అప్పటికి బండి కదిలీ కదలనట్టుగా ముందుకి కదులుతోంది. పై బెర్తు మీద నుంచి తటాలున కిందికి దూకి, ఓ చేత్తో బేగు అందుకుని, కుడి భుజానికి తగిలించుకుని, గాలితో నిండిన దిండునీ, మడవని దుప్పటినీ లుంగ చుట్టి ఎడమ చంక కింద తోసి, బూట్లని ఎడంచేత్తో పట్టుకుని తలుపుకేసి పరిగెత్తేను. పూర్తిగా బిడాయించి వున్న తలుపుని తిట్టుకుంటూ, పెద్దగా శబ్దం చేస్తూ తలుపు తెరచి, బండి కదులుతున్న దిశగా మొహం పెట్టి కనకదుర్గమ్మని తలుచుకుని కదులుతున్న రైలులో నుంచి ప్లాటుఫారం మీదికి దూకడానికి ఉద్యుక్తుడినయ్యేను. తలుపు తీసిన చప్పుడుకి పరుగున టీటీయీ ద్వారం దగ్గరకి వచ్చేడు. నేను మొహం తిప్పి చూస్తే రాత్రి నేను అభ్యర్ధించిన “టీటీయీ ” యే. నన్ను నిద్ర లేపకుండా, తాను కూడా డ్యూటీ దిగిపోకుండా ఇంకా ఏంచేస్తున్నాడో నాకు బోధ పడలేదు. నాకెందుకనుకుని, బూట్లు కిందకి విసిరేసి, ఎడమకాలు ఏటవాలుగా ముందుకు సాచి, కుడి కాలూ, కుడి చెయ్యీ పట్టు వదిలి, బండికి సమాంతరంగా ప్లాటుఫారం మీద పరిగెత్తడం మొదలెట్టేను. అప్పటికి టీటీయీ నేను ఖాళీ చేసిన తలుపులోంచి తల బయటికిపెట్టి – “అదేంటీ, విజయవాడ అన్నారు కదా” అన్నాడు. అతని అలసత్వానికి, పైగా ఈ పరాచికాలకీ, చెప్పొద్దూ, నాకు మాచెడ్డ కోపం వచ్చింది. నేను అతని కేసి కొరకొరా చూస్తుండగా, అతడు నన్ను చూసి విస్తుపోతుండగా, దూరం పెరిగి రైలు చీకట్లో కలిసిపోయింది.
నేను క్రమంగా నిలిచి, వెనక్కొచ్చి బూట్లందుకుని చుట్టూ కలియజూడగా, ప్లాటుఫారం నిగ నిగ లాడుతూ కనిపించింది. విజయవాడ స్టేషన్ని ఆధునికీకరించేరేమో ననుకుని, సామాన్లు సర్దుకోవడానికి దగ్గర్లో వున్న కుర్చీమీద కూర్చోబోతుండగా ఎదురుగా, పసుపు పచ్చని పలక మీద నల్లని తాటికాయంత అక్షరాలతో మూడు భాషలలో రాసి వుంది -“గుంటూరు” అని.
‘హతవిధీ!’ అనుకుని కూలబడ్డాను. కోమల స్వరం కలిగిన ఈ స్త్రీ చదువరి కి విజయవాడ నుంచి గుంటూరు బదిలీ అయ్యింటుం దనుకున్నాను. ఆమె గొంతుని విశ్వసించిన నాకు, ఆవిడ బదిలీ నా కొంప ముంచినట్టనిపించింది. వేరే వూరు బదిలీ అయినా, ఆవిడకి ‘పాపం రాత్రి షిఫ్టులు తప్పలేదే!’ అని రవంత బాధ కూడా పడ్డాను. సమయం రాత్రి మూడయ్యింది. వెంటనే విజయవాడకి మరో బండేమీ లేదు. లేచి, నెమ్మదిగా కాళ్ళీడ్చుకొస్తోంటే గేటు దగ్గర టీసీ ” దీనికి, బ్రేకు జర్నీ రాయరండీ” అన్నాడు. జీవం లేని నవ్వు నవ్వి, టిక్కెట్టిచ్చేసి బయటపడ్డాను.
ఆటో మాట్లాడుకుని గుంటూరు బస్టాండు చేరుకున్నాను. నేను బస్టాండు లోపలకి చేరుకునేసరికి, పై వూరినుంచి విజయవాడ వెళ్ళే బస్సొకటి బయలుదేరడానికి సిద్ధంగా వుంది. అదృష్టం బాగుండి సీటు దొరకడంతో, ‘బతుకు జీవుడా!’ అని కూర్చోగానే బస్సు బయలుదేరింది. మగతగా కళ్ళు మూసుకున్న నాకు, ప్రకాశం బేరేజి మీద కృష్ణమ్మ చల్లటి గాలికి మెలకువ వచ్చింది. విజయవాడ పురపాలక కార్యాలయం దగ్గర బస్సు దిగి, ఆటో ఎక్కి విజయవాడ స్టేషను చేరుకున్నాను. సమయం తెల్లవారుజామున నాలుగున్నర.
విచారించగా, నేను దిగిపోయిన నర్సాపుర్ ఎక్సుప్రెస్సు కృష్ణా కెనాలు జంక్షనులో సిగ్నలు దొరక్క ఆగిపోయిందనీ, ఇప్పుడే ఐదో నంబరు ప్లాటుఫారం మీదకి వస్తోందనీ తెలిసింది. ప్లాటుఫారం టిక్కెట్టు కొనుక్కుని వెంటనే పరుగు తీసేను. ప్లాటుఫారం మీద మా టెక్నీషియను నాకోసం ఎదురు చూస్తూ కనిపించేడు. బండి ప్రవేశిస్తోంది. ఇంజను కనిపిస్తోంది. నేను వెనకనుంచి వెళ్ళి, భుజం చరచగానే, తిరిగి చూసిన అతడు నిర్ఘాంతపోయి – ” అదేంటి సార్, రైలింకా వస్తోంది కదా, సామాన్లతో మీరిక్కడికెలా వచ్చేరు?” అన్నాడు. నేను జవాబు చెప్పబోయేంతలోగా, గుంటూరులో నేను విన్న సుమధుర కోమల స్త్రీ స్వరం, స్పష్టమైన ఉచ్చారణతో -“ప్రయాణికులకు గమనిక, ” అంటూ ప్రకటన ప్రారంభించింది. నాకు నోట మాట రాలేదు. ఈసారి నిర్ఘాంతపోవడం నావంతయ్యింది. ఈలోగా, డ్యూటీ ముగించుకు వెళుతున్న సదరు టీటీయీ ఎదురు పడ్డాడు. ముందు స్టేషనులో, కదులుతున్న బండి చివరి పెట్టె, ఆఖరు తలుపులోంచి దూకి దిగిపోయిన నన్ను, ఇక్కడ తక్కిన ప్రయాణికుల మధ్య చూసిన అతడు తల తిరిగి, తూలి పడబోయి తమాయించుకున్నాడు. ఈ తెల్లవాడి మాయ పూర్తిగా తెలియక ఇరుకునబడి నేనే బుర్ర బద్దలు కొట్టుకుంటూండగా, ఆయన్నేమి కుశలం కనుక్కుంటాంలే? అని, నా దారిన నేను పోయేను.
ఆ సాయంత్రం, నెల్లూరు లో పని ముగించుకుని, విజయవాడకి తిరిగి వెళ్ళడానికి స్టేషనుకి వచ్చేను. బండి కోసం ఎదురు చూస్తుండగా మళ్ళీ అదే సుమధుర కోమల స్వరం “ప్రయాణికులకు గమనిక” అంటూ నన్ను వెంటాడింది. పొద్దున నెల్లూరులో దిగినప్పుడు, ముద్ద ముద్ద గొంతుతో తూతూ మంత్రంగా ఓ మగ గొంతు రైల్వే వారి పేటెంటు స్థాయిలో ప్రకటన చేసింది. మరిప్పుడెందుకు ఈ కోమల స్వరం నన్ను తికమక పెడుతోంది?
ఏమైనా సరే, ఈ గొంతు వెనక మర్మం ఛేదించాలనుకున్నాను. కానీ ఎలాగో తెలియక ప్లాటుఫారం అంతా తిరుగుతోంటే, స్టేషను మాస్టరు గదికి పక్కగా ఓ చిన్నపాటి సందడి కనిపించింది. ఏమిటా అని వెళ్ళి చూస్తే, అదే ప్రకటనల గది. వివరాలు కనుక్కుని, సమాచారం రాబట్టగా క్లుప్తంగా తెలిసిం దేమిటంటే – ముందుగా ముద్రించిన ముక్క ముక్కల ధ్వనిని (ప్రీ రికార్డెడ్ వాయిస్ సిగ్మెంట్స్ అనొచ్చా!) బళ్ళ రాకపోకలకి అనుగుణంగా కంప్యూటరు లాంటి ఓ యంత్రంతో అనుసంధానించి ప్రకటనగా వినిపిస్తారు. ఆరోజే, నా ఎదురుగా ఓ రైల్వే అధికారి చేతులమీదుగా ఈ ఏర్పాటు నెల్లూరు స్టేషనులో లాంఛనంగా ప్రారంభించేరు. అక్కడే తరువాత తెలిసింది – గుంటూరు లో కూడా ఈ మధ్యే ఈ ఏర్పాటు చేసేరని. ఆ పిమ్మట, క్రమంగా ద.మ.రే (దక్షిణ మధ్య రైల్వే) లో అన్ని ముఖ్యమైన స్టేషన్లలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేసేరని. ఇప్పటికీ, దేశం వెళ్ళినప్పుడు, ఈ ప్రకటనలు చెవినబడితే అనిపిస్తూవుంటుంది -“వినదగునెవ్వరు చెప్పిన…..”.