ఈమాట » లిటిల్‌సైంటిస్టు

Expand to right
Expand to left

లిటిల్‌సైంటిస్టు

[Editors’ Note: ఈమాట పాఠకులకు నమస్కారం. మునుపెక్కడైనా ప్రచురింపబడ్డ కథల్నీ కవితల్నీ వ్యాసాల్నీ (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప)ఈమాటలో పునర్ముద్రించగూడదనే నియమం ఉన్నదని మీకందరికీ తెలిసిన విషయమే.అయితే కొన్నిసార్లు పొరపాట్లు సహజం. ఫణి డొక్కా గారి ఈ కథ పునర్ముద్రితమని మాకు తెలియగానే మా నియమాన్ననుసరించి కథను తొలిగించి వేశాం. కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణా, సంజాయిషీల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. అయితే ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి రాకుండా, రచయితలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా మరికొంచెం శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాం. అందుకే మరొక్కసారిగా - ప్రచురితమైనవే కాక, ఇంకెక్కడైనా ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు కూడా ఈమాటకి ఆమోదయోగ్యం కావు. కొన్ని కొన్ని చోట్ల, ఒక రచనని ప్రచురిస్తున్నారో లేదో ఒక పట్టాన చెప్పరు. అటువంటి సందర్భంలో, ఈమాటకు పంపేటప్పుడు, ఆ ఇంకో చోటినుంచి ఆ రచనను తప్పక ఉపసంహరించుకునే బాధ్యత రచయితదే.

ఈమాటకు ప్రచురణార్ధం వచ్చే ప్రతీ రచన పునర్ముద్రణో కాదో తెలుసుకోవడం మాకు అసంభవం. అయినా మామూలుగా రచయితల్నీ కవుల్నీ లిఖిత పూర్వక హామీలు మేమడగనూలేదు (ఎవరో ఒకిద్దరు మరీ కొత్తవాళ్ళైతే తప్ప), ఆ…అడగట్లేదులే అని మీరెవరూ మా నియమాన్ని అలుసుగా తీసుకోనూ లేదు. కారణం, మీమీద మాకూ, మామీద మీకూ ఉన్న నమ్మకం మాత్రమే. ఈ నమ్మకాలూ గౌరవాలే ఒక సుహృద్భావ సాహితీ వాతావరణంలో ఈమాట కలకాలమూ మనగల్గడానికి ఆయువుపట్లు. వీటిని కాపాడుకోవడం మీరో మేమో మాత్రమే చేయగలిగింది కాదు, ఈ బాధ్యత మనదీ, మనందరిదీ కూడా.]

“నాన్నా, నెక్స్ట్‌వీక్‌నించీ సైన్సులాబ్‌ మొదలు పెడతారు, నాకో కోటు కొను అర్జెంటుగా.” గబుక్కున వెనక్కి తిరిగి చూసాను. పైన ఎవరూ కనబడలేదు. కిందకి చూసాను. భూమికి జానెడు లేదు, దీనికప్పుడే సైన్సులాబులూ, స్కైలాబులూ ఎందుకు? దానికోసం మళ్ళీ కోట్లూ, కొమ్మచ్చులూనా? దోచేస్తున్నారు దొంగపీనుగులు. చెప్పి చఛ్ఛేదేవీ లేదు గానీ, ఈ హంగులకేం తక్కువలేదు. అసలు వీళ్ళ సైన్సు టీచర్ని చూడడానికి నిజంగానే రెండు కళ్ళూ చాలవు. ఇంకో రెండు కళ్ళు అప్పు తెచ్చుకుంటేనే గానీ ఆ “అప్పూ” ని సాంతం చూడలేము. ఆ గుమ్మం నించి ఈ గుమ్మందాకా వుంటుంది పాపం. ఆవిడే చెట్టయ్యి వుంటే రెండిళ్ళకి సరిపడా చెక్క అన్న మాట. “ఏవిటీ మాట్లాడవు?” అన్నట్టు చూసింది నా కూతురు. “సరే, వీకెండు కొందాంలే, అమ్మ బయల్దేరుతోంది, పదా స్కూలుకి” అని పంపించేసాను. వచ్చి ఆఫీసు రూమ్‌లో కూర్చున్నాను, ఆట్టే పని లేదు. వచ్చేవారం కొత్త ప్రాజెక్టు మొదలు. అప్పటిదాకా వర్కింగ్‌ఫ్రం హోమ్‌.

వేలెడంత లేరు, వీళ్ళకి సైన్సు లాబులా? మేము ఇంటరుమీడియెట్‌లో మొట్టమొదటిసారి చూసాం, అసలు లాబ్‌అంటే ఏవిటో. అప్పటి వరకూ సైన్సు పాఠవైనా, తెలుగు పాఠవైనా ఒకటే పట్టు. వేదంలాగ విని, వల్లించడవే, శృతి అన్నమాట. ఉత్సాహం కాస్త ఎక్కువై, పూనుకుని మొదలెట్టిన ప్రతీ ప్రయోగమూ ఓ ప్రహసనంలా తయారయ్యేది.

జీవితంలో మొట్టమొదటి సారి మూడో క్లాసులోనో,నాలుగులోనో చేసాం సైన్సు ప్రయోగం. ‘ఒక గాజు బీకరు తీసుకొనుము. నీళ్ళతో నింపుము. ఒక పుల్లకు పైన వొకటీ, మధ్యన వొకటీ, కిందన ఒకటీ చిక్కుడు గింజలు కట్టుము. మధ్య గింజ సగము ములుగునట్లుగా పుల్ల బీకరునందుంచుము. రెండ్రోజుల తరవాత చూడుము. పైగింజ ఎండి చఛ్ఛును. లోపలి గింజ ఉబ్బి చఛ్ఛును. మధ్యది మాత్రము మొలకెత్తును. నీ గమనికలు, తీసుకోవలసిన జాగ్రత్తలు వివరింపుము’ అని వుండేది. “గాజు బీకరుకు బదులు ప్లాస్టిక్‌చెంబు వాడ వచ్చును. పుల్లకోసము కొండ చీపురు వాడునప్పుడు అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడవలెను. మిఠాయి పొట్లమునకు ఉన్న దారముతో సరిపెట్టుకొనవలెను. అమ్మ డబ్బాలో వున్న ట్వైను దారము తీయరాదు. లేనిచో ప్రమాదము” అని రాసాను. అది చూసి మా సైన్సు మేష్టారు ఒకటే నవ్వు. అన్నట్టు రెండో క్లాసులోనే ఒక చిన్న పరిశోధన చేసాను గానీ కారణాంతరాల వల్ల అది సగంలోనే ఆగిపోయిందికాబట్టి లెక్కలోకి రాదు.

‘ఒక బంగాళా దుంప ఉడికించి, సగం పెరట్లో పెట్టుము, సగం ఫ్రిజ్జిలో పెట్టుము. రెండు రోజుల తరవాత చూసినచో బైట వున్న ముక్క బూజు పట్టును, దానిని ఫంగస్‌అందురు. ఫ్రిజ్జులో ఉన్నది బాగుండును, వేయించుకు తిన్నచో ఇంకా బాగుండును’ అని వుండేది. బంగాళ దుంప అంటే ఉడికించాను గానీ, ఫ్రిజ్జు ఎక్కడనించి తేనూ? అక్కడికీ అమ్మనడిగాను, “అమ్మా, ఫ్రిజ్జు కొనుక్కుందావే, లేకపోతే స్కూలుకి రావద్దన్నారే” అని. “ఇంతోటి బోడి చదువుకీ ఫ్రిజ్జులూ, విమానాలూ కొనలేంగానీ, నా మాట విని శుబ్భరంగా చదువు మానేసి, అంట్లుతోమడం నేర్చుకో, పనికొస్తుంది” అంది అమ్మ నవ్వుతూ. నేను అబద్ధవాడానని అమ్మకెలా తెలిసిపోయిందో? అక్కడికీ బాగానే చెప్పాను, మొహం జాలిగా పెట్టి. నాక్కోపవొచ్చి మొత్తం బంగాళదుంప బైట పారేసాను. సాయంత్రం మామ్మ చెప్పింది “పోనీ సగం ముక్క తెచ్చి మన కుండలో పెట్టుకో, అదీ చల్లగానే ఉంటుంది, ఫ్రిజ్జంటే బోలెడు ఖరీదు” అని. నిజమే, అప్పట్లో మావూరు మొత్తం మీద డాక్టరు వర్మ గారింట్లోనే వుండేది ఫ్రిజ్జు మరి. సరే, అలా ఆగిపోయిందా బంగాళ దుంప పరిశోధన, కాబట్టి చిక్కుడు ప్రయోగమే మా మొదటిది.

తరువాత శాస్త్రీయ నామాలతో, బోలెడంత హడావిడి చేసాను. ఓసారి, భాస్కర్రావు కొట్టోకెళ్ళి, “ఓ రూపాయి సోడియం క్లోరైడు ఇయ్యి, అమ్మ తెమ్మంది” అంటే వాడు తెల్ల మొహం వేసి “అదేటండీ?” అన్నాడు. అప్పుడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్‌లా ఫోజు పెట్టి, “సోడియం క్లోరైడు అంటే ఇదీ” అన్నాను ఉప్పు బస్తా చూపించి. అదే వూపులో ఇంటికొచ్చి, మామ్మ దగ్గరికెళ్ళి “మామ్మా, నీక్కొంచెం హెచ్‌టూవో కావాలా?” అని అడిగాను. “వద్దురా, ఆట్టే దాహం లేదు” అంది మామ్మ. నాకు గుండె ఆగినంత పనైంది. “మామ్మా, హెచ్‌టూవో అంటే..నీ కెలా తెలుసే..” అన్నాను నీళ్ళు నవులుతూ. “అన్న చెప్పాడు రా, వాడు నాకు చక్కగా పాఠాలు అప్ప చెబుతాడు కదా, అప్పుడు చెప్పాడు”.. వెంఠనే వెళ్ళి అన్న జామెట్రీ బాక్సు కనపడకుండా దాచేయాలనిపించేది. కానీ, జామెట్రీ బాక్సు లేకపోతే వాడి హోంవర్కు అవదు, అది పూర్తైతేనే గానీ నా హోంవర్కు అవదు. అందుకే వదిలేసేవాడిని.

ఆరో తరగతిలో గోనో మీటరో, గోదారి మీటరో ఏదో ప్రయోగం ఉండేది. జామెట్రీ బాక్సులోని “డి” తీసుకుని, దానికి రెండు స్ట్రాలు అతికించి, భవనం ఎత్తు కొలవమని. సరే, గడియార స్థంభం ఎత్తు కొలుద్దాం కదా అని, దాని ముందు నిలబడి స్ట్రా గొట్టం లోంచి చూస్తూ, పక్కకి నడుస్తూ వెళ్ళి నాగేస్రావు కూల్డ్రింకు బండిని గుద్దేసాను. వాడి రంగు సీసా ఒకటి పడి పగిలిపోయింది. ఆరోజునించీ వాడికి నేనంటే కోపం. అందరిలాగే నేనూ కప్పైస్క్రీముకి పావలా ఇస్తానా, అయినా వాడు నాకప్పెప్పుడూ పూర్తిగా నింపేవాడు కాదు.

తరవాత థర్మా మీటరు తయారు చేసే ప్రయోగం. ఈసారి ఎల్లాగైనా చేసి తీరాలని పట్టుదలతో అందరినీ అడిగాను “మీ దగ్గర పాదరసం వుందా?” అని. అందరూ నాకేసి వింతగా చూసి “అదే తగ్గిపోతుందిలే, రెండు రోజుల్లో” అనుకున్నారు. చివరికి మా మేస్టారే సలహా ఇచ్చారు “ఒరేయ్‌ సేఠ్ల దగ్గర సున్నితపు త్రాసులూ, పాదరసం గట్రా ఉంటాయి అని”. మా క్లాసులో ఇద్దరు సేఠ్ల పిల్లలుండేవారు. భరత్‌లాల్‌, భేరూ లాల్‌అని. వాళ్ళని అడిగాను, “ఒరేయ్‌,రేపు కొంచెం పాదరసం పట్రండర్రా, థర్మా మీటరు చేసుకుందాం” అని. మర్నాడు భరత్‌లాల్‌వచ్చి చెప్పాడు “మానాన్న నీతో మాట్లాడద్దన్నాడు” అని. భేరూలాల్‌గాడు అప్పటికే మానేసాడు. తరవాత అయస్కాంత రేఖలు గీసే ప్రయోగం భలే వుండేది. కాయితంపైన ఇనప రజను పోసి, కింద అయస్కాంతం పెట్టడం ఒకటీ, దిక్సూచి పెట్టి రేఖలు గీయటం ఒకటీ. అంతా గీసాకా చూస్తే, పేద్ద బొద్దింక లా వచ్చేది ఆ బొమ్మ. దిక్సూచీ, అయస్కాంతవూ ఒకే జేబులో వేసుకుని తిరిగేవాళ్ళం. దాంతో ఆ దిక్సూచి ఉత్తర దక్షిణాలకి బదులు తూర్పూ, పడమరా చూపించేది.

అయితే, ఓసారి అన్నయ్యకీ వాడి ఫ్రెండు కీ సైన్సు ఫేర్‌లో మొదటి బహుమతి వచ్చింది. వాళ్ళు విరిగిపోయిన ట్యూబులైటూ, బ్లేడూ, వైర్లూ వాడి, ఏదో చేసారు. అప్పటినించీ నాకు ఇంట్లో పోరెక్కువైపోయింది. “వెధవా, అన్న చూడు ఎంత చక్కగా చేశాడో. నువ్వూ ఉన్నావు, ఎందుకూ, తిండి దండగ” అని. నాక్కోపం వచ్చి మా క్లాసుమేటు చలపతి గాడికి చెప్పేసాను, “వొరేయ్‌వచ్చేసారి ఏదైనా చేద్దాం” అని. వాళ్ళ నాన్న పెద్ద సైంటిస్టు మరి. సరే, చివరికి వాడే కనిపెట్టాడు. యంత్ర శక్తిని విద్యుఛ్ఛక్తిగా మార్చే ప్రయోగం. స్టాండు వేసిన సైకిలెక్కి గెట్టిగా తొక్కడం నా పని. దానికి వైర్లూ గట్రా తగిలించి, నానా హంగామా చేసి, చివరికి బల్బులు వెలిగించడం వాడిపని. నాకు తెలియదు కాబట్టి, సైన్సుఫేర్లో వాడే అందరికీ అర్థమయ్యేట్టు చెప్పేసాడు. “నిన్నెవరేనా ప్రశ్నలడిగితే, కష్టపడుతూ, ఆయాసపడుతూ సైకిల్‌తొక్కుతున్నట్టు మొహం పెట్టు, అప్పుడు ఆ ప్రశ్నలకి కూడా నేనే సమాధానం చెప్పేస్తాను” అని చిట్కా కూడా చెప్పాడు. సరే అయేడాది మాకొచ్చింది బహుమతి. ఇంట్లో అందరికీ గుండె ఆగినంత పనయ్యింది. నేనేదో దారిలో పడిపోతున్నానని నాన్న బోల్డు సంబర పడిపోయారు. కానీ వాళ్ళకేంతెలుసూ, ఆ ప్రయోగం వల్ల నాకొచ్చిందల్లా సైకిలు తొక్కడవేనని !

అలా చేసిన పరిశోధనలూ, అల్లర్లూ ఆనాటితోనే సరి. ఇప్పుడు ఏదో “మూడు పాకేజిలూ, ఆరు ప్రోగ్రాములూ నేర్చేసుకుని, అటు దిటూ, ఇటు దటూ తిరగరాసేసి, ఘన, పనస, జట లాంటి వేద ప్రక్రియ లన్నీ కంప్యూటర్‌రంగంలో ప్రయోగించి, నోరుపెట్టుకుని బతికేస్తున్నాను, ఏదో, నలుగురితోటీ నారాయణా. నాలోనూ ఓ లిటిల్‌సైంటిస్టు ఉన్నాడు. కానీ వాడిప్పుడు ఆలోచించడం మానేసి, మూడంకేసి, ముసుగు తన్ని నిద్దరోతున్నాడు చాలా ఏళ్ళుగా. వాడికీ ఓ కోటు కొంటాను, బహుశా అది చూసైనా లేస్తాడేమో..


శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...

 

(16 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Ram Charan అభిప్రాయం:

    March 1, 2008 11:50 pm

    I could not see any story in this except writer’s childhood memories.

  2. kosyasura అభిప్రాయం:

    March 2, 2008 8:59 am

    ఈ కధ ( ? ) చదువుతున్నంతసేపూ నాలో ఎప్పుడో చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిన లిటిల్‌సైంటిస్టు నా చొక్కా లాగుతూ గుర్తున్నానా…… అని అన్నట్లైంది.
    మీలో ఉన్న లిటిల్‌సైంటిస్టు మాటవినకండి. రచయిత మాటే వినండి.
    కొ స్యా సు రా

  3. Sowmya అభిప్రాయం:

    March 5, 2008 6:46 am

    కథ(??) కథ లా అనిపించలేదు. అనుభవాలను రాసినట్లు అనిపించింది. నేను “కోవెల్లో పకపకలు” తర్వాత మీ అభిమానిని అయ్యాను. ఈ కథ కూడా, హాస్యం పరంగా నాకు చాలా నచ్చింది కానీ, సడన్ గా ముగిసినట్లు అనిపించింది. అసలు ఏదో కథలో ఓ భాగం చదివిన భావన కలిగిందే కానీ, కథ చదివిన భావన కలగలేదు.

  4. జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:

    March 5, 2008 9:44 am

    ఈ కధలో ‘కధ’ లేదని కొందరు పాఠకులు ఎందుకంటున్నారో నాకర్థం కాలేదు. ‘నేను’ అనే పాత్రకి కూతురు సైన్సు లాబుకి కోటు కొనమని అడిగినప్పుడు, తన చిన్నతనపు సంఘటనలు బోలెడు గుర్తొస్తాయి. ప్రతీ సంఘటనా ఒక బుల్లి కధ. చివర్లో, గతం లోంచి వర్తమానం లోకి వచ్చి, తనున్న పరిస్థితి చెప్పి, తనలో వున్న లిటిల్ సైంటిస్టుకి కూడా కోటు కొందామనుకుంటాడు. స్పష్టంగా చెప్పలేదు గానీ, దీనర్థం ప్రస్తుత కంప్యూటర్ గోలతో విసిగిపోయిన నేను పాత్ర, మళ్ళీ సైన్సు ప్రయాగాలు మొదలు పెడదామని అనుకున్నట్టు. ఇలాంటి విషయాలు రచయిత చెప్పినట్టుగానే చెప్పి వదిలెయ్యాలే గానీ, అంతకన్నా వివరించకూడదు అని అనుకుంటున్నాను. చెప్పిన మాటల్లోనే అన్ని అర్థాలూ కనిపించాయి మరి.

    గతం గురించిన సంఘటనలూ, వాడిన భాషా చాలా బాగున్నాయి. నాకు చాలా నవ్వొచ్చింది చాలా చోట్ల. రాసిన షంఘటనల్లో బోలెడు నిజాయితీ కనబడింది. ఒక సంఘటనా, ఒక ఘర్షణా, ఒక మలుపూ లాంటి కధా ప్రక్త్రియలకి అలవాటు పడి పోవడం వల్ల, ఇటువంటివి కధలుగా అనిపించడం మానేశాయేమోనని అనిపిస్తోంది.

    ఏమయితేనేం, ఈ రచనలో మంచి హాస్యం వుంది. చక్కటి భాష వుంది. వివరణల్లో నిజాయితీ వుంది. నాకు నచ్చింది.

    ఇక నచ్చని విషయాలు. లావుగా వుంటే టీచరు గురించి వెక్కిరింతలు నచ్చలేదు. మనుషుల శరీరాకృతిని వెటకారం చెయ్యడం ఈ కధకి శోభ నివ్వదు. లావుగా వుండేవాళ్ళు మంచిగా వుండరా? సన్నగా వున్న వాళ్ళంతా మంచి వాళ్ళా? మనుషుల్ని వాళ్ళ ప్రవర్తనతో గుర్తించాలి గానీ, శరీరాకృతితో కాదు. ఈ కధలో “నేను” పాత్ర తల్లినీ, మామ్మనీ, “ఏమే”, “రావే” అని సంబోధిస్తూ వుంటుంది. కొన్ని కుటుంబాల్లోని పిల్లలు, ముఖ్యంగా పాత రోజుల్లో, తల్లినీ, మామ్మనీ అలాగే సంబోధిస్తారు. కానీ, రాను రాను ఈ సంబోధనలు ఎబ్బెట్టుగా అయిపోయాయి. ఇప్పటి కాలం పిల్లలు తల్లుల్ని, “ఏమే” అనీ, తండ్రుల్ని, “ఏమండీ” అనీ అనరు, ఎక్కువగా. ఇద్దర్నీ “నువ్వు” అనే అంటారు. “వాస్తవమెల్లా వాంఛనీయం కాదు” అనే పద్ధతిలో, కధలో ఈ సంబోధనలు మార్చి వుంటే, ఇంకా బాగుండేది నా అభిప్రాయంలో.

    - ప్రసాద్

  5. kosyasura అభిప్రాయం:

    March 9, 2008 1:30 am

    ప్రసాద్ గారూ

    రచయిత వలంగావున్నవాళ్ళని వెక్కిరించలేదు. ఆక్షణంలో కుమార్తె కోటు అడిగిన వెంటనే ఆ విసుగులో తనలో తాను అనుకున్న అభిప్రాయం. మనలోనూ చాలమంది తల్లి తండ్రులు ఇలాంటి పరిస్థితులలో అలానో ఇంకో లానో అనుకునేదే (రెండిళ్ళకి సరిపడా చెక్క అన్న మాట… ఈ ప్రయోగం చాలా కాలం క్రింతం విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలలో వాడుకలో వుండేది). ఆ తర్వాత నాలిక కొరుక్కుని ఉండొచ్చు.

    నాకనిపిస్తూ ఉంటుంది, ఈరొజుల్లో మనలో సహనం తగ్గుతుందేమోనని. నా చిన్నపుడు “నే నర్రా గుడ్డి సోదిని . తలుపు తీయండి” అంటూ మా దూరపు చుట్టం అంటే పరుగు పరుగు న ఇంటిల్ల పాదీ పరుగెత్తే వాళ్ళం. తాను అంతగా చదువుకో లేదు. అందుకేనేమో, తాను తన కంట్లో పువ్వుని గొప్పగాచెప్పుకునేది. శ్రీరామనవమి చందా దండుకుంటు “ఏం పేరు రాయాలీ, రసీదు మీద?” అంటే బొడ్డులోంచి రెండు ఇచ్చురూపాయలు చేతిలో పెడుతూ “సొట్టసోమన్న… అన్రాసుకొండి” అన్నసోమన్న తన అవిటితనాన్ని లోకువుగా తీసుకొలేదు.అసలు తనపేరు మైకులో వినేవాడో లేదో తెలీదు. “వలంపాటి పిన్నిగారు మీరేనా? ఇదిగో, ఈ వాయనం ” అంటే “అలాగే ఉండు. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, లేచి ఆ వాయనం అందుకుంటాను.” అని లేచి వాయనం అందుకుని “నాలో సగం ఒళ్ళు తీసుకోకూడదూ. ఉత్తినే ఇస్తాను” అన్న పిన్నిగార్లు ఏరీ ?

    కొ స్యా సురా

  6. Phani DokkA అభిప్రాయం:

    March 9, 2008 2:18 pm

    కొస్యాసురా గారూ, ప్రసాద్ గారూ,
    కథ చదివినందుకు, అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.
    ఫణి డొక్కా

  7. Phani DokkA అభిప్రాయం:

    March 9, 2008 3:40 pm

    సౌమ్య గారూ,

    కథ చదివి, అభిప్రాయం చెపినందుకు ధన్యవాదాలు. మీ అంచనా
    కరెక్టే. అసలు నేను మొదట్లో రాసిన కథలో ఇంకొంచెం పొడిగింపు
    వుంది. కాలేజీలో, కెమిస్ట్రీ లాబుల్లో పిప్పెట్ లోంచి పొటాసియం
    పెర్మాంగనేట్ పొరపాట్న తాగేసి పగటి డ్రాకులాల్లా నవ్వుతూ
    కాలరెగరేసిన కబుర్లూ, ట్యూనింగు ఫోర్కు విరుగుతుందా లేదా? అని
    బెట్టు కట్టుకుని మరీ విరక్కొట్టి, ఫైను కట్టిన ఊసులూ, ఫైనలెక్సాము
    లో లేబ్ అసిస్టెంటుకి డబ్బులిచ్చి సాల్ట్ ఎనాలసిస్ లో ఏం కలిపాడో
    కనుక్కున్న ఫ్రెండ్ల ముచ్చట్లూ, సీనియర్ల రికార్డులు చిల్లు కొట్టకుండా
    లాబ్ అసిస్టెంట్ ని కాకా పట్టి తీసేసుకుని, వాటిపై తమ పేరు
    పెట్టేసుకుని, రీయూజ్ చేసిన అల్లరి అమ్మాయిల కబుర్లూ, మరో రెండు
    మూడు పేరాలు వచ్చింది. కానీ, నా మొదటి శ్రోత విని, ఈ పొడిగింపు
    వల్ల కథలో అమాయకత్వం, సున్నితత్వం తగ్గిపోతునట్టనిపిస్తోంది,
    మరో మాటు ఆలోచించండి అనడంతో, కాస్త ఆలోచించి, ఆ పేరాలు
    దాచేసాను. ఇవన్నీ నా అనుభవాలే అయినా, ఇటువంటివి అందరికీ
    జరిగే వుంటాయనే నమ్మకంతో, కథ రూపం ఇద్దామని
    ప్రయత్నించాను.

    కృతజ్ఞతలతో,
    ఫణి డొక్కా

  8. srinivas Chilakapati అభిప్రాయం:

    March 9, 2008 5:02 pm

    ఎడిటర్లు తమ నియమాల్ని సడలించుకుని, వంగూరి వారి తొమ్మిదవ సంకలనంలో ముద్రితమైన ఈ సరదా కబుర్లని కథగా పునర్ముద్రించినందుకు ధన్యవాదాలు. హాయిగా నవ్వుకున్నాను.

  9. జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:

    March 12, 2008 7:06 pm

    కొస్యాసురా గారి కామెంటు చదివి, నా కామెంటు వెలగబెడదామనుకునేసరికి ఈ మాట వారు ఈ కధని తీసేశారు. ఇప్పుడు ఆ కధని కోట్ చెయ్యాలంటే, వంగూరి వారి బుక్ కోసం వెదకడం మొదలు పెట్టాలి.
    దొరికింది. దొరికింది. రచయిత, “అసలు వీళ్ళ సైన్సు టీచర్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఇంకో రెండు కళ్ళు అప్పు తెచ్చుకుంటేనేగానీ (ఇక్కడ వరకూ చదివే సరికి, మొదట్లో రచయిత ఆ టీచర్ గారి అందం గురించి రాస్తున్నారనుకున్నాను.) ఆ “అప్పూ”ని సాంతం చూడలేము. ఆ గుమ్మం నించి ఈ గుమ్మం దాకా వుంటుంది పాపం. ఆవిడే చెట్టయ్యి వుంటే రెండిళ్ళకి సరిపడా చెక్క అన్నమాట.” అని రాస్తే, మీరు దాన్ని “వెక్కిరించడం” కాదంటే, “వెక్కిరించడం” అంటే ఏమిటో మీరేదైనా నిర్వచనం చెప్పాలి. మనం ఒకరిని జోక్ చేస్తే, అది కూడా వారి శారీరక అవకరం గురించి. అది వెక్కిరింతే అవుతుంది.

    నిజానికి మనలో సహనం తగ్గడం లేదండీ, సంస్కారం పెరుగుతోంది. రెండవ పేరాలో మీరు ఇచ్చిన ఉదాహరణల్లో, వారు తమ మీద తాము జోక్ చేసుకున్నారు. అది తప్పు కాదు. అది వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్. అదే మనం అవతల వారి శారీరక అవకరం మీద జోక్ చేస్తే, అది కుసంస్కారం. మనం మీద మనం జోక్ చేసుకోవడానికి మనకి అన్ని హక్కులూ వుంటాయి. అవతల వాళ్ళ మీద వాళ్ళు కూడా జోక్ గా తీసుకుంటేనే, జోక్ చెయ్యాలి. లేకపోతే అది అవతల వాళ్ళని కించ పరచడమే. లావుగా వుండే వాళ్ళు, వాళ్ళ లావు మీద వాళ్ళు జోక్ చేసుకోవడం వేరు, వేరే వాళ్ళు జోక్ చెయ్యడం వేరు. ఇలాగా మిగిలిన శారీరక అవకరాలన్నీ. ఇది అర్థం కాకపోతే, ఇక చెప్పడానికి నాదగ్గర వేరే జవాబు లేదు.

    ప్రసాద్

  10. chavakiran అభిప్రాయం:

    March 13, 2008 11:03 pm

    ఇలా రచనలు తొలగించడం ఈ పత్రికలకు ఉన్న మరో సౌలభ్యంగా భావించాలేమో! అదే ఏ స్వాతిలోనో వస్తే వాళ్ళు తొలగించలేరు కదా :!

    ఈ పత్రికలు జిందాబాద్.

    రచయితలూ పరాహుషార్ బిఫోర్ యూ సెండ్ దెం టూ మల్టిపుల్ పత్రికలు. :)

  11. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    March 15, 2008 9:44 am

    సంపాదకులకు చిన్న మనవి.
    మరోచోట ముద్రించిన రచనలను మళ్ళీ ప్రచురించగూడదన్న ఈమాట నియమం ఉన్నప్పుడు రచయితల దగ్గర హామీ పత్రంలా ( ఈమైలు లేదా లిఖిత పూర్వకంగా రాసిమ్మంటే బాగుంటుంది. దాని వల్ల రచయితలకీ, పత్రికలవారికీ ఇబ్బందుండదు. కానీ ఇలా ఒకసారి ప్రచురించి, మరలా తీసేయడం లాంటివి పెద్ద మనిషి తరహాగా అనిపించుకోవు. తప్పొప్పులు ఎవరివైనా ఒకసారి, అదీ వారంపైగా ఉంచీ, దానీమీద ( కథ తీసేసినా, మరలా ఆ కథ బాగోగుల మీద ) చర్చలూ, కామెంట్లు ప్రచురించడం ఎబ్బెట్టుగా ఉంది. చదివే వాళ్ళకి కన్ఫ్యూజింగ్ గా ఉంది. కధైనా ఉంచండి లేదా కామెంట్లయినా ఆపేయ్యండి.
    - సాయి బ్రహ్మానందం గొర్తి

  12. kosyasura అభిప్రాయం:

    March 15, 2008 9:44 am

    ప్రసాదు గారూ

    ఏమాట కామాట చెప్పు కోవాలి. అన్నికధలూ కూలంకషంగా చదివి అభిప్రాయాలు రాస్తారు. అది నాకు నచ్చినవిషయం.

    ఇహ మిగతా విషయం. వేళాకోళము, వెక్కిరింత వగైరా. ముందే ప్రస్తావించేను. రిచ్ డాడ్ లు తప్పసాధారణ సగటు నాన్న లు, నాన్నగార్లు కూతురొచ్చి “నాన్నా వైటు కోటు” కొడుకొచ్చి “నాన్నా, ఎర్ర బూట్లు” “రేపుదయం వేసుకురమ్మన్నారు”, “రాకపోతేక్లాసులోకి రానివ్వరుట”, “బెంచీ ఎక్కంచీస్తారుట” అంటూంటే ముందు విసుగు పిల్లల మీద తర్వాత తెమ్మన్న ఆ టీచరు మీద ఆనక ఆస్కూలు మీద ఏదో విధంగా మనసులో అనుకోవడమో, గొణుగుకోవడమో, మరీ ఒళ్ళు మండితే బయటకి అనుకోవడం సహజం. ఆతర్వత కాస్తా నిమ్మళించినాక నాలిక కరుచుకోవడం (అది సంస్కారం) సహజం అన్నాను (చూడుడు: పేరా ఒకటి, పంక్తి ఆరు )!

    ఇక పోతే “వలంపాటి పిన్నిగారు”, వగైరా డొక్కా వారి హాస్య పాయసం లో సన్నగా తరిగి వేయించిన కొబ్బరి ముక్కలుగా వేస్తే బాగుంటుందన్న సదుద్దేశం. కాని పాయసం మరో మారు “మారు” వేయించుకునేలోపలే అటకెక్కించేసారు సంపాదకుల వారు.

    కొ స్యా సు రా

  13. Srinivas Nagulapalli అభిప్రాయం:

    March 15, 2008 6:03 pm

    ప్రచురించిన రచనను ఇంకొక చోట ప్రచురించబడ్డది అని పూర్తిగా తొలగించడం, జరిగిన పొరపాటుకు మించిన తప్పిదం లాగా అనిపిస్తుంది. పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించినా అది దురభిప్రాయంతోనో, దురుద్దేశంతోనో చేసినట్టుగా కనిపించదు. అయినప్పటికినీ, మన్నించమని అడగడమో, ఇక ముందు జాగ్రత్తగా ఉంటామని విన్నవించడమో సరిపోయేదేమో.
    ఏ రచయితైనా తన రచనను ప్రచురించకపోతే కొంత నిరుత్సాహపడవచ్చేమో కానీ, ప్రచురించిన తర్వాత తొలగించడం నొప్పి కలిగించేదే. అదీ రచనయొక్క గుణాల గురించిగా కాక, తెలిసో తెలియకో ఇంకో చోట ప్రచురింపబడ్డందుకే అని గుర్తిస్తే సంపాదకుల నిర్ణయం అర్థంచేసుకునేదే అయినా, సహృదయంగా మాత్రం అనిపించడంలేదు. పాఠకులకైతే ఇది వడ్డించిన విస్తరి తీసేసినట్టుగా ఉంది. ఏన్నో ప్రచురించి ఉండొచ్చు, ఈ రచయితవే కూడా, కాని ఇలా వేసి తీసిపారేసారు అన్న మాటే ‘ఈమాటకు’ అన్నింటికన్నా ఎక్కువగా నిలిచిపోతుందనే అనుమానం కలుగుతుంది. సంపాదకులు కొంత సహృదయంతో పునరాలోచించి తీసేసిన రచనను, వారికిష్టమైన, తోచిన గమనికతోనైనా, పునర్ముద్రించాలనీ, ఈ తీసివేతకు తొందరగా తెరదించాలని కోరుకుంటున్నాను, కాదు అర్థిస్తున్నాను.
    విధేయుడు
    Srinivas

  14. Srinivas Nagulapalli అభిప్రాయం:

    March 25, 2008 8:07 am

    సంపాదకులు తిరిగి రచనను అందించినందుకు చాలా సంతోషం.
    చాలా కృతజ్ఞతలు. తొలగించడం కష్టమైన నిర్ణయమైతే, దాన్ని పునః పరిశీలించి తిరిగి ప్రచురించడం కష్టతరమే కాదు, ఎంతో సహృదయం ఉంటే తప్ప సాధ్యపడదు.
    ఆ.
    రచనలెన్నొ చేయు రచయిత లెందరో
    అచ్చు వేయు నెన్నొ అనుదినంబు
    సహృదయంబుగల్గు సంపాదకులుమీరు
    అతిశయోక్తి కాదు అసలు మాట!

    విధేయుడు
    Srinivas

  15. రానారె అభిప్రాయం:

    April 3, 2008 8:08 am

    “ఒక సంఘటనా, ఒక ఘర్షణా, ఒక మలుపూ లాంటి కధా ప్రక్త్రియలకి అలవాటు పడి పోవడం వల్ల, ఇటువంటివి కధలుగా అనిపించడం మానేశాయేమోనని అనిపిస్తోంది.” అన్నారు జె.యు.బి.వి ప్రసాదుగారు. ఇలా కాని కథాప్రక్రియ గతంలో వుండేదా? చిన్నప్పటినుంచి నేను చదివిన పిల్లల మాసపత్రికలు, బాలల రామాయణ భారత భాగవతాలు, పంచతంత్రం మొదలు ఈనాటిదాకా ఒకటీ అరా ఆంగ్ల కథలతో కలుపుకున్నా నేను చదివిన కథలు చాలా తక్కువే వుంటాయి. వీటన్నిట్లోనూ దాదాపు ఇదే ప్రక్రియ. ఈ మూసను అనుసరించకుండా ఎక్కువ కథారచనలు చేసి ప్రత్యేకత సంతరించుకొన్నవారెవరైయినా వుంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన భాషలో.

  16. జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:

    April 30, 2008 6:34 pm

    రా. నా. రె. గారూ,
    “వెచ్చని మనసులు” కధని మెచ్చుకున్న మీరు ఈ ప్రశ్న అడగడం నాకు కాస్త ఆశ్చర్యం కలగజేసింది. ఈ కధ నాక్కూడా నచ్చిందనుకోండీ. కానీ మనం చెప్పుకున్న ప్రక్రియలేవీ ఈ కధలో లేవు కదా? అలాగే, ఎంతో మంది మెచ్చుకున్న “మిధునం” కధలో కూడా అటువంటి ప్రక్రియలు లేవు. దీనర్థం ఈ “లిటిల్ సైంటిస్టు” కధని పై కధల పక్కన కూర్చోబెడుతున్నట్టు కాదు. అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన అనేక కధలు కూడా. సోమరాజు సుశీల గారు రాసిన ఇల్లేరమ్మ కధలు కూడా. కోట్ చెయ్యలేను గానీ, శ్రీపాద వారివీ, చలం గారివీ కొన్ని కధలు ఇలాంటి ప్రక్రియలు లేకుండా చదివినట్టు గుర్తు. ఇంకా చదివినవి గుర్తు లేవు. కొన్ని కదలు ఆహ్లాదంగా వుంటాయి. మొహంలో ఒక చిరునవ్వుని పూయిస్తాయి. అవి నిజ జీవితంలోంఛీ వచ్చిన కొన్ని చిన్న చిన్న అనుభవాలతో కలిసి, కాసిని కబుర్లు ఆత్మీయంగా చెప్పుకున్నట్టుగా వుంటాయి. గొప్ప మలుపులూ, గొప్ప నీతులూ, ఉత్కంఠ కలిగించే విషయాలూ వుండవు. నా దృష్టిలో అలా అన్నీ వుండ నక్కరలేదు కూడా. అలాంటివి వున్న కధలని నేను విమర్శించడం లేదు కూడా. ఆ ప్రక్రియలు కూడా బాగానే వుంటాయి. ఇవీ ఆ మాటలు అనడం వెనుక నున్న నా వుద్దేశ్యం.

    ప్రసాద్

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a