్పుడర్థమైందా, నేనెవర్నో?” అన్నట్లు ఉంది ఆ నవ్వు.
లింకన్ విషపు నవ్వు తీవ్రత తగ్గినట్లు అనిపించింది.
ఇలా వీలయినన్ని సార్లు ఆ మహనీయుడిని తూలనాడటం చాలా ఆశ్చర్యకరంగా,అభ్యంతరకరంగానూ ఉంది.
దయ్యపు పాత్రలతో హాస్యంపండించితీరాలి అనుకున్నప్పుడు ఏ హిట్లర్నో లేదా కుర్రభూషయ్యనో ఒక పాత్రగా తీసుకుని ఉండాల్సింది,పుట్టు నాస్తికుడు అనే జీవి అసలు ఉంటుందా?పైగా వాడికి లింకన్ దెయ్యం లాకనిపించటం దానితో వాడు తెల్లారెపాటికి గంటలకొద్దీ పూజలు చేసి,గంటకొట్టి హారతులిచ్చే స్థాయికి మారటం ఏమిటి?నాస్తికుడు చివరిరీలుకొచ్చేసరికి భక్తశిఖామణిగా మారి తీరాలన్న మన భారతీయ సినిమా సంస్కృతిని నరనరానా జీర్ణించుకోపోతే తప్ప సాధారణంగా ఇలాంటి కధలు అలాంటి ముగింపులు ఇవ్వటం చాల కష్టం.
malathi అభిప్రాయం:
May 13, 2008 11:41 am
ఈవ్యాఖ్యలన్నీ చూస్తుంటే మరోసారి నామాట రాయలేకుండా వుండలేను.. ఈమధ్య కొందరు పాఠకులు తమ ఆలోచనాసరళికి ఏమాత్రం భిన్నంగా వున్నకథ అయినా, దాన్ని పీకి పాకాన పెడుతున్నారు. అలా జరగడానికి అవకాశం లేదు. అంచేత ఆకథ రాయడానికి వీల్లేదు అనుకుంటున్నట్టున్నారు వారు.
నాకథలమీద కూడా ఇలాటి వ్యాఖ్యలు వచ్చేయి కనక ఇక్కడ రాస్తున్నాను. ఒకసంఘటన కాస్త కొత్తగా కనిపించినప్పుడు, ఇది జరిగిందనో, జరగగల అవకాశం వుందని చెప్పడానికో కథ రాస్తాం. నేను ఇలాటికథ చదివితే, నాకు లింకన్ కలలోకి రాలేదు, సౌమ్యకి ఎలా వచ్చేడు అనుకోను. లింకన్ కలలోకి వచ్చినట్టు ఎక్కడో రచయిత్రి చదివి వుండొచ్చు. పైవ్యాఖ్యాతలు అది పర్సనల్ గా తీసుకోనవసరంలేదు.
అలాటిదే నాకు ఒక్కముక్క అర్థం కాలేదన్న వ్యాఖ్య కూడాను. . అన్ని కథలూ ఏవో బ్రహ్మరహస్యాలు బోదించడానికో, మరేదో చెయ్యడానకో కాదు కదా. కనీసం నేను అనుకోను.
ఈమధ్య వస్తున్న చాలా కథలు కేవలం coffee table conversations లాటివే. ఇంచుమించు వారానికి కొన్నివందల కథలు పత్రికలలోనూ, నెట్ లోనూ ప్రచురితమవుతున్నాయి. అన్నీ ఒకే మూసలో పోసినట్టుండవు. ఒకే రకం కొలమానాలకి అందవు. అలా అందుతాయనుకోడం కూడా అమాయకత్వమే.
రాజేంద్ర అభిప్రాయం:
May 13, 2008 11:04 pm
మాలతి గారికి,
నమస్కారాలు,పాఠకులు తమకు ఏ రచనైనా నచ్చనప్పుడు బాగాలేదు,నాకు నచ్చలేదు ఫలాన కారణాలవల్ల అని చెప్పటం తప్పంటారా?లింకన్ ను దయ్యంగా చూపటంతో పాటు ఇతరత్రా కొన్ని అభ్యంతరాలు నేను రాసాను,అలా రాయటం నేరమంటారా?లాల్ బహదూర్ శాస్త్రి అమితాబ్ బచ్చన్ అంత ఎత్తు లేడనీ,సినీనటి సావిత్రి లావుగా ఉంటుందనీ,ఫిడేలు నాయుడుగారికి కళ్ళు లేవనీ ఇలా చాలా పాత్రలు కధలూ వస్తాయి,అప్పుడూ ఇలా మీరు సదరు రచయితలకు మద్దతిస్తారా అని నా అనుమానం.వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం ఒక కధ గురించి ఎందుకుంటుంది?
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
May 13, 2008 11:22 pm
“తెలుగులో సాహిత్య విమర్శ”
మాలతి గారి కథ మీదా, సౌమ్య గారి కథ మీదా నేను నాలుగు మాటలు రాయడాన, మాలతి గారు నన్ను కూడా దృష్టిలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వారికి జవాబుగా ఇదిగో మరో ముక్క.
నచ్చిందనో నచ్చలేదనో ముక్తసరిగా చెప్తే, ప్చ్, నిర్మాణాత్మకంగా లేదు, అని పెదవి విరుస్తారు సంపాదకులు. ఇది ఇందుకు నచ్చింది, ఇది ఇందుకు నచ్చలేదు అని సామాన్య పాఠకుడు తన స్థాయికి తగ్గట్టుగా రాస్తే, పీకి పాకాన పెడుతున్నాడని కళెర్ర చేస్తారు రచయితలు. ఎలా చావడం?!
ఈ సందర్భంలో బూదరాజు రాధాకృష్ణ మన విమర్శ గురించి అన్న మాటలు ఆలోచించదగ్గవి: “గ్రంథానికి లేని విలువ దాని విమర్శకు రాదు; విమర్శకు లేని విలువ గ్రంథానికీ రాదు. ఈ రెండూ అన్యోన్యాశ్రితాలు. ఈ రెంటికీ విడదీయరాని పరస్పర సంబంధముంది. ఒకటి పేలవమైతే రెండోది అప్రశస్తమవుతుంది. ఒకటి దురభిమానభూయిష్ఠమయితే రెండోది నిస్సారమవుతుంది. ఉన్నత సాహితీ సృష్టికి విమర్శలను తట్టుకొని పదికాలాల పాటు బతకాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉండాలి. ఉత్తమ విమర్శకు గుణదోష పరీక్షణ శక్తి కావాలి.”
అయితే రచయితలొక విషయం గుర్తుంచుకోవాలి. నాలాంటి పాఠకులు వృత్తిరీత్యా, కనీసం ప్రవృత్తి రీత్యా నయినా విమర్శకులు కారు. వాళ్ళ పరీక్షణ శక్తి చాలా పరిమితం అని గ్రహించాలి. ఆ పరిమిత శక్తితో వాళ్ళు చేసే విమర్శకు కించిత్ విలువన్నా ఉందో లేదో రచయితలే పరామర్శించుకోవాలి.
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఈమాట లాంటి పత్రికలో ప్రచురించినందుకు రచయితలు గర్వపడొచ్చు. వాటిని కొందరు పాఠకులు మెచ్చుకున్నందుకు పొంగిపోవచ్చు. అది సహజమే. కాని విమర్శించిన సామాన్య పాఠకుల అమాయకత్వానికి జాలిపడకుండా, విమర్శలో తమ రచనలు ఇంకా పైస్థాయికి చేరే సూచనలుంటే స్వీకరించడం, లేకపోతే మర్యాదగా తిరస్కరించడం - అది బాధ్యతగల రచయితల విధి అని నాఉద్దేశం.
కొడవళ్ళ హనుమంతరావు
Sowmya అభిప్రాయం:
May 14, 2008 2:22 am
@Rajendra: Basically, I want to tell something here. Lincoln’s ghost is not my creation. Stories about Lincoln’s ghost have been in vogue since his death. There are some related links here: Wikipedia’s article on Lincoln’s Ghost. Also this kind of photos are galore: Ghost of Lincoln’s Bedroom.
ఇక్కడ నాకు లింకన్ ని కించపరచాలన్న ఉద్దేశ్యం లేదు. మీరు వర్రీ కాకండి.
నేను కథ రాసేటప్పుడు అదంతా ఆలోచించలేదు. ఏదో, సరదాగా రాసానంతే. ముందే చెప్పినట్లు, నాకు సత్యజిత్ రాయ్ రాసే విధానం లో ఉండే కథలంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం. అందుకని ఆ పద్ధతి లో రాసాను. అంతకు మించి వేరే అర్థాలు తీసుకోడానికేమీ లేదు ఇందులో. లింకన్ తో పాత పగలేవీ కూడా లేవు.. :)
రాజేంద్ర అభిప్రాయం:
May 14, 2008 4:57 am
ఆలోచించి రాస్తే ఇంకా బాగుంటుంది అన్నదే నా అభిప్రాయం కూడా.
Sowmya అభిప్రాయం:
May 14, 2008 5:44 am
కథ ప్రయోజనం ఏమిటీ? అన్న దాన్ని బట్టి ఉంటుంది మనం ఏం ఆలోచిస్తాం అన్నది. మీరు ఈ కథ ఒకలా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ, రాసే మనిషిని నేను. నేను రాసే కారణాలు వేరు. అలాంటప్పుడు, మీ ఆలోచనలని నా కథలో ఎలా జొప్పించగలను?
rajasankar kasinadhuni అభిప్రాయం:
May 14, 2008 6:03 am
ఈ చర్చలవలన నాకు కొత్తగా బోధపడిన విషయం ఏమిటంటే, కాఫీ తాగుతూ లేదా కూరగాయలు తరుగుతూ చెప్పుకునే కబుర్లు కథలనిపించుకునే దాకా కథల పరిమితి పెరిగిందనీ, అలా పెరగడానికి వీలుగా కొత్త కొలమానాలు కనుక్కోబడుతున్నాయనీ. సందేశం (బ్రహ్మ రహస్యాల మాట దేవుడెరుగు) ఉన్నా లేకపోయినా, పాఠకులని నవ్వించడమో, కవ్వించడమో, ఏడిపించడమో, ఆలోచింపచేయడమో, ఆసక్తికరంగా చదివించడమో వగైరా వగైరా లక్షణాలు కథలకి ఉండాలనే అపోహలో ఉన్నాను ఇంతకాలం. ఇహనేఁ, నాలాంటి వాళ్ళుకూడా రచనలు మొదలుపెట్టవచ్చు (లేక కథల, కవితల స్థాయి పడిపోవడానికి ఇదే కారణమా?)
వినీల్ అభిప్రాయం:
May 14, 2008 11:54 am
సౌమ్య గారు, నేను సత్యజిత్ రాయ్ కథలు చదివి కనీసం పదేళ్ళయింది. కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. మీ కథ కూడా ఇంచుమించు అలాగే ఉంది. అభినందనలు.
B.AJAY PRASAD అభిప్రాయం:
May 15, 2008 4:02 am
సౌమ్యగారూ.. మీరు రాసిన కథ బాగుంది. పై విమర్శలలో సహేతుకమైన వాటిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని మంచి కథలు రాయండి.
సత్యజిత్ రాయ్ రాసిన “టాడ్ పోల్ గుడ్డు” కథ నాకు చాలా ఇష్టం. అసంఖ్యాకమైన రాయ్ అభిమానుల్లో నేనూ ఒకడిని.
అభినందనలతో..
బి.అజయ్ ప్రసాద్
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
May 15, 2008 1:42 pm
“తెలుగులో సాహిత్య విమర్శ”
హనుమంత రావు గారూ, మీరు అనుకున్నట్లుగా చాలామంది రచయితలుండరు. వ్యక్తులకీ, వస్తువుకీ తేడా తెలియదు చాలామందికి. కథ బాగుందని రాసారా, సంతోషిస్తారు, మంచి పాఠకులుగా దండేస్తారు. కాస్త ఏదయినా వాస్తవానికి దూరంగా అనిపించిందా, రచయితలు ఒప్పుకోడానికి సిద్ధంగా ఉండరు. విమర్శించే వాళ్ళ దాంట్లో విషయం ఉన్నా, రాసేవాళ్ళ అహం ఒప్పుకోదు. ఒక కథ అందరికీ ఆమోద యోగ్యంగా రాయాలనేం లేదు. చిన్న చిన్న విమర్శలు పరవాలేదు చాలా మందికి. కాస్త ఘాటుగా రాస్తే, విమర్శ పై విమర్శ దారితప్పి, వ్యక్తిగతం అయ్యే ప్రమాదం ఉంది. మరీ గట్టిగా గదమాయిస్తే, మేం మామూలు పాఠకులకోసం రాసామంటూ చర్చనుండి తప్పిస్తారు. తెలుగు సాహిత్యంలో విమర్శ ఎదగకపోవడానికి రచయితలే ముఖ్య కారణం. పొగడ్తలు ఇచ్చే వాళ్ళు మిత్రులూ, విమర్శకులు శత్రువులుగా పరిగణించడం సర్వ సాధారణం. రాసేవాళ్ళు ఎప్పుడూ పైనే ఉంటారు, చదివేవాళ్ళు క్రిందనే ఉంటారు అన్న భావన చాలా మందికుంటుంది. రాసేవాళ్ళు తమ తప్పులు ఒప్పుకోరు. అంగీకరించినా, లేకపోయినా ఇది మాత్రం వాస్తవం.
ఈ కథపై వచ్చిన చర్చ బాగుంది. దీని వల్ల రాసేవాళ్ళకీ, చదివే వాళ్ళకీ ఉపయోగమే!
- సాయి బ్రహ్మానందం గొర్తి
V.B.Sowmya అభిప్రాయం:
May 15, 2008 5:35 pm
అజయ్ గారికి & వినీల్ గారికి:
రాయ్ కథలు చదివిన మీ నుండి వచ్చిన వ్యాఖ్యలు నాకు విలువైనవి. ధన్యవాదాలు.
బ్రహ్మానందం గారికి:
మీరన్నది కొంతవరకు నిజం, నా దృష్టిలో. మిగితా సగం, రచయితలే కాదు, రచయితల అభిమానులు కూడా కారణం :). తమ అభిమాన రచయిత ని విమర్శిస్తే తట్టుకోలేనంత అభిమానం ఉన్న అభిమానులు :).
Sai Brahamanandam Gorti అభిప్రాయం:
May 15, 2008 10:41 pm
సౌమ్య గారూ,
కాకి పిల్ల కాకికి ముద్దు అన్న చందంగా ఎవరి రచన వారికి బాగుంటుంది. బాగోలేదనే సరికే అసలు గొడవ ప్రారంభం అవుతుంది. అన్నవాళ్ళని తక్కువగా చూడ్డం, మీరు చెప్పినట్లు అభిమానులు గుడ్డిగా వంత పాడ్డం ఇవన్నీ తెలుగు సాహిత్యానికి మంచిని చేయలేవు. విమర్శకీ, కువిమర్శకీ తేడా తెలియని రచయితలే ఎక్కువ. మంచి విమర్శ వల్ల కొత్త విషయాలూ, కనిపించని కోణాలూ వెలుగులోకి వస్తాయన్న అవగాహన రచయితల్లో కొరవడింది. ఇది తెలుగు సాహిత్యానికి పట్టిన దౌర్భాగ్యం. ఏం చేస్తాం? ఇది మాత్రం మింగుడుపడని వాస్తవం.
చాలా పత్రికలు బాగోలేదని విమర్శ రాసినా వేయవు. ఈ విషయంలో ఈమాట ఒక్కటే మినహాయింపు.
-సాయి బ్రహ్మానందం గొర్తి
Sowmya అభిప్రాయం:
May 17, 2008 10:10 am
బ్రహ్మానందం గారు:
తెలుగు సాహిత్యానికి మాత్రమే నంటారా?
నాకు అది ఎక్కడన్నా కనిపించే సహజ గుణమేమో అని అనుమానం.
malathi అభిప్రాయం:
May 18, 2008 7:17 am
హనుమంతరావు గారూ, నాకు రాధాకృష్ణగారి వ్యాక్యాలు అర్థం కాలేదు కానీ, మీరు చెప్పింది - రచయితలు పాఠకులవిమర్శలని సహృదయతతో స్వీకరించి ఆలోచించుకోవావి అన్నది అర్థం అయింది. ఒప్పుకుంటాను. రచయితలందరితరఫునా నేను వాదించడంలేదు కానీ, నామటుకు నేను నారచయితమిత్రులతో సంప్రదించి మార్పులు చేసుకున్న సందర్బాలున్నాయి.
బ్రహ్మానందం గారు వెలిబుచ్చిన రెండు అభిప్రాయాలు - రచయితలు తామేదో పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారు అనీ, ఈమాటవారు తమకి వచ్చిన విమర్శనలన్నిటినీ నిష్పక్షపాతంగా ప్రచురిస్తున్నారు అనీ.
ఈమాట వారు విమర్శలని ప్రచురిస్తారు కానీ కథలకి అలా కాదు. తమ కొలమానాలకి నప్పితేనే వేసుకుంటారు. అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.
ఇలాటికథలు రాయకండి అని రచయితలకీ, ఇలాటివి వేసుకోకండి అని సంపాదకులకీ చెప్పడం సమంజసమే అనుకునే పాఠకులు తాము పైమెట్టుమీద వున్నాం అనుకుంటున్నారేమోనని అనుకోడానికి అవకాశం వుంది కదా,
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
May 18, 2008 8:13 pm
“తెలుగు సంగతులు”
మాలతి గారూ,
మీరు బూదరాజు రాధాకృష్ణ గారి వాక్యాలు అర్థం కాలేదన్నారు. సందర్భం అవసరం కావచ్చు. ఆ వ్యాసం అందుబాటులో ఉన్న “తెలుగు సంగతులు” అన్న పుస్తకంలో ఉంది. ఆయన రచనలన్నీ చదవదగ్గవి.
కొడవళ్ళ హనుమంతరావు
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
May 19, 2008 8:56 am
మాలతి గారూ,
మొదటిగా -
ఏ పత్రికకయినా వారి వారి అభిరుచుల్ని బట్టి కొన్ని నియమాలుంటాయి. ప్రమాణాలు ఉండచ్చు. దాన్ని బట్టే ఆ పత్రిక నాణ్యత ఉంటుంది. కాబట్టి కథల ఎంపిక విషయంలో అది వారిష్టం. ఒక పత్రిక తిరిగి పంపిన కథకి, ఇంకో పత్రిక బహుమతి ఇవ్వచ్చు. కథలని ప్రచురణకి ముందు, సమీక్ష చేయడం ఈమాట వారి ప్రమాణం కావచ్చు. ఇదికూడా ఆయా సమీక్షకుల అభిరుచిని బట్టీ, వారు వెలుబుచ్చే అభిప్రాయాలబట్టీ ఉంటుంది. ఒక్కోసారి సమీక్షకులు బాగా చేయచ్చు. లేదా బాగోలేదనీ సంపాదకులకు చెప్పచ్చు. ప్రచురణ విషయంలో అక్కడ సంపాదకుల విచక్షణకి ఆయా రచన పరిమితం అవుతుంది. కాబట్టి ఇవి నచ్చినప్పుడే రచయితలూ రాయడం జరుగుతుంది. మీరు రాసివ్వండి, మేము కళ్ళు మూసుకొని వేసేస్తాం అన్న ధోరణి తో అనేక పత్రికలు నడుస్తున్నాయి. ప్రమాణాలు ఎప్పుడూ సాపేక్షమే!
ఇహ రెండోది.
“అంటే ఆ రచన కనీసం ఒక రేటింగుకి నోచుకున్నట్టే.. రచయితలనుండీ పాఠకులు సహృదయత ఆశించడం ఎంత న్యాయమో, పాఠకులనుండీ రచయితలు కూడా అలాటి సహృదయతనే ఆశిస్తారు.” అన్న విషయంతో నేను ఏకభవించను. ఒక రచయిత తన రచనని ప్రజల ముందు వదిలాక అది బాగుందీ, బాగోలేదూ అన్నది పాఠకుల అభీష్టం. రచయితకెలా రాసే హక్కు ఉందో, పాఠకులకీ విమర్శించే హక్కు ఉంది. ఇక్కడ సహృదయత ఆశంచడం ఎంత వరకు సబబు? రాసిన ప్రతీ రచన్నీ మెచ్చుకోవాలని ఆశించడం సహృదయతా? లేక నొప్పించకుండా పరవాలేదు అని చెప్పడం సహృయదతా?
అందరికీ అన్నీ నచ్చాలని లేదు. విషయ పరంగా నచ్చకపోయినా వస్తుపరంగా విమర్శ ఉంటే అది స్వీకరించడానికి రచయితలు సిద్ధంగా ఉండరు అన్నదే నా పాయింటు.
వెబ్ లో అనేక పత్రికలున్నాయి. ఎన్ని పత్రికలు ఇలా చర్చలకి ఆహ్వానం పలుకుతున్నాయి? ఈ మాట సంపాదక వర్గమూ కొన్ని అభిప్రాయాలని కత్తిరించిన సందర్భాలున్నాయి. కాదనను. ఇదీ విమర్శకులూ, రచయితలూ హద్దు మీరినప్పుడే! కొన్ని పత్రికలయితే కేవలం “ఆహా, ఓహో” అనే పొగడ్తలనే రాస్తాయి. తెగడ్తలని తుంచి పారేస్తాయి. ఇండియాలో పత్రికలయితే సరేసరి. స్థలా భావం సాకు ఎలాగూ ఉంది.
కాకపోతే మనకి అమెరికన్లలాగ నొప్పించకుండా చెప్పడం రాదు. చెత్త ప్రశ్నని కూడా “చాలా మంచి ప్రశ్న” అని మొదలెట్టి, చివరికి చెత్తలో చేర్చడం మనకలవాటులేదని నా అభిప్రాయం.
చివరగా, ఒక్కసారి ఈ అభిప్రాయాల శీర్షిక లేదనుకోండి. మనం ఇలా ఇన్ స్టంట్ గా చర్చించుకునే వాళ్ళమా, చెప్పండి?
రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
May 19, 2008 6:19 pm
మాలతి గారు,
ఎవరో కొందరు పాఠకులు పైమెట్టు మీద వున్నావని అనుకున్నందు వలన రచయితకి నష్టవేవిటండి? ఏ మెట్టుమీదున్నా విమర్శని తీసుకోవటం, తిరస్కరించటం రచయిత ఇష్టాఇష్టాలే కదా. రచయిత పైమెట్టు మీదున్నానని అనుకోకపోతే చాలు (అనుకుంటే రచయితకే నష్టం).
“ఈమధ్య కొందరు పాఠకులు తమ ఆలోచనాసరళికి ఏమాత్రం భిన్నంగా వున్నకథ అయినా, దాన్ని పీకి పాకాన పెడుతున్నారు.” ఆ పాకం పాఠకుల హక్కు. పాకం బాగుంటే మరింత రుచిచూడండి, లేదనుకుంటే రుచిచూడకండి. ఎందుకు బాగలేదో చెప్పండి. కానీ పాకం బాగలేదని నిష్టూరపోతే ఎలా మాలతి గారు.
ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:
May 25, 2008 2:52 am
పైన జరిగిన చర్చ చాలా రసవత్తరంగా బాగుంది.
నా వరకూ కథ పెద్దగా నచ్చలేదు. ఇందులో హాస్యం పాళ్ళ కోసం రాసానని రచయిత చెప్పినా కథలో ఆ పాళ్ళు పెద్దగా లేవనే నాకనిపించింది. కథనం నడిపిన విధానం బాగానే ఉంది.
అన్నిటికన్నా నాకు నచ్చనిది లింకన్ పాత్రనే దెయ్యం గా ఎంచుకోవడం ఎందుకు ? ఆ పాత్రకి సంబంధించిన సంభాషణ జరగలేదు. అంటే లింకన్ కి సంబంధించి జరిగిన చర్చ ఏదీ లేదు కథలో. ఆ పాత్రని దేనితో మార్చినా కథ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఒక ప్రముఖ కారెక్టరుని ఉపయోగించడం అనవసరం.
ఇక రచయితలు విమర్శలని స్వీకరించే విధానంలో మార్పు రావాలనే నా ఉద్దేశం కూడా. విమర్శ మంచిది అనిపిస్తే దానిని స్వీకరించి తమ రచనా విధానంలో మార్పులు చేసుకోవచ్చు. అలా కాక నే ఆలోచించిన విధానంలోనే పాఠకులు కూడా ఆలోచించాలి అనుకుంటే వారికే నష్టం. విమర్శలో పస లేకపోతే దానిని దాని మానాన వదిలెయ్యవచ్చు.
Sowmya అభిప్రాయం:
May 30, 2008 9:09 pm
@praveen: నేను రచయిత్రిని. రచయితను కాను :).
లింకన్ నే ఎందుకు పెట్టాను? ఇంకెవరినన్నా పెట్టుండొచ్చు. నిజమే. కానీ, ముందే చెప్పినట్లు, లింకన్ ఆత్మ గురించి ప్రచారంలో ఉన్న కథలే ఈ కథకి inspiration. కనుక నేను ఇంకోళ్ళని పెట్టుకోలేను. ఇది లింకన్ ని కించపరచడం కాదు అని మరోసారి మనవి చేసుకుంటున్నా.
రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
June 1, 2008 6:37 am
సౌమ్య గారికి,
ఎంత సెక్సిస్టు ఆలోచన సరళి నుంచి తప్పుకున్నావని అనుకున్నా, తెలీకుండానే ఏ హానీలేదనిపించే, అమాయకవైన పద ప్రయోగంతో బయటపడే మురికిని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. నేను కూడా మాలతి గారికి జవాబిస్తూ రచయిత్రి బదులు రచయిత పదం వాదటం జరిగింది. రచయిత(త్రి) అనే పద ప్రయోగం కాకుండా లింగబేధం సూచించని తెలుగు పదం ఎవరన్నా సూచిస్తే బాగుండు రచయిత(త్రి) బదులు.
[ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఫెమినిస్టుల ఉద్యమాల కారణంగానే ఇంగ్లీషులో authoress, actress, waitress, stewardess వంటి పదాల వాడుక దాదాపు కనుమరుగైపోయింది. రచయిత అన్న పదాన్ని లింగరహిత (gender neutral) నామవాచకంగా ప్రయోగించడం తెలుగులో కొంత కాలం నుంచే ఉందన్న అభిప్రాయం తోనే, ఈమాటలో కూడ రచయిత్రికి బదులుగా రచయిత అన్న పదాన్ని ఈ మధ్య కాలంలో వాడుతూ వచ్చాము. - సంపాదకులు]
B.Srikanth అభిప్రాయం:
June 14, 2008 12:07 am
కధ బాగుంది. సరదాగా ఉంది.
Nanduri Venkata Subbarao అభిప్రాయం:
June 16, 2008 5:38 am
సౌమ్య గారికి అభినందనలు. కథనం బాగుంది. కానీ చెప్పదల్చుకున్న అంశంలో స్పష్టత లేదు. ( ఏమీ చెప్పదల్చుకోలేదని మీరు అంటున్నారు కానీ ఇది స్వగతం కాదు కదా, పాఠకుల కోసం వ్రాసిన కథ. దయ్యాలకు భయపడి దేవుడున్నాడని ఒప్పుకోవడం వాస్తవానికి దగ్గరగా ఉండటం నిజమే. కానీ లింకన్ దయ్యమే ఎందుకు కనబడింది, కనబడినా ఎందుకు కోపగించుకుంది? వీటి వెనుక తర్కం లేదు. హాస్య కథ విజయవంతమ్ కావాలన్నా తర్కం ఉండాల్సిందే. మీకున్న లకథన శక్తికి మరింత కసరత్తు చేస్టే పది రోజులపాటు గుర్తుండే కథ వ్రాయగలిగేవారని నా విశ్వాసం.