ఓ చందమామ
ఏడుస్తోందని ఎత్తుకుని
చందమామను చూపించాను
రెట్టింపు ఏడుపుతో ఆ చందమామ కావాలంది
అమ్మకిచ్చేసాను
అమ్మ ఒడిలో ఓ చందమామ!
పాలు తాగుతూ పడుకుంటోందని
ఎత్తుకుని లాలించాను
మత్తు నిద్రతో గురక పెడుతోంది
వెచ్చగా పడుకోబెట్టాను
ఉయ్యాలలో ఓ చందమామ
తప్పటడుగుల్తో బోర్లాపడితే
చేయి పట్టుకుని నడిపించాను
అలుపెరగని నడకతో ఇల్లంతా తిరుగుతోంది
నీరసంగా కూలబడ్డాను
నట్టింట్లో ఓ చందమామ
ప్రక్కింట్లో చూసి సైకిలు కావాలంది
చిన్న సైకిలు కొనిచ్చా
రెట్టించిన ఉత్సాహంతో తొక్కేస్తోంది
వీధిలో చూస్తున్నాను
వీధి వీధంతా ఓ చందమామ
స్కూల్లో పాఠాలు అర్ధం కాలేదంది
దగ్గిర కూర్చుని నేర్పిస్తే
సరే రోజూ ఇలాగే హోం వర్క్ చేయించమంది
ఓపిగ్గా చేయించాను
రాత్రంతా ఓ చందమామ
కాలేజీలో జేరాక మాట విననంది
ఎందుకని అడిగితే
తిండి తినకుండా తలుపేసుకుపడుకుంది
బయటనుంచే బ్రతిమాలాను
ఒంటరిగా ఓ చందమామ
పెళ్ళికని సంబంధాలు చూస్తే
నాకొద్దు పొమ్మని
అల్లుడ్ని తనే తీసుకొచ్చింది
పెళ్ళయ్యాక
అత్తవారింట్లో ఓ చందమామ
ఏడాది తిరిగాక
పుట్టింటికి తీసుకొస్తే
పుల్ల మామిడికాయ కావాలంది
ఇంకో ఆర్నెల్లకి
చందమామ ఒడిలో ఓ బుల్లి చందమామ
[థాంక్స్ - వింజమూరి పెద్దబాబు]
teresa అభిప్రాయం:
March 1, 2008 10:48 am
చాలా బాగుంది!
mOhana అభిప్రాయం:
March 1, 2008 1:48 pm
ఆకాశంలో ఒకే చందమామ, కాని మంచు బిందువులు ఎన్ని
చందమామలను ప్రతిఫలనము చేస్తుందో! అలాగే జీవితంలో
ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చందమామ!
చక్కని హృదయంగమమైన కవిత - మోహన
ravikiran timmireddy అభిప్రాయం:
March 1, 2008 7:01 pm
రోజూ చూస్తున్నా చందమామ క్రొత్తగానే కనిపిస్తాడు ప్రతిరోజూ. నిన్న చూసిన చంద్రుడే ఐనప్పటికీ, ఈ రోజు కూడా ఒక అద్భుతవైన భావాన్ని మనసులో వెలిగిస్తాడు. నాయంతెత్తు పెరిగిన నా కూతురు, పదమూడేళ్ళనుంచి చూస్తున్న నా కూతురు, రోజు రోజు నా కళ్ళకి అద్భుతంగా కనిపించటం నాకనుభవవే కదా!
బాగా వ్రాశారండీ. వొకటికి రెండు సార్లు చదివేలా, చాలా బాగా వ్రాశారు.
నిషిగంధ అభిప్రాయం:
March 3, 2008 4:45 am
వావ్!! ఒక్క చందమామ ఎన్ని విధాలుగా!! చాలా బావుందండి!
radhika అభిప్రాయం:
March 3, 2008 1:56 pm
మీ చందమామ వెన్నెలను మాకు కూడా పంచినందుకు చాలా థాంక్స్.కవిత ముద్దుగా అనిపించింది.
కొత్తపాళీ అభిప్రాయం:
March 4, 2008 2:20 pm
ఆ ర్ద్రంగా ఉందండీ.
ఇలాగే ఇంకో తండ్రి మమకారం ఇక్కడ
http://eemaata.com/em/library/ata-2006/271.html
సోమ శంకర్ అభిప్రాయం:
March 12, 2008 1:00 am
చాలా బాగుంది! కొత్త పాళీ గారు లింక్ ద్వారా అందించిన “పిచ్చినాన్న” కవిత కూడ బాగుంది. రెండు, రెండే నాన్న వాత్సల్యాన్ని బాగా వ్యక్తం చేసాయి.
సోమ శంకర్
yashwanth.alakky అభిప్రాయం:
March 15, 2008 10:48 pm
చాలా బాగుంది.
kosyasura అభిప్రాయం:
March 31, 2008 6:13 pm
ఇంత చిన్ని ఆకాశంలో ఎన్ని చందమామలో ఇంత చిన్ని బ్రతుకులోఎన్ని అందమామలో. పగటి పూట జాబిల్లిని వెతికే ఎంత మంది వెర్రి నాన్నలో
ఇంకో వెర్రి నాన్న.
కొ శ్యా సు రా
Seetha అభిప్రాయం:
April 2, 2008 11:16 pm
అబ్బ ఎంత బాగుందో…..
Lakshmi kallakuri అభిప్రాయం:
April 8, 2008 9:48 am
బాగుంది. నిత్యము ఎన్నోకళలతో సంతోషము వెలిగించే వెన్నెల బొమ్మ
కనీకనిపించనీ దూరము కదూ! ( అమ్మనాన్నలకు.)
‘సాయిలక్ష్మి’
bollojubaba అభిప్రాయం:
April 30, 2008 11:15 am
కవిత చాలాబాగుంది
చందమామను మనింట్లోని పాపతో పోల్చి, వర్ణించటం నచ్చింది.
వ్యక్తీకరణ అందంగా ఉంది.
కానీ చందమామ కు సంబందించిన వివిధ అంశాలైన, పౌర్ణమి, అమావస్య, శుక్లపక్షం, కృష్ణపక్షం, వెన్నెల, నెలవంక, హేమంతరుతువు, ఆటుపోట్లు మొదలైనవాటిని కూదా కవితలో చొప్పించగలిగితే ఇదొక అద్భుతమైన కవితగా మిగిలిపోతుంది.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/