వెచ్చని మనసులు

కాసేపయ్యాక ఓ గ్లాసులో వేడి వేడి టీ తెచ్చి భర్తకిచ్చింది. ఆ టీ రెండు గుక్కలు తాగగానే ఆయన ప్రాణం లేచొచ్చింది.

“ఈపూట నీళ్ళలోకి వెడితే ఊర్కోను. జాగ్రత్త! పనిమనిషి వస్తుందిగా, ఆమె చేస్తుంది అన్ని పనులు. నువ్వు కూడ టీ తెచ్చుకుని నా పక్కన కూర్చో” అంటూ భార్యని ఆదేశించాడు బిషన్ సింగ్.

సుఖవంతి ముందుగా తన పక్కని సర్ది, రగ్గు మడత పెట్టి, మంచాన్ని పెరట్లో పెట్టింది. ఆ తర్వాత టీ గ్లాసు తెచ్చుకుని వచ్చి భర్త పక్కన కూర్చుంది.
“ఇలా రగ్గులోకి వచ్చి, నాకు దగ్గరగా జరిగి కూర్చో. కాస్త వెచ్చగా ఉంటుంది” అంటూ రగ్గుని తెరిచాడు బిషన్ సింగ్. ఆమె భర్తకి మరింత దగ్గరగా జరిగి, ముడుచుకుని కూర్చుంది. ఆయన శరీరం వేడిగా అనిపించింది.

“అరే, మీకు జ్వరం వచ్చినట్లుంది” అంటూ ఆయన నుదుటిపై చెయ్యి వేసి చూసింది. “చెప్పనే లేదు. రాత్రి జ్వరం మాత్ర ఇచ్చేదాన్ని కదా. ఈ పూట మంచం దిగకండి.”

“ఊరికే కంగారు పడకు. నాకేమీ కాలేదు” అని చెబుతూ మరో గుక్క టీ తాగాడు బిషన్ సింగ్. అలా ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ. టీ తాగుతున్న చప్పుడు తప్ప వారి మధ్య మాటలు లేవు.
కాసేపయ్యాక సుఖవంతి ఆలోచనల్లోంచి బయటపడింది. గట్టిగా నిట్టూర్చి ఉదాసీనమైన గొంతుతో, “మనమేం పాపం చేసామో, మనకి పిల్లలు పుట్టలేదు. నాకొక బిడ్డనిచ్చుంటే ఆ పై వాడికి ఏం పోయేదో? వారసులుంటే ఈ ముసలితనంలో వాళ్ళతో హాయిగా గడిపేవాళ్ళం కదా….” అంటూ వాపోయింది.

“వారసులా, వాళ్ళతో సుఖమా?” అంటూ చిన్నగా నవ్వాడు బిషన్ సింగ్.
ఆమె తల తిప్పి ఆయనకేసి చూసింది. ఆ నవ్యు వెనక ఉన్న బాధని గుర్తించడానికి ప్రయత్నించింది. బిషన్ సింగ్ తన రెండు చేతుల మధ్య టీ గ్లాసుని ఉంచుకున్నాడు. టీ గ్లాసునుంచి బయటకొస్తున్న ఆవిరినే చూస్తూండిపోయాడు.

“సంతానం వల్ల సుఖమేముంది సుఖవంతీ? పిల్లలున్న వాళ్ళు ఏడుస్తునే ఉన్నారు. మన చరణ్‌నే చూడు. ముగ్గురు కొడుకులుండి కూడ నరకం అనుభవిస్తున్నాడు. కొడుకులు ఆస్తిలో వాటాలు పంచుకుని విడిపోయారు. ముసలి తల్లిదండ్రులను పట్టించుకునే వారే లేరు” అని చెప్పి మళ్ళీ టీ గ్లాసుకేసి చూడసాగాడు.

కాసేపయ్యాక, మళ్ళీ ఆయనే మాట్లాడుతూ,..”పరంజీత్ తెలుసుగా, అదే శిందర్ వాళ్ళ నాన్న! పిల్లలుండి కూడ అనాధలా బ్రతుకుతున్నాడు. ఓ రొట్టి ముక్క కూడ దొరకడం లేదు. పిల్లలు లేనంత కాలం నాకు వారసులు లేరని గోల పెడతారు. పిల్లలు ఇలా తయారైతే పిల్లలు లేకపోయినా బావుండేదని అంటారు. వాడి కొడుకులు ఆస్తంతా వాళ్ళ పేరున రాయించుకుని వీడిని పట్టించుకోడం లేదు. ఇప్పుడు అంటూంటాడు – ఆస్తి నా చేతిలో ఉన్నా బాగుండేది. కనీసం నా సేవలకి ఓ పేద మనిషిని పెట్టుకునేవాడినని……..” అన్నాడు.

ఆమె భర్తకి మరింత దగ్గరగా జరిగి, “కానీ అందరు పిల్లలు అలా ఉండరు కదండీ అంది. ఆమె స్వరం నూతిలోంచి వచ్చినట్లుగా బలహీనంగా వినబడింది. టీ గ్లాసులెపుడో ఖాళీ ఆయ్యాయి. సుఖవంతి తన గ్లాసు, భర్త గ్లాసు తీసి మంచం కింద పెట్టింది. చెదిరిన రగ్గుని సరిచేసుకుని ఇద్దరు మళ్ళీ దగ్గరగా జరిగి కూర్చున్నారు.

“జిందర్ మనల్ని మోసం చేసాడు. లేకపోతే….” అంటూ తన మాటలని మధ్యలోనే ఆపేసింది సుఖవంతి.

“వాడి మాటెత్తకు. వాడు నా అన్న కొడుకైనా నా సొంత కొడుకులా భావించాను. అన్న పేదరికం కారణంగా పిల్లలని సరిగా చూసుకోలేక పోతుంటే, కనీసం జిందర్‌నైనా చదివించి ప్రయోజకుడిని చేయాలనుకున్నాను. కానీ….” అంటూ బిషన్ సింగ్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు.

“మనింటికి వచ్చినప్పుడు వాడికి పది-పదకొండేళ్ళు ఉంటాయేమో. మనకి తెలిసి వాడికి మనమేదీ తక్కువ చేయలేదు. మనకి ఉన్నంతలో మంచి భోజనం పెట్టాం, చక్కటి బట్టలు కుట్టించాం. వాడికి ఏం దురాశ కలిగిందో, ఆ పాడు పని చేసాడు…” సుఖవంతి మాటలలో వేదన వ్యక్తమైంది.

“అంతా వాడిదే కదా, వాడు కాక మనకింకెవరు ఉన్నారు? వాడు నీ నగలపై చెయ్యేసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కాని అది నా తప్పే అని ఊరుకున్నాను” అంటూ భార్య కుడి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని నిమురుతూ, “ఎప్పుడైతే వాడు కొట్లని తన పేరు మీద రాసేయ్యమని అడిగినప్పుడు వాడి దుర్బుద్ధి గ్రహించాను. కాని అది వాడి సొంత ఆలోచన కాదు…” అని అన్నాడు.

“పోన్లెండి. వాడంతట వాడే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు…” అంటూ గట్టిగా నిట్టూర్చింది సుఖవంతి.

“సుఖవంతీ, మనిషి దగ్గర ఏదైతే లేదో దాని గురించి జీవితాంతం ఏడుస్తాడు. ఉన్న వాటికి విలువివ్వడు. మన దగ్గర లేని దాని గురించి మనం ఎందుకు బాధ పడడం? ఉన్నవాటిని ఎందుకు ఆస్వాదించం?” అంటూ భార్యని మరింత దగ్గరికి లాక్కున్నాడు. అలా భర్త హృదయాన్ని హత్తుకుని చాలా సేపు ఉండిపోయిందావిడ. ఆ స్పర్శ తాలూకు వెచ్చదనం ఇద్దరినీ ఏకం చేసింది.

‘ఈ వెచ్చదనం ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు’ అనుకున్నాడు బిషన్ సింగ్. ‘ ఈ వేడి, ఈ వెచ్చదనం కలిగింది ఈయన జ్వరం వల్లా, లేక ఈయన ప్రేమవల్లా’ అని ఆలోచిస్తోంది సుఖవంతి. ‘ఏది ఏమైనా, మా ఇద్దరి మధ్య ఈ వెచ్చదనం ఎప్పటికీ ఉండాల్సిందే’ అని అనుకుందామె.

ఇంతలో ఓ నీరెండ తునక కిటికీలోంచి జారి, గదిలోకి ప్రవేశించింది. గచ్చుమీద ఆ సూర్యకిరణం చిన్న కుందేలు పిల్లలా అటూ ఇటూ కదలసాగింది. తమ ఏకాంతాన్ని ఎవరో మూడో వ్యక్తి పరికించాడా అన్నట్లుగా ఒక్కసారిగా ఉలిక్కిపడి భర్త నుంచి పక్కకి జరిగిందామె. మరుక్షణంలో ఆ సూర్యకిరణాన్ని చూసి ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.


కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి:

కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

 ...